‘’కూచి పూడి నాట్య వేదాంతం ‘’శ్రీ సత్య నారాయణ శర్మ

 ‘’కూచి పూడి నాట్య వేదాంతం ‘’శ్రీ సత్య నారాయణ శర్మ

 

ఆయన అభినవ సత్య భామ .ముదిమి వయసు లోను వన్నె తగ్గని అభినయ కౌశలం .కూచి పూడి ని విడిచి పెట్టి ఉందని నాట్యా చార్యులు .జీవితాన్ని కళా రాదన కే అంకితం చేసిన  ధన్య జీవి .అక్కడి సిద్ధేంద్ర కలాక్షేత్రానికి పునాదుల నుంచి ,పునర్వికాసం వరకు ఆయన చేసిన కృషి జగద్విదితం .సిద్ధేంద్ర యోగి దేవాలయ నిర్మాణం లోను ,దాని నిర్వహణ లోను ఆయన ఆలోచన,ప్రస్ఫుటం .సంపాదించుకొనే అనేక వెసులు బాట్లు ఇతర ప్రాంతాలలో ఉన్నా వాటిని తృణీకరించి ,జన్మ భూమి పైనా ,కూచి పూడి నాట్యం మీద ఉన్న విశేష గౌరవం ,ప్రేమ ,అభిమానాల నే మాత్రం చె జార్చుకోకుండా కళకే అంకిత మై ఆదర్శ ప్రాయులైన కళా తపస్వి. . 78 ఏళ్ళు నిండు జీవితాన్ని గడిపి నిన్న రాత్రి తుది శ్వాస విడిచిన పద్మ శ్రీ వేదాంతం సత్య నారాయణ శర్మ గారు ముమ్మాటికీ’’ కూచి పూడి నాట్య వేదాంతమే ‘’

             మగాడు ఆడ వేషం వేసి రాణించి ఆ కళకే సార్ధకత తెచ్చిన వారు శర్మ గారు .ఈ విధం గా కూచి పూడికి అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులను అందించి ,ఆ కళా సరస్వతికి జన నీరాజనాలన్దిన్ప జేశారు .వీరి తొమ్మిదవ ఏట నాట్య తరగతికి ఆదరా బాదరా నడిచి వెడుతుంటే ,పొలాలలో ఒక యోగి తారస పడ్డారట .ఈ కుర్రాడి హావ భావ విన్యాసాలను గమనించి ఆయోగి ‘’నువ్వు గొప్ప నాట్యా చార్యుడవుతావు .నీ వల్ల నీ గ్రామానికి, కూచి పూడి కళకు విశేష కీర్తి లభిస్తుంది ‘’అని మనసారా ఆశీర్వా దించి ,అదృశ్య మైనాడట .ఎవరీయన అని తర్వాత ఆరా తీస్తే ఊరి పెద్దలు ,తలి దండ్రులు ఆ వచ్చిన యోగి సాక్షాత్తుకూచి పూడి నృత్యానికి ఆద్య గురువు లైన  సిద్ధేంద్ర యోగి పుంగవులే అని నిర్దారించారట .అంతటి పుణ్య పురుషుల ఆశీస్సు లభించింది శర్మ గారికి .అంతే ఇక ఆయనకు ఎదురు లేకుండా పోయింది .

