ఇండస్ట్రీని నిలబెట్టిన ఘనత వాళ్ళదే! దర్శకుడు తాతినేని రామా రావు

ఇండస్ట్రీని నిలబెట్టిన ఘనత వాళ్ళదే!

తెలుగు, తమిళ, కన్నడ వంటి దక్షిణాది భాషల్లో సినిమాలు తీసేవాళ్లకు.. 
బాలీవుడ్‌లో అడుగుపెట్టడం ఒక కల! ఇప్పటికీ ముంబయికి వెళ్లి హిందీలో సినిమా చేయడం ప్రిస్టీజ్‌గానే భావిస్తారు సినీ నిర్మాతలు, దర్శకులు. అలాంటిది ఆ రోజుల్లోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి – బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, అనీల్‌కపూర్‌, రాజ్‌బబ్బర్‌, జితేంద్ర, ధర్మేంద్ర, రేఖ, హేమమాలిని వంటి హేమాహేమీలతో కలిసి పనిచేసిన స్టార్‌ దర్శకులు తాతినేని రామారావు. తెలుగు, హిందీలలో సుమారు నాలుగు దశాబ్దాలపాటు కొనసాగి ముప్పావు వంతు సినీ విజయాలు సొంతం చేసుకున్న ఆయన తన జ్ఞాపకాలను ‘నవ్య’తో పంచుకున్నారు..
‘‘మాది కృష్ణా జిల్లా, వ్యవసాయ కుటుంబం. కపిలేశ్వరపురంలో పుట్టాను నేను. ఏలూరులో ఇంటర్‌ వరకు చదువు సాగింది. ఇంజనీరింగ్‌ చేయాలనుకున్నాను కానీ, ముల్కీ నిబంధనల వల్ల సీటు రాలేదు. ఇతర కోర్సుల్లో చేరడానికి సమయం ముగిసిపోయింది. దీంతో ఏడాదంతా ఖాళీగా ఉండాల్సిన పరిస్ధితి. అలా 18 ఏళ్ల వయసులో 1957లో చెన్నై చేరుకున్నాను. మా వూరి మనిషి, మాకు బంధువు కూడా అయిన తాతినేని ప్రకాశరావు అప్పట్లో పెద్ద పేరున్న దర్శకుడు. ఎల్‌వి ప్రసాద్‌ దగ్గర పనిచేశారాయన. ప్రసాద్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ (పిఎపి)లో ‘ఇల్లరికం’ సినిమాను నాగేశ్వరరావుతో తీస్తున్నారప్పుడు. ఆ సినిమాకు నేను తొలిసారిగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాను. ఆ సమయంలో నా నెల జీతం రూ.100 మాత్రమే. దాంతోనే తిండీతిప్పలన్నీ నడిచిపోయేవి. నాతో పాటు ప్రత్యగాత్మ, సుబ్బారావు కూడా దర్శకత్వ శాఖలో పనిచేసేవారు. అవకాశం రావడంతో ప్రత్యగాత్మ ‘భార్యాభర్తలు’ సినిమాకు దర్శకుడయ్యాడు. ఆయన నన్ను అసోసియేట్‌ దర్శకునిగా తీసుకున్నారు.
టర్నింగ్‌ పాయింట్‌
అలా 1964 వరకు ‘భార్యాభర్తలు’, ‘కులగోత్రాలు’, ‘మనసులు-మమతలు’, ‘పునర్జన్మ’ వంటి చిత్రాలకు పనిచేసే అవకాశం చిక్కింది. తమిళంలో వచ్చిన ‘నవరాత్రి’ చిత్రాన్ని సావిత్రి కొనుగోలు చేశారు. తెలుగులో తీయాలనుకున్నారు ఆవిడ. ఈ సినిమా రీమేక్‌లో సావిత్రితో పాటు పిఎపి కూడా భాగం పంచుకుంది. సావిత్రి కుమార్తె పేరు మీద ‘విజయచాముండేశ్వరి’ బ్యానర్‌పై తెరకెక్కింది. దర్శకునిగా ఇదే నా తొలి సినిమా. ఇందులో నాగేశ్వరరావువి తొమ్మిది పాత్రలు. ఒక్కో పాత్రకు ఒక్కో భావం, భాష, రంగు, రుచి ఉంటాయి. నవరసాలతో నిండిన అన్ని భావాలను ఆయన అలవోకగా పండించారు. మళ్లీ నాగేశ్వరరావు-జయలలితలతో ‘బ్రహ్మచారి’ చిత్రాన్ని తెరకెక్కించాను. తరువాత కృష్ణ, శోభన్‌బాబులతో ‘మంచి మిత్రులు’ తీశాను. ఇందులో విజయనిర్మల కథానాయకి. వరుస విజయాలు రావడంతో వరుసగా సినియాలు వచ్చాయి. అవకాశాల కోసం వెతుక్కోనవసరం లేకపోయింది. 1964లో ‘మంచి మనిషి’ చిత్రానికి ఫస్ట్‌ అసిస్టెంట్‌గా ఉన్నపుడే వివాహం జరిగింది. పెళ్లి అయ్యాకే దర్శకునిగా నిలదొక్కుకున్నాను. హరనాధ్‌తో కూడా ‘నడమంత్రపు సిరి’ అనే సినిమా చేశాను. శోభన్‌బాబుతో ‘జీవనతరంగాలు’ తీస్తే చాలా బాగా ఆడింది. ఆ సినిమా పాటలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి.
