జంతూనామ్ నరజన్మ దుర్భరమ్’’ అంటారు ఆదిశంకరులు. జన్మాంతర సుకృతం చేత దుర్లభమైన మానవ జన్మ మనకు లభించిందనేది దీని అర్థం. ఆహారం, నిద్ర, భయం, మైఽథునము ఇవి జంతువులకు, మానవులకు సామాన్యమైన లక్షణములు. అయితే మానవ జన్మవలన ప్రత్యేకంగా లభించేది యుక్తమైనది, ఆయుక్తమైనది అనే విచక్షణా జ్ఞానమే. దానినే సదసద్వివేక సంపద అని కూడా చెబుతారు. ఏది సత్ పదార్థము ఏది అసత్ పదార్థము అని నిర్ణయము చేసి సత్ పదార్థము వైపు దృష్టి మళ్ళించి సాధించగలిగే అవకాశము మానవుడికి మాత్రమే ఉంది.
భయం వల్ల..
తిండి, నిద్ర, భయం, సంసార సుఖం ఇవి సకల ప్రాణులకి సమానమైనవి. వీటి చేత కలిగే సుఖం, ఆనందం తాత్కాలికమైనవి. వీటిని వ్యక్తపరిచే శక్తితో పాటు భాష, వివేకం మానవుడికి మాత్రమే ఉన్నాయి. పైన పేర్కొన్న వాటిలో భయం మానవ సమాజంలో ఎక్కువగా ఉండటాన్ని మనం చూస్తుంటాం. సాధారణంగా భయం కలిగినప్పుడు దానిని తొలగించుకోవడానికి భగవంతుడి యందు భక్తి భావం పుడుతుంది. ఆ భయహేతువును తెలుసుకోవడానికి మరియు దాని నివృత్తికి నిరంతరము ప్రయత్నిస్తాము. లోకంలో మనతో పాటు జీవిస్తున్న మహాత్ములను దర్శించి వారరి చేత మన భయందోళనలు నివృత్తి చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. ఒక వైపు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే- సర్వోత్కృష్టుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అయిన భగవంతుడిని ఆరాధించి, భయభ్రాంతులు తొలగించుకోవాలనుకుంటాం. అయితే ఇది తాత్కాలికంగా భయాన్ని తొలగించుకోవటానికి చేసే ప్రయత్నం మాత్రమే. అయితే- శాశ్వత భయనివృత్తి, నిరతియానందం కోసం, అనాది నుండి మానవులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దీనినే- శంకరులు.
తైత్తిరీయ భాష్యంలో ‘‘పురుష ఏవహి శక్తిత్వాత్ – అర్థిత్వాత్ ’’ అని పేర్కొంటారు. కర్మ ఉపాసనల ద్వారా సాపేక్షికమైన నిరతిశయ ఆనందం పొందే అవకాశము మానవుడికి మాత్రమే ఉందనేది ఈ వాక్య అర్థం. ఇలాంటి నిరతిశయ ఆనందాన్ని పొందటానికి మార్గమేమిటనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దానికున్న ఏకైక మార్గం జ్ఞానుల మార్గదర్శకత్వమే. ‘‘నేను’’ ఎవరు? నా స్వరూపం ఏమిటి? ఎందుకు ఇలా ఉన్నాను? అనే ప్రశ్నలకు మనకు సరియైున జ్ఞాన గురువుల దగ్గరే సమాధానం లభిస్తుంది.
‘‘తద్విద్ధి ప్రణి పాతేన పరిప్రశ్నేన సేవయా’’ అంటారు గీతాచార్యులు. భౌతిక జ్ఞానానికి వ్యవహారిక ఆధ్యాత్మిక జ్ఞానానికి శాసీ్త్రయ జ్ఞానులు అవసరమనేది దీనర్థం. ఈ మార్గదర్శకత్వం కూడా వీలైనంత త్వరగా పొందాలి. వయస్సు, బుద్ధి, ఆరోగ్యం అన్ని ఉన్నప్పుడే జ్ఞానం పొందగలిగితే వయస్సు మీరిన తరువాత మానవ జీవన మార్గానికి దుఃఖము ఉండదు, భయము ఉండదు.
స్వామి స్వరూపానందేంద్ర సరస్వతివిశాఖ శారదా పీఠాధిపతి
99666696584