          కూచి పూడి నాట్యం లో విశిష్ట మైన శ్రీ కృష్ణ సత్యభామ కలాపం అదే ‘’భామా కలాపం ‘’పై పూర్తీ దృష్టిని పెట్టి అభ్యసించి దాని మూలాలను శిఖరాలను తరచి చూశారు .సత్య భామ అంటే సత్య నారాయణ శర్మ గారే వేయాలి అన్న పేరొచ్చింది ..ఎక్కడా మగతనం మనకు కనీ పించదు .ఆ నడక ,ఒయ్యారం ,హొయలు ,సొగసులు,సోయగం మురిపెం ముద్దు ,మాట పాటా  అన్నీ కాచి వడపోసి ఆ పాత్ర ను చిరంజీవి ని చేశారు .ఈ వేషం వల్ల వివాహం చేసుకోవ టానికి స్త్రీ ఎవరు ముందుకు రారని చెవి నిల్లు కట్టుకొని పోరినా,వారు పెడ చెవిని బెట్టి తన సత్య భామకే అంకితమై పోయి న భూతో నభవిష్యతి అని పించుకొన్నారు .దానినొక అద్వితీయ పాత్ర గా మలిచి మెరుగులు దిద్దారు .ఆయన దీక్ష ,పట్టుదలా,కఠోర శ్రమ ,అధ్యయనం ,అమలు చేసిన తీరు మహాశ్చర్యాన్ని కలిగిస్తుంది ..ఆ పాత్రకు ఆయనే సరి అది ఆయన కోసమే నని పించారు .ఎక్కడ ప్రదర్శన నిర్వ హించినా,,ఎంత దూరమైనా వెళ్లి తిరిగి స్వగ్రామం చేరుకోవటం వారికి ఇష్టం .నాట్యానికే కాదు ఆ నాట్యం అందించిన గ్రామానికీ ఆయన సేవలు నిరుప మానం .ఎన్ని వేల ప్రదర్శనలిచ్చారో లెక్కలేదు .ప్రదర్శించిన ప్రతి చోటా ,ప్రశంశా వర్షమే  కురిసింది .ఆడ వాళ్ళే అబ్బుర పడి స్త్రీయేమో నని భ్రమ పడిన సందర్భాలున్నాయట .భార్యనే ఆశ్చర్య పరచారంటారు .ఆయనను సన్మానించని,బిరుదులన్దించని ,సపురస్కారం అందజేయని  సంఘం ,విద్యాలయం ,అకాడెమీ ,సాహిత్య సంగీత నృత్య సంస్థ లేదు ..నలభై వ ఏట భారత ప్రభుత్వం వీరిని ‘’పద్మశ్రీ ‘’పురస్కారం తో సన్మానించి వారి కీర్తికి వన్నె తెచ్చింది .వారికి వయసు పైన పడుతున్నా ,లాస్యం లో ఏ మాత్రం వన్నె చిన్నెలు తగ్గలేదని విశ్లేషకులు నివ్వెర పోతుంటారు .కూచి పూడి విశ్వ విద్యాలయం అభి వృద్ధికి వారిచ్చిన ప్రోత్సాహ ప్రోద్బలాలు మరిచి పోరానివి .అక్కడి గ్రంధాలయం ,రిసోర్సు కార్యాలకు సౌకర్యాలు కల్గించారు .వెంపటి ఛిన సత్యం, వేదాంతం సత్య నారాయణ ,బందా కనక లింగేశ్వర త్రయం కూచి పూడి నాట్యా భి వృద్ధికి అవిశ్రాంత కృషి చేశారు .ఇవాళ ఆ కేంద్రం ఇంత ఉన్నత స్తితికి రావ  టానికి వీరే ముఖ్య కారకులు .

             ప్రతి ఏడాది సిద్ధేంద్ర ఆరాధనోత్స వాలను నిర్వ హిస్తు కళా కారులను రావించి ,వారి ప్రతిభను ప్రకటింప జేస్తూ ప్రోత్సహిస్తూ సంగీతానికి ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని రకాల నృత్యాలకు అన్ని ప్రాంతాల వారికీ అవకాశం కల్గిస్తూ అంతర్జాతీయ ఖ్యాతిని కూచి పూడి గ్రామానికి కల్గించారు .ఉదయం పూట  సోదాహరణ ప్రసంగాలను ఏర్పాటు చేసి శర్మ గారు తాను వయసును లెక్క చేయకుండా రెండేళ్ళ కిందట కూడా తన అభినయ కౌశలాన్ని ఆహూతులందరికి తెలియ జేసి ముక్కున వ్రేలు వేసుకోనేట్లు చేశారు .నేను ఎన్నో సార్లు వీటిని స్వయం గా చూసి తరించాను .వారితో పరిచయం ఉంది కాని అంతకు మించి దూరం పోలేదు .కాని మనిషి కనీ పిస్తే మన రెండు చేతులు అనుకో కుండా ముడుచుకు పోయి వారికి నమస్కారం చేస్తాము .అదీ వారి ప్రత్యేకత .ఎప్పుడూ సాంప్రదాయ మైన దుస్తులే వేసుకొంటూ ,మన సంస్కృతికి అద్దం పడుతూ మనల్ని ఆకర్షిస్తారు .నుదుటి మీద యెర్రని నిలువు బొట్టు వారి ప్రత్యేకత .ఆ కళ్ళ లో హావ భావాలు తొణికిస లాడుతూనే ఉంటాయి .అసలు వారిని చూస్తె ఈయన సత్య భామ వేస్తారా /అని పిస్తుంది వేషం కడితే ఇక ఆనంద పర వశమే పదేళ్ళ క్రితం అనుకొంటా ఒక సారి బందరు టౌన్ హాల్ లో ఒక సభలో మేమిద్దరం ప్రక్క ప్రక్కనే కూర్చున్నాం .నేను పరిచయం చేసుకొని వారిని గురించి నా నాట్ బుక్ లో రాసిన నాలుగు మాటలు వారికిచ్చి చదవమని కొరాను .వారు ఎంతో ఆత్మీయం గా చదివి తమ ఆనందాన్ని తెలిపి నమస్కరిస్తూ కన్ను లు ఎగర వేసి నేను రాసిన దాని కింద సంతకం చేసిచ్చి వారి సహృదయత ను చాటుకొన్నారు .అప్పటి నుండి తరచు కలుస్తూనే ఉన్నాం కూచి పూడిలో .

