వేదాంతం వారికి పుష్పాంజలి ‘నేనే సత్యభామ’

ఆరుదశాబ్దాల పాటు పట్టుచీర మెరమెరలు, పూలజడల గుబాళింపులు, అలకలు, వయ్యారాలు, కలహాలు , వన్నె చిన్నెల వయ్యారాలతో యావత్ ప్రపంచాన్ని మురిపించిన కూచిపూడి పెద్దాయన వేదాంతం సత్యనారాయణ శర్మ ఇటీవలే కన్నుమూశారు. కానీ ఆయనను సజీవంగా కళ్లముందు నిలిపేందుకు మంచి ప్రయత్నం చేశారు దూలం సత్యనారాయణ. నేనే సత్యభామ అనే పేరుతో ఆయన ఎంతో శ్రమించి రూపొందించిన డాక్యుమెంటరీ విశేషాలు.
కూచిపూడి నాట్యగురువు, అన్ని ప్రక్రియల మూలకర్త సిద్ధేంద్రయోగి రూపొందించిన భామాకలాపంలోని అసలు సారం ఔపోసన పట్టిన అతి కొద్దిమందిలో ఒకరు పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ. ఆధునికులకు సత్యభామ అసలు తత్వం తెలియచెప్పి, అరుదైన ప్రక్రియను ఆక ళింపు చేసుకున్న గొప్ప కళాకారుడు ఆయన. ఈ మధ్యనే కన్నుమూసిన ఆయనను, ఆయన సుదీర్ఘ కృషిని సజీవం చేసే గొప్ప ప్రయత్నం ఒకటి జరిగింది.
వేదాంతం… సజీవం
కళా రంగంలో ఎందరో మహనీయులు నిరంతరం శ్రమించి, అద్భుతాలను అవిష్కరిస్తున్నారు. అయితే వారు చేసిన కృషి ముందుతరాలకు తెలియకుండా పోతున్నది. ఈ లోటును భర్తీ చేసేందుకు అమెరికాలో స్థిరపడిన నర్తకి స్వాతి గుండపనే ని, డాక్యుమెంటరీ రూపకల్పనలో మంచి అనుభవం గడించిన దూలం సత్యనారాయణ న డుంకట్టారు. ఎంతో శ్రమించి, లక్షల రూపాయలు వెచ్చించి ‘నేనే సత్యభామ’ పేరుతో వేదాంతం వారి అపారకృషిని డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. ఆయనను, ఆయన కృషిని శాశ్వతం చేశారు. 70 నిముషాల నిడివిగల ఈ డాక్యుమెంటరీ నాట్యం గురించి తెలియని వారిలో సైతం ఆసక్తిని పెంచే విధంగా రూపొందింది. భామాకలాపంలో గత ఆరేడు దశాబ్దాల్లో చోటుచోసుకున్న మార్పుల గురించి వేదాంతం సత్యనారాయణ శర్మ వ్యాఖ్యానం రసరమ్యంగా సాగుతుంది.
1960లో కూచిపూడి గ్రామంలో ఆరంభమైన తొలి కూచిపూడి నర్తన శిక్షణాసంస్థ విశేషాలను పద్మశ్రీ వేదాంతం నోట వినటం అరుదైన సందర్భం. ఆడవేషాలు వేస్తూ ప్రపంచానికి వయ్యారాల ముచ్చట్లు, అలంకరణ పద్ధతులు తెలియచెప్పిన వారిలో నాటకాలలో స్థానం నరసింహారావు, నాట్యంలో వేదాంతం సత్యనారాయణలు జగత్ ప్రసిద్ధులు. స్థానం వారి వివరాలు, మంచి ఫోటో వంటివి ఈ తరం వారికి అందుబాటులో లేవు. కానీ దూలం సత్యనారాయణ చొరవతో వేదాంతం వారి రూపం, మాట, నడక, వేషం ప్రత్యేకమైన ఆట వంటి అంశాలు ముందతరాలకు అంది వచ్చాయి. ఈ తరంలో అగ్రశేణి నాట్యతారలుగా పేరు ప్రఖ్యాతలు గడించిన వారికి అడుగులు నేర్పిన పసుమర్తి వేణుగోపాల శర్మతో పాటు, కూచిపూడిని కలకాలం తలచుకునేలా చేసిన గురువులు ఆ చిత్రంలో వేషం కట్టి ఆడటం మరెక్కడా అగుపించని అపురూప అంశం.
ఈ డాక్యుమెంటరీ రూపకల్పనకు వీరిద్దరూ చాలా కష్టాలే పడ్డారు. 1965-70లలో కూచిపూడిలోని ప్రజ్ఞను తమ చిత్రాలలో పొదువుకున్న ప్రభుత్వ ఫిలిం డివిజన్ వారి చిత్రాలలోని సన్నివేశాలను తమ చిత్రంలో వాడుకోవటం కోసం అనుమతుల పొందడానికి నానా అవస్థలు పడ్డారు. అందుకోసం వారికి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి రావటంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా పట్టదలతో డాక్యుమెంటరీ పూర్తి చేశారు. కూచిపూడి గురువుతో మేలైన సంభాషణలతో డాక్యుమెంటరీని రసగుళికలా రూపొందించారు.
అందరికీ చేరువగా…
కొద్ది మంది అభిమానులు మాత్రమే చూడగలిగిన ఆ కూచిపూడి భామ చిత్రాన్ని అందరూ చూసేలా చేయాలని నిర్మాత, దర్శకులు ఉవ్విళ్లూరుతున్నారు. వేదాంతం వారు ఇటీవల కన్నుమూయటంతో ఆయన అనుభవాలను, జ్ఞాపకాలను రికార్డు చేయటం ఎంత అవసరమో వారు గుర్తించారు. ఆ అరుదైన డాక్యుమెంటరీని అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. డాక్యుమెంటరీ నిర్మాణంలో అమెరికాలో శిక్షణ పొందిన సత్యనారాయణ రెండేళ్లు శ్రమించి, కూచిపూడి అగ్రహారంలో నాట్యకళ లోతుల్ని ఈ డాక్యుమెంటరీ రూపంలో మనముందుంచారు. కూచిపూడి గ్రామంలోని ప్రకృతి అందాలు, ఆ ఊరివారి ఆచార వ్యవహారాలు అన్నింటిని ఆ యువదర్శకుడు తన కెమెరాలో బంధించి ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. వాటిని అందుకోవాల్సిన బాధ్యత కళాహృదయులందరిదీ. ఆసక్తి కల వారు ఆ చిత్ర రూపకర్త సత్యనారాయణను 8886455000 ఫోన్ నంబరులో పలకరించవచ్చు.


మంచి వార్త మాస్టారు.
LikeLike