పువ్వు’గాని మీద పడగలదు..లెగరా బాబు

పువ్వు’గాని మీద పడగలదు..లెగరా బాబు

“మా గోదారి జిల్లావాసులకి వెటకారం పాలు కాస్త ఎక్కువండి”అని మనందరికీ తెలిసిన విషయాన్నే ఆయన ముందుజాగ్రత్తగా, ఎంతో వినయంగా చెప్పారు. “కోపాన్ని కళ్లెర్రజేస్తూనే కాదు కామెడీగా కూడా ప్రదర్శించవచ్చు. అదెలా అంటే మా ఊరొస్తే తెలుస్తుంది. ఇప్పుడేముంది లెండి….గోదావరి యాసే పోయింది. నా చిన్నప్పటి ఊరు విశేషాల్ని గుర్తుచేసుకుంటే ఒళ్లు పులకరిస్తుంది” అని చెబుతున్న కృష్ణభగవాన్ తాను ఈత కొట్టిన రేవు నుంచి కోళ్లను ఎత్తుకుపోయే దొంగ కుక్కవరకూ తన ఊరి కబుర్లని ఓ కామెడీ సినిమా స్టోరీలా చెప్పుకొచ్చారు. ఆయన ఊరు ‘కైకవోలు’ విశేషాలే ఈవారం ‘మా ఊరు’ 
“నాకు ఆరేళ్ల వయసప్పుడు ఒకరోజు నాన్నతో పొలానికి వెళ్లాను. నాన్న పొలంలో కూలివాళ్లతో మాట్లాడుతుంటే నేను ఆడుకుంటూ ఆడుకుంటూ పక్కనే ఉన్న కాలవదగ్గరికి వెళ్లాను. కాలవపక్కన ఉన్న మట్టిగడ్డపై కూర్చుని జోరుగా పారుతున్న నీటిని చూస్తున్నాను. నేను కూర్చున్న మట్టిదిబ్బ బాగా నాని ఉంది. నేను కూర్చున్న ఐదునిమిషాలకి అది కూలి నేను నీళ్లలో పడిపోయాను. కొట్టుకుపోకుండా కాలవ ఒడ్డునున్న గడ్డిదుబ్బుని పట్టుకుని ఏడుస్తున్నాను.

ఆ దుబ్బుగాని చేతిలోకి ఊడొచ్చిందా అంతే సంగతి. ఇంతలో ఆ కాలవపక్కగా వెళుతున్న ఒకతను నీళ్లలో నన్ను చూసి ఎక్కడో పొలంలో ఉన్న మా నాన్నగారిని పిలవడం మొదలుపెట్టాడు. నాన్న పరిగెట్టుకుంటూ వచ్చి నీళ్లలో దిగి నన్ను పైకి తీసుకొచ్చారు. నిజానికి అతన్ని చూడగానే భయంతో వణికిపోతున్న నాకు ధైర్యమొచ్చింది. అతను వెంటనే కాలవలోకి దిగి నన్ను రక్షిస్తాడనుకున్నాను. కాని అతను రాలేదు.

మా నాన్నని పిలిచాడు. అతనలా ఎందుకు చేశాడని నాన్నని అడిగితే…’అతను దళితుడు కదా…నిన్నెలా ముట్టుకుంటాడు…’ అన్నాడు. ఆ విషయం గుర్తుకొచ్చిన ప్రతిసారీ నాకు చాలా భయమేస్తుంది. మనం సృష్టించుకున్న కులాలు మనకెంత చేటుచేస్తున్నాయో చూడండి. తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలం ‘కైకవోలు’ మా ఊరు. ఊరు చిన్నదే గాని నా జ్ఞాపకాలు చాలా పెద్దవి.

