మారణాయుధాల మధ్య తూనీగలు
- – వి.బి.ఎన్. శ్రీనివాస్ 8522846585
- 12/01/2015

మబ్బు చిచ్చుబుడ్డి చిమ్మే పువ్వుల్ని
భూమికన్నా ముందే అందుకునే
కొన్ని చేతులు
ముత్యపు చిప్పలకన్న ముందే
గుప్పిట పట్టే కొన్ని నోళ్ళు –
మొక్కల మొదళ్ళకన్న ముందే
మట్టి సాక్సులు తొడుక్కునే కొన్ని కాళ్ళు –
కాల్వ పక్కనే ఎదురుచూస్తున్న
కాగితపు పడవల్ని సుతారంగా లేపి
నీటి మీద బతుకునిచ్చే కొన్ని ప్రాణాలు –
ఏం చెప్పాలి
నవ్వుల వెనె్నల్ని కాసే
వేల చందమామలు!
ఇల్లు పూలవనమయ్యే
పుప్పొడి అడుగులు!!
అమ్మ నాన్నల్ని ఆరోగ్యపరిచే
అద్భుత ముద్దుల గుళికలు!
అక్షరాలమీద వాలిన తూనీగల్ని
ముక్కలు చేసి
ఆయుధానికి దండేశారు
కూలిన కలల నెత్తుట్లో
పసివాసన నవ్వులు!
రాలిన కలల నెత్తుట్లో
మరణించిన బాల్య పరిమణాలు!
వాలిన కలల నెత్తుట్లో
మినుకు మినుకు కళల
నిర్జీవ నక్షత్రాలు!
వాలి కూలి రాలిన నెత్తుట్లో తేలిన
బాల్యపుస్తకాల శవాలు!
చిగురాకుల్ని కాల్చి
ఖండఖండాలు చేసి
తల్లివేరు కడుపుమీద
ఆరని చితి పేర్చారు
రాజ్యం కనుగప్పిన ఆయుధమా!
నీకో పాలబువ్వల బాల్యాన్నిస్తున్న
నీకో సుతిమెత్తని తరగతి పుస్తకాన్నిస్తున్న
నీకో సతత వసంతబడి వాతావరణాన్నిస్తున్న
నీకో ప్రేమల అమ్మ ఒడినిస్తున్న
నీకో హృదయపు తడినిస్తున్న
ఇక బతుకు!
వెర్రితలల తుపాకుల్లారా!
కత్తుల్లారా! బాంబుల్లారా!
బాల్యాన్ని మింగడమంటే-
రేపటి ప్రపంచాన్ని చంపడమే!
బాల్యం పాలస్తీనా అయినా
బాల్యం పాకిస్తాన్ అయినా
బాల్యం భారత్ అయినా…

