మూల స్థంభాలకు ముప్పు రాకూడదు –శ్రీ రాళ్ల బండి కవితా ప్రసాద్

మూలస్తంభాలకు ముప్పు రాకూడదు


భాష పట్ల, సాహిత్యం పట్ల గల అవ్యాజమైన ప్రేమ ఆయనను ఉన్నత శిఖరాలకు చే ర్చింది. ఎక్కడో మారు మూల పల్లెటూర్లో పుట్టిన ఒక నిరుపేద విద్యార్థి, అంచెలంచెలుగా ప్రపంచ తెలుగు మహా సభల్ని నిర్వహించే స్థాయికి ఎదిగారు. ఆయనే డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్. ఇప్పటి వరకూ 18 కవితా సంకలనాలు అచ్చయ్యాయి. పాతిక వేలకు పైగా పద్యాలు రాశారు. వేయికి పైగా అష్టావధానాలు చేశారు. ‘అవధాన విద్య ఆరంభ వికాసాలు’ అన్న ఆయన సిద్ధాంత గ్రంథం అవధానానికి సంబంధించి అత్యుత్తమ ప్రామాణిక గ్రంథంగా నిలిచింది. ప్రస్తుతం సాంస్కృతిక శాఖ సంచాలకులుగా పనిచేస్తున్న డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ జీవితంలోని కొన్ని అరుదైన సంఘటనలే ఈ వారం అనుభవం. 

వ్యక్తులు వ్యక్తులే. కానీ, కొంతమంది వ్యక్తులు మనలోకి ప్రవేశించి ఒక ప్రపంచమైపోతారు. ఒక దశలో మనకు తెలియకుండానే మనలో కొత్త ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోతారు. కాకపోతే వాళ్లు ప్రవేశించడానికి ముందే మనం దూరంగా పారిపోతేనో, లేదా మన మనస్సుల్లో వాళ్లకు స్థానం కల్పించకపోతేనో జీవితాలు అక్కడే ఆగిపోతాయి. అలా నన్ను, నా జీవితాన్నీ అమితంగా ప్రభావితం చే సిన వ్యక్తులు ముగ్గురు. ఆ ముగ్గురిలో మొట్టమొదటి వ్యక్తి నా తండ్రి రాళ్లబండి రామకోటేశ్వర రాజు. రెండవ వ్యక్తి కాలేజీ రోజుల్లో నన్ను సాహిత్యం వైపు, అవధానం వైపు నడిపించిన దూపాటి సంపత్కుమారాచార్యులు గారు. ఇక మూడవ వ్యక్తి సిఎస్ రావు. (చాడ సాంబశివరావు గారు). నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది మా నాన్నగారు. రెండవ వ్యక్తి నాలో కవిత్వ రచనా నైపుణ్యాన్ని పెంచితే, మూడవ వ్యక్తి నాలో జీవన నైపుణ్యాన్ని పెంచారు. జీవించడం ఎలాగో నేర్పించారు. పడదోసే వాటితో అప్రమత్తంగా ఉండడం ఎలాగో నే ర్పారు.

ఎదుటివారి బాధ తెలియకుండా
మా నాన్నగారు ముష్టికుంట్ల అనే ఊళ్లో ప్రభుత్వ టీచర్‌గా పనిచేసేవారు. చాలీ చాలని జీతం. ఆ పక్కనే ఉన్న తిరువూరు అనే గ్రామానికి సంబంధించిన భూస్వామి కొడుక్కి నాన్నగారు ట్యూషన్ చెబుతుండే వారు. ఫీజు నెలకు ఒక్క రూపాయి. ఐదు మాసాలుగా ఆ ఫీజు కూడా ఇవ్వడం లేదు. ఆ అబ్బాయిని అడిగితే చాలా బాధపడుతున్నాడు, కానీ తానే అడిగి తేలేక మా నాన్నను అడగమని చెబుతున్నాడు. అప్పుడు నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఇంట్లో పరిస్థితి మరీ గడ్డుగా ఉండడంతో రావలసిన ఐదు నెలల ఫీజు ఐదు రూపాయలు అడిగి తీసుకురమ్మని నాన్నగారు నన్ను ఆ భూస్వామి వద్దకు పంపారు. నేను వెళ్లేసరికి ఆ భూస్వామి, తన తోటి భూస్వాములతో కలిసి పేకాట ఆడుతున్నాడు. వారి ఎదురుగా పందెంగా పెట్టుకున్న డబ్బులు రాసులుపోసి ఉన్నాయి. వాటిలో ఐదురూపాయల నోట్లు, రెండు రూపాయల నోట్లు, రూపాయి నోట్లు ఉన్నాయి. నేను దూరంగా నిలుచున్నాను. నన్ను చూసిన పనిమనుషులు, రాజు పంతులు కొడుకు వచ్చాడనే విషయం చెప్పారు. ఏంటయ్యా అన్నాడు భూస్వామి. నేను విషయం చెప్పాను. డబ్బులు లేవు ఏమీ లేవు వెళ్లు అన్నాడు.

