‘ఇతనితో డిఫరెంట్ కేరక్టర్లు చేయించొచ్చు’, ‘ఇతనిని పెట్టుకున్నామంటే ఆ పాత్రకు ప్రాముఖ్యం ఉండాలి’ అని దర్శకులు భావించే నటునిగా తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు ‘ఆహుతి’ ప్రసాద్ కేన్సర్ వ్యాధితో బాధపడుతూ అర్ధంతరంగా కన్నుమూయడం తెలుగు చిత్రసీమను విచారంలో ముంచేసింది. సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకుని పేరు సంపాదించుకున్న అతి కొద్దిమంది నటుల్లో ఆయన ఒకరు. చొరవగా ముందుకెళ్లే మనస్తత్వం లేకపోవడంతో కెరీర్ మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ మితభాషి మరణం తర్వాతే ఆయన ఎంతమంది స్నేహితుల్ని సంపాదించుకున్నారో లోకానికి తెలిసింది. ‘ఆహుతి’ చిత్రంతోటే మొదటిసారిగా అందరి దృష్టిలో పడి, ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నప్పటికీ, ‘చందమామ’ చిత్రంలో చేసిన రామలింగేశ్వరరావు పాత్రే ఆయనకు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.
ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్. కృష్ణాజిల్లా, ముదినేపల్లి పక్కన కోడూరు గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రంగారావు, హైమావతిల దంపతులకు నలుగురు అమ్మాయిల తర్వాత కలిగిన మగ సంతానం వరప్రసాద్. ఆయన తండ్రికి కర్ణాటక ట్రాన్స్‌ఫర్ కావడంతో మూడో తరగతి వరకు ఆయన చదువు అక్కడే సాగింది. నాలుగో తరగతి నుండి ఆరవ తరగతి వరకు కర్నూలులో ఆయన అక్క దగ్గర చదువుకున్నారు. తర్వాత కోదాడ, మిర్యాలగూడలో పదో తరగతి వరకు చదివి, అక్కడే ఇంటర్‌లో చేరారు. ఇంట్లో ఒక్కడే మగబిడ్డ కావడంతో కుటుంబం ఆయనను ఎంతో గారాబంగా పెంచింది. స్కూల్ రోజుల్లోనే ప్రసాద్‌కు నటన అంటే పిచ్చి. క్లాసులు ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసేవారు. నాగార్జున సాగర్‌లో చదువుతున్న
సమయంలో ‘అభినయం’ అనే నాటకం వేసి ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. అలాగే ఆయన వేసిన రెండో నాటకం ‘అన్నాచెల్లెళ్లు’ కూడా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. దానికిగాను నాగార్జున సాగర్ డ్యామ్ ఛీప్ ఇంజనీర్ అప్పట్లో విదేశాల నుండి తెప్పించిన ఓ పెన్నును బహుమతిగా ఇవ్వడం ఎప్పటికీ మరువలేని అనుభూతిగా ఆహుతి ప్రసాద్ చెప్పేవారు. చదువులో బిలో ఏవరేజ్‌గా స్టూడెంట్‌గా ఉన్న ఆయనకు నాటకాల్లో ప్రశంసలు దక్కడంతో సినీ నటుడు కావాలనే ఆశ మరింత బలపడింది. సినిమాల్లోకి వెళ్తానంటే కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దాంతో చదువుపై అంతగా దృష్టిసారించక కోదాడలో డిగ్రీ మధ్యలో వదిలేశారు. పెళ్లి చేస్తే సినిమాల గొడవ పక్కన పెడతాడనే ఉద్దేశ్యంతో విజయనిర్మలతో పెళ్లి చేశారు పెద్దలు.
