షాహాజన్ పూర్ – శ్రీ రామ చంద్ర మహా రాజ్ –1
పూజ్య శ్రీ రామ చంద్ర మహారాజ్ విక్రమ నామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి నాడు 1899 ఏప్రిల్ 30 న ఉత్తర ప్రదేశ్ లోని శాహజాన్ పూర్ గ్రామం లో జన్మించారు .లోకం లో అధర్మం పెచ్చు పెరిగి ధర్మ నిర్వీర్య మై పోతున్నప్పుడు అవతార పురుషులు ఉద్భవించి ధర్మ సంరక్షణ చేస్తారని మనకు తెలిసిన విషయమే .ఇరవయ్యవ శతాబ్దపు ప్రారంభం లో ఇవే పరిస్తితులున్నాయి భారత దేశం లో .అప్పుడొక అవతార పురుషుని ప్రాదుర్భావం అవసర మైంది .ఆ మహా పురుషుడే శ్రీ రామచంద్ర గురు. శాహజాన్ పూర్ శ్రీ రామ చంద్రఅంటే అందరికి తప్పకుండా జ్ఞాపకం వచ్చేది వారు బోధించిన’’ జపం కాని జపం అంటే అజపా జపం ‘’…ఉయ్యూరు లో దాదాపు నలభై ఏళ్ళ క్రితం మా వంగల కృష్ణ దత్త శర్మ గారు శాహజాన్ పూర్ వెళ్ళి అజపా జపం నేర్చుకొని వస్తూండే వారు .వేసవిలో ఒకటి రెండు నెలలు అక్కడే ఉండి వారి ఆశ్రమం లో సాధన చేసి వస్తూండే వారు .ఆ విషయాలు మాకు చెబుతూ ఉండే వారు .వారి గురించిన పుస్తకాలు అజపా జప విధానం గురించి మాకు తెలియ జేశేవారు .అప్పుడు మాకంతా వింతగా ఉండేది .ఆ తర్వాత నా శిష్యుడు డాక్టర్ వెంపటి కృష్ణ యాజి హైదరాబాద్ లోని విజయ నగర కాలనీ ఉన్న ‘’శ్రీ రామ చంద్ర సెంటినరి హాస్పిటల్’’ లో సేవా దృక్పధం తో డాక్టర్ వృత్తిలో తన జీవితాన్ని ఆదర్శ వంతం గా గడుపుతున్నాడు .అతని దగ్గరకు వైద్యం కోసం మా కుటుంబం అందరం వెళ్తున్నాం .ఇప్పుడు రెండవ సారి శ్రీ రామ చంద్ర గారి గురించి కొంత తెలుసుకోవటం జరిగింది .ఈ సేవా సంస్థ శ్రీ రామ చంద్ర గారి బోధనలపుస్తకాలను ఉచితం గా నాకు అందజేశారు .అందులో వారి జీవిత చరిత్ర లేదు .కొంత సమాచారాన్ని సేకరించి వారి జీవితానికి సంబంధించిన ముఖ్య విషయాలను అంద జేస్తున్నాను .
తగిన శిష్యుని కోసం గురువు నిరీక్షణ
అప్పటికే 1873 ఫిబ్రవరి రెండు న ఫతేగడ్ లో జన్మించిన ఆధ్యాత్మిక గురు వరేణ్యులుశ్రీలాలాజీ మహా రాజ ధర్మ సంస్తాపనకు తగిన వ్యక్తీ కోసం నిరీక్షిస్తున్నారు . శాహజాన్ పూర్ లోశ్రీ బదరీ ప్రసాద్ గారింట శ్రీ రామ చంద్ర జన్మించాదారని తెలియ గానే ఆయన ఆనందానికి అంతులేదు . .అప్పటి నుంచి శ్రీ రామ చంద్ర శ్రీ లాలాజీ శిష్యుడైనారు .రామచంద్రను బాబాజీ మహా రాజ అనీ పిలుస్తారు .శ్రీ రామ చంద్ర చిన్నప్పటి నుంచి చాలా అసహనం గా ఏదో తెలుసుకోవాలనే కోరిక తో కన్పించే వారు ..చివరికి 1922 జూన్ మూడున శ్రీ లాలాజీ దర్శనం చేసుకొన్నారు లాలాజీ గురు శిక్షణ లో 1944 కు సంపూర్ణ వికాసం పొందిన ఆధ్యాత్మిక తేజో మూర్తి గా భాసించారు శ్రీ రామ చంద్ర .ప్రకృతి ధర్మాలను నిర్వహిస్తూ లక్షలాది దీన జనోద్ధరణ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు .
