సినిమా పదకోండవ అవతారం
సినిమా మనిషిని ప్రభావితం చేయడమే కాదు… ఆలోచనల్ని సమూలంగా మార్చేస్తుంది అంటారు జె కె భారవి. ఆయన దృష్టిలో సినిమా11వ అవతారం. ‘చిటికెల పందిరి’ సినిమాకు దర్శకుడుగా సినీరంగంలోకి ప్రవేశించినా ఆ తర్వాత రచయితగా మారి ప్రఖ్యాతి గడించారు భారవి. ఆ క్రమంలో 24 కన్నడ సినిమాలకు రచన చేసినా ఆయన తెలుగు ప్రేక్షకులకు తెలిసింది మాత్రం అన్నమయ్య సినిమా రచనతోనే. ఆ సినిమా సాధించిన అద్భుత విజయం ఆ త ర్వాత శ్రీ మంజునాథ, పాండురంగమహత్యం, శ్రీరామదాసు సినిమాలకు నాంది అయింది. యువతే లక్ష్యంగా ఆధ్యాత్మిక సినిమాను రూపొందించటం ఒక సాహసమే. స్వీయ రచన, దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో త్వరలో విడుదల కాబోతున్న ‘ఆదిశంకర’ ద్వారా ఆయన ఆ సాహసమే చేశారు. మూడు పదుల సినీ ప్రస్థానంలో భారవికి ఎదురైన అరుదైన సంఘటనలే ఈ వారం అనుభవం.నాకప్పుడు పదేళ్లు. వరంగల్ జిల్లాలోని కోమటిపల్లి మా ఊరు. అక్కడ ఇస్తారి అనే ఓ వ్యక్తి మీద దొంగతనం చేశాడనే ఆరోపణ వచ్చింది. అతన్ని పిలిచి అడిగితే నేను ఆ దొంగతనం చేయలేదన్నాడు. నువ్వే చేశావు, నువ్వే చేశావంటూ ఎంత మంది అరిచినా తాను మాత్రం చేయలేదనే బదులిచ్చాడు. నిజం ఎలా తేలాలి? వెంటనే అతన్ని ఊరి చెరువు వద్దకు తీసుకువెళ్లారు. ఊరిజనమంతా అక్కడ గుమిగూడారు. చెరువు గట్టు దగ్గర రెండు బస్తాల బొగ్గులతో నిప్పు రాజేసి అందులో గడ్డపారను వేసి ఎర్రగా కాల్చారు. ఆరోపణకు గురనైన వ్యక్తి కాలుతున్న గడ్డపారను అరచేతులతో పట్టుకుని పైనుంచి కిందికి తుడవాలి. అలా మూడు సార్లు చేశాక చేతులు కాలితే ఆ ఆరోపణ నిజమని, కాలకపోతే అతడ్ని నిర్దోషి అని తే ల్చేస్తారు.
ఇస్తారి ఏదో దేవతను తలుచుకుంటూ మూడుసార్లు ఆ గడ్డపారను తుడిచాడు. అతని అరచేతులు నల్లగా మాడిపోయాయి. అవి చూసిన పెద్దలు అతడు దొంగతనం చేసింది నిజమేనంటూ తేల్చేసి, జరిమానాగా ఇంత డబ్బు చెల్లించాలంటూ తీర్మానించి చక్కావెళ్లిపోయారు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. నాకు ఏడుపొచ్చేసింది. ఇస్తారి కేసి చూస్తే అతడు ఆ దొంగతనం చేయలేదనిపించింది. కానీ ఆ మాటను అతడు ఎంత అరచి చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. ఎదిరించలేని నిస్సహాయతలో అతను ఎంతో హింసకు గురయ్యాడు. ఆ సంఘటన నా మనసులో బలంగా పాతుకుపోయింది. నన్ను వెంటాడుతూనే వచ్చింది.
తర్కం కోల్పోతే…
ఓ నాలుగైదేళ్లు గడిచిపోయాయి. అప్పటికే నా మీద కొంత సినిమాల ప్రభావం ఉండడం వల్ల ఆ సంఘటన ఆధారంగా నేనొక స్క్రిప్ట్ రాసిపెట్టుకున్నాను. అందరి దృష్టిలో దొంగగా మిగిలిపోయిన ఇస్తారి దుఃఖం తీరేదెలా? ఏ ఒక్కరికీ అతని పట్ల సానుభూతి లేదా? అందుకే క్లైమాక్స్‌లో అక్కడున్న దేవుని విగ్రహం కళ్లల్లోంచి నీళ్లు వచ్చినట్లు రాశాను. ఆ స్క్రిప్ట్‌ను మా టీచర్ జక్కా సత్యం గారు చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత ఆ స్కిప్టును ఆ రోజుల్లో నాటకరంగంలో కృషి చేస్తున్న డిఎస్ఎన్ మూర్తికి వినిపించాను. అంతా విని, ఆయన స్క్రిప్టులో ఒక మార్పును సూచించారు.
