తనలో తాను

 తనలో తాను 

       ఒక విచిత్రమైన, కాని ఆలోచింపజేసిన, ఆలోచించాల్సిన అరుదైన సందర్భం. దక్షిణామ్నాయ శృంగేరీ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి విశాఖపట్నం వేంచేశారు. భీమునిపట్నంలో సద్గురు శివానందమూర్తివారి ఆశ్రమానికి -వారి దర్శనార్థం వెళ్లాను. శివానందమూర్తిగారు నన్ను అందరిలోనూ పిలిపించారు. స్వామివారికి స్వయంగా పరిచయం చేశారు. స్వామివారు ముందుకు వంగి ఆసక్తిగా వింటున్నారు. నన్ను ఏమని పరిచయం చేస్తారు? ప్రముఖ రచయితననా? సినీనటుడిననా? రేడియో డైరెక్టరుగా రిటైరయాననా? టీవీల్లో కార్యక్రమాలు నిర్వహిస్తాననా? మంచి వక్తననా? వీటిలో ఏదయినా లేదా అన్నీ చెప్పవచ్చు. కాని రెండే మాటలు చెప్పారు -సద్గురువులు. అవి ఇవి: ”ఈయన గొల్లపూడి మారుతీరావు. మంచి సంస్కారం వుంది” అంతే! ఈ విశేషణాలలో ఏవో చెప్తారని ఊహించిన నేను ఈ పరిచయానికి ఆశ్చర్యపోయాను. ఆలోచించగా -కనువిప్పూ అయింది.
హిందూ మతానికి 36వ పీఠాధీశ్వరులయిన ఒక మహాస్వామి సమక్షంలో నా గురించిన ఏ పరిచయమూ నిలవదు. ఏదీ వారికి ఆసక్తిని కలిగించదు. లౌకికమయిన ఏ అర్హతా, ఏ విజయమూ పీఠాధీశ్వరుల సమక్షంలో ప్రతిభగా నిలిచేదికాదు. అయితే- ఏభై ఎనిమిది సంవత్సరాలు జీవన సరళినీ, కృషినీ, పరిశ్రమనీ క్రోడీకరించగల ఒక్క గుణం -అంతటి మహానుభావుల ‘ఎఱుక’లో రాణించేది ఉన్నదా? ఉన్నది. దానిపేరు -సంస్కారం.
ఓ జీవితకాలం పరిశ్రమలో -ఏ ప్రతిభా, ఏ వ్యుత్పత్తీ, ఏ ప్రాముఖ్యతా, ఏ కీర్తీ, ఏ పదవీ, ఏ సంపదా మనిషి ఔన్నత్యాన్ని మహానుభావులముందు నిలపదు. నిలిచేదిగా రాణించదు. ఒకే ఒక్కటి వీటన్నిటినీ తలదన్నేది ఉంది. ఇంకేమీ లేకపోయినా ఉండవలసింది ఉంది. వీటితో ప్రమేయం లేనిది ఉంది. పొరపాటు. ఎన్ని చేసినా, ఏం సాధించినా -ఆ సాధనకి లక్ష్యంగా, మూలధాతువుగా ఉండాల్సిన ఒకే ఒక్క గుణం ఉంది. దాని పేరు సంస్కారం.
అది ఒక దేశపు సంస్కృతీ, ఉద్ధతీ, సంప్రదాయ వైభవం, ఆలోచనా ధోరణీ, వ్యక్తి శీలత, పెద్దల వారసత్వంగా, అనూచానంగా వచ్చిన సంపదా -యిన్నీకలిస్తే -యిన్నిటిని కలిపి నిలిపేది ఒకటుంది. దానిపేరు సంస్కారం.
దీని వైభవం ఎంతటిదో, దీని విలువ ఎంత గొప్పదో -మన సమాజంలో నాయకత్వం వహించవలసిన నాయకులు, ఐయ్యేయస్సులూ, ఇతర మతాల పెద్దలూ, ఉద్యోగులూ ప్రతిరోజూ జైళ్లలో మాయమవుతూ చెప్పక చెప్తున్నారు. అసదుద్దీన్‌ ఒవైసీని అరెస్టు చెయ్యగానే -కొన్ని బస్సులు ధ్వంసమయాయి. కొన్ని దుకాణాల అద్దాలు పగిలాయి. ఆయన్ని జీపు ఎక్కించి నినాదాలు చేసే కార్యకర్తల మధ్య నుంచి ఆయన్ని తీసుకెళ్లలేకపోయారు. మనకి గుర్తుండే ఉంటుంది -ఒక తెల్లవారు ఝామున దేశం ఇంకా కళ్లిప్పకుండానే కంచి స్వామిని జైలుకి తరలించారు. కొందరిగుండె కలుక్కుమంది. కొందరు ఏడ్చారు. ఇతర మతాల పెద్దలూ బాధపడ్డారు. కాని ఏ విధ్వంసమూ జరగలేదు. ఎవరి అనుతాపమూ ఆవేశంగా తర్జుమా కాలేదు. అరాచకంగా కార్యరూపం దాల్చలేదు. అసదుద్దీన్‌ నేరం చేశాడని న్యాయస్థానం నిర్ణయిస్తోంది. శిక్ష వేస్తోంది. న్యాయాన్ని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కంచిస్వామి అరెస్టుకి కంటతడి పెట్టారు. అది అనివార్యమా? అది న్యాయస్థానం నిర్ణయం. అరాచకమా? అది వ్యవస్థ తేల్చుకోవలసిన విషయం. ఈ విచక్షణ పేరే సంస్కారం.