కెమెరా ముందుకు…
పెళ్లి తర్వాత 1983 జనవరిలో మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరారు. అందులో ఈయనదే మొదటి బ్యాచ్. రాంజగన్, శివాజీరాజా, అచ్చుత్, సుబ్బారావు ఈయనకు కొలీగ్స్. ఏడాది తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కి షిప్ట్ చేశారు. మధుసూధనరావుగారి ద్వారా తాతినేని ప్రకాశరావుగారితో పరిచయాన్ని పెంచుకున్నారు. ఆ పరిచయంతో ప్రకాశరావు ‘మీరు ఆలోచించండి’ సీరియల్‌లో నటించే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ప్రతాప్ ఆర్ట్స్‌లో ఓ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే రాఘవగారబ్బాయి తీస్తున్న ‘ఈ ప్రశ్నకు బదులేది’ సినిమాలో మెయిన్ విలన్‌గా బుక్ చేశారు. ఈలోగా మధుసూధనరావుగారికి మరో రెండు సినిమాలొచ్చాయి. ఒకటి ఉషాకిరణ్ మూవీస్‌లో ‘మల్లెమొగ్గలు’, రెండోది నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్’. ఈ రెండింటికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ నటించారు. ఆయన మొదట తెర మీద కనిపించిన సినిమా ‘విక్రమ్’. ఆ తర్వాత ‘ఈ ప్రశ్నకు బదులేది’ సినిమా విడుదలైంది. మద్రాస్‌లో ఆ సినిమా చూసిన శ్యాంప్రసాద్ రెడ్డి ‘ఆహుతి’ సినిమాలో అవకాశమిచ్చారు. 1987 డిసెంబర్ 3న విడుదలైన ‘ఆహుతి’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో, రాజశేఖర్, జీవితతో పోటీపడుతూ హోమ్ మినిస్టర్ శుంభుప్రసాద్ పాత్రను ప్రసాద్ ఎంత బాగా చేశారో అందరికీ తెలిసిందే.
నష్టం తెచ్చిన ‘ఆహుతి’ పేరు
ఆహుతి ప్రసాద్ సినిమా కెరీర్‌ను పరిశీలిస్తే ‘చందమామ’ ముందు, ‘చందమామ’ తర్వాత – అని విభజించవచ్చు. ‘ఆహుతి’తో తొలి బ్రేక్ వచ్చినా, దానిని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు. మంచి మంచి అవకాశాలు వస్తున్న టైమ్‌లో మిత్రులైన నటులు రఘుబాబు, హరిప్రసాద్‌తో కలిసి కన్నడంలో సినిమాలు నిర్మించే పనిలో మునిగిపోయారు. దీంతో ఆయన నటించడం మానేశాడేమోనని అడగడం మానేశారు. పైగా జనార్దన వరప్రసాద్ పేరు కాస్తా, ‘ఆహుతి’ ప్రసాద్‌గా మారడంతో, ఆ పేరే ఆయనకు మైనస్‌గా మారింది. ‘ఆహుతి’ అనే పదాన్ని నిర్మాతలు నెగటివ్‌గా భావించడం వల్ల కూడా ఆయనకు అవకాశాలు ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడారు. ఏదైనా పాత్రకు ఆయనను తీసుకుందామని దర్శకులు అంటే, ‘ఆహుతా.. వద్దు లేవయ్యా. ఆ సౌండే బాగాలేదు’ అని నిర్మాతలు అనడం వల్ల పెద్ద పెద్ద సినిమాలే చేజారిపోయాయి. పైగా ఆయనది చొరవ తీసుకునే మనస్తత్వం కాదు. మొహమాటం, తనను తాను బూస్టప్ చేసుకునే తెలివితేటలు లేకపోవడం వల్ల కూడా అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ టైమ్‌లో కృష్ణవంశీ నుంచి ఆయనకు మంచి ఆఫర్ వచ్చింది. అది నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘నిన్నే పెళ్లాడతా’లో హీరోయిన్ టబు తండ్రి కేరక్టర్. ఆ పాత్ర ఆయన కెరీర్‌కు రెండో బ్రేక్.