ఏ యుగంలో అయనా విగ్రహాల కళ్లలోంచి కన్నీళ్లు రావు. కాబట్టి స్క్రిప్టు నుంచి ఆ మాటను తీసేయమన్నారు. సాంఘిక రచనలైనా, పౌరాణిక రచనలైనా తార్కికతను, హేతుబద్ధతను కోల్పోతే అవి ప్రజల్ని ఏమాత్రం రంజింపచేయలేవు అనే గొప్ప సత్యాన్ని ఆయన మాటల ద్వారా నేను గ్రహించాను. అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీమంజునాథ, పాండురంగడు, కొత్తగా వస్తున్న శ్రీ జగద్గురు ఆదిశంకర ఇవన్నీ హేతుబద్ధంగా ఉండడానికి ఆనాటి ఆ సూచనే ఇప్పటికీ నాకు ఒక గైడ్‌గా పనిచేస్తోంది
వాస్తవాలే వస్తువుగా…
ఆచార్య ఆత్రేయ వద్ద నేను 11 ఏళ్లపాటు అసిస్టెంట్ రైటర్‌గా పనిచేశాను. ఆయనంటే నాకు అంతులేని ప్రేమ, గౌరవం. చాలాసార్లు నాకూ ఆయనకూ మధ్య తీవ్రమైన వాగ్వివాదాలు సాగేవి. అలాంటి సమయాల్లో ఆత్రేయ నోట కొన్ని కొత్త సత్యాలు వెలువడుతూ ఉండేవి. అయితే పెద్దా చిన్నా అనే భావన లేకుండా ఒక్కోసారి పసిపిల్లాడిలా సరెండర్ అయిపోయే స్వభావం కూడా ఆయనలో ఉండేది. సినిమా కథకు పనికి వస్తుందనిపించి 1850 ఆ ప్రాంతంలో జరిగిన ఒక వాస్తవిక సంఘటన ఆత్రేయ గారికి చెప్పాను. అదేమిటంటే, ఇంగ్లాండ్‌లో క్యారీనేషన్ అనే ఓ స్త్రీ ఉండేది.
తన భర్త విపరీతంగా మద్యం తాగి చనిపోవడంతో వాళ్ల కుటుంబం సర్వనాశనం అయిపోయింది. దాంతో మద్యం అమ్మకాల మీద తిరుగుబాటుగా ఒక ఇనుప పనిముట్టు తీసుకుని కనిపించిన ప్రతి వైన్‌షాప్‌నూ ధ్వంసం చేయడం ప్రారంభిస్తుంది. ఆమెకు మద్దతుగా అక్కడి మహిళలంతా గుంపులు గుంపులుగా వచ్చి ఆమెతో చేతులు కలుపుతారు. ప్రభుత్వానికి అదో పెద్ద సమస్యగా మారుతుంది. చివరికి క్యారీనేషన్ పుట్టిన జిల్లా అంతా మద్యనిషేధం విధిస్తారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ జిల్లాకు క్యారీనేషన్ పేరే పెడతారు.
ఈ సమస్యే ఇతివృత్తంతగా సినిమా తీస్తే గొప్పగా ఉంటుందనిపించింది. ఇదే విషయాన్ని ఆత్రేయ గారి ముందు ప్రస్తావిస్తే, “తాగుడు సమస్యేమిటి నాయనా… అసలది ఒక సమస్యే కాదు! ”అన్నారు. ఆయన అలా అనటం విని నేను ఆశ్చర్యపోయాను. నేను వెంటనే “తాగడం సమస్య కాకపోతే, మీరు నా గురువే కాదు” అన్నాను. అందుకాయన “ప్రజలు మీరు అనుకుంటున్నట్లుగా లేరు” అన్నారు. వెంటనే నేను “మీరు ఏ ప్రజల గురించి మాట్లాడుతున్నారు? మీకు తెలిసిందల్లా 1940 కాలం నాటి ప్రజలే. ఈ రోజునుంచి నేను మీకు శిష్యుడ్నే కాదు.” అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాను.
