మాగ్లెవ్ ట్రెయన్ ‘పట్టా’ల్లేవ్… పగ్గాల్లేవ్…

మాగ్లెవ్ ట్రెయన్ ‘పట్టా’ల్లేవ్… పగ్గాల్లేవ్…

  • 03/05/2015
  • -రామానుజం

దినపత్రికలో వచ్చిన వార్తకు సంబంధించి ‘హెడ్‌లైన్’ను చదివేలోగా మీరు ప్రయాణిస్తున్న రైలు దాదాపు 2 కిలోమీటర్ల దూరం దూసుకుపోతుంది. నమ్ముతారా..! … నమ్మాల్సిందే.. గంటకు 603 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలులో అది నిజం కనుక. భూ వాతావరణంలో ధ్వనికన్నా ఐదారు రెట్ల వేగంగా, గంటకు 7వేల కిలోమీటర్ల వేగంతో అంటే విమానం కన్నా వేగంగా దూసుకువెళ్లే రైలు భవిష్యత్‌లో మీకు సేవలందిస్తుందంటే నమ్ముతారా! మనం వెంటనే నమ్మలేకపోవచ్చు…కానీ, శాస్తవ్రేత్తలు దాన్ని నిజం చేయగలమంటున్నారు. ఆశ, తపన, నమ్మకం లేకుండా మనిషి లేడు. అందుకు ఉదాహరణే జపాన్ తాజాగా ప్రయోగించిన ‘మాగ్లెవ్ ట్రెయిన్.’ *** ఆ రైళ్లకు ఇంజన్లు, చక్రాలు ఉండవు.. అయినా భద్రంగా, అతివేగంగా గమ్యానికి మనల్ని చేరుస్తాయి.. ఆ రైళ్లు ట్రాక్‌మీద కాకుండా గాలిలో దూసుకుపోతాయ్… అయినా ప్రమాదమేమీ ఉండదు. కుదుపులు, చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా మన చేరాల్సిన చోటికి చేరవేస్తాయి. ఆ రైళ్లు పరిగెడుతూంటే… గాలిని చీల్చే శబ్దం తప్ప మరేమీ విన్పించదు. కాదు…మరే శబ్దం ఉత్పత్తికాదు. ఆ రైళ్లలో వెడుతూ అద్దాల్లోంచి బయటి దృశ్యాలను చూస్తే తప్ప మనం ప్రయాణిస్తున్న విషయం తెలీదు.. ఈ రైళ్లు కొండవీటి చాంతాడంత పొడవునా ఉండవు. బోగీల కోసం వెతుక్కోనక్కరలేదు. అంతా కలిపితే ఏడు చైర్‌కార్లుంటాయంతే. ఓ హెలికాఫ్టర్‌కన్నా…ఓ ఫార్ములావన్ రేసు కారుకన్నా…వేగంగా దూసుకుపోయే ఆ రైళ్ల పేరు ‘మాగ్లెవ్ ట్రెయిన్స్’. పదేళ్లక్రితం నుంచే ఇవి రెగ్యులర్ సేవలు అందిస్తున్నాయి. అసమాన వేగంగా, పరిమిత దూరానికి ప్రస్తుతానికి ఇవి సేవలందిస్తున్నాయి. ఈ మధ్య జపాన్‌లో జరిపిన ప్రయోగంలో గంటకు 603 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయి గతంలో తాను సృష్టించిన రికార్డును బద్దలుకొట్టిన ఆ బుల్లి మాగ్లెవ్ ట్రెయిన్ గొప్పలు అన్నీఇన్నీకావు. దాదాపు నూట పదేళ్ల క్రితమే ఈ తరహా బీజం పడినా ఎడతెగని పరిశోధనల ఫలితంగా వాటి వేగంలో వచ్చిన మార్పులు ఇప్పుడు మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. మనిషి మేధోమథనం ఇలాగే కొనసాగితే విమానాల కన్నా వేగంగా, భద్రంగా మనల్ని మోసుకెళ్లే వాక్టోట్రెయిన్స్ మరో 50 ఏళ్లలో మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇంతకీ ఏమా రైళ్లు..? ఏమా కథ..? కాలంతో పరుగు ఆధునిక మానవుడికి ప్రాణం తరువాత అత్యంత విలువైనది కాలం. కాలంతో పరుగులు తీస్తూ మనోవేగాన్ని మించి దూసుకుపోవాలన్నది అతడి తపన. ఆచరణలో