అమ్మమ్మ ఊరు…
మా అమ్మమ్మ(కాకర వీరాయమ్మ)కి 22 సంవత్సరాల వయసప్పుడే భర్త చనిపోయాడు. అప్పటి నుంచి పిల్లల పెంపకం, వ్యవసాయం అన్నీ తానే చేసుకుంది. కూతురికి ఇల్లరికపు అల్లుడ్ని తెచ్చుకోవాలని మా పక్కూరు చింతపల్లి నుంచి అల్లుడ్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంది. అప్పటి నుంచి నాన్న, మా మేనమామ వ్యవసాయం పనులు చూసుకునేవారు. మాకు ఇరవై ఎకరాల వరకూ ఉండేది. పాడి కూడా పుష్కలంగా ఉండేది. మా ఇల్లు చాలా పెద్దగా ఉండేది.

ఓ పక్క సపోటా చెట్టు, వెనకవైపు నారింజచెట్టు, ఇంటి ముందు రేకమందారపువ్వు చెట్టు పక్కనే మామిడి చెట్టు ఉండేవి. మామిడి చెట్టు చూడ్డానికి చిన్నగా ఉన్నా లెక్కలేనన్ని కాయలు కాసేది. మాకు తెలియకపోయినా ఆ లెక్క నాన్నకి బాగా తెలిసేది. చెట్టుమీద ఎవడు చెయ్యివేసినా కనిపెట్టేసేవాడు. ఆ కొమ్మకి పాతికకాయలుండేవి. నాలుగు తగ్గాయి అనేవారు. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు. నేను అందరికన్నా చిన్నవాడ్ని.

నాన్న వెటకారం…
గోదావరి జిల్లాలవారికి వెటకారం పాలు కాస్త ఎక్కువనే మాట. నిజమే…ఎంతటి కోపాన్నైనా హాస్యపూర్వకంగా వెక్కిరింతగా అవతలివాడి మనసు చివుక్కుమనేలా ప్రదర్శించడం మా వాళ్ల స్పెషాలిటి. మా నాన్న కుటుంబంలోవాళ్లకి ఈ వెటకారం మీర ఎక్కువగా ఉండేది. నాన్నైతే మరీను. ఒకరోజు పొలంలో పని ఎక్కువగా ఉన్న సమయంలో పట్టా వీరయ్య అనే పనివాడు డుమ్మా కొట్టాడు. ‘సరిగ్గా పని ఎక్కువగా ఉన్నప్పుడే ఎగ్గొట్టాడు…రానీ వాడి సంగతి చెబుతాను’ అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు నాన్న.

ఇంతలో వీరయ్య వచ్చి ఇంటి ముందున్న మందార చెట్టుకింద కూర్చున్నాడు. ‘ఏరా…పట్టీరయ్యా నిన్న రాలేదే” అన్నారు నాన్న. “కాల్లో ముల్లు గుచ్చుకుందడయ్యా…” అన్నాడతను. మా చిన్నప్పుడు పల్లెలో ముల్లు గుచ్చుకోవడం అనేది సమస్యే కాదు. పని ఎగ్గొట్టేంత సమస్య అస్సలు కాదు. వెంటనే నాన్న “సర్లేగాని..ముందు ఆ చెట్టుకింద నుంచి లెగు…పువ్వుగాని మీద పడగలదు. మళ్లీ ఈ రోజు కూడా పనిలోకి రాడానికి ఉండదు” అన్నాడు. దాంతో వాడు తలదించుకుని పొలానికి వెళ్లిపోయాడు. మా చిన్నాన్న కూడా అంతే. నోరు తెరిస్తే వెటకారం.

