కళ కాలం జీవిస్తారు

కళ కాలం జీవిస్తారు

కూచిపూడి నృత్యానికి కొత్త సొబగులు అద్ది దేశ, విదేశాలకు వ్యాప్తి చేసిన మేటి నాట్య గురువు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం. అగ్రశ్రేణి సినీ తారలకే కాక నేడు నాట్యగురువులుగా, కళాకారులుగా అగ్రస్థానంలో ఉన్న వారిలో చాలామంది సత్యంగారి శిష్యులే. కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ఆశయంతో శ్రమించిన ఆయన మొదట్లో తన పిల్లలు నాట్యరంగంలోకి రాకూడదని ఎందుకు భావించారు? ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫి చేసిన ఆయన సినిమా రంగాన్ని వద్దనుకుని నృత్య శిక్షణకే ఎందుకు పరిమితమయ్యారు? 80వ పడిలో కూడా కూచిపూడి నాట్య వ్యాప్తి కోసం తపించిన తన తండ్రి గురించి, ఆయనతో తన అనుబంధాన్ని గురించి ‘నవ్య’తో పంచుకున్నారు ఆయన పెద్దకుమార్తె మేళ్లచెరువు కామేశ్వరి.

నాన్నది చాలా జాలిగుండె. ఎవరికైనా వొంట్లో బాగాలేదంటే తన జేబులో ఉన్న డబ్బంతా ఇచ్చేసి వచ్చేసేవారు. అప్పట్లో మద్రాసులో మేమున్న ఇల్లు ‘అయ్యర్ వీడు'(బ్రాహ్మణుల ఇల్లు)గా ఫేమస్. టి.నగర్‌లో అయ్యర్ వీడు అంటే రిక్షావాడు నేరుగా తీసికెళతాడు. నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ నా కళ్లముందు సజీవంగా ఉంది. అప్పుడు నాకు తొమ్మిదేళ్లు ఉంటాయేమో. ఒక రోజు రాత్రి భోరున వర్షం కురుస్తోంది. మేమంతా ఇంట్లో ఉన్నాము. ఇంతలో ‘సత్యం సార్ యార్’ అంటూ ఎవరో వీధిలో గట్టిగా అరుస్తున్నారు.

ఆ అరుపులకు నాన్న గబగబ ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తారు. వీధిలో ఒక రిక్షా ఆగిఉంది. అందులో ఒక వృద్ధుడు పూర్తిగా తడిసిపోయి పడిపోయి ఉన్నాడు. నాన్న అతనిదగ్గరకు వెళ్లి ‘నేనే సత్యాన్ని…ఏమైంది?’ అని అడిగారు. అప్పుడా ఆ రిక్షా అబ్బాయి రిక్షాలో ఉన్న వృద్ధుడిని చూపిస్తూ “ఎవరో సార్ ఇతను…సత్యం సార్ దగ్గరకు తీసుకెళ్లు..ఆయనే నన్ను చూసుకుంటాడు అని చెప్పాడు..ఇప్పుడేమో ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు” అనడంతో నాన్న స్పృహలో లేని ఆ వ్యక్తిని తన రెండు చేతులతో మోసుకుని ఇంట్లోకి తెచ్చారు.

నాన్నే అతని తడిబట్టలు విప్పి, పొడి పంచె కట్టి ఆటోలో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఆ వ్యక్తి ఎవరో నాన్నకు తెలియదని ఆ తర్వాత తెలిసింది. పేదవారికి ఎవరికైనా సుస్తీ చేస్తే ”సత్యంసార్ ఇంటికి వెళితే ఆయనో, ఆయన భార్యో అసుపత్రిలో చేర్పిస్తారు” అని అనేవారట అప్పట్లో. “మనం తింటే అది నేలపాలు..ఇతరులకు పెడితే దేవునిపాలు” అని మా నాయనమ్మ మా చిన్నప్పుడు అనేది. అదే సూత్రాన్ని నాన్న పాటించారు. మనం తినడమే కాదు ఇతరులకూ పెట్టాలి అని భావించే దయాగుణం నాన్నది.