ఎన్‌టీఆర్‌ నుంచి పిలుపు..

మొదటి నుంచీ పిఎపి వారితో కలిసి ఉండడంతో అక్కినేని నాగేశ్వరరావుతో సినిమాలు తీయగలిగాను. ఆయనతో చేసిన సినిమాలు పదిహేను. అలా ఉండగా 1978లో ఎన్‌టిఆర్‌తో సినివ ూ తీసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. కెమెరామెన్‌ వెంకటరత్నానికి సినిమా చేస్తానని ఎన్‌టీఆర్‌ మాట ఇచ్చి ఉన్నారు. ఆ సినిమా పుండరీకాక్షయ్య తీయాల్సి ఉంది. కానీ ఆలస్యం అవుతోంది. ఇలా ఏవో డేట్లు సర్ధుబాటులో భాగంగా 28 రోజులు కాల్షీట్లు ఉన్నాయి. ‘‘త్వరగా సినిమా తీస్తానంటే చెప్పు, నేను సిద్దం’’ అని ఎన్‌టిఆర్‌ అనగానే, వెంకటరత్నం ఒప్పేసుకుని, సరే అన్నాడు. దీనితో డివి నరసరాజుగారి కథ ఆధారంగా ‘యమగోల’ తీశాం. 28 రోజుల్లో తీసిన సినిమా అది. పరుగు పరుగున చిత్రీకరణ జరిపాం. నెల్లూరు సమీపంలోని ఓ గ్రామంలో నాలుగు పాటలు పూర్తి చేశాం. అదే సమయంలో ఎన్‌టీఆర్‌ మరో సినిమా రీ రికార్డింగ్‌తో బిజీగా ఉండేవారు. ఉదయం మాకు కాల్షీట్‌ ఇచ్చేవారు. ఆయన రాగానే ఆయన సీన్లు అన్నీ తీసేసే వాణ్ని. 12 గంటల తరవాత ఆయన రికార్డింగుకు వెళ్లి 3 గంటల ప్రాంతంలో వచ్చే వారు. తిరిగి సాయంకాలం వరకూ ఆయనతో ఉన్న కాంబినేషన్‌ సీన్లు చిత్రీకరించే వాణ్ని. ఎంత హడావుడిగా తీసినా, నాణ్యతలో రాజీ లేదు. అన్నీ పక్కా, రాసి పెట్టుకుని, జాగ్రత్తగా తీసేవాళ్లం. ఆ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. అప్పటి రాజకీయాలపై సెటైర్లు ఎన్‌టీఆర్‌ నోట బాగా పండాయి. ఆ తరువాత ఎన్‌టీఆర్‌తో ‘ఆటగాడు’, ‘అనురాగదేవత’ వంటి మూడు సినిమాలు చేశాను.
హిందీలో హవా..
