సిద్ధ యోగి పుంగవులు –27 శ్రీ విద్యోపాసకులు –ఆది భట్ట రామ మూర్తి శాస్త్రి

         సిద్ధ యోగి పుంగవులు –27         

 

                                              శ్రీ విద్యోపాసకులు –ఆది భట్ట రామ మూర్తి శాస్త్రి

 బొబ్బిలి తాలూకా మురగడం అగ్రహారం లో 1861 లో సుబ్రహ్మణ్య ,,మహాలక్ష్మమ్మ దంపతులకు ఆది భట్ట రామ మూర్తి శాస్త్రి గారు జన్మించారు .ద్రావిడ శాఖకు చెందిన వీరు స్వగ్రామం లోనే పంచాకావ్యాలను నేర్చుకొన్నారు .పిమ్మట శ్రీ పాద రామ మూర్తి శాస్త్రి గారి వద్ద తర్క శాస్త్రాన్ని ,పంచ లక్షణ వ్యధి కారణాన్ని ,సిద్ధాంత లక్షణాలను అవచ్చేదకత్వ నిరరుక్తి ని ,పక్షత సామాన్య నిరుక్తి అనే తర్క గ్రంధాలను ఆసాంతం చదువు కొన్నారు ..పండితులకు నిలయ మైన కాశీ చేరి ,కర్నాటక సీతా రామ శాస్త్రి గారి దగ్గర నవ్యభిచారం ,సథ్ ప్రతి పక్షం ,అవయవం ,అనే మహా గ్రంధాలను చదివి తమ తర్క పాండిత్యాన్ని అభి వృద్ధి చేసుకొన్నారు .బెంగాలీ పండితులైన వజ్ర కుమార విద్యా రత్న భట్టా చార్యుల వారి వద్ద వ్యుత్పత్తి వాద ,శక్తి వాదాల తో బాటు ,ప్రామాణ్య వాదం ,విధి వాదం ,ముక్తి వాదం అనే అపూర్వ గ్రంధ రాజాలను తుదముట్టా చదివి తమ వాదనా సామర్ధ్యానికి పదును పెట్టుకొన్నారు .

                  తర్క శాస్త్రం లో ప్రమాణ గ్రంధ మైన ‘’మూల చూడం’’ ను అధ్యయనం చేసి ఎదురులేని పాండిత్యాన్ని కైవశం చేసుకొన్నారు ..కలకత్తా వెళ్లి అక్కడి ప్రభుత్వ పరీక్ష లో పాల్గొని ‘’తర్క తీర్ధ ‘’బిరుదును అందుకొన్నారు .అక్కడ విశేష సన్మానం తో బాటు అయిదు వందల రూపాయల నవ రత్న రూప బహుమానాన్ని అందుకొన్నారు .ప్రతిభ తగిన ప్రతి ఫలం వారికి లభించింది .దానితో సంతృప్తి చెందలేదు కాశీ పండితుల చేత కూడా భేష్ అని పించుకోవాలనే ఆలో చన కలిగి కాశీ చేరారు .అక్కడ ద్రావిడ సుబ్రహ్మణ్య దీక్షితులవద్ద వేదాంత సూత్ర శంకర భాష్యం లో చతుస్సూత్రి వరకు అధ్యనం చేశారు ..స్వీయ ప్రతిభ తో దశోపనిషత్తుల భాష్యాలను ,గీతా భాష్యాన్ని ,సూత్ర భాష్యాన్ని ,అద్వై త సిద్ధిని ,గౌడ బ్రహ్మా నందాన్ని తాను అభ్యసించి ,శిష్యులకు అధ్యాపనం చేశారు .

              వీరి అపూర్వ పాండిత్యం అందరిని ఆకట్టు కొన్నది .కర్నాటక దేశం లోని చిత్రా పూర్ లోని శంకరపీఠస్వామికి వేదాంతాన్ని బోధించే అరుదైన అవాకాశాన్ని పొందారు ..వారి ఆదేశం పై అక్కడి విద్యార్ధులకు తర్క శాస్త్రం బోధిస్తూ మూడేళ్ళు ఉన్నారు ..తమ పర్యటనలలో దర్భాంగా ,మండి సంస్థానాలను దర్శించి విద్వత్తు ను ప్రదర్శించి బహుమానాలను, సత్కారాలను పొందారు .ఉర్లాం జమీన్ దారు  వీరిని తర్క శాస్త్ర పరీక్షాధి కారి గా చేశారు .మండ పేట ,విజయనగరం ,రాజ మండ్రిసంస్కృత కలా శాలలో పది హేడు సంవత్స రాలు అధ్యాపకులు గా పని చేసి ఎందరో శిష్యులకు తర్క శాస్త్రాన్ని బోధించి ,తీర్చి దిద్దారు .

                    వీరి విద్యా గరిమను చూసి తిరుపతి సంస్కృత కలా శాలలో ప్రధాన ఆచార్య పదివి నిచ్చి సత్కరించారు .ఇక్కడ ఎక్కువ కాలం పని చేయ లేదు .దక్షిణ దేశ సంచారం చేస్తూ విద్వత్ సభలలో రాణిస్తూ వాదాలలో జయ భేరి మ్రోగిస్తూ, తర్కం లో అజేయులని పించుకొని .,శాస్త్రార్ధ చర్చలలో అద్వితీయులని నిరూపించుకొని జయ కేతనాన్ని ఎగుర వేశారు .లుకులాం అగ్రహారాన్ని చేరుకొని ,అక్కడ వదాన్యులైన బూర్లె శ్రీ రాములు గారి చేత భూమి, గృహం ,వసతులను పొంది నివాసమున్నారు .సుఖ జీవితాన్ని గడుపుతూ విద్యార్ధులకు తర్క వేదాంత విద్యనూ బోధిస్తూ గడిపారు .శక్తి వాదం పైన ఒక అపూర్వ వ్యాఖ్యానాన్ని రాశారు కాని ముద్రణ కు అది నోచుకో లేదు .

             రామ మూర్తి శాస్త్రి గారు విద్యార్ధి దశ నుండి శ్రీవిద్యో పాసకులు .కడ దాకా దాన్ని కొన సాగించిన దీక్షా దక్షులు .అవసాన దశ సమీపించే తరుణం లో శాస్త్రి గారు నదీ తీరం లో ఉండాలని సంకల్పించుకొని ,రాజమహేంద్ర వరం చేరి, గోదావరీ తటాన కొంత కాలం ఉన్నారు .చివరి రోజులలో సన్యాసాశ్రమం తీసుకొని సార్ధక జన్ము  లైనారు .తమ యాభై తొమ్మిదవ ఏట1920లో ఆది భట్ట రామ మూర్తి శాస్త్రి స్వామి సిద్ధి పొందారు .వారి విద్యా వైదుష్యానికి శ్రీ విద్యోపాసనే తోడ్పడిందనిని నిశ్చయం గా నమ్మి, ఆ మరనాంతం దాన్ని అనుసరించిన ధన్య జీవులు  .

.                   సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-11-12—ఉయ్యూరు

              

 

 

http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.