మాకు డ్యాన్స్ వద్దన్నారు
మేము ఐదుగురం సంతానం. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. అందరిలోకి నేనే పెద్దదాన్ని. నా తర్వాత కాత్యాయని, వెంకటాచలపతి, బాలా త్రిపురసుందరి, రవిశంకర్. మేము పుట్టింది, పెరిగింది మద్రాసులోనే. నాన్న కూచిపూడి నుంచి మద్రాసుకు వెళ్లి స్థిరపడ్డారు కదా. నేను చదువుకుంది టి.నగర్‌లోని శారదా విద్యాలయలో. మా నాన్న టి.నగర్‌లోని పానగల్‌పార్క్ పక్కన ఇంట్లో కూచిపూడి ఆర్ట్ అకాడమి నిర్వహించేవారు. మొదట్లో విడిగా వేరే ఇంట్లో ఉండేవాళ్లం. తర్వాత ఇల్లు, డ్యాన్స్ స్కూలు ఒకటే అయింది.

మేము నృత్యం నేర్చుకోవడానికి నాన్న మొదట్లో ఒప్పుకోలేదు. తాను చాలా కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి తన పిల్లలు ఈ రంగంలోకి వచ్చి కష్టపడకూడదన్న ఉద్దేశంతో అమ్మా నాన్నలిద్దరికీ మేము ఎవరమూ ఈ రంగంలో రావడం ఇష్టం ఉండేది కాదు. అయితే నిద్రలేచింది మొదలు మా కళ్లకు కనిపించేది నృత్యమే కాబట్టి మేము కూడా నేర్చుకుంటామని నాన్నతో పోట్లాడేవాళ్లం. మా నాయనమ్మ మా తరఫున వకాల్తా పుచ్చుకుని నాన్నతో వాదించేది. “ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది అమ్మాయిలు వచ్చి నేర్చుకుంటున్నారు.

మన పిల్లలను కూడా నేర్చుకోనీరా అబ్బాయ్” అని నాయనమ్మ గట్టిగా పట్టుపట్టడంతో నాన్న కూడా సరేననక తప్పలేదు. అలా మేము కూడా చిన్నప్పటి నుంచే నాట్యం నేర్చుకున్నాము. మా నాన్న దగ్గర శేషుగారు(శంకరాభరణం ఫేమ్), దుర్గక్క అసిస్టెంట్స్‌గా ఉండేవారు. నాన్న వందనంతో శ్రీకారం చుడితే అసిస్టెంట్స్ జతులు, కొన్ని ఐటమ్స్ నేర్పించేవారు. ఆ తర్వాత నాన్న పర్యవేక్షణలో నృత్య శిక్షణ జరిగేది.

ఎందరో ప్రముఖ శిష్యులు
నాన్న తన శిష్యులతో విస్తృతంగా నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు. నా చిన్నప్పుడు ఆయన కొన్ని సినిమాలకు కొరియోగ్రఫి నిర్వహించడం నాకు గుర్తు. 1968 ప్రాంతంలో ఎన్టీఆర్ రామారావుగారు ఒక సినిమా కోసం నాన్న దగ్గర నృత్యం నేర్చుకున్నారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే మా ఇంటికి కారు పంపేవారు. నాన్న వెళ్లే సరికే రామారావుగారు సిద్ధంగా ఉండేవారట. రెండు, మూడు గంటలపాటు ఆయన డ్యాన్స్ నేర్చుకునేవారు. మా చిన్నతమ్ముడు రవిశంకర్ పుట్టినప్పుడు నామకరణం రోజున రామారావుగారు మా ఇంటికి వచ్చి మాతో పాటే కూర్చుని భోజనం చేయడం నాకిప్పటికీ గుర్తుంది.

ఎన్టీఆర్ కుమార్తెలు పురందేశ్వరిగారు, భువనేశ్వరిగారు మాతోపాటే నాట్యం నేర్చుకున్నారు. నాన్నగారి దగ్గర నృత్యం నేర్చుకున్న వారిలో చాలామంది ఆ తర్వాత సినిమారంగంలో అగ్రతారలుగా వెలుగొందారు. హేమమాలినిగారు సినిమారంగంలోకి రాకముందు మా ఇంటికి వచ్చి నాన్న దగ్గర నృత్యం నేర్చుకునేవారు.

సావిత్రిగారు కూడా తన దగ్గర నృత్యం నేర్చుకున్నారని నాన్న మాతో చెప్పేవారు. ఒక చిత్రం కోసం ఇప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితగారితో పాటు నటీమణులు చంద్రకళ, కాంచన, వైజయంతిమాల, వాణిశ్రీ మొదలైనవారంతా నాన్న దగ్గర నృత్యం నేర్చుకున్నారు. అప్పట్లో సినిమాల్లో ఒక్కపాటకైనా నాన్న నృత్య దర్శకత్వం ఉండాలని నిర్మాత, దర్శకులు పట్టుపట్టేవారు. అయితే రానురాను సినిమారంగంలో వ్యాపార ధోరణులు పెరిగిపోవడంతో నాన్న సినిమాలకు కొరియోగ్రఫి చేయడం మానేశారు. పూర్తిగా నాట్య శిక్షణకే అంకితమయ్యారు.