‘చందమామ’తో దశ తిరిగింది
‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత నుంచి ఆయన అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకపోయింది. అనేక కుదుపులతో అతలాకుతలమైన ఆయన కెరీర్‌ను ఆ సినిమా మంచి మలుపు తిప్పింది. చాలా సినిమాల్లో చేసిన పాత్రల్లో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. కానిస్టేబుల్ నుంచి ఐజీ దాకా అన్ని రకాల పోలీస్ పాత్రలను ఆయన చేశారు. దాదాపు తొంభై సినిమాల్లో పోలీస్ పాత్రలను పోషించిన రికార్డ్ ఆయనది. అయితే ‘ఆహుతి ప్రసాద్ ఇట్లా కూడా చేస్తాడు’ అనే పేరు తెచ్చిపెట్టిన చిత్రం ‘చందమామ’. దాని దర్శకుడూ కృష్ణవంశీయే. అందులో గోదావరి యాసతో మాట్లాడే రామలింగేశ్వరరావు పాత్ర ఆయన కెరీర్‌కు బోనస్‌లా మారింది. ఆలస్యంగానైనా ఆ కేరక్టర్ ఆయన సినీ జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. అప్పటివరకూ విలన్‌గా, కేరక్టర్ ఆర్టిస్ట్‌గా సీరియస్‌గా కనిపిస్తూ వచ్చిన ఆయన కామెడీ కూడా గొప్పగా చేయగలడని ఆ సినిమా నిరూపించింది. రామలింగేశ్వరరావు పాత్రలో ఆహుతి ప్రసాద్ నటనను, ఆయన డైలాగ్స్‌ను ఆస్వాదించడానికే ఆ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు చాలామందే. ‘చందమామ’తో ఆయనకు ఎంత పేరొచ్చిందనేదానికి నిదర్శనం – విజయవాడలో ఆ సినిమా ఆడుతున్న థియేటర్ వద్ద నలభై అడుగుల ఆహుతి ప్రసాద్ కటౌట్ పెట్టడం. ‘‘ఈ సినిమాలో రామలింగేశ్వరరావు కేరక్టర్ వల్ల రిపీట్ ఆడియెన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టే ఆయన కటౌట్ పెట్టాం’’ అని డిసి్ట్రబ్యూటర్లు చెప్పారు. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో చేసినప్పట్నించీ, కృష్ణవంశీకి సన్నిహితుడు కావడం, ఆయన వద్ద గోదావరి యాసలో జోకులు చెప్తుండటం వల్లే రామలింగేశ్వరరావు పాత్ర ఆయనకు లభించింది. కృష్ణవంశీ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు.
రెండు నందులు
ఇరవై ఏడేళ్ల కెరీర్‌లో 250కి పైగా చిత్రాలు చేసిన ఆయన నటనా ప్రతిభకు గుర్తింపుగా రెండు నంది అవార్డులు లభించాయి. మొదట ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ చిత్రానికి ఉత్తమ ప్రతినాయకుడిగా అవార్డు పొందిన ఆయన, రెండోసారి ‘చందమామ’లోని రామలింగేశ్వరరావు పాత్రను పోషించిన తీరుకు ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్ట్‌గా అవార్డు అందుకున్నారు. ‘విక్రమ్’ సినిమాకి సంబంధించిన రెమ్యూనరేషన్‌ను శివాజీ గణేశన్ చేతులు మీదుగా అందుకోవడం, హిందీ ‘సూర్యవంశ్’లో అమితాబ్‌తో పద్దెనిమిది రోజులు కలిసి పనిచేయడం, కమల్‌హాసన్‌తో ఓ తమిళ సినిమా చేయడం తన జీవితంలో మరపురాని క్షణాలని ఓ సందర్భంగా ఆయన చెప్పుకున్నారు. అలాగే విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీ రామారావుతో కలిసి నటించకపోవడం తీరని లోటుగా ఆయన భావించేవారు. తెరపై నటుడు కావాలనే కోరికను తీర్చుకుని, స్వయంకృషి, పట్టుదలతో ఓ చక్కని నటునిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వరప్రసాద్ మరణంతో తెలుగు చిత్రసీమ ఓ నిఖార్సయిన తెలుగు నటుణ్ణి అర్ధంతరంగా కోల్పోయినట్లయింది.