తనికెళ్ళ భరణీయం

బంధాలు వికసిస్తేనే అందం

రంగస్థలాన్ని దాటి సినీరచయితగా పదేళ్లు, నటుడిగా పాతికేళ్లు సుదీర్ఘ ప్రస్థానం చేసిన వారు తనికెళ్ల భరణి. స్వేచ్ఛ లేని చోట బాధ్యత ఏముంటుంది? బాధ్యతాయుతంగా ఏమైనా చేయొచ్చనుకుని సినీరచనకు సిద్ధమైన భరణికి ఆక్కడున్న సంకెళ్లు ఎంతో మానసిక క్షోభకు గురిచేశాయి. అయినా ఓ పదేళ్లు ఆ బాధ్యతల్ని మోసి ఆ తరువాత సినీనటనకు శ్రీకారం చుట్టారు.

పాతికేళ్ల తర్వాత తాను ఆశించినంత పూర్తి స్వేచ్ఛతో రచన, దర్శకత్వం చేసే ఒక అవకాశం మి«థునం ద్వారా ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. ‘మిథునం’ తనకో గుర్తింపుగా మారబోతున్న ఈ తరుణంలో తనికెళ్ల భరణి జీవితంలోని కొన్ని అరుదైన సంఘటనల్ని మీ ముందు ఉంచుతోంది ‘ అనుభవం’ 
ఆనందంలోంచి కొంత నేర్చుకోవచ్చు. విషాదం లోంచీ కొంత నేర్చుకోవచ్చు. కానీ, ఆ రెండూ కలగలిసినప్పుడే సమస్య. అప్పుడూ నేర్చుకోవచ్చు. కాకపోతే, ఆ సత్యాలు కలగాపులగంగా ఉంటాయి. వాటిని జీర్ణించుకోవడం కొంత కష్టమయ్యే మాట నిజమే కానీ, అవే ఎంతో లోతైన సత్యాల్ని నేర్పుతాయి. దేవరకొండ నర్సింహకుమార్ అని నాకో మిత్రుడు ఉండేవాడు. ఇంటర్ నుంచి, డి గ్రీ దాకా వాడు నా క్లాస్‌మేట్. అప్పుడో ఇప్పుడో నేను రాసే కవితల్ని చదివి బాగా మెచ్చుకునే వాడు.

ఇంకా ఇంకా రాయమని ప్రోత్సహించే వాడు. వాడి ప్రోత్సాహమే నేను సాహిత్యం దిశగా పయనించడానికి అవసరమైన స్ఫూర్తినిచ్చింది. ఎవరెవరితోనో సాహిత్య చర్చలు చేస్తూ ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చేవాడ్ని. చాలా సార్లు ఆ టైంకి మా ఇంటికి వెళ్లలేక ఈ మిత్రుడి రూమ్‌కే వెళ్లి పడుకునే వాడ్ని. వాడి ధ్యాసంతా ఎప్పుడూ పుస్తకాల మీదే ఉండేది. నేను మొదట్నించీ కాస్త గాలివాటమే. బి.కాం చేసే రోజుల్లోనే వాడు టైప్, షార్ట్‌హ్యాండ్ కూడా నేర్చుకుంటూ ఉండేవాడు. కొద్దిరోజుల పాటు నేనూ టైపింగ్‌కు వెళ్లాను గానీ, నాకు అదేమీ అబ్బలేదు. మా నాన్నేమో అస్తమానం వాడితో పోలుస్తూ నన్ను అదేపనిగా తిడుతూ ఉండేవాడు. ఎప్పుడైనా వాడు మా ఇంటికి వస్తే చాలు మా నాన్న నా మీద వీర విహారం చేసేవాడు.

డిగ్రీ పూర్తయిన వెంటనే వాడికి ఒక మంచి కంపెనీలో స్టెనో ఉద్యోగం వచ్చింది. ఇంకేముంది? మా నాన్న తిట్లదండకం ఇంకా ఎక్కువయ్యింది. ఒక దశలో ‘ వీడివల్లే కదా నేను ఇన్ని తిట్లు తింటున్నాను’అన్న నెగెటివ్ ఫీలింగ్ నాలో మొదలయ్యింది. ‘అసలు వీడిని ఇంటికే రావద్దని చెప్పేస్తే బెటర్ కదా!’ అని కూడా అనుకున్నాను. చివరికి ఒకరోజు నేరుగా వాడితో ఆ మాటే అనేశాను. అందుకు వాడు బదులేమీ ఇవ్వకుండా, మౌనంగా నావైపు అలా చూస్తూ ఉండిపోయాడు. చివరికి నేనే తలతిప్పుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాను.

