ఒక జ్ఞాపకం అతనితో పాటు హరిశ్చంద్రుడూ చనిపోయాడు

ఒక జ్ఞాపకం
అతనితో పాటు హరిశ్చంద్రుడూ చనిపోయాడు

పండగ సెలవులకు ఇంటికెళ్ళాను. చిలకలూరిపేటకి దగ్గర్లోని ఒక పల్లెటూళ్ళో చీమకుర్తి నాగేశ్వర్రావు నాటకం ఉందని తెలిసి, రాత్రి అన్నాలు తిని నేనూ, అన్నయ్య, నాన్న బయల్దేరి వెళ్ళాం. గతుకుల రోడ్డు మీద చిమ్మచీకట్లో మన్నుతిన్న పాములా కదుల్తోంది మా మోపెడ్. మేం వెళ్ళేసరికి వారణాసి సీను కూడా అయిపోతుందేమో అని నా టెన్షన్. క్రిస్మస్ సందర్భంగా మాలపల్లెలో ఉంది హరిశ్చంద్ర నాటకం ఆ రోజు. ఊరి పొలిమేరలకు చేరుకునేసరికి మైకులో ఎనౌన్స్‌మెంటు వినిపించింది. చీమకుర్తి నాగేశ్వర్రావు ఇంకో అరగంటలో స్టేజి ఎక్కుతాడని. హమ్మయ్య అనుకున్నా. అప్పటికే రాత్రి పది దాటింది. ఊరి మధ్యలో ఎద్దుల బండ్లతో ఏర్పాటు చేసిన రంగస్థలం. చుట్టూ వందల మంది జనం. నాటకం ఇంకా మొదలవ్వలేదు. ఎందుకంటే చీమకుర్తి రాలేదు. ఐదు నిమిషాలకొకసారి ఎవడో ఒకడు స్టేజీ ఎక్కి మరో పది నిమిషాల్లో నాగేశ్వర్రావు వచ్చేస్తున్నాడని, రాగానే నాటకం మొదలవుతుందని ఎనౌన్సుమెంట్లు. 

నేను ఎనిమిదో, తొమ్మిదో చదువుతున్న రోజుల్లో మొదటిసారి మా ఊళ్ళో చీమకుర్తి నాగేశ్వర్రావు నాటకం చూశాను. భలే నచ్చాడు నాకు. డి.వి. సుబ్బారావు, కె.వి. రెడ్డి లాంటి మహామహుల్ని కూడా హరిశ్చంద్ర పాత్రలో చూశాను కానీ బహుశా చిన్నవయసు కావడం వల్లనో ఏమో వాళ్ళకంటే నాకు నాగేశ్వర్రావే గొప్పగా అనిపించాడు. అయితే మర్నాడు పొద్దున ఇంటిముందు బండలమీద కూర్చుని ఊరి జనం చీమకుర్తిని ఛీ కొడుతూ మాట్లాడుతుంటే నాకు కొంచెం బాధగా అనిపించింది. రాత్రి నాటకంలో చీమకుర్తి ఏయే పద్యాలలో ఎక్కడెక్కడ తప్పులు పాడాడో చాలాసేపే చర్చ జరిగింది. పదాల యొక్క అర్థం, పద్యం యొక్క పరమార్ధం తెలియకుండా పాత్రధారణ చేస్తే అలానే ఉంటుంది అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శంకరశాస్త్రిలా చీమకుర్తిని ఆడిపోసుకున్నారు. ఏదిఏమైనా వాడిలో ఒక గమ్మత్తుందిరా అని రామసుబ్బయ్య తాత చీమకుర్తి చేసే మాజిక్‌ను వివరించాడు. అభినయం చీమకుర్తికున్న ప్రత్యేకత అనీ… ఆ అభినయంలో కూడా తనదైన ఒక స్టైల్ అతను సృష్టించుకున్నాడని తాతయ్య అంచనా! అదంతా గతం.

