ఎడిటోరియల్ పేజి వ్యాసాలు »
నడిచే నాటక విజ్ఞాన సర్వస్వం
-డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు
నాటక రచయిత, దర్శకుడు, నటుడు, పరిశోధకుడు, విమర్శకుడు, అధ్యాపకుడు, గ్రంథ సంపాదకునిగా బహుముఖ ప్రజ్ఞావంతుడైన ఆచార్య మొదలి నాగభూషణశర్మ గుంటూరు జిల్లా ధూళిపూడిలో 19335 జూలై 24న జన్మించారు. నాటక దర్శకత్వంలో అమెరికాలోని ఇల్లినాయీస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎఫ్ఏ డిగ్రీని పొందారు. అమెరికన్ నాటక రంగంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పట్టాను స్వీకరించారు. తండ్రి వెంకటసుబ్రహ్మణ్యశర్మ ప్రోత్సాహంతో 8వ సంవత్సరంలోనే రంగస్థల ప్రవేశం చేశారు.

రాముని బుద్ధిమంత తనం అనే నాటక రచనతో రచయితగా మారిన మొదలి విద్యార్థి దశలోనే అన్వేషణ, విషాదాంతం, జంట పక్షులు, చిన్నలు పెద్దలు, రాజదండం, అడ్డదారి వంటి నాటికలను రచించి ప్రదర్శించారు. కొప్పరపు సుబ్బారావు ప్రోత్సాహంతో ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత, నాటక రంగ శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యాయనం చేశారు. ఇల్లినాయీస్ విశ్వవిద్యాలయంలో రవీంద్రనాధ్ ఠాగూర్ రచించిన శాక్రిఫైస్, అరబాల్ రచించిన పిక్నిక్ ఆన్‌ది బ్యాటిల్‌ఫీల్డ్ అనే నాటకాలకు దర్శకత్వం వహించి నాటక రంగ ప్రముఖుల ప్రశంసలు పొందారు.
ది విజిట్, కింగ్ ఈడిపస్, హయవదన, తుగ్లక్, మృచ్ఛకటిక, వెయిటింగ్ ఫర్ గోడో వంటి గ్రీకు, సంస్కృత, ఆంగ్ల నాటకాలకు దర్శకత్వం వహించి హైదరాబాదు డ్రమటిక్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. విషాదాంతం, అడ్డదారి, పెళ్ళికి పది నిమిషాల ముందు, మదనకామరాజు కథ, ప్రజానాయకుడు ప్రకాశం వంటి స్వతంత్ర నాటకాలను, రాజా ఈడిపస్, యాంటిగని, మాక్‌బెత్, డాల్స్‌హౌస్, ఎనిమీ ఆఫ్‌ది పీపుల్, ఎంపరర్‌జోన్స్, వెయిటింగ్ ఫర్ గోడో, మన్మధుడు మళ్ళీ పుట్టాడు. కాయితం పులి, హయవదన, సాంబశివ ప్రహసనం వంటి గొప్ప పాశ్చాత్య, భారతీయ ప్రముఖ నాటకాలను స్వేచ్చానువాదం చేశారు. ప్రజా నాయకుడు ప్రకాశం నాటకాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంగ్లశాఖ ఆచార్యులుగా సుదీర్ఘకాలం వ్యవహరించిన మొదలి రంగస్థల కళల శాఖకు వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరించారు. కేంద్రీయ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ రంగస్థల కళల శాఖ అధ్యక్షులుగా పనిచేశారు. తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం, తెలుగు నవలా వికాసం, రంగస్థల శాస్త్రం, నాటక కర్త చిలకమర్తి, నూరేళ్ళ తెలుగు నాటక రంగం, నాటక శిల్పం, తొలినాటి తెలుగు గ్రామఫోన్ గాయకులు నాటక రంగ పారిభాషిక పదకోశం వంటి గ్రంథాలను రచించారు. ఏటుకూరి ప్రసాద్‌తో కలిసి నూరేళ్ళ కన్యాశుల్కం అనే గ్రంథానికి సంపాదకులుగా వ్యవహరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పరిశోధన చేసి 64 జానపద క ళారూపాలపై ఆంగ్లంలో గ్రంథాన్ని రచించారు. యక్షగానం, తూర్పు భాగవతం, తోలుబొమ్మలాట వంటి జానపద కళారూపాలపై పరిశోధన గ్రంథాలను రచించారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జపాన్, టర్కీ, రష్యా, గ్రీక్ దేశాలలో పర్యటించి తోలుబొమ్మలాట కళారూపాన్ని స్వయంగా ప్రదర్శించారు.
తెలుగు విశ్వ విద్యాలయ ప్రతిభామూర్తి పురస్కారం, లలిత కళాపరిషత్(అనంతపురం) బళ్ళారి రాఘవ పురస్కారం, తానా సంస్థ విశిష్ట నాటక పురస్కారం, జానపద కళాబ్రహ్మ పురస్కారం, కేంద్ర సంగీత నాటక అకాడమీ విశ్వకవి ఠాగూర్ అకాడమీ రత్న పురస్కారాలను పొందారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, కేంద్ర సంగీత నాటక అకాడమి, పాలకవర్గ సభ్యులుగా, కేంద్ర ప్రభుత్వ సంస్కాృతిక శాఖ సభ్యులుగా వ్యవహరించారు. పలు పర్యాయాలు హైదరాబాదులో జాతీయ, అంతర్జాతీయ నాటకోత్సవాలను నిర్వహించారు. తెలుగు, పాశ్చాత్య నాటకరంగాలపై 20వేల పేజీలకుపైగా సమాచారాన్ని సేకరించారు. నడిచే నాటకరంగంగా పేరుపొందిన మొదలి నాటక రంగ సమాచారానికి నిఘంటువుగా నిలిచారు.
డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు
తెలుగు అధ్యాపకులు, నాటక రంగపరిశోధకులు
(నేడు విజయనగరంలో నంది నాటకోత్సవ ముగింపు సభలో నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా)