అక్కినేని నాగేశ్వరరావు, వాణీశ్రీ జంటగా తీసిన ‘ఆలుమగలు’ పెద్ద హిట్‌. దీన్ని హిందీలోను తీయాలనుకున్నాం. అంతకు ముందు ‘ఇల్లరికం’, ‘భార్యభర్తలు’ వంటి సినిమాలను కూడా హిందీలో రీమేక్‌ చేశాను. అవన్నీ 25 వారాలకు పైగా ఆడి, ఘనవిజయం సాధించాయి. ఒక దశలో జితేంద్ర ఈ రీమేక్‌లలో నటిస్తూ, మద్రాసులోనే ఉండిపోయారు. ‘ఆలుమగలు’ జితేంద్ర- రేఖ జంటగా హిందీలో తీశాను. విజయం సాధించింది. అయితే ‘యమగోల’ మాత్రం అక్కడ నిరాశ పరిచింది. ఈ దశలో డూండి, సునంది, పిఎపి, జగపతి, నా స్వంత సంస్థ లక్ష్మీ ప్రొడక్షన్స్‌ వంటి తెలుగు నిర్మాతలకే వరుసగా పలు హిందీ సినిమాలు చేశాను. దీనితో పరిశ్రమ హైదరాబాదుకు మారుతున్న సమయంలో నేను ముంబైలో ఉండిపోయా. హైదరాబాద్‌ షూటింగ్‌లకు వెళ్లినా అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోలేకపోయాను. ‘చట్టానికి కళ్లు లేవు’ సినిమాను ‘అంధాకానూన్‌’ పేరుతో హిందీలో చేశాను. ఇందులో అమితాబ్‌ పాత్ర నిడివి పెంచా. అలాగే రజనీకాంత్‌కి ఇదే తొలి హిందీ సినిమా. అతనితో హిందీ సినిమా ఏమిటని చాలా మంది వారించారు. అయినా సరే తీశాను. విజయం వరించింది. 1979-2000 మధ్య హిందీలో 30 సినిమాలు చేశాను. అందరూ అప్పట్లో ప్రముఖ తారలే, ఎవరితోనూ ఇబ్బంది కలగలేదు. రెండేళ్ల క్రితం కుటుంబంతో ముంబై వెళ్లినపుడు అమితాబ్‌ని కలిశాను. ఆయనలో మునుపటి ఆదరణే కనిపించింది.
పరుగు ఆపడం ఒక కళ..
‘‘మనం ఎక్కడ పరుగు ఆపాలో తెలుసుకుంటే, జీవితంలో ఏ చింత ఉండదు. తెలుగు, హిందీ సినిమా రంగంలో 40 ఏళ్లకు పైగా కొనసాగాను. 65 చిత్రాలకు దర్శకత్వం చేశాను. ఎన్నడూ హద్దు దాటలేదు. నిత్యం వ్యాయామం చేయడం, మితాహారం తీసుకోవడం వంటి నియమాలు పాటిస్తున్నాను. 43 సంవత్సరాల సుదీర్ఘసినీ ప్రస్థానంలో 65 సినిమాలే చేశాను..’’
రేటు తగ్గించుకున్నారు..
‘‘ఒక సందర్భంలో – సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న అగ్రనటులు ఎన్‌టిఆర్‌-ఏఎన్‌ఆర్‌లు తమ పారితోషికాలను సైతం భారీగా తగ్గించి నిర్మాతలకు సహకరించిన రోజులున్నాయి. అక్కినేని గారు అయితే, చాలా అరుదుగా తన రేటును పెంచే వారు. రేటు పెంచుతానంటే, దుక్కిపాటి మధుసూధనరావే నాగేశ్వరరావుని కసురుకునేవారు. ‘నీవు రేటు పెంచితే, నిర్మాత ఎలా భరిస్తాడు? పెంచవద్దు’ అని స్నేహపూర్వకంగానే వారించేవారు. ఆ వాతావరణం ఇప్పుడు ఎక్కడుంది?’’
అలా బయటపడ్డాను..
‘‘అనిల్‌కపూర్‌, రవీనాటాండన్‌, రేఖలు ప్రధాన పాత్రల్లో ‘బులంది’ సినిమా చేశాను. అది పోయింది. పెద్దగా ఆడలేదు. ఆ తరువాత ఇక సినిమాలు మనకు పనికిరావని తెలుసుకున్నాను. గౌరవంగా విరమించుకోవడం మంచిదని భావించా. చెన్నై సమీపంలో గుమ్మడిపూండి వద్ద ఒక పరిశ్రమ ఏర్పాటు చేశాను. నా కుమారుడు ఇంజనీర్‌. అతనే ఆ వ్యాపారం చూస్తాడు. ప్రస్తుతం ఆ సంస్థలో 200పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇంతమందికి పని కల్పించడం కాస్త గర్వంతో కూడిన సంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది..’’
మన్నవ గంగాధర ప్రసాద్‌, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాసులు
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.