పన్నెండు దాటింది. చీమకుర్తి ఇంకా రాలేదు. మధ్యాహ్నం ఒంగోలులో బయలుదేరిన మనిషి మూడింటికల్లా చిలకలూరిపేట చేరుకోవాలి. అలాంటిది అర్ధరాత్రి పన్నెండు దాటినా మనిషి పత్తా లేడు అని జనం గుసగుసలు. ఆ కొడుకూ ఈ కొడుకూ అని, తాగి ఎక్కడ పడిపోయాడో అని తిట్లు. విసుగు. ప్రతివాడూ విసుక్కునేవాడే గానీ వెధవ నాటకం అని ఇంటికిపోయినవాడు ఒక్కడూ లేడు. ఎప్పటికైనా రాకపోతాడా పాడకపోతాడా అన్న ఆశ. మొదటి సీను ముగిసేసరికన్నా రాకపోతాడా అన్నట్టు నాటకం మొదలుపెట్టారు మాలపల్లి మోతుబర్లు. సీను ముగిసిందిగానీ చీమకుర్తి చేరుకోలేదు. అదిగో వచ్చేస్తున్నాడూ ఇదిగో వచ్చేస్తున్నాడని గోల కొనసాగింది తప్ప ఆయన వచ్చిందీ లేదు స్టేజీ ఎక్కిందీ లేదు.

ఇదంతా చూస్తుంటే ఎనభై మూడులో ఎన్టీఆర్ చైతన్యరథం ఎక్కి ఊళ్ళ మీద పడి తిరుగుతున్నప్పటి వాతావరణం కళ్ళముందు కదలాడింది. కళాకారుడు నచ్చాలే గానీ కళ్ళు కాయలు కాచేదాకా ఎదురుచూడడం తెలుగు ప్రజల బలహీనత అనిపించింది.
ఈలోపు మా నాన్న వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి లేటెస్ట్ అప్‌డేట్స్‌తో వచ్చాడు. వాస్తవానికి చీమకుర్తి ఒంటిగంటకే ఒంగోలులో బయల్దేరాడట. కానీ చీమకుర్తి వస్తున్నాడని తెలిసి ఒంగోలు, చిలకలూరిపేట మధ్యలోని చాలా ఊళ్ళలో అభిమానులు ఆపడం, ఆయనకు ఎంతో ఇష్టమైన నాటుసారాతో ఆతిథ్యం ఇవ్వడం, మీ ఋణం ఏమిచ్చి తీర్చుకోగలను అంటూ చీమకుర్తి కన్నీరు మున్నీరై వాళ్ళ కోసం నాలుగు పద్యాలు పాడి, ప్రజాబాహుళ్యాన్ని పరవశింపజేసి మరలా బయల్దేరడం… ఇదీ జరుగుతున్నదని చెప్పాడు. అలా అంచలంచలుగా ఊళ్ళు దాటుకుంటూ బాటలు విడిచీ పేటలు గడిచీ నాగేశ్వర్రావు ఒక అరగంట క్రితమే చిలకలూరిపేటకు చేరుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఒకవేళ వచ్చినా వేదిక ఎక్కగలడా? ఎక్కినా పాడగలడా? తెలియదు. పద్యనాటకం పత్తిపంట లాంటిది. దేనికీ గ్యారెంటీ ఉండదు.

అప్పటికే తెల్లవారుజాము మూడు గంటలవుయింది. వాడొచ్చినప్పుడు లేద్దాంలే అని అక్కడే కటిక నేలమీదనే చాలామంది ముసలీ ముతక నిద్రలోకి జారుకున్నారు. ఇక బయల్దేరదాం అని నాన్న కూడా చాలాసార్లు అన్నాడు. ఇంతలో చీమకుర్తి వచ్చాడు. ఒక్కసారిగా కలకలం మొదలయింది. తప్పిపోయిన పసిపాప దొరికిన తల్లిలా హార్మోనియం ఆనందంతో పరవళ్ళు తొక్కుసాగింది. నిద్రమత్తులో తూగిపోతున్న ఊరు మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. క్రిస్మస్ కాలపు తెల్లవారుజాము అప్పుడప్పుడే మెల్లగా ఒళ్ళు విరుచుకుంటున్నది. ఈలలు, చప్పట్లు, వేదిక చుట్టూ తొక్కిసలాటల నడుమ ఒక బక్క ప్రాణం, ఒక పొట్టిజీవి వినమ్రంగా రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ వేదిక మీదకు వచ్చింది.