 నాన్నతో ముద్దుమురిపాలు
మొదటి ఆడ శిశువుకు కామేశ్వరి అని పేరుపెట్టడం మా నాన్నగారి పూర్వీకులకు సాంప్రదాయంగా వస్తోంది. మా మేనత్త పేరు కూడా కామేశ్వరే. మా తమ్ముడు కుమార్తె పేరు కూడా కామేశ్వరే. కామేశ్వరీదేవి మా ఇలవేలుపు. మా ఇంట్లో నేనే మొదటి సంతానం కావడంతో మా నాన్న నన్ను గారాబంగా ‘కామయ్య’ అని పిలిచేవారు. నాన్నకు పూజలు చేసే అలవాటు పెద్దగా లేదు. కాఫీ తాగుతూ పేపర్ చదవడం నాన్న దినచర్యలో భాగం. పిల్లలమంతా హాలులో కింద పడుకునేవాళ్లం.

నాన్న మా దగ్గరకు వచ్చి కూర్చుని ‘లేవండ్రా, డ్యాన్సు కోసం పిల్లలు వచ్చే టైమయ్యింది’ అంటూ మమ్మల్ని నిద్రలేపేసేవారు. మేమంతా బద్దకంగా పడుకుని ఉంటే ఒక్కొక్కర్ని బతిమాలుతూ, ముద్దాడుతూ లాలించడం ఇన్నేళ్లయినా మరచిపోలేని మధురస్మృతి. మా ఇంటి ఆవరణలోనే చిన్న చిన్న పర్ణశాలల్లాంటి పాకలు వేయించారు నాన్న. అందులో విద్యార్థులు, వారి పేరెంట్స్ ఉండేవారు. ఒంటరిగా ఉండే ఆడపిల్లలైతే మాతో పాటే హాల్లో పడుకునేవారు. తన దగ్గర నాట్యం నేర్చుకునే ఆడపిల్లల సంరక్షణను నాన్న ఎంతో బాధ్యతగా నిర్వర్తించేవారు.

మేము స్కూలుకు వెళ్లి భోజనానికి ఇంటికి వచ్చే సమయానికి వాళ్ల క్లాసులు కూడా పూర్తయ్యేవి. భోజనం చేసేటప్పుడు నేను, మా పెద్దచెల్లెలు నాన్నకు చెరోవైపు కూర్చోవాల్సిందే. మా ఇద్దరి నోట్లో ముద్దలు పెడుతూ బిక్కమొఖం వేసుకుని చూస్తున్న ఆఖరుచెల్లెల్ని ఉడికించేవారు నాన్న. ‘చూడండ్రా…దాని ముఖం ఎలా ఉడికిపోతోందో’ అంటూ ‘బాలిగా రా…'(బాల) అంటూ దాన్ని ఒడిలోకి లాక్కుని దానికి కూడా ముద్ద పెట్టి అప్పుడు నాన్న తినేవారు. మమ్మల్ని ప్రాణప్రదంగా చూసుకున్నారు నాన్న. జీవితంలో ఆయన ఎంత కష్టపడ్డారో, ఎలా కష్టపడ్డారో కాని మాకు మాత్రం ఏలోటు రానివ్వలేదు.

శ్రీనివాస కల్యాణం-నా వివాహం
నాన్న చేసిన నృత్యప్రదర్శనల్లో ‘పద్మావతీ శ్రీనివాస కల్యాణం’ ఆయనకు విశేషమైన కీర్తిప్రతిష్టలు తెచ్చింది. ఒకవిధంగా చెప్పాలంటే శ్రీనివాస కల్యాణం మా ఇంట్లో జరిగిన మొదటి కల్యాణం. ఒక పెళ్లిలా ఆ నృత్యరూపకానికి సన్నాహాలు జరిగాయి. దాదాపు ఏడాదిపాటు సంగీత దర్శకులు సంగీతరావుగారు, రచయిత భుజంగరాయశర్మగారు, నాన్న కలిసి ఒక యజ్ఞంలా దాన్ని తీర్చిదిద్దారు. తెల్లవార్లూ కూర్చుని పాటలకు బాణీలు కట్టేవారు. ఒక్కో సీన్ గురించి గంటల తరబడి చర్చించుకునేవారు. నాన్న అప్పుడు టిటిడి ఆస్థాన విద్వాంసులుగా ఉండేవారు.

