భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ మిరియాలూ -1
హాస్య బ్రహ్మ స్వర్గీయ భమిడి పాటి కామేశ్వరరావు మేష్టారు అంటే నాకెంతో ఇష్టం .ఆయన్ను మోలియర్ అనే నాటక రచయిత తో పోలుస్తుంటారు .అచ్చతెలుగు హాస్యాన్ని వండి వడ్డించిన సోషల్ మేష్టారాయన ..హైస్కూల్ విద్యార్ధుల కోసమే రాసిన నాటిక లైనా అందర్ని నవ్వుల్లో ముంచి తేలుస్తాయి .ఆయన రాసిన హాస్య నాటిక‘’అంతా ఇంతే‘’ను మేము స్కూలు వార్షికోత్స వాల్లో ఆడటమే కాక ,మా విద్యార్ధులతో కూడా వేయించి ఆ హాస్య రసాన్ని అందరికి పంచాము .అయితే అయన రాసిన ‘’అన్నీ తగాదాలే ‘’రచన చాలా మందికి పరిచయం తక్కువని నా అభిప్రాయం .అందులో హాస్య బ్రహ్మ చిలికించిన చమత్కారాలు ,మిరియాలు మీ అందరికి తెలియ జేయాలన్న సంకల్పమే ఈ రచన కు నేపధ్యం
సాంప్రదాయకం గా వస్తున్న కొన్ని విషయాల పై భ.కా.రా.మేస్టారికి తనదైన స్వంత అభి ప్రాయాలున్నాయి .అందుకే తన మనసు లోనీ చెప్పటానికి ఒక పుస్తకమే గీకి పారేశారు ‘’అన్నీ తగాదాలే ‘’నంటూ .ఆ తాగాదాలు భాషకు ,భావానికి ,పద్యానికి ,,వేషానికి చెందినా వై ఉంటాయి .నిష్కర్ష గా అందులో ఏదో పక పాత్ర చేత తన మాటల్ని మనకు విని పిస్తారు భమిడి పాటి మేష్టారు .
పద్యం అంటే ,అర్ధం అంటే ఏమిటి ?అన్న విషయాలపై తగాదా పడతారు మిత్రులు .భావ రాజు పాత్ర ద్వారా తన అభి ప్రాయాలను మనసుకు హత్తుకోనేట్లు చెప్పిస్తారు .’’శాశ్వతత్వం పొందిన ప్రపంచ కవిత్వం పద్య రూపం లోనే నిల్చి ఉంది . నడక అనేది వేద పురుషుని పాదాలు అని అందుకే అంటారు .సముద్రం లాంటి ప్రాపంచికాను భవం ,పైకి చెప్పుకో గల కవికి నడక ఈత లాంటిది .ఒక్కొక్కడు పద్యమే కాదు గద్యమైనా ,చివరికి కార్డు రాసినా తగల బెట్టి అతుకు తుంటాడు .నిశానీ కూడా పాడు చేసే వాడుండ వచ్చు .ఆలోచన పైకి రావాలంటే సాధన కావాలి .ఆ సాధన సముదాయమే ఆ భావానికి భాష .ఆ సాధనా ,చిత్త వృత్తీ మేళ వించిన మీదట ఆ భావం పండుతుంది .భావం భాష లోనే పుట్టి ,ప్రకటిత మై జీవిస్తుంది .’’ఇది పద్యాన్ని రాగం గా పాడాలి’’ అనే వారికి తగిన పాఠమే .భావ ప్రాధాన్యం వదిలి రాగాల జిలేబి చుట్టలు చుట్టకూడదని మేస్టారి మతం .ఇది అందరికి సమ్మతమే .అర్ధ ప్రాదాన్యానికి ఇచ్చిన విలువ ఇది ,ఇవ్వాల్సిన గౌరవం ఇది ..
ఇక రాగం-పద్యం విషయానికి వస్తే –శేషు అనే పాత్ర ద్వారా తన భావాలను ఆవిష్కరిస్తారు కామేశ్వరరావు మేష్టారు .’’భాష సముద్రం లాంటిది .సముద్రం లో అట్టడుగున పడి పోకుండా ,పై పైకి తేలగలిగిన ‘’ఆంద్ర కూర్మం ‘’’లాంటి దాన్ని ఆధారం గా చేసుకొని ,సంగతీ సందర్భాన్ని కవ్వం గా చేసుకొని ,నాలికలు అనే తాళ్ళతో జనం అంతా కలిసి మధనం చెయ్యగా చెయ్యగా బయల్దేరే హాలాహలాన్ని లయ కర్తకు వదిలేసి అమృతాన్ని మాత్రం తనకు చేత నయి నంత పట్టి నిలిపే వాణ్ణి కవి అంటారు .’’అని సమర్ధ వంత మైన నిర్వచనం చేస్తారు .అంతే కాదు –‘’తన భాష వాడు యెట్లా యెట్లా ఆలోచించి ఉండేవాడో ,అట్లా ఆలోచించి అప్పటి చిత్తవృత్తిని మాటల్లో బంధించే వాడే కవి .ఇంక రాగం తీయటం పై భకారా గారి భావం ఇలా ఉంటుంది ‘’పద్యం లో ఉండగల కవిత్వానికి అగమ్యత్వం మొదటి పూత .రాగాలు తీయటం రెండో పూత .సగం విన పడీ సగం విన పడకుండా చేయడం మూడో పూత పూత మెరుగులు కవిత్వం కిందకి రావు .ఎల్లానో ఆకర్షించటం కాదు .ఆకర్షణ సక్రమం గానూ ,సవ్యం గానూ ఉండాలి .ప్రాణ ప్రతిష్ట చేసి ఆకర్షించాలి .మొదటే ,అతీతులం అని బయల్దేర రాదు అని హెచ్చరిస్తారు మేష్టారు .