           సత్య నారాయణ శర్మ గారికి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ డాన్స్ బిరుదు నిచ్చి భారత ప్రభుత్వం సత్క రించింది .పెరు దేశం లోని అనేక సంస్థలు వారికి గౌరవ డాక్టరేట్ నిచ్చాయి ఆ నగర తాళం చెవులు అందించి గౌర వించాయి .కొలంబియా లోని పలు సంస్థలు సత్కరించి కీ లను అందించి గౌరవించాయి . డెన్మార్క్ లోని అంతర్జాతీయ సంస్థ ,యు నేస్కో సత్కారాలు పొందారు .ఒరిస్సా లోని మానవ హక్కుల కమిషన్ గౌరవ పురస్కారమంద జేసింది .ఉత్తర ప్రదేశ్ లో రంగ్గ్ మహోత్సవ్ వారు ‘’రంగ్గ్ భూషణ్ ‘’బిరుదు నిచ్చి సన్మానించారు .ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘’మెడల్ ఇన్ పెర్ఫార్మన్స్ ఆర్ట్ ‘’ను ,ఉగాది పురస్కారాన్ని అంద జేసింది .నిజామాబాద్ లోని లలితాశ్రమం ‘’నృత్య శేఖర్ ‘’నుఇచ్చి గౌరవించింది .ఉత్కళ్ యువ సంస్కృతి సంఘం ‘’చారిస్మాన్ అవార్డు ‘’ను అందించింది .నిజామాబాద్ జిల్లా కలెక్టర్‘’ఉత్తమ అవార్డు ‘’ను అందజేసి  గౌరవించారు .ఇంతటి విశిష్ట వ్యక్తిని మన కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ తో సరి పుచ్చి నిద్ర పోవటం సిగ్గు పడాల్సిన విషయం .కూచి పూడి నృత్య కళకు కూచి పూడి గ్రామానికి అంకిత మై ప్రపంచ పటం లో ఆ రెంటికి తిరుగు లేని కల్పించి ,భామా కలాపాన్ని అంతర్జాతీయ స్తాయికి తెచ్చి సత్య భామ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసి తానూ ఆ పాత్ర ద్వారా ప్రతిష్టా గౌరవాలు పొందిన కళా శేఖరులు వేదాంతం సత్య నారాయణ శర్మ గారి మరణం ఆంద్ర కళా మతల్లికి తీరని లోటు .ఈ మధ్యనే పరమ పదించిన వెంపటి ఛిన సత్యంగారు  ఒక అగాధాన్ని కల్పించి వెడితే, శర్మ గారు మరీ శూన్యం చేసి వెళ్లారు .వీరిద్దరూ రెండు అభినయ .మహా శిఖరాలు  . 

           మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-11-12-ఉయ్యూరు 

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

1 Response to ‘’కూచి పూడి నాట్య వేదాంతం ‘’శ్రీ సత్య నారాయణ శర్మ

  1. మీ నివాళి బాగుంది

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.