ఐదు నెలలుగా ఇవ్వడం లేదుటండీ, అందుకే వచ్చాను. అన్నాను. ఔనా అంటూ నా వేపు ఎగాదిగా చూసి అక్కడున్న రూపాయి బిళ్ల ఒకటి తీసి నా వేపు విసిరేశాడు. అది నాకు చాలా అవమానకరంగా అనిపించింది. మాకు మీరు ఇవ్వాల్సింది 5 రూపాయలండీ అన్నా, కాస్తంత అసహనంగానే. నా గొంతు విన్న ఆయన నా వే పు తీక్షణంగా చూస్తూ, సిగరెట్టు పట్టుకున్న చే యి ఊపుతూ ఎంతో ఉక్రోషంగా వెళ్లిపో అన్నాడు. నేను ఆ ఒక్కరూపాయి తీసుకుని వెనుదిరిగి వచ్చేసి నాన్న గారికి ఆ విషయం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చాను. నేను ఈ విషయం చెబుతున్న సమయంలో ఆ భూస్వామి గారి అబ్బాయి మా ఇంట్లోనే ఉన్నాడు. నేను మా నాన్నగారితో చెబుతున్న విషయాలు విన్న ఆ అబ్బాయి తన పుస్తకాలు తీసుకుని పరుగెత్తడం మొదలెట్టాడు. నాన్నగారు అతడ్ని ఆపి ఎక్కడికి వెళుతున్నావు అంటే ‘నేనింక చదువుకోదలుచుకోలేదు’ అంటూ ఏడుస్తూ వెళ్లిపోయాడు. ఆ పిల్లాడికి ఉన్న ఆత్మాభిమానమైనా ఆ తండ్రికి లేదే అని నాన్న చాలాసార్లు తన బాధను వ్యక్తం చే సేవాడు. బాధ్యతలేని తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లలేమైపోతారు? అనేవారు. ఇటువంటి అవమానాలెన్నో చూసిన మా నాన్నగారు ఆత్మగౌరవంతో బతికే స్థితికి ఎదిగేందుకు ప్రయత్నించు అనేవారు నాతో. దానికి ఆత్మవిశ్వాసం ఒక్కటే మార్గం అని కూడా చెప్పేవారు. నేనో పెద్ద అధికారి కావాలని కూడా తరుచూ అనే వారు. కాకపోతే నేను ఐఏఎస్ అధికారి కావడానికి కొద్దిరోజుల ముందే ఆయన చనిపోయారు.

ఆ ప్రేమను ఎలా కొలుస్తాం?
సత్తుపల్లి డిగ్రీ కాలేజ్‌లో బిఎస్‌సి చేస్తున్న రోజుల్లో ఒక వ్యాసరచన పోటీ జరిగింది. ఆ పోటీలో నాకు ప్రధమ బహుమతి వచ్చింది. అయితే నా వ్యాసం చూసిన న్యాయనిర్ణేత దూపాటి సంపత్కుమారాచార్య ఆ వ్యాసానికి ఒక నోట్ రాసి సాయంత్రం తమ ఇంటికి రమ్మని మా కాలేజ్‌కు పంపాడు. హాస్టల్ భోజనం మిస్సయిపోతానని నేనే వె ళ్లలేదు. నేను రాలేదంటే మరోసారి కబురు పెట్టారు. అయినా నేను వెళ్లలేదు. చివరికి తానే స్వయంగా మా కాలేజ్‌కు వచ్చాడు. నువ్వేనా ప్రసాద్ అంటూ తమ ఇంటికి తీసుకు వె ళ్లాడు. ఆ వ్యాసం చివరన రాసిన పద్యం ఎవరిది? అన్నారు. నేనే రాశానండీ అన్నాను. ఇక నుంచి రోజూ సాయంత్రం మా ఇంటికి వచ్చి రెండు గంటల పాటు ఉండిపోవాలి అన్నారు. అలా ఆయన వివిధ అంశాల మీద రోజూ నాతో 20 నుంచి 30 పద్యాల దాకా రాయించే వాడు. నువ్వు అవధానం చెయ్యగలవు అంటూ నాలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంచిన తొలి వ్యక్తి ఆయన.