వారణాసి సన్నివేశం. మనిషి మాట్లాడలేకపోతున్నాడు. అడుగులు తడబడుతున్నాయి. అయినా చేతులు దించలేదు. అతని కళ్ళు చెమర్చి ఉన్నాయి. అతను పెడుతున్న నమస్కారం వెనుక ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో అర్థాలు నాకు గోచరమౌతున్నాయి. నన్ను క్షమించమంటున్నాయి. నేను తాగి ఉన్నాను అంటున్నాయి. ఈ ఆలస్యానికి క్షంతవ్యుణ్ణి అంటున్నాయి. నేను సరిగా పాడలేకపోయినా… ఈ మరుక్షణంలో తూలి పడిపోయినా నన్ను ప్రేమించడం మానవద్దు అని వేడుకుంటున్నాయి. సరిగ్గా నేను అనుకున్నట్టే మాట్లాడాడాయన. “అయ్యలారా! నన్ను క్షమించండి… బాగా అలసిపోయి ఉన్నాను. దయచేసి వన్సుమోర్లు కొట్టకండి. ఒకటే పద్యం. పదే పదే పాడలేను అంటూ భక్తయోగ పదన్యాసి అందుకున్నాడు. వరుస నాటకాలతో గొంతు అతి నీచంగా తయారయ్యింది.

బొంగురుపోయింది. వణికిపోతోంది. అయినా ఏదో తెలియని మా«ధుర్యం ఆ ప్రాంగణమంతా అలముకుంది. మద్యం తాలూకు మైకం ఇంకా పెరిగిపోతున్నట్టుంది. పద్యం పాడటానికి అతని గొంతూ శరీరం ఏమాత్రం సహకరించడం లేదు. ఎక్కడ తూలి పడిపోతాడో అన్న భయంతో పక్కనే చంద్రమతి వేషంలో ఉన్న విజయరాజు చీమకుర్తి చేయిపట్టుకుని ఆ చేయి పట్టుకోవడం కూడా అభినయంలో భాగమే అన్నట్టు అతి సహజంగా నటిస్తున్నాడు.

అంతలో చంద్రమతి అమ్మకానికి రంగం సిద్ధమైంది. అయ్యలారా! కాశీపుర పౌరులారా! ఈమె నా భార్య… చంద్రమతి… ఏనాడూ పతి మాట జవదాటని పైడిమూట… అంటూ పద్యం అందుకున్నాడు చీమకుర్తి. పద్యం ప్రారంభమైందో లేదో… అతని కళ్ళవెంట కన్నీటిధార ప్రవాహంలా కారిపోతున్నది. ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడు. ఏడుస్తూనే పద్యం పాడుతున్నాడు. కరుణ రసం కట్టలు తెంచుకుంటోంది. మధ్యమధ్యలో చూపుడువేలుతో కారుతున్న కన్నీటిని తుడుచుకుంటున్నాడు. అలా చూపుడువేలుతో వేగంగా తుడుచుకోవడం వల్ల ఆ కన్నీటిధార వేదికమీద పడుతోంది. కొన్నిసార్లు పక్కనే ఉన్న చంద్రమతి మీద పడుతోంది. నాగేశ్వర్రావు, విజయరాజుల కాంబినేషన్ గురించి జనం అంతలా ఎందుకు మాట్లాడుకుంటారో అప్పుడే తెలిసింది. హరిశ్చంద్రుడితో పాటు చంద్రమతి కూడా ఏడుస్తున్నది. నాగేశ్వర్రావు ఆమె భుజాలు పట్టుకుని ఆమె కన్నీరు తుడుస్తున్నాడు. చూపుడు వేలుతో ఆ తుడిచే తీరులో తెలియని రాచరికం కనిపిస్తున్నది. పద్యం పాడుతూనే ఆమె గడ్డం పట్టుకుని పిల్లవాడు లోహితాసుడు జాగ్రత్త అని వీడ్కోలు చెబుతున్నాడు.

నాన్న ఏడుస్తున్నాడు. అన్నయ్య ఏడుస్తున్నాడు. నేను ఏడుస్తున్నాను. నా పక్కన కూర్చున్న వాళ్ళెవరో తెలియదు, వాళ్ళూ ఏడుస్తున్నారు. అంతలో రాగం రానే వచ్చింది. వెళుతున్నాడు… వెళుతున్నాడు… ఇంకా ఇంకా పైపైకి వెళుతున్నాడు. రాగం తారస్థాయికి చేరుకుంటున్నది. సూర్యోదయపు పసుపుపచ్చని కాంతిలో అతని విశ్వరూపం నాకు గోచరమయ్యింది. రాగం అగ్రభాగానికి చేరుకున్నది. అంతకుమించి పాడితే అతని కంఠనాళాలు తెగి పోతాయనిపించే స్థాయిలో పాడుతున్నాడు. పాడుతూ పాడుతూనే ప్రాణం వదలడానికి పడుతున్న ఆరాటంలా అనిపించింది. అతని శరీరంలోని అణువణువూ అనిర్వచనీయమైన అనుభూతితో కదిలిపోతోంది. ప్రేక్షకుని శరీరం కూడా తెలియని తన్మయత్వంతో తుళ్ళిపోతున్నది. జనం ఆ గానామృతంలో తడిసి ముద్దయిపోతున్నారు.