అప్పుడే తెగిపోతే…
అంత మాట అనేసినా వాడు నాకు దూరం కాలేదు. నా స్నేహాన్ని వదులుకోలేదు. సాహిత్యం విషయంలో నన్ను ప్రోత్సహించడమూ మానుకోలేదు. తొలిసారిగా పత్రికలో వచ్చిన ‘అగ్గిపుల్ల-ఆత్మహత్యలు’ అన్న నా కవితను చూసి ఏ మహాశిఖరమో నా చేరువైపోయినట్లు తెగ ఆనందపడ్డవాడు వాడే. వాస్తవానికి, ఆ రోజుల్లో అంతలా ప్రోత్సహించే వాళ్లు నాకు మరెవరూ లేరు. ఈ రోజు ఈ కాస్త స్థాయిలో నేనున్నానూ అంటే వాడి ప్రోత్సాహ ఫలమే.

నేను వాణ్ని మా ఇంటికి రావద్దని చెప్పానే గానీ, చూడకుండా ఉండలేకపోయే వాడ్ని. వాడూ అంతే. ఒకరోజు వాళ్ల ఆఫీసు వాళ్లతో కలిసి గండిపేటకు పిక్‌నిక్‌కు వెళ్లాడు. మ«ధ్యాహ్నం 3గంటల వేళ నా మిత్రుడొకడు వచ్చి కుమార్ గండిపేట చెరువులో మునిగి చనిపోయాడని చెప్పాడు. నా శరీరంలోని ప్రతి అణువూ కాలిపోతున్నట్లనిపించింది. ఆగమేఘాల మీద గండిపేటకు చేరుకున్నాం. వాడి తల్లిదండ్రుల దుఃఖానికి అంతు లేదు. స్మశానానికి చేరుకున్నాం.

ఒక్కగానొక్క కొడుకు కన్నుమూశాడన్న దుఃఖంతో వాడి తండ్రి కుప్పకూలిపోయాడు. చివరికి నా మిత్రుడికి నేనే కొరివి పెట్టాను. భౌతికంగా వాడు నా కళ్లముందు లేకపోవచ్చు గానీ, వాడు నాలోనే ఉండి, నాతోనే నడుస్తున్నాడనుకుంటాను. ఆ రోజు ఎంత తొందరపడ్డాను? మా ఇంటికి రావద్దని నేను అంత కఠినంగా మాట్లాడేసిన్నాడు నిజంగానే వాడు నాకు దూరమై ఉంటే ఏమయ్యేది? ఈ రోజు నేనిలా నిలబడే వాణ్నే కాదు. మన జీవితాన్ని నిలబెట్టే అత్యంత ఆత్మీయుల నుంచి కూడా వాళ్లకు తెలిసో, తెలియకో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎప్పుడైనా మన మనసు గాయమైఉండొచ్చు. అంత మాత్రానికే ఆ బంధాన్ని తెంచేసుకుని, వారికి దూరమైపోతే అది జీవితకాలమంతా తిరిగి పూడ్చుకోలేని భారీ నష్టమవుతుందన్న సత్యం ఆ అనుభవం నాకు నేర్పింది.

అన్నీ తెలియడం వల్లే…
పాతికేళ్ల క్రితం నాటి మాట. నాటకమే జీవితం అన్నట్లు ఎంతో ఉధృతంగా నాటకాలు వేస్తున్నాం. ఆ సమయంలో కళాసాగర్‌లో నాటకపోటీలు జరుగుతూ ఉంటే, నేను రాసిన ‘గోగ్రహణం’ నాటకాన్ని ప్రదర్శనకు తీసుకువెళ్లాం. తల్లావ ఝల సుందరం గారి దర్శకత్వంలో ఆ ప్రదర్శన జరిగింది. దాన్ని చూడటానికి ముఖ్య అతిథిగా ఆచార్య ఆత్రేయ గారు వచ్చారు. ప్రదర్శన తరువాత జరిగిన సభాకార్యక్రమంలో మాట్లాడుతూ, “సినిమాల్లోకి వచ్చాక నాటకాలు రాయడం మానేశాను. అయినా మళ్లీ నాటకాలు రాస్తాను… రాస్తాను అంటూ కొన్నేళ్లుగా మిమ్మల్ని భయపెడుతూ వచ్చాను.

