నాటక రంగం నుంచి తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి, కె. బాలచందర్ వంటి దిగ్దదర్శకుడిని మెప్పించి, ఆయన తెలుగు చిత్రాల ఆస్థాన సంభాషణల రచయితగా పేరుపొందడం ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి చరిత్రను సాధించిన రచయిత గణేశ్ పాత్రో. ఆయన సంభాషణలు రచించిన సినిమాలే రచయితగా ఆయన గొప్పతనమేమిటో తెలియజేస్తాయి. ఫ్యామిలీ సినిమాలైనా, సీరియస్ సినిమాలైనా, ప్రేమకథలైనా.. ఏదైనా సరే, తనదైన ప్రత్యేకశైలి సంభాషణలతో మెప్పించిన మాటల సవ్యసాచి పాత్రో. విశాఖ నుండి చెన్నైకి వచ్చారు. 100కిపైగా సినిమాలకు మాటలు రాశారు. 1976లో కె. ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన ‘అత్త వారిల్లు’ చిత్రంతో సినీ మాటల రచయితగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు. 1978లో వచ్చిన కె. బాలచందర్ సినిమా ‘మరోచరిత్ర’ ఆయన కెరీర్‌ని మలుపుతిప్పింది. అక్కడ నుండి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. బాలచందర్ తీసిన తెలుగు సినిమాలన్నింటికీ పాత్రోనే మాటల రచయిత. వాటిలో ‘గుప్పెడు మనసు’, ‘ఇది కథ కాదు’, ‘తొలికోడి కూసింది’, ‘ఆకలి రాజ్యం’, ‘రుద్రవీణ’ వంటి ఎన్నో అపురూ పమైన సినిమాలున్నాయి. ఇక 1984లో వచ్చిన ‘మనిషికో చరిత్ర’, ‘మయూరి’, ‘మంగమ్మగారి మనవడు’, ‘స్వాతి’, 1985లో వచ్చిన ‘ప్రేమించి పెళ్లాడు’, ‘మా పల్లెలో గోపాలుడు’, 1988లో వచ్చిన ‘మురళీకృష్ణుడు’, 1989లో వచ్చిన ‘ముద్దుల మావయ్య’, 1991లో వచ్చిన ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘నిర్ణయం’, ‘జానకిరాముడు’, 2001లో వచ్చిన ‘9 నెలలు’ చిత్రాలు పాత్రోకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ‘9 నెలలు’ తర్వాత పన్నెండేళ్ల విరామంతో 2013లో వచ్చిన వెంకటేశ్, మహేశ్ సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’, పాత్రో ఆఖరి సినిమా. ‘అందమైన అనుభవం’, ‘నిర్ణయం’ చిత్రాల్లో పాటలు రాశారు. ఇక అతికొద్ది సినిమాల్లో నటుడిగాను మెరిశారు పాత్రో. వడ్డే నవీన్ నటించిన ‘మా బాలాజీ’ చిత్రంలో కీలకపాత్ర పోషించి మెప్పించారు.
అవార్డులు…
పాత్రో ప్రతిభకి పలు అవార్డులు పాదాక్రాంతమయ్యాయి. ‘స్వాతి’, ‘మయూరి’, ‘సీతారామయ్య గారి మనవరాలు’, ‘ఆకలిరాజ్యం’ చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో సంస్థల సన్మానాలు అందుకున్నారు.
‘మనవడా.. నీతో సినిమా
చెయ్యాలి అనేవారు
‘‘గణేష్ పాత్రోగారు నాకు తాతయ్య వరుస. ఆయ నకి గొల్లపూడి మారు తీ రావుగారు క్లోజ్ ఫ్రెండ్. వారిద్దరూ గంటలు గంటలు మాట్లాడుకునే వారు. మధ్యలో ఆయన ఫోన్ చేసి ‘మనవడా… నీ సంగీతం, సినిమాల గురించే డిష్కషన్ చేసుకుంటున్నాం’ అనే వారు. ఆ సమయంలో చాలా గర్వంగా అనిపించేది. పనిమీద ప్రేమ ఉండే వ్యక్తి. చేసే పనికి వందశాతం న్యాయం చేయాలనే ఆయన ఆలోచన నాకు స్ఫూర్తి. చిన్న డైలాగ్‌తో సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యేట్లు చెప్పగల ఇంటెలెక్చువల్ ఆయన. ‘ఆకలిరాజ్యం’, ‘రుద్రవీణ’ చిత్రాల్లో ఆయన రాసిన సంభాషణలంటే నాకు ఆరాధన. నేను చేసిన ‘బ్రోకర్’ చిత్రం చూసి ‘మనవడా… నీతో సినిమా చెయ్యాలి, నీ థాట్ నాకు చాలా బాగా నచ్చింది… నీ తదుపరి చిత్రానికి నేను వర్క్ చేస్తా… ఏమంటావ్?’ అన్నారాయన. చాలాసార్లు ‘నేను నీ తాతను కాబట్టి పొగడకూడదు కానీ.. గ్రేట్ మనవడా’ అనటం నా మనసుకి మంచి అనుభూతి కలిగింది.