తిరుపతిలో ‘శ్రీనివాస కల్యాణం’ తొలి ప్రదర్శన జరిగింది. మా అమ్మ స్వరాజ్యలక్ష్మి వేంకటేశ్వరస్వామి భక్తురాలు. శోభానాయుడు, మంజుభార్గవి పద్మావతీ శ్రీనివాసులుగా అభినయించారు. ఈ ప్రదర్శన జరుగుతుండగా అమ్మకు పూనకం వచ్చినట్లు ఏడ్చింది. ఎవరెంత నచ్చచెప్పినా, సముదాయించినా ఆమె ఏడుపు ఆగడం లేదు. మాకెవరికీ ఏమీ అర్థం కావడం లేదు.

జరుగుతున్నది శ్రీనివాస కల్యాణం కాబట్టి వేంకటేశ్వరుడే ఆమెను ఆవహించాడని ఎవరో చెప్పడంతో వెంటనే అమ్మకు హారతి ఇచ్చారు. ఆ తర్వాతే ఆమె మనలోకంలోకి వచ్చింది. శ్రీనివాస కల్యాణం ప్రదర్శన ఎక్కడ జరిగినా ప్రేక్షకులు గోవిందా, గోవిందా అంటూ కొబ్బరికాయలు కొడుతూ బ్రహ్మరథం పట్టేవారు. ఆ నృత్యాన్ని ప్రదర్శించిన ఏడాదిలోపే నా వివాహం జరిగింది.

సత్యంగారు శ్రీనివాసుడి కల్యాణం తర్వాత తన కుమార్తె కల్యాణం కూడా చేసేశారని నాన్న మిత్రులు చమత్కరించేవారు. 1979లో మేళ్లచెరువు నాగభూషణశాస్త్రిగారితో వివాహమై హైదరాబాద్ వచ్చేశాను. నాకు చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే కూడా చాలా ఇష్టం.

పెళ్లయిన తర్వాత నా భర్త సహకారంతో జెఎన్‌టియులో ఫైనార్ట్స్ చేసి డ్రాయింగ్ టీచర్‌గా కొంతకాలం ఒక స్కూల్లో పనిచేశాను. అయితే అక్కడ కూడా డ్రాయింగ్ క్లాసెస్ కన్నా నృత్యం నేర్పించమనే అందరూ అడిగేవారు. నాన్న ఆశయాల కోసం 2005 నుంచి ఇంటి దగ్గర నృత్య తరగతులు నిర్వహించడం మొదలుపెట్టాను. 2008లో నాన్న పేరిట ‘సత్యం అకాడమి’ని స్థాపించి శ్రీనగర్ కాలనీలోని మహిళా మండలిలో రెగ్యులర్‌గా క్లాసులు తీసుకుంటున్నాను.

కళ వ్యాపారం కాదు…
గత ఏడాది ఫిబ్రవరిలో నాన్నకు అస్వస్థత ఏర్పడింది. అన్నం తినడానికి చాలా ఇబ్బంది పడేవారు. అంతకుముందు వరకు మోకాళ్ల నొప్పులు ఉన్నా తమ్ముడు రవిశంకర్ నిర్వహించే డ్యాన్స్ అకాడమిని నాన్నే పర్యవేక్షించేవారు. వీల్ చెయిర్‌లో కూర్చుని రవి కంపోజ్ చేసే నృత్యాన్ని చూసి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. గత ఏడాది జూలై 29న తన 83వ ఏట కన్నుమూయడానికి రెండు రోజుల ముందు వరకు నాన్న అందరినీ పలకరిస్తూనే ఉన్నారు. కళ కళ కోసమే తప్ప కాసుల కోసం కాదని నాన్న భావించేవారు. నాన్న నాట్యం నేర్పించడానికి ఎవరి దగ్గరా డబ్బు డిమాండ్ చేసేవారు కాదు. నాన్న వారసులుగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మా బాధ్యత. ఈరోజు కూడా మేము ఎక్కడకు వెళ్లినా ముందు మా నాన్న పేరుతోనే మమ్మల్ని పలకరిస్తారు. ఆయన సంపాదించుకున్న కీర్తిప్రతిష్టలే మాకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.