ఆదివారం అనుబంధం »
నివాళి
అపురూప చిత్రలేఖకుడు దశిక రామలింగేశ్వరరావు
2012 డిసెంబరు 28న చెన్నయ్‌లో కన్నుమూసిన దశిక రామలింగేశ్వరరావు ఒక ‘అపురూప’ చిత్రలేఖకుడు. 1925 సెప్టెంబరు 1న జన్మించిన రామలింగేశ్వరరావు 21వ యేటనే (1946లో) ఢిల్లీలో అఖిల భారత లలిత కళాసమితి ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సమకాలిక చిత్రకళా ప్రదర్శనలో ప్రథమ బహుమతి గెల్చుకోవటమే అందుకు తార్కాణం. అప్పుడతను చెన్నపట్నంలోని ‘కళలు, వృత్తుల విద్యాశాల’ విద్యార్థి. ఆ విద్యాశాలకు సుప్రసిద్ధ దేవీప్రసాద్‌రాయ్ చౌదురి ప్రధానాధ్యాపకుడు. రామలింగేశ్వరరావు 1944లో ఆ విద్యాశాలలో చేరారు. అతని హస్తకౌశలం గమనించిన రాయ్ చౌదురి అతని చిత్ర రచనలను ఆ ప్రదర్శనానికి పంపాడు. ప్రథమ బహుమతి సాధించి గురుదేవుని నమ్మకాన్ని నిజం చేశాడతను.
ఆ మరుసటి సంవత్సరం అప్పటి కేంద్ర ప్రభుత్వం రామలింగేశ్వరరావుకి సహాయ భృతిగా 2500 రూ. మంజూరు చేసింది. పిమ్మట దేశ స్థాయిలో అనేక బహుమతులు అతని చిత్ర రచనలకు లభించాయి.
కవి బాలగంగాధర తిలక్, బాల్ బాడ్మింటన్ ‘క్రీడి’ నండూరి నరసింహారావుల నెలవు అయిన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణమే రామలింగేశ్వరావు స్వస్థలం. పలు కళాక్షేత్రాలలో కుశలురైన కృషీవలులకు అది కాణాచి. గోస్తనీ నది గట్టున ఉన్న ఆ పట్టణంలో దశికవారిది సంపన్న కుటుంబం. సర్కారు కచేరీల ఆవరణకు ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి గుడిసందులో వారిదొక్కరిదే పెద్ద మేడ. కలిగిన కుటుంబమిచ్చే సౌకర్యాలు, కులాసాలతో అల్లారుముద్దుగా పెరిగారు ఆయన. హైస్కూలు చదివే రోజుల్లోనే చిత్రలేఖనం మీద చిత్తం లగ్నం చేశారు. ఇంట్లో వారి ప్రోత్సాహ ప్రోద్బలాలు లభించాయి. ఆ విధంగా చిత్రకళాభ్యాసానికి చెన్నయ్ చేరాడు. రాయ్ చౌదురి శిల్ప నిర్మాణంలో సైతం ఆరితేరిన వారు. ఈ శిష్యుడు ఆయన వద్ద ఆ రెండు విద్యలూ నేర్చాడు. పైగా ఛాయాగ్రహణంలో కూడా నైపుణ్యం సాధించాడు. చెన్నయ్ మెరీనా బీచ్‌లో ‘మహాత్మాగాంధి’ విశ్వవిద్యాలయం వద్ద ‘కార్మిక విజయం’ శిల్పాలు రాయ్ చౌదురి నిర్మాణాలే. ఆ నిర్మాణాలలో ఈ శిష్యునికి కూడా పాలు పంచాడు గురుదేవుడు. 1950లో ఆ విద్యాశాలలో శిక్షణ, అభ్యాసం ముగిశాయి. ఇప్పుడది లలిత కళల కళాశాల.
ఆంధ్రపత్రిక సంస్థలో ఆర్టిస్టు ఉద్యోగం ఖాళీకావటం తెలిసి దరఖాస్తు చేశాడు. తన యోగ్యతా సామర్థ్యాల వల్ల ‘కళ్లకు అద్దుకున్నట్లు’ ఉద్యోగం ఇచ్చారు పత్రికా యజమాని శంభుప్రసాద్. 1951 జనవరి 1 నుంచి కొలువు ప్రారంభం. దిన పత్రిక, సచిత్ర వారపత్రిక, భారతికి సంబంధించిన కళా, చిత్రకళా సంబంధ సర్వ కార్యకలాపాలలో ముఖ్య పాత్ర వహించవలసి వచ్చేది. ఒక్కొక్క పరిస్థితిలో పని ఒత్తిడి తట్టుకోవటానికి రెండు చేతులూ చాలవన్నట్టు ఉండేది. జంకు, గొంకు ఎరుగడు.
హైదరాబాదుపై భారత రక్షణ బలాల పోలీస్ చర్య నాడు కొల్హాపురి, కర్నూలు, కొండపల్లిల నుంచి బలగాల కదలికలను బాణపు గుర్తులతో సూచిస్తూ పటం ప్రచురించాము. అది పలు ప్రశంసలు పొందటం నాకు బాగా గుర్తు. సంపాదక వర్గ సహచరునిగా నాతో కలిసి అతను తీసిన ఆఖరి ఫోటో 1974 సెప్టెంబరులో సర్వేపల్లి రాధాకృష్ణయ్యది. ఆయన జన్మదినం రేపనగా వెళ్లి సుస్తీతో శయ్యాగతుడైవున్న రాధాకృష్ణయ్యను పలకరించి, అనుమతి పొంది ఫోటో తీసుకున్నాము. దానిని మర్నాటి ఉదయం ‘గురువందనం’లో పత్రిక ముఖచిత్రంపై ప్రచురించే భాగ్యం కలిగింది.
1975లో ‘చెన్నపట్నం ఆంధ్రపత్రిక’ మందిమార్బలం, తుండుతుపాకితో ఆంధ్రప్రదేశ్ రాజధానికి తరలినపుడు రామలింగేశ్వరరావు తన కుంచెలపై, కెమెరాలపై నమ్మకంతో ఉద్యోగం వదులుకుని చెన్నయ్‌లోనే ఉండిపోయాడు. ఐతే ఆ సంవత్సరం జరిగిన ప్ర«థమ ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రదర్శనకు ఆంధ్ర ప్రముఖుల ‘మూర్తి’ చిత్రాలను రచించే అవకాశం రామలింగేశ్వరరావుకే లభించింది. దానికోసం హైదరాబాదులో రెండు మాసాలు ఉండి 120 మంది ‘మూర్తు’లను చిత్రించి ఇచ్చి వెళ్లారు. అవి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భవనాలలో ఉండే ఉంటాయి. అతని జీవిత సంగ్రహాన్నీ, చిత్రాలనూ సేకరించి భవిష్యత్తు తరాల వారికి అందుబాటులో ఉంచటం ఆ సంస్థ విధి, ధర్మం.
షష్టిపూర్తి అయిన స్నేహబంధం ప్రాకృతికంగా విచ్ఛిన్నమయినందుకు చింతించటం, భార్యాబిడ్డలకు సానుభూతి, ఓదార్పు తెలపటం కంటే నేను చేయగలిగింది ఏముంది?
– మద్దాలి సత్యనారాయణ శర్మ
ఫోన్ నెం: 040 – 2354 4065