చాలామందికి తెలీని విషయం కృష్ణ, రామ్మోహన్‌ను హీరోలుగా పరిచయం చేస్తూ ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ‘తేనె మనసులు’ చిత్రానికి మిగతావాళ్లతో పాటు పాత్రో సైతం ఓ పాత్ర కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్ర్కీన్ టెస్ట్‌కు సైతం ఆయనను పిలిచారు. అయితే ఆ ఉత్తరాన్ని అందుకున్న వాళ్ల నాన్న దీనికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో వెళ్లలేకపోయారు.
పాత్రో దర్శకత్వంలో ‘ప్రతిమ’ అనే చిత్రం 1986లో ప్రారంభమైంది. విశాఖపట్నంలో కొంత షూటింగ్ జరిగాక, ఆగిపోయింది. అది పూర్తయివుంటే, నటి గౌతమికి అదే మొదటి సినిమా అయ్యేది. ఉషాకిరణ్ మూవీస్ తలపెట్టిన ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పనిచేశారు. తెలీని కారణాల వల్ల సినిమా ఆగిపోవడంతో దీని కోసం రికార్డ్‌చేసిన పాటలను ఆ తర్వాత వేరే సినిమాలకు ఉపయోగించుకున్నారు.
ఆత్రేయ – పాత్రో
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ (పీఏపీ) నిర్మించిన ‘అత్తవారిల్లు’ చిత్రానికి రచయితగా పాత్రోకు అవకాశమిచ్చారు, దాని దర్శకుడు కె. ప్రత్యగాత్మ. ఆ రోజుల్లో పాత్రో వద్ద పెద్దగా డబ్బులు లేవు. స్కూల్లో చదువుకుంటున్న ఆయన ఇద్దరు పిల్లలకు ప్రవేశ రుసుము కూడా కట్టలేని దుస్థితి! పెద్ద బేనర్లో అవకాశం వచ్చిందన్న ఆనందం ఓ వైపు, తన పారితోషికాన్ని ఎలా అడగాలనే సంశయం మరోవైపు. అప్పుడు ఆత్రేయ ఆయనను ఆదుకున్నారు. పీఏపీ సంస్థ నుంచి పారితోషికం డబ్బులేవైనా అందాయా, లేదా అని పాత్రోని అడిగారు. అందలేదని పాత్రో చెప్పడంతో, ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని వాకబుచేసి, తన అసిస్టెంట్‌ను పంపి, పిల్లల స్కూలు ఫీజులు కట్టేశారు. మరికొంత డబ్బు పాత్రో చేతుల్లో పెట్టారు. అయితే ఆ తర్వాత పీఏపీ నుంచి ఆయనకు పారితోషికం అందింది. ఈ విషయం చెప్పి, ఆత్రేయ సాయం చేసిన డబ్బును తిరిగివ్వబోయారు పాత్రో. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్‌కు పాత్రోను పరిచయం చేసింది కూడా ఆయనే. మలయాళంలో హిట్టయిన ఓ సినిమాని ఈరంకి శర్మ తెలుగులో ‘చిలకమ్మ చెప్పింది’ పేరుతో రూపొందించారు. దానికి బాలచందర్ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. సెట్స్ మీద కూడా దర్శకుడితో ఎక్కువ సమయం వెచ్చించగల రచయిత కావాలని బాలచందర్‌గారు అనుకున్నారు. అప్పట్లో ఆత్రేయ బాగా బిజీగా ఉన్నారు. బాలచందర్ అసిస్టెంట్ అయిన అనంతుకు పాత్రోని పరిచయం చేశారు. పాత్రో రంగస్థల నేపథ్యం తెలుసుకున్న అనంతు ఆయనను బాలచందర్ వద్దకు తీసుకుపోయారు. అలా ‘చిలకమ్మ చెప్పింది’ చిత్రానికి పనిచేశారు పాత్రో. ఆయన పనితనం బాలచందర్‌కు బాగా నచ్చింది. కమల్‌హాసన్ హీరోగా ‘మరో చరిత్ర’ను తెలుగులో తీయాలని బాలచందర్ సంకల్పించారు. ఆత్రేయతోటే సంభాషణలు రాయించాలని ఆయన అనుకున్నారు. అయితే ఆరోగ్య కారణాలతో ఆయనతో పాటు సెట్స్‌పై పూర్తి సమయం వెచ్చిం చే స్థితిలో ఆత్రేయ లేరు. అందుకని ఆయన స్థానంలో రచయితగా పాత్రోని తీసుకుంటానని ఆత్రేయకు చెప్పారు బాలచందర్. ఆత్రేయ ఏమాత్రం నొచ్చుకోకుండా పాత్రోని మనసారా ఆశీర్వదించారు. అలా బాలచందర్‌తో పాత్రో అనుబంధం మొదలైంది. అందుకే చిత్రసీమలో రచయితగా తను ఎదగడానికీ, పేరు తెచ్చుకోవడానికీ ఆత్రేయ ఆశీస్సులే కారణమని పాత్రో ప్రగాఽఢంగా నమ్మేవారు.
