సిద్ధ యోగి పుంగవులు –23 పార్ధివ లింగ యోగి -పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు

          సిద్ధ యోగి పుంగవులు –23

 

                                                  పార్ధివ లింగ యోగి -పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు

 నిత్య పార్ధివ లింగ పూజా పరాయణులు బ్రహ్మశ్రీ పేరిలక్ష్మీ నారాయణ శాస్త్రి గారు .1877లో గోదావరి జిల్లా కోన సీమ లో పేరూరు అగ్రహారం లో జన్మించారు .తండ్రి గారు మహా శ్రీ విద్యోపాసకులైన అనంత రామావధానులు గారు .తల్లి గారు వెంక మాంబ ..తాత గారు శ్రీ పార్ధివ లింగ పూజా పరాయణులు ,శ్రీ విద్యోపాసకులు,సత్కర్మ పరాయణులు అయిన సుబ్బావధానులు గారు .వీరిది  ద్రావిడ బ్రాహ్మణకుటుంబం .

             శాస్త్రి గారి చిన్నతనం లోనే తండ్రి మరణించారు .అమ్మ గారే వీరిని కంటికి రెప్పలాగా కాపాడారు .ఎనిమిదవ ఏటనే ఉపనయం చేశారు .పదహారవ ఏటనే వైయాకరణ చూడా మణి బిరుదాన్కితులైన మంధా చెన్నయ్య శాస్త్రి గారి కి శిష్యులై సంస్కృత కావ్య నాటకాలను ,న్యాయ వేదాంత గ్రంధాలను అభ్యాసం చేశారు ..తర్క శాస్త్రం మీద మోజు కలిగి అతి దుర్బోధకం గా ఉండే  ఆ శాస్త్రాన్ని పంచ దార పానకం లా గుటకాయస్వాహా గా పుచ్చుకొని ,ఆ నాటి మేటి తర్క శాస్త్రజ్నులనే ఆశ్చర్యం లో ముంచారు .ఆయన దిషణాదిక్యత కు అందరు ముచ్చట పడ్డారు.

             విజయ నగర మహా రాజ సంస్కృత కళాశాలలో న్యాయ శాస్త్ర ప్రధానా చార్యలు అపర గౌతమ బిరుదాంకితులు అయిన గుమ్మలూరి సంగ మేశ్వర శాస్త్రి గారి వద్ద న్యాయ శాస్త్రాన్ని పది  ఏళ్ళు అభ్యశించారు .దీనికి మెరుగులు దిద్దు కోవటానికి నైయాకరణ సార్వ భౌములు అని పిలువబడే పిథాపుర ఆస్థాన విద్వాంసు లైన శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి గారి సమక్షం లో రెండేండ్లు న్యాయ శాస్త్రాన్ని చదివి అసాధారణ పండితులని పించుకొన్నారు .పిఠాపురం ,ఉర్లాం సంస్థానాలను దర్శించి తమ నిరుప మాన మైన  పాండిత్య ప్రకర్ష ను నిరూపించి ,,శాస్త్ర పరీక్ష లో నెగ్గి ,ప్రధమ స్థానాన్ని పొంది అనేక బహుమానాలను గెలుచుకొన్నారు .

                  తమ స్వగ్రామం లో న్యాయ శాస్త్రాన్ని ,వేదాంతాన్ని అనేక మంది శిష్యులకు బోధించారు .వీరి కీర్తి నెల నాలుగు చెర గులా వ్యాపించింది .1902  లో విజయ నగర సంస్కృత మహా విద్యాలయం లో న్యాయ శాస్త్రాధ్యాపకు లుగా నియుక్తులైనారు ..1913 లో సంగమేశ్వర శాస్త్రి గారి నిర్యాణం తరువాత వీరు ప్రధాన న్యాయ శాస్త్ర పండితులుగా  పదోన్నతి పొందారు .మహా రాజావారి అభ్యర్ధన మేర కు రాజస్థాన్ లోని జయపూర్ సమస్తానికి వెళ్లి అక్కడ మహా విద్వత్ సభలో తమ ప్రజ్ఞా,పాండిత్య ప్రతిభ ను ,వాదకౌశలాన్ని  ప్రదర్శించి ‘’న్యాయ భూషణ ‘’బిరుదును పొందారు ..విజయ వాడ లోని త్రిలింగవిద్యా పీథం వారు బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకట రమణ సిద్ధాంతి గారి ఆధ్వర్యం లో న్యాయ స్థాపక ‘’బిరుదు నిచ్చి సత్కరించారు .1937 లో లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు సంస్కృత కళాశాల ప్రధాన పండిత పదవిని అలంకరించారు .అయిదేళ్ళు పని చేసి విశ్రాంతి పొందారు .

               ఆ నాటి బ్రిటీష్ ప్రభుత్వంవారు  శాస్త్రి గారి విద్వత్తు కు అబ్బుర పడి ‘’మహా మహోపాధ్యాయ ‘’అనే అరుదైన బిరుదు నిచ్చి సత్క రించారు .వీరికి ముందు నలుగురు మాత్రమె ఈ బిరుదు ను పొందారు .న్యాయ, వేదాన్తాలను జీవితాంతం బోధించటమే గాక మంత్ర ,జ్యోతిషాలలో అద్భుత ప్రావీణ్యంసంపాదించారు .అతి గహన మైన ఉదయనా చార్యుల రచన ‘’కుసుమాంజలి ‘’ని అతి సరళ భాష లో అనువాదం చేసి తమ పాండితీ గరిమను నిరూపించారు .అలాగే గదాధర భట్టాచార్యుల ‘’హేత్వాభాస సామాన్య నిరుక్తి ,’’సవ్యభి చార సామాన్య నిరుక్తి ‘’అనే నవ్య న్యాయ శాస్త్ర గ్రంధాలకు ‘’లలిత ‘’అనే పేరు తో వివరణాన్ని రాసి ,తమ న్యాయ శాస్త్ర కౌశలాన్ని ,ప్రతిభా వ్యుత్పత్తిని ప్రదర్శించి కోవిదుల మన్నన లందుకొన్నారు .మాధవా చార్యుల వారి ‘’సర్వదర్శన సంగ్ర హం ‘’లోని అనేక భాగాలకు ఆంధ్రాను వాదం చేశారు .అయితే అది అముద్రితమే ..డెబ్బది మూడు సంవత్స రాలు ధన్య జీవితాన్ని గడిపిన న్యాయ శాస్త్ర కోవిదులైన శాస్త్రి గారు 1949 న పరమ పదించారు .

                సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-11-12-ఉయ్యూరు

 

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.