సూర్యకాంతం ఇల్లు…
మా ఇంటిపక్కనే ప్రముఖనటి సూర్యకాంతం ఇల్లు ఉండేది. ఆమె, మా అమ్మమ్మ మంచి స్నేహితులుగా ఉండేవారట. మేం పుట్టేనాటికే ఆమె మంచి నటిగా పేరుతెచ్చుకున్నారు. సూర్యకాంతం గురించి అమ్మమ్మ చాలా విషయాలు చెప్పేది. “సూర్యకాంతం కోడలిగా మన ఊర్లో అడుగుపెట్టి ఒక్కనాడు కూడా సుఖపడలేదు. అత్తగారి వేధింపులు భరించలేక ఊరొదిలి వెళ్లిపోయింది. ఆమె అలా వెళ్లకపోతే ఈరోజు ఓ గొప్ప నటిని కోల్పోయేవాళ్లం” అని మా అమ్మమ్మ చెప్పినమాటల్ని ఊళ్లోవాళ్లంతా ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. మా అమ్మమ్మని నేను చిట్టెమ్మా అని పిలిచేవాడ్ని. ఆమె నన్ను కిట్టా అనేది. 92 ఏళ్లు బతికింది. చాలా కష్టజీవి. చనిపోయేచివరి నిమిషం వరకూ పనిచేస్తూనే ఉంది.

మూడిళ్ల బడి…
మా ఊళ్లో మొదటిబడి నూనిచిన్నకాపుగారింట్లో ఉండేది. వాళ్లింటి వరండానే మా తరగతి గదన్నమాట. కొన్నాళ్లకు సింహాద్రిరాజుగారింట్లోకి మారింది. ఆ తర్వాత మరో రాజుగారి ఇంట్లో ఉండేది. అత్తిలి వెంకటగోపాలాచారి మా హెడ్‌మాస్టార్. పెద్డింటి లక్ష్మణాచార్యులు మా మాస్టారు. బోళ్ల సత్యనారాయణ , దాట్ల రవిరాజు, గోపాలకృష్ణమాచారి…వీళ్లంతా నా స్నేహితులు. ఐదో తరగతి వరకూ మా ఊళ్లో చదువుకుని ఆరోతరగతి కోసం పక్కూరికి వెళ్లేవాళ్లం. అప్పటివరకూ బడికెళ్లడం అంటే ఏదో బాధగా ఉండేది. పక్కూళ్లో బడన్నకాడినుంచి మాకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసేది. ఎందుకంటే ఆ ఊరికెళ్లాలంటే మా ఊరి రేవు దాటాలి. ఆ రేవు పేరు ‘ఆడదాని రేవు’. పూర్వం ఆ రేవు దగ్గర ఒక ఆడామె ఉండి అందరినీ బల్లకట్టు ఎక్కించుకుని రేవు దాటించేదట. అందుకే ఆ రేవుకి ఆ పేరొచ్చిందని మా పెద్దోళ్లు చెప్పేవారు.

రేవులో స్నానాలు…
స్కూలుకి వెళ్లేటప్పుడు అమ్మాయిలు బుద్ధిగా వంతెనమీద నుంచి వెళితే మేం నిక్కర్లు ఇప్పేసి ఈదుకుంటూ వెళ్లేవాళ్లం. ఎవడో ఒకడికి మా నిక్కర్లు ఇచ్చి వాడ్ని వంతెనమీద పంపేవాళ్లం. మాకు ఇష్టంలేని వాడి క్యారేజి రేవులో ముంచి తీసేవాళ్లం. ఒకడు ఎప్పుడు వాళ్లింట్లో తెలగపిండి, వెల్లుల్లి రేకల కూర వండినా క్యారేజి తీసుకొచ్చేవాడు. ఆ కూరంటే మాకెవ్వరికీ ఇష్టం ఉండేది కాదు. అందుకే వాడి డబ్బాలాక్కుని రేవులో ముంచేవాళ్లం. ఒంటిపూట బడులొచ్చాయంటే పండగే పండగ. మధ్యాహ్నం స్కూలు నుంచి వస్తూ రేవులో దిగి ఈతకొట్టి వచ్చేవాళ్లం. ఇంటికి రాగానే నాన్న చెయ్యిచాపమని మోచేతినుంచి అరిచేతివరకూ గోరుతో గీరేవాడు. తెల్లగా మచ్చపడితే రేవులో స�

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.