ఈ కాలమ్‌ మాట్లాడే విషయం -సంస్కారం. రాజకీయం కాదు. రోడ్డుమీద తన మిత్రుడితో వెళ్తున్న ఆడపిల్లని ఆరుగురు చెరిచి ఆమె చావుకి కారణమయారు. కొన్నిలక్షల కోట్లు దోచుకున్న ఓ నేరస్థుడు తను జైలునుంచి బయటికి రావడానికి ఒక న్యాయాధిపతి నీతికి ధర చెల్లించబోయాడు. ఒక కేంద్ర మంత్రిగారు టెలిఫోన్‌ శాఖని నిర్వహిస్తూ 320 లైన్ల టెలిఫోన్‌ ఎక్చ్సేంజీని తన వ్యక్తిగత ప్రయోజనాలకి -యింట్లోనే ఏర్పాటు చేయించుకున్నాడు. ప్రస్థుతం రెండు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు -పండిత్‌ సుఖ్‌రాం, ఓం ప్రకాష్‌ చౌతాలా జైల్లో ఉన్నారు. ఆ మధ్య అరెస్టయిన ఓ వ్యభిచారి -తన ఇంటికి వచ్చిన నాయకులు, ఆఫీసర్ల జాబితాను బయటపెడతానని గర్వంగా బెదిరించింది.
ఇంత విస్తృతమైన అవినీతి, కుసంస్కారం నేపధ్యం -58 సంవత్సరాలు శ్రమించిన నా జీవనయాత్రలో అన్ని విజయాల వడపోతగా ‘సంస్కారి’ అన్న కితాబుని మూటగట్టుకోవడం ఎంత వైభవం?
ఒక పీఠాధిపతి ముందు -ఓ వ్యక్తి జీవిత సాఫల్యానికి యింత సంక్షిప్తమయిన కితాబు లభిస్తే -మరి భగవంతుడి సమక్షంలో నిలిచిన భక్తుడికి -ఆ స్థాయిలో అతని ఉనికి, అతని ఆస్థికత, ఆయన తపస్సు, ఆయన అనిష్టాన వైభవం -ఏవీ నిలవవు. స్వామి సమక్షంలో భక్తుడు పిపీలిక, నిర్వీర్యుడవుతాడు. అప్పటి అతని ఉనికికి వ్యుత్పత్తి లేదు. అర్థం లేదు. గుర్తింపు లేదు. ఆ స్థాయిలో అవసరమూ లేదు.
జీవిత సాఫల్యాన్ని కాచి వడబోస్తే -కళాప్రపూర్ణలూ, కేబినెట్‌ హోదాలూ, ఐయ్యేయస్సులూ, కోట్ల బ్యాంకు అకౌంట్లూ, ప్రపంచ ప్రఖ్యాతులూ, గానగంధర్వ బిరుదాలూ -అన్నీ అన్నీ అసందర్భాలు. అన్నిటికీ మించి వ్యక్తికి అవసరమైనదీ, నికార్సుగా నిలిచేదీ ఒక్కటి -ఒక్కటే ఒక్కటి ఉంది. వ్యక్తిగత సంస్కారం. దానిలోపం విశ్వరూపం దాల్చడాన్ని మనం ఏ రోజు పేపరు తెరిచినా అర్థమౌతుంది. ఆ ఒక్క సుగుణాన్నే ఫణంగా పెట్టి మిగతా ప్రపంచాన్ని జయించబోయిన ఎందరో మహనీయుల గోత్రాలు -ప్రతి రోజూ ఆవిష్కృతమౌతున్నాయి.
సంస్కారం ఒక్కటే ఉండి మరేది లేకపోయినా బాధలేదు. అది లేక మరేది ఉన్నా ప్రయోజనం లేదు. సద్గురువులు పీఠాధిపతుల సమక్షంలో నాకిచ్చిన కితాబు -60 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నది, మరెవరూ దూరం చేయలేనిదీను. ఒక తెరని సద్గురువులు తొలగించారు.

 గొల్లపూడి మారుతీరావు.
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

1 Response to తనలో తాను

  1. gdurgaprasad's avatar gdurgaprasad says:

    గొల్లపూడి నిలు వెత్తు సంస్కారాన్ని శ్రీ శృంగేరి జగద్గురువులు
    ”సంస్కాము ఉన్న మనిషి ”అని చిన్న అద్దం లో లోకానికి చూపించారు . ఆ మాటతో
    పులకించి న మారుతీ రావు ఆనంద శిఖరరోహణ మే చేసి ఉప్పొంగి పోవటం మరీ సంస్కార
    యుతం గా ఉంది .దుర్గా ప్రసాద్

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.