కానీ, ఈ రోజు తేల్చిచెప్పేస్తున్నా.. తనికెళ్ల భరణి రాసిన ఈ గోగ్రహణం చూశాక నేనింక నాటకం రాయక్కర్లేదన్న నిర్ధారణకు వచ్చేశాను. అందుకే ఇంక నేను నాటకాలు రాయనంటే రాయను” అన్నారు. అంతటి ఒక మహా రచయిత నోట ఆ మాట రావడం నాకు గర్వకారణమే కానీ, ఆ మాటలతో నేను బాగా ఆలోచనలో పడిపోయాను. గొప్ప వాళ్లు తమను తాము నిలబెట్టుకోవడానికి ఎంతగా తపించిపోతారో… ఒక్కోసారి తమను తాము వదులుకోవడానికి కూడా అంతగానూ సిద్ధమైపోతారు కదా అనిపించింది. వాస్తవానికి ఆ సంస్కారమే వారిని ఆ శిఖరానికి చే ర్చింది. ఎదగాలనుకునే ఎవరికైనా ఆ సంస్కారం అవ సరం అనిపించింది. నాకైతే ఆ ప్రశంసల మాటున ఆ సత్యమే ప్రస్ఫుటంగా కనిపించింది.

“మన జీవితాన్ని నిలబెట్టే అత్యంత ఆత్మీయుల నుంచి కూడా వాళ్లకు తెలిసో, తెలియకో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎప్పుడైనా మన మనసు గాయమైఉండొచ్చు. అంత మాత్రానికే ఆ బంధాన్ని తెంచేసుకుని, వారికి దూరమైపోతే అది జీవితకాలమంతా తిరిగి పూడ్చుకోలేని భారీ నష్టమవుతుందన్న సత్యం ఆ అనుభవం నాకు నేర్పింది.

యువతలోనూ ఒక పెద్దతనం ఉంది
శ్రీరమణ గారి మిథునం చదివిన్నాడు నేను కన్నీటి పర్యంతం అయ్యాను. అప్పటి నుంచీ ఆ ఇతివృత్తం దృశ్యమానమైనా మనసులో కదులుతూ వచ్చింది. అదొక మానవ సంబంధాల కథ. సినిమా తీస్తే యువతను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తీయాలన్న భావజాలం చాలా మంది సినీ నిర్మాతా, దర్శకుల మనసుల్లో బాగా పాతుకుపోయింది. అందుకే యువ జీవితాలకు సంబంధించిన ఇతివృత్తాలే ఎంచుకోవాలని, లేకపోతే ఫెయిల్ అవుతుంద ని చెబుతుంటారు. ఆ కారణంగానే వయసు పైబడిన జీవిత కథలేవీ నేడు తెరకెక్కడం లేదు. నిజానికి యువతలోనూ నిగూఢంగా ఒక పెద్దతనం ఉంటుందనే సత్యాన్ని చాలామంది విస్మరిస్తున్నారు.

వారి మనసుల్లో ఉండే ఆ కోణాన్ని ఎవరైనా బలంగా తాకగలిగితే యువత కూడా ఈ తరహా సినిమాలు చూస్తారనే ది వాస్తవం. పరోక్షంగానే కావచ్చు కానీ, యువతరాన్ని తాకే అంశాలు ఏ వయసు వారి కథలోనైనా ఉంటాయి. మిథునంలో చిత్రీకరించిన అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ అంశాలే అందుకు సరియైన ఉదాహరణ. కొడుకులనూ, కూతుళ్లనూ ప్రేమించు. అయితే మధ్యలో వచ్చిన వాళ్లు, మధ్యలో వెళ్లిపోతారు. చివరి దాకా ఉండేది ఎప్పడైనా భార్యాభర్తలే. వార్థక్యాన్ని బరువుగానో, భారంగానో కాకుండా ఆనందంగా గడపవచ్చని చెప్పే ఒక అందమైన కథనమది.

దాంపత్యం అంటే శాశ్వతమైన స్నేహం అన్నాడు భవభూతి. ఆ సత్యాన్ని ఈ సినిమా అందంగా చెబుతుంది. ఈ అంశం యువతకు సంబంధం లేని విషయమేమీ కాదు కదా! అందుకే మిథునం సినిమాను యువతీయువకులు కూడా పెద్దవారితో సమానంగా చూస్తున్నారు. ఎంతో యిష్టంగా తీసిన సినిమా ఇది. రాష్ట్రానికే పరిమితం కాకుండా అమెరికా, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లోనూ ప్రశంసలు అందుకుంటోంది. పెద్దవారిలో ఉండే కుర్రతనాన్ని గమనించగలిగినంత స్పష్టంగా కుర్రవాళ్లలోని పెద్దతనాన్ని తాకగలిగితే కళాత్మక సృజనలో వయోభేదాలు అడ్డుగోడలు కావన్న సత్యం మిథునం సినిమా ద్వారా మరింత బలంగా రుజువయ్యింది. -బమ్మెర

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.