బాలచందర్ – పాత్రో
చిత్రసీమలో బాలచందర్‌తో దాదాపు ఇరవై ఏళ్లపాటు కలిసి ప్రయాణించారు పాత్రో. సున్నిత మనస్కుడిగా పేరున్న బాలచందర్ తన చుట్టూ ఉన్న మనుషుల పట్ల చాలా శ్రద్ధ చూపుతారు. అయితే నిర్లక్ష్యాన్ని ఆయన ఏమాత్రం సహించరని పేరు. అలాంటి ఆయన ముందు సిగరెట్ తాగడానికి అనుమతి ఉన్న ఏకైక వ్యక్తి పాత్రో అనేది నిజం. ఆ రోజుల్లో పాత్రో చైన్ స్మోకర్గా పేరుపొందారు. బాలచందర్ ముందు సిగరెట్లు తాగడానికి ఎవరూ ధైర్యం చేసేవాళ్లు కాదు. షూటింగ్ మధ్యలో సిగరెట్ తాగడం కోసం సెట్స్ బయటకు వెళ్లేవారు పాత్రో. ఆయన కంటిముందు కనిపించకపోవడంతో వాకబు చేసేవారు బాలచందర్. పాత్రో సెట్స్ మీదకు వచ్చాక, ఎక్కడికెళ్లావని అడిగేవారు. సిగరెట్ తాగడానికి వెళ్లానని పాత్రో చెప్పేవారు. ఓ వారం రోజుల పాటు ఇదే కొనసాగడంతో ఆయన పాత్రోని పిలిచి ‘‘ఇక్కడున్న వాళ్లలో దాదాపు అందరూ సిగరెట్ తాగేవాళ్లే. కానీ అలాంటి అలవాటే లేని మంచివాళ్లుగా నా దృష్టిలో పడాలని ప్రయత్నిస్తుంటారు. నువ్వొక్కడివే ధైర్యంగా సిగరెట్ తాగుతున్నానని చెప్తున్నావ్. షూటింగ్ జరిగే టైమ్‌లో నువ్వు సెట్స్ మీదే ఉండటం నాక్కావాలి. కాబట్టి, నా ముందే నువ్వు నిరభ్యంతరంగా సిగరెట్ తాగొచ్చు. దానివల్ల ఇద్దరికీ సమయం కలిసొస్తుంది’’ అన్నారు. షూటింగ్‌కు ప్యాకప్ చెప్పాక తర్వాత తీయాల్సిన సన్నివేశాల గురించి చర్చించుకుని, ఎవరి వెర్షన్లో వాళ్లు డైలాగ్స్ రాసేవాళ్లు ఆ ఇద్దరూ. మరుసటి రోజు షూటింగ్ మొదలుపెట్టే ముందు మాత్రమే వాళ్లు ఒకరి డైలాగ్స్‌ను మరొకరు చూసుకునేవాళ్లు. ఇక్కడ విశేషమేమంటే, పాత్రో సంభాషణల స్థాయిలో తన తమిళ వెర్షన్ డైలాగ్స్ లేవని భావించిన బాలచందర్, వాటిని మరింత బాగా రాయడం కోసం షూటింగ్‌ను వాయిదా వేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే ఓ ద్విభాషా చిత్రం తమిళ వెర్షన్‌కు ‘నూల్ వేలి’ (దారపు హద్దు) అనే టైటిల్ పెట్టారు బాలచందర్. తెలుగుకు ఆ టైటిల్ నప్పదని చెప్పిన పాత్రో, ‘గుప్పెడు మనసు’ టైటిల్ సూచించారు. దాన్నే తెలుగు సినిమాకు పెట్టారు బాలచందర్. ఆ టైటిల్ ఆయనకు ఎంత నచ్చిందంటే తర్వాత కాలంలో తను తీసిన ఓ టీవీ సీరియల్‌కు ‘గుప్పెడు మనసు’ అనే పేరు పెట్టారు. అదీ పాత్రోకు ఆయనిచ్చిన గౌరవం, విలువ!