ఆ తర్వాత రెండ్రోజులకి ఆత్రేయ గారే స్వయంగా నాకోసం వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు. వస్తూనే, తప్పయింది నాయనా! నేను అలా మాట్లాడటం తప్పే. నువ్వనే ఆ ప్రజల గురించి నిజంగానే నాకేమీ తెలియదు. నిజమే. తాగుడు ఒక మహమ్మారి. నేను ఒప్పుకుంటున్నాను. వచ్చేయ్ నాయనా! నాతో వచ్చెయ్ అంటూ నా చెయ్యి పట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్లారు.
నాకోసం ఆయన వెతుక్కుంటూ వచ్చి ఆయన తక్కువేమీ అయిపోలేదు. నిజాన్ని నిజాయితీగా ఒప్పుకుని ఆయనే గొప్పవారయ్యారు. కాకపోతే, ఆయన ఎక్కడో ఒకచోట తగ్గినట్టే తగ్గి, హఠాత్తుగా ఒక పెద్ద ఆలోచనా ప్రవాహంలో పడి పెద్ద సముద్రమైపోయే వారు. ఆకాశం అయిపోయేవారు. అంతకు ముందు పసిపిల్లాడిలా విలవిల్లాడింది ఈయనేనా ?అని ఆశ్చర్యం వేసేది. ఎవరినైనా ఏదో ఒక కోణంలోనే చూసి అంచనా వేయడం ఎంత తప్పో ఆత్రేయను చూశాక తెలిసింది.
ఆదిశంకరతో ఒక ఆరంభం
సినిమాను మించి మానవాళిని ప్రభావితం చేసే మరో మాధ్యమం లేదనేది నాకున్న బలమైన అభిప్రాయం. నా దృష్టిలో అది 11వ అవతారం. అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీమంజునాథ వంటి ఇతివృత్తాల్ని సినిమాగా కాకుండా మరే మాధ్యమంలో చూపినా అంత ప్రయోజనం ఉండదు. భద్రాచలం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో సీతమ్మ పర్ణశాల ఉంది. శ్రీ రామదాసు సినిమా విడుదల కావడానికి ముందు అక్కడికి రోజూ ఒక బస్సు, రెండు ఆటోలు మాత్రమే తిరుగుతూ ఉండేవి. రామదాసు విడుదలైన నాటి నుంచి రోజూ 50 బస్సులు, 200 ఆటోలు తిరుగుతున్నాయి.
ఇది సినిమా ప్రభావం ఎంత ఉధృతంగా ఉంటుందో చెప్పేందుకు ఒక ఉదాహరణ. ఆలోచనాత్మకంగా చూసినా మనిషిని ప్రభావితం చేయడంలో మిగతా వాటికంటే సినిమా వెయ్యిరెట్లు అధికంగా ప్రభావితం చేయగలదని నా అభిప్రాయం. అలాగే ప్రపంచంలో ఏమార్పు అయినా యువతతోనే సాధ్యమవుతుందనేది నా ప్రగాఢ విశ్వాసం. గత అనుభవాలన్నీ వేదికగా చేసుకుని ఇప్పుడు ‘జగద్గురు ఆదిశంకర’ సినిమా తీశాను. ఒక యువకుడు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలడని చెప్పడమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.
ఆదిశంకరుడు బతికింది కేవలం 32 ఏళ్లే అయినా అతడు జగద్గురువుగా ఎదిగాడు. ఆ కాలంలో 72 మతాలు ఉండేవి. పరస్పరం చంపుకునే ఒక మారణకాండ సాగుతున్న సమయంలో ప్రపంచానికి ఆదిశంకరుడు అద్వైతాన్ని బోధిస్తూ కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా నాలుగు సార్లు పాదయాత్ర చేశాడు. ఆ మహత్తర శక్తిసంపన్నుని జీవితాన్నే ఈ సినిమాలో చూపాను.
ఆధ్యాత్మిక పురుషుల సినిమాలంటే కేవలం పెద్ద వారికోసమేనా? కానే కాదు. అందుకే ఆది శంకర సినిమాకు ‘యువతకోసం’ అనే టాగ్ పెట్టాను. ఒక మంచి సినిమా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలిసిన అనుభవమే నన్ను ఆదిశంకర సినిమా నిర్మాణానికి పురికొల్పింది. అనుభవాలు ఎప్పుడూ పునాదులు అవుతాయి.ఆ తర్వాత వచ్చే ఆలోచనలు భవంతులు అవుతాయి. ఇదే నా జీవితం నాకు నేర్పిన పాఠం.
బమ్మెర