అవధానిగా, పద్యకవిగా నాకు ఈ కాస్త పేరు రావడానికి ఆయనే కారణం. అన్నిటినీ మించి సాహిత్యం గురించిన ఒక అవగాహన కలిగించిందీ ఆయనే. ఆ సమయంలో ఆయన్నెవరో మధిరలో అవధానం చేయమని అడిగితే, నేను చేయను నా శిష్యుడు చేస్తాడని చెప్పి, నాకు తెలియకుండానే వాళ్లకు నా పేరు ఇచ్చారు. నేనే మిటి, అవధానం చేయడం ఏమిటి సార్! అంటే ఏం కాదు నువ్వు చేయగలవు అంటూ నాలో ధైర్యాన్ని నింపారు. ఏమిటా ప్రేమ? ర క్తసంబంధమూ కాదు, బంధుత్వమూ లేదు. ఆయన నా పట్ల అంత మనసు ఎందుకు పెట్టారు? మలచడానికి పనికొచ్చే మట్టిముద్ద ఎక్కడ కనిపించినా దాన్ని అరచేతుల్లోకి తీసుకునే అటువంటి హృదయాలను ఏమని పిలవాలి? నిజానికి తానుగా వచ్చి తీసుకెళితే గానీ నేను అన్నిసార్లు కబురంపినా వె ళ్లనే లేదు. ఒకవేళ ఆయనే రాకపోయి ఉంటే అవ«ధానం నా జీవితంలో అంత పెద్ద భాగం అయ్యేదే కాదు. కొన్నిసార్లు మన ఎదురుగా వచ్చి నిలుచున్న సదవకాశాల్ని కూడా ఎలా నిర్లక్ష్యం చేస్తామా అని ఇప్పటికీ మధనపడుతుంటాను.

పరిమితులు దాటి…
బి.ఇడి పూర్తయ్యాక ఉద్యోగ వేటలో పడ్డాను. భద్రాచలం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్‌లో కొత్తగా స్కూలు పెట్టారు. అక్కడ లెక్కల మాస్టారు కావాల్సి ఉందని, ఆ రోజు ఇంటర్వ్యూ అవుతోందని తెలిసి అక్కడికి వెళ్లాను. ఉద్యోగానికి దరఖాస్తు పంపకుండా, ఏ విధమైన కాలెలెటర్ అందకుండా లోనికి ఎలా వచ్చావు? అంటూ అక్కడి వాళ్లు నన్ను నిలదీశారు. దరఖాస్తు ఇప్పుడు తీసుకుంటే మాత్రం మీకు వచ్చే నష్టమేమిటి? అన్నాన్నేను. దానికి డేట్ అయిపోయిందంటున్నారు వాళ్లు. మొత్తానికి వాళ్లకూ నాకూ మధ్య ఒక ఘర్షణ జరుగుతోంది. అంతలో ఒకతను ఆవైపు ఉన్న తలుపు తోసుకుని వచ్చి ఏం జరుగుతోంది? అన్నారు. ఆంగ్లంలో నేను నా గురించి అంతా చెప్పాను. నిలువెల్లా తడిసిపోయి, జుత్తు చెదరిపోయి, ప్లాస్టిక్ పేపర్‌లో సర్టిఫికెట్లు పట్టుకుని నిలుచున్న నా వేపు ఎగాదిగా చూశాడు. దరఖాస్తు ఇచ్చావా? అన్నారు. లేదు అన్నాన్నేను.