‘’వేషం ‘’అనేది పాత్ర స్వభావాన్ని పెంచేదీ ,పాత్ర పై ఆవ గాహన హెచ్చిన్చేదీ గా ఉండాలి కాని –అది ఆసహ్యం గా ఉండ రాదనీ ,పాత్ర పై ఏహ్య భావం కల్గిన్చరాదని హాస్య బ్రహ్మ అభి ప్రాయం .’’భాష అంటే భావం దాల్చే వేషం .భావం ఆంతర్యం .వేషం ప్రత్యక్షం .ప్రకృతి భగ వంతుని వేషం ‘’అంటారు మేష్టారు ..ఈ విషయాలన్నీ బలరామయ్య పాత్ర ద్వారా చెప్పించారు .భావం లేని కవిత్వం గూర్చి ఒకానొక పెద్దాయనను గురించి ‘’ఈయన కవిత్వం చేసే టప్పుడు తప్ప ,కడం అప్పుడు భావం బోధ పడే లాగ వ్యవహరిస్తాడు .’’అని చురక అంటిస్తాడు .
సాంఘిక నాటకాల్లో మరీ స్పష్టం గా వేష నిర్ణయం జరగ వచ్చు .పురాణ పాత్రల వేషమే తగాదా .వాళ్ళ వేషాలు పురాణ నాటక కారులు ఎరుగుదురేమో ?కాని చెప్పరు .’’అంతట బ్రహ్మ ప్రవేశించును ‘’’అంటారు యే తిట్ల కోసమో సిద్ధమై నటులే ,ఏదో ఏడుస్తారు .ఆ పాత్రలన్నీ సగ పాలు దేవుళ్ళు .-ఇమిటేషన్ దేవుళ్ళు .దేవుళ్ళ లాంటి మనుష్యులు .మనుష్యుల్లాంటి దేవుళ్ళు .ఋషుల గురించి చిన్తిల్లటం అనవసరమే .ఎటొచ్చీ వాళ్లకు కాస్త జనప నార గుడ్డ లూ ,వాటి కంపూ తప్ప ఇతర బాధే లేదు .’’అని వేష ధారణా ఎంత కృత్రి మత్వం దాల్చు తోందో కడిగేసేట్టు మాట్లాడిస్తారు పాత్ర ద్వారా .పెద్ద దేవుళ్ళకు మరీ కష్టాలోచ్చాయంటారు మేష్టారు .
ఉదాహరణకు బ్రహ్మ పాత్ర ఎలా ఎడుస్తుందో స్టేజి నాటకం లో చూపిస్తారు ‘’పురాణ బ్రహ్మ చతుర్ముఖుడు ,వారిజాసనుడు ,సృష్టి కర్త ,వేద మూర్తి .నాటక బ్రహ్మ సాధారణం గా ‘’యం బ్రహ్మ ‘’ఒక్కొక్కప్పుడు పెట్టుడు తలకాయలు చెవులు మూసెయ్యడం వల్ల ,ప్రాంటింగ్ అందాక ఒక్క మాట కూడా వాడికి విన బడి చావదు .’’ఇదే ఇట్లా ఉంటె విష్ణువు మామూలు మనుష్యుల కంటే హీనం గా ప్రవర్తిస్తాడు .శివుడు చంద మామ కాని ,త్రిశూలం కాని ,పాము కాని దొరికిన పరికరాలతో ‘’డబ్లీ పన్నా గడ్డం తో ‘’తయారు .శివ శివా నీ కెంత గతి పట్టిందిరా ‘’అన్న హేళన లో కొండంత నిజం స్పష్టం గా కని పిస్తుంది .
‘’ఇంద్రుడు ఒక అసందర్భపు కల్పన.ఆయన మీద ఎప్పుడు విశ్వాస రాహిత్యమే .ఎప్పుడూ ‘’తవ్వాయే ‘’.ఉల్టా సీదా భయమే .ఇతరుల నిష్ఠ చెడ గొట్ట టానికి ఎప్పుడూ స్త్రీలను పంపటమే .మామూలు సంగతులు కూడా ఎప్పుడూ ఇతరుల్ని అడగటమే .భోగ రాయుడు కనుక కోర్టు లో ఎప్పుడూ బోగం ఆటే .’’అంటు ఇంద్ర పాత్ర ఎంత భ్రష్టు పట్టిందో తిట్టింది తిట్టకుండా కడిగేస్తారు కామేశ్వరరావు మేష్టారు .
