కూచిపూడి నిఘంటువు
– భాగవతుల సేతురాం
కూచిపూడి నాట్య విషయాలకు సంబంధించిన సిద్ధాంత, ప్రాయోగిక, సంగీత, సాహిత్య, చరిత్ర ఇత్యాది విషయాలకు సత్యనారాయణ శర్మ ఒక నిఘంటువు లాంటి వారు. కలాపాలు, యక్షగానాలు, ఏకపాత్ర కేళికలు, కూచిపూడి నాట్యంలోని మార్పులు, చేర్పులు, ప్రదర్శనా విధానంలో నాటికీ, నేటికీ ఉన్న వ్యత్యాసం, నాటి కూచిపూటి నాట్య గురువుల విశేషాలు, కూచిపూడి నాట్యానికి ఆ మహనీయులు చేసిన సేవ ఇత్యాది విషయాల గూర్చి నేడు కూలంకషంగా చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఆయనే.
నాచిన్న తనంలో నేనుచూసిన పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మగారి స్త్రీ వేషం ‘విప్రనారాయణ’ నృత్య రూపకంలో ‘దేవదేవి’ కిక్కిరిసినది. ప్రేక్షకులు, ఇసుక వేస్తే రాలని జనం. ప్రేక్షకులలో ఏ ఒక్కరూ ఈ లోకంలో లేరు. అందరూ ఆ ‘దేవదేవి’ అందానికీ, హొయలకూ, అభినయ కౌశలానికి మంత్రముగ్ధులయిన వారే. అభినయంలో వారికి వారే సాటి. సత్యనారాయణ శర్మ గారి అభినయం మనోధర్మంతో కూడి ఉండటం వల్ల ఎంతో వైవిధ్యంగా ఉండేది. ఎన్నిసార్లు ఒకే అంశాన్ని చూసినా ఇంకా చూడాలనిపించేది ఆ కారణంగా. వారితో నా చివరి సంభాషణలలో ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ, ‘మీ కాలంలో ఒక దర్వునుగానీ, ఒక అంకాన్ని గానీ తెల్లార్లు ప్రదర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అభినయానికి ఎల్లలుగీసి ప్రదర్శిస్తున్న ఈ రోజులలో వైవిధ్యం లేకుండా సాత్వికాభినయాన్ని పంజరంలో బంధించటం ఎంతవరకు సబబు?” అన్నా వారు దానికి నవ్వేసి “ఆ కాలానికి అది కరెక్టు. ఈ కాలానికి ఇది కరెక్టు. అయినా నువ్వన్నట్టు ఒక వాక్యానికి ఐదు సార్లే చేయాలి అని ఎక్కడా లేదు. సందర్భాన్ని బట్టి చేసుకుంటూ పోవాలి’ అన్నారు. సమయోచిత సంభాషణ, లౌక్యంతో విషయాన్ని చెప్పకనే చెప్పటం వారి సొత్తు అనిపించింది నాకు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2003లో లబ్దప్రతిష్ఠులయిన 10 మంది గురువుల నాట్య బాణీలపై, నేను సంధానకర్తగా, ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం చైర్మన్‌గా నిర్వహించిన బాణీ ఫెస్టివల్‌లో వారు, వారి బాణీని ప్రదర్శిస్తూ చేసిన సోదాహరణ ప్రసంగం అపూర్వం, అపురూపం. నాట్య గురువుల బాణీలపై ఏర్పాటు చేసిన ఈ సదస్సు, నృత్య ప్రదర్శన ఆలోచనకు వారు నన్నెంతగానో ఆభినందించారు. నా పూర్వజన్మ సుకృతం. అలాగే మా విశ్వవిద్యాలయ బోధనా సిబ్బంది, విద్యార్థులు అందరం శ్రీ సిద్ధేంద్ర కళాపీఠం, కూచిపూడిలో వారి గురుత్వంలో భామాకలాపాన్ని నేర్చుకోవడం ఒక అదృష్టం.
కూచిపూడి నాట్య విషయాలకు సంబంధించిన సిద్ధాంత, ప్రాయోగిక, సంగీత, సాహిత్య, చరిత్ర ఇత్యాది విషయాలకు సత్యనారాయణ శర్మ ఒక నిఘంటువు లాంటి వారు. కలాపాలు, యక్షగానాలు, ఏకపాత్ర కేళికలు, కూచిపూడి నాట్యంలోని మార్పులు, చేర్పులు, ప్రదర్శనా విధానంలో నాటికీ, నేటికీ ఉన్న వ్యత్యాసం, నాటి కూచిపూటి నాట్య గురువుల విశేషాలు, కూచిపూడి నాట్యానికి ఆ మహనీయులు చేసిన సేవ ఇత్యాది విషయాల గూర్చి నేడు కూలంకషంగా చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఆయనే. అనేక నాట్య సదస్సులలో వారు నాట్యసంబంధిత విషయాలపై సోదాహరణ ప్రసంగాలు చేశారు. వారు మంచి వక్త. కార్యశీలురు.
ఎటువంటి కార్యాన్నయినా వారి మృదుమధుర సంభాషణతో సాధించగలరు. వారు పొందిన సత్కారాలు, సన్మానాలు, బిరుదులు అనేకం. అయినా అవి ఏవీ ఆయన ప్రతిభాపాటవాలకు మించినవి కావు. ఇటీవల ఉద్దండులయిన కూచిపూడి కళాకారులను కోల్పోయి కూచిపూడి నాట్యకళామతల్లి మౌనంగా రోదిస్తోంది. మా తరానికి మార్గదర్శకులు వారు. వారి తదనంతరం దశ, దిశ నిర్దేశించే పెద్దలెవరు? వారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ, తెలిసింది తక్కువ, తెలుసుకోవాల్సింది ఎంతో అనే వారి ఆలోచనా ధోరణి అలవరచుకుంటూ, ఆ తరం వారు ఏర్పరచిన బాటలో నేటి తరం వారు నడవాలని భావిస్తూ, అశ్రునయనాలతో మామయ్యకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
– భాగవతుల సేతురాం
అసోసియేట్ ప్రొఫెసర్
నృత్య శాఖ, తెలుగు విశ్వవిద్యాలయం