అతన్నించి దరఖాస్తు తీసుకుని , ఇంటర్వ్యూ తీసుకోండి అన్నారు ఆయన. ఆయనెవరో కాదు ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ సిఎస్ రావు. అయిష్టంగానే అప్లికేషన్ తీసుకున్నారు. చాలా విచిత్రంగా ఒక్క పోస్టు కోసం ఇంటర్వ్యూకు వచ్చిన మొత్తం 21 మందిలో నేనే సెలక్ట్ అయ్యాను. ఆ స్కూల్లో నేను రెండేళ్లపాటు పనిచేశాను. ఆ రెండేళ్ల కాలంలో జీవితం గురించి, మనిషిని పక్కదారి పట్టించే సవాలక్ష ప్రమాదాల గురించి ఆయన నాకు ఎన్ని నిజాలు చెప్పారో లెక్కలేదు. యవ్వన ప్రేమ నుంచి దేశ ప్రేమ దాకా ఆయన చెప్పని విషయాలే లేవు. విద్యావిషయాలకే పరిమితమైతే అది బతుకునిస్తుందే గానీ, నిండైన జీవితాన్నివ్వదు. అందుకే టీచర్‌గా పనిచేసిన ఆ ఎనిమిదేళ్ల కాలంలో విద్యావిషయాలతో ఆగిపోకుండా సమస్త విషయాలకూ ప్రాధాన్యతనిచ్చేవాడ్ని.

తాత్కాలికాలే ముఖ్యమై…
ఐఎఎస్ అధికారిగా నేను ఎక్కువ కాలం విజిలెన్స్‌లో పనిచేశాను. ఎవరైనా విజిలెన్స్ అధికారులను తాత్కాలికంగా గౌరవిస్తారు గానీ, శాశ్వతంగా ద్వేషిస్తారు. అలాగే నిజాయితీని కూడా తాత్కాలికంగా గౌరవిస్తారే గానీ, శాశ్వతంగా ప్రేమించరు. తక్షణ ప్రయోజనాలు, స్వప్రయోజనాలు ఇవే ముఖ్యమైపోయాయి. అందుకు అడ్డుపడేవాటిని ధ్వంసం చేసేందుకు కూడా మనిషి సిద్ధమవుతున్నాడు. విజిలెన్స్ అధికారిగా కోట్లరూపాయల కుంభకోణానికి పాల్పడిన ఒక దుర్మార్గపు అధికారిని పట్టుకుంటే అతడు నా ఉనికినే దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. ఎంతో కష్టపడి నేను ఎదురీదినప్పటికీ ఆ పరిణామాలు నన్ను కన్నీటి పర్యంతం చేశాయి. సమాజాన్ని నిర్మించే యజ్ఞంలో భాగం కాకుండా, త మ ప్రయోజనం కోసం సమాజాన్ని పిండుకోవాలని చూస్తున్నారు. ఈ ఆలోచనా ధోరణిని మార్చే శక్తి టీచర్‌కే ఉంది.

ఈ అధికారాలు, హోదాల మీద ఏవో భ్రమలు పెంచుకుని ఇలా వచ్చానే గానీ, ఉపాధ్యాయ వృత్తి అన్నిటికన్నా గొప్పది. ఎప్పటికైనా మనిషిని, దేశాన్ని, ప్రపంచాన్నీ నిలబెట్టేది టీచరే. అందుకే నేను రిటైరైపోయాక నా శాశ్వత చిరునామా టీచర్‌గానే. నేడు యువతలో కనబడుతున్న వికృతత్వాన్ని చూసి గగ్గోలు పెడుతున్నామే గానీ, అలాంటి ఉపాధ్యాయులే ఉంటే విషయం అంతదాకా వస్తుందా? మూలస్తంభాలు కూలిపోతున్నప్పుడు పట్టించుకోని వారు దాని కిందపడి ఉన్న మృతదేహాలను చూసి దుఃఖిస్తే ప్రయోజనం ఏముంటుంది? ఆ మూలస్తంభాల పట్ల స్పృహను, వాటిని నిర్మించే శక్తిని ఎప్పటికైనా ఇచ్చేది టీచర్లేనని బలంగా నమ్ముతాను.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.