‘’నారదుడు మరీ చులకన అయి పోయాడు. పౌరాణిక నాటకాల్లో .కాని ఆయన్ను పోతన అద్భుతం గా వర్ణించాడు .’’ఆత్మ వేది ,పారద రుచి దేహుడు ,అపార దయా మతి ,వివేక విశారదుడు ప్రాచీన బర్హికి ఆత్మా తత్త్వం ఉపదేశించిన వాడు .సప్త స్వరములు తన యంత నమ్రోయు చున్న వీణా లాపన రతిం జేసి నారాయణ కధా గానం చేయు వాడు .’’కాని మన నాటక నారదుడు పరమ పాపిష్టి రకం .వాడి వేషం బొంబాయి బాపతు గావును –తలంతా బాగా నున్నగా ‘’గవ్వ మెరుగు వచ్చే లాగా ‘’‘’డేక్కించటం’’ ,వెనక్కి నిగిడె పిలక ఉండడం ,అది అచ్చం గా ముచిగి పళం గా ఉన్న గంగా బొండాం అని పించడం ,పాం కోళ్ళు ,వాయిచని చిడతలు చేతిలో తీగల్లేని వీణ ,-కొందరు నటులు వీణకు తీగలున్నా ,చేత్తో ముట్టుకోరు .ముట్టుగున్నా ఒక చేత్తోనే ,తల్లకిందుగా వాయింపు .’’అంతే కాదు నాటక నారదుడు ‘’అగ్గి పెట్టె గాడు ‘’అన్నారు మేష్టారు .అందుకే మాటలు విని పించని పాటలు పడుతూ పాడు పన్లు చేస్తూంటాడు .వాడు దేవుడూ కాదు ,ఋషీ కాదు ,మనిషీ కాదు .మంచి రాక్షసుడూ కాదు .ఒకటో రకమైన లుచ్చా .అటు వంటి వాడు పట్టు బడితే మామూలుగా తవ్వి పాత రేస్తారు .’’
రాగాలు మనకి లంచం గా ఇవ్వలేని నారదుణ్ణి నాటకం లో చూస్తె ఆపాత్ర ఎంత అపాత్రం అయి పోయిందో తెలుస్తుంది .ఇంకా –లోక మాతలుగా ఊహించుకో బడ్డ లక్ష్మి ,సరస్వతి ,పార్వతి దేవత్వ స్పురణ అవుతుంది అనుకోవటం హాస్యాస్పదమే వేషం ఎందుకు ?స్వభావాన్ని ప్రదర్శించాటానికా ?అన్న మీమాంస లో పడి తన భావాలనిలా చెప్పేస్తారు హాస్య బ్రహ్మ ‘’వేషం చూద్దాం విలాసం కావచ్చు ,వినోదం కావచ్చు .వేషం వెయ్యడం అంత కన్నా ఎక్కువాడే .ఒక్కొక్క వేషం సజీవం గా వ్రాసిన వాడి చేతా ,వేసిన వాడి చేతా ఒప్పించ బడితే అది నిజం గా మహోత్క్రుష్టమే .అట్టి వేషం ఒక్కొక్కటి నూరుగురు మనుష్యుల స్వభావ లేశాలని లోపల ఇముడ్చుకొని ఉంటుంది ‘’అని అభిప్రాయం వెలి బుచ్చారు .
పాత్రలో ఇమిడి నటిస్తే పాత్ర సార్ధకమవుతుంది ‘’రాజూ మంత్రీ అంటూ లాంటి వేషం ఏదైనా సరే వేసి సర్వసమ భూత సమత్వం స్థాపించి తనే ఒక కల్పిత పాత్ర అవస్థ గురించి ఏడిచి ,నవ్వి మొత్తు గోవడం లో ఆత్మా వత్ సర్వ భూతాని రుజువు చేసి తన నాశనం వల్ల ఏదో కల్పిత పాత్ర కి జీవం పోయ్యగల త్యాగి నటుడే ‘’అదే జీవిత పరమావధి .ఎంత అద్భుత మైన నిర్వచనమో చూడండి .సామాన్య మైన మాటల్లో ఎంతటి అసామాన్య విషయాన్ని ,ఎంత సూటిగా ,నిర్మోహ మాతం గా ,నిష్కర్ష గా నిజాన్ని తెలియ జేశారో మేష్టారు ?అదీ ఆయన ప్రతిభ ప్రతి పాత్ర లోను తొంగి చూసి పరకాయ ప్రవేశం చేసె నటనే అమోఘం కదా !
సంక్రాంతి శుభా కాంక్ష లతో
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12-1-13-ఉయ్యూరు