నాలో ఏదో తెలియని ప్రశ్న మొదలయ్యింది. ఆ గొంతు ఇతనిది కాదు. ఇతనొక్కడిదే కాదు… ఇలా ఎవరో పాడగా విన్నాను. ఇదే శృతిలో… ఇదే తీవ్రతతో… ఇదే తన్మయత్వంతో… ఎవరు? ఎవరు? ఆ గుర్తుకొచ్చాడు. ఉస్తాద్. ఉస్తాద్ నుస్రత్ ఫతే అలీఖాన్! నువ్వు పాడుతుంది అతని గొంతుతోనో, అతను పాడుతుంది నీ గొంతుతోనో తెలియటం లేదు. కాదు కాదు ఇది ఒక్క ఫతే అలీఖాన్‌దే కాదు. ఇంకెవరిదో కూడా! ఎవరు? ఎవరు? శబ్దం తాలూకు మూలం తెలిసిన వాళ్ళు. రాగాల తాలూకు రహస్యాలు ఛేదించిన వాళ్ళు. తీజెన్ భాయ్… ఛా! ఛా! అసలు వాళ్ళతో వీళ్ళతో పోలికేమిటి? ఎవరికి వాళ్ళే. ఒక్కొక్కరు మహా హంతకులు. వింటున్న వారి, చూస్తున్న వారి మనసు పొరల్లో పేరుకుపోయిన బూజునీ, ఆత్మన్యూనతనీ, అపచార భావనల్నీ… రోగం ఏదైతేనేం… ఒక్క రాగంతో చంపేసే శస్త్రకారులు. అది కర్నాటకమో, హిందుస్థానీయో లేక సూఫీనో ఏదైతేనేం… మా ప్రాణాలు తీయడానికి!

అమాంతం స్టేజీ ఎక్కి నాగేశ్వర్రావు చొక్కా పట్టుకుని అడగాలి. ఓనమాలు కూడా సరిగ్గా రాని అర్భకుడివి. కటిక దరిద్రుడివి… దళితుడివి… జానపదుడివి… పొట్టకూటి కోసం ట్రాక్టర్ తోలుకునే డ్రైవర్‌వి. ఎట్లా అబ్బింది నీకీ విద్య! అడగాలి. వెంటనే అతని కాళ్ళు పట్టుకుని మరీ చెప్పాలి- చీమకుర్తీ నువ్వు మహాకళాకారుడివి. ఒక్క పద్యంతో, రాగంతో, ఒక్కసారే వేలాదిమందిని వశపరుచుకునే అపర మాంత్రికుడివి. చచ్చిపోతావురా నాయనా! హద్దూ పొద్దూ తెలియని ఆ తాగుడు మానుకోరా బాబు… నీకు దండం పెడతాను… నీలాంటి వాడు ఇంటిముందు మల్లెతీగలాగా ఎప్పుడూ పచ్చగానే ఉండాల్రా తండ్రీ! నేల నిస్సారమైపోయింది. నీలాంటి వాడు మళ్ళీ మళ్ళీ మొలకెత్తటం జరగని పని… అర్థం చేసుకో!

***

అనుకున్నట్టే జరిగింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత 2006లో చీమకుర్తి చనిపోయాడని కబురందింది. అతనితో పాటు హరిశ్చంద్రుడూ చనిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి విజయరాజు కూడా కాలం చేశాడు. కాస్త అటూయిటుగా రేబాల రమణ అకస్మాత్తుగా వీడ్కోలు చెప్పాడు. అటు మొన్ననే గుమ్మడి జయరాజు కూడా వెళ్ళిపోయాడు. ఇంకెంతకాలం బతుకుతావే పద్యనాటకం?

– పెద్ది రామారావు
93910 05610
(జనవరి 21 చీమకుర్తి ఏడవ వర్ధంతి) 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.