శ్రీ రామ చంద్రుల బాల్యం –విద్యాభ్యాసం
శ్రీ రామ చంద్ర మహారాజ్ బాల్యం గురించి ఇప్పుడు తెలుసు కొందాం .చిన్నప్పుడే టైఫాయిడ్ తో బాధ పడ్డాడు దానితో చదివింది అంతా మరిచి పోయేవాడు ఇంటి దగ్గర ప్రైవేట్ మాస్టర్ ను ఏర్పాటు చేశాడు తండ్రి .లెక్కలు వచ్చేవి కావు .తప్పే వాడు తల్లి నీతి కధలు బోధించేది .ఆరవ ఏట తండ్రి గుర్రం కొనిస్తే దాన్ని లాఘవం గ స్వారి చేసే వాడు స్కూల్ లో చేర్పించారు హాకీ టీం కి కెప్టెన్ అయాడు .టీచర్లు శిక్షించే వారు .అది భరింప రానిది గా ఉండేది .అవతలి వ్యక్తీ ఉచ్చ్వాస నిస్స్వాసాలను బట్టి వారి ప్రవర్తనను అంచనా వేసే శక్తి రామ చంద్ర కు ఏర్పడింది ..ఏదో తీరని తపన తో అనుక్షణం గడిపే వాడు .14 వ ఏడు వచ్చేసరికి గురువు కోసం అన్వేషణ సాగించాడు ..తగిన గురువు లభిస్తే సర్వ సమర్పణ చేయటానికి సిద్ధ పడ్డాడు .ధ్యాస అంతా వేదాంతం మీదే ఉంది చదివి కొంతా ,స్వయం గా ఆలోచించి మిగిలినదీ నేర్చాడు .గృహస్తుని గా ఉంటూ ఆధాత్మిక జీవనం సాగించటం కష్టం అని భావించి సన్యాసి అవాలనే నిశ్చయానికి వచ్చాడు .మంత్రగాల్లను తాంత్రికులను నమ్మలేదు .
ఆ సమయం లో స్కూల్ హెడ్ మాస్టర్ ఇద్రిస్ అహమ్మద్ శూల నొప్పి తోతీవ్రం గా బాధ పడుతూ,ని ద్రలేకుండాగడుపు తున్నాడు . రామచంద్ర సాయం కోరాడు .రామ చంద్ర ఆయన బొటన వ్రేలిని తన చేతులతో పట్టుకొని నెత్తి మీద పెట్టి ఒక నిమిషం అయిన తర్వాత ‘’నెప్పి తగ్గిందా ?’’అని అడిగాడు .ఇద్రిస్ గారు తగ్గి పోయిందని చెప్పి హాయిగా నిద్ర పోయాడు .అప్పటి నుండి బడిలో యే విద్యార్ధికి జబ్బు వచ్చినా రామ చంద్ర దగ్గరకు పంపిస్తుందే వాడు .ఈయన హస్త వాసి వల్ల అవి నయం అయేవి ఆయన మనో బలం అంత గొప్పది .ఇంగ్లిష్ మేష్టారు రామచంద్ర లోని ఆసక్తిని గమనించి వేదాంత పుస్తకాలు చదవటానికి ప్రోత్స హించాడు ఈయనకు ‘’డైనమిక్స్ ఆఫ్ మైండ్ ‘’అనేది చాలా అభిమాన విషయం .దాని పై ఎంతో కృషి చేశాడు రామ చంద్ర .మెదడు ఆలోచిస్తుందని హృదయం దానిని సరైన మార్గం లో పెడుతుందని తెలుసుకొన్నాడు .1918లో 19 వ ఏట శ్రీ కృష్ణుని జన్మ స్థల మైన మధుర లో వివాహం జరిగింది .భార్య భగవతి కి కోపం ఎక్కువ .దాన్నీ భరించి మహా సహనం అలవరచుకొన్నాడు రామ చంద్ర .
1922 లో ఫతేగడ్ లోని గురు మహాత్ములైన శ్రీ రామ చంద్ర జీ తనకు మార్గ దర్శనం చేయగలరని భావించాడు .1922 జూన్ మూడు న ఆయన్ను దర్శించాడు .ఆయన దగ్గర కూర్చో బెట్టుకొని ధ్యానం చేయించాడు .అంతే అప్పటి నుండి చుట్టూ ఉన్న ప్రకృతిలో ఒక కొత్తదనం గమనించాడు .గురువు అనుగ్రహం తో రాజ యోగాన్ని అభ్యసించాడు .దీనితో ప్రేమ, ఆరాధనా, అంకిత భావం ఏర్పడి జీవితాంతం నిలిచి పోయాయి .ఇంటికి తిరిగి వచ్చాడు .మెట్రిక్ పరీక్ష పాస్ అయ్యాడు .శాహజాన్ పూర్ కోర్టు లో ఉద్యోగం లో చేరాడు తన ధ్యానాన్ని క్రమం తప్పకుండా కొన సాగిస్తున్నాడు తోటి ఉద్యోగులతో మర్యాదగా ప్రవర్తించే వాడు. కానీ సిగెరెట్ అలవాటైంది తండ్రి కోప్పడినా మానలేదు తండ్రికీ ఈ అలవాటు ఉండేది . తండ్రి సిగరేట్ తాగటం మానేసి కొడుక్కి హుక్కా కొనిచ్చాడు ఇది సిగరెట్ అంతహానికాదని హుక్కాలో నికోటిన్ అనే విషం లేదని తండ్రి అభిప్రాయం .తాను పొగ పీల్చటం మనేయ్యాలా అని గురువును అడిగితే అక్కర్లేదు నీ ఇష్టం అన్నాడట
సశేషం
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –..29-1-13 –ఉయ్యూరు