ఒక్కో మైలురాయి దాటుతున్నాడు. పరుగు ప్రయాణంలో వేగంగా అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచం విశ్వనగరంగా మారిపోయింది. ఒకచోటి నుంచి మరోచోటికి, ఒక ఖండం నుంచి మరో ఖండానికి రోజువారీ పర్యటనలు చేయాల్సిన స్థితికి మనిషి అవసరాలు చేరాయి. ఉక్కిరిబిక్కిరిగా, ఊపిరి సలపని పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని మనసు ఉబలాటపడుతూంటే ఆ వేగానికి తగ్గట్లు సౌకర్యాలు ఉండాలి కదా! ఆ అవసరాలు తీర్చడానికి తగిన ప్రయాణ సాధనాలను కనుగొనే పని శతాబ్దాల క్రితమే ప్రారంభమైంది. ఇప్పుడు ఆ సాధనాల వేగం పెంచే పనిలో ఒక్కో అడుగూ ముందుకేస్తున్నాం. జపాన్‌లో మొన్న జరిగింది అదే. గంటకు 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మాగ్లెవ్ ట్రెయిన్ టెస్ట్ రన్ విజయవంతం కావడంతో ఆ దేశం వైపు, ఆ రైళ్లవైపు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. మాగ్లెవ్ ట్రెయిన్స్ అంటే… సంప్రదాయ రైళ్లు మొదట బొగ్గు, నీటి ఆవిరి, ఆ తరువాత డీజిల్, ఇప్పుడు విద్యుత్‌శక్తితో నడుస్తున్న విషయం తెలిసిందే. భారీ స్టీల్‌ట్రాక్‌లపై పెద్దశబ్దం చేస్తూ వెళ్లే ఈ రైళ్లను ఆధునీకరించి, వాటి వేగం పెంచి బుల్లెట్ ట్రైన్లుగా చెప్పుకుని మురిసిపోతాం. మనదేశంలో ఇంకా బుల్లెట్ రైళ్లు..కాగితాలపైకూడా ఇంకా పరుగులు తీయడం లేదు. కానీ, ఆసియా దేశాలైన జపాన్, చైనా,కొరియా, రెండు మూడు పాశ్చాత్య దేశాల్లో మాగ్లెవ్ రైళ్లు కాలంతో పరుగులు తీస్తూ దూసుకువెళుతున్నాయి. అయస్కాంత శక్తిని వినియోగిస్తూ నడిచే రైళ్లనే మాగ్లెవ్ రైళ్లుగా పేర్కొనవచ్చు. మాగ్నటిక్ (అయస్కాంతశక్తి), లెవిటేషన్ (గాలిలో తేలడం) అని అర్థం వచ్చినప్పటికీ అయస్కాంత శక్తివల్ల ట్రాక్‌పై తేలియాడుతూ దూసుకువెళ్లే రైళ్లుగా వీటిని అభివర్ణించవచ్చు. ఇలా రైళ్లు గాలిలో తేలుతూ వెళ్లడానికి అయస్కాంత శక్తే కారణం. అయస్కాంతంలో సజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని, విజాతి ధృవాలు వికర్షించుకుంటాయని మనకు తెలుసు. రైలును ముందుకు నడిపించేందుకు, ట్రాక్‌పై బోగీలు తేలియాడేలా ఉండేందుకు ఈ సూత్రాన్ని వినియోగిస్తూ ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రాక్ (గైడ్ వే) ఉంటుంది. రైలు బోగీల కింద కొన్ని మాగ్నెటిక్ కాయిల్స్, గైడ్ వేకు ఇరువైపులా క్రమపద్ధతిలో అమరుస్తారు. అందువల్ల ఆయా కాయిల్స్ ఆకర్షించుకున్నప్పుడు రైలు ముందుకు కదులుతూంటుంది. వికర్షణ శక్తివల్ల ట్రాక్‌పై బోగీలు తేలుతూంటాయి. ఇదంతా జరగడానికి విద్యుత్‌శక్తిని ఉపయోగిస్తారు. విద్యుత్‌శక్తిని వినియోగించనప్పుడు రైలు ముందుకు కదలదు. అంటే రైలు ఆగాల్సినప్పుడు విద్యుత్‌శక్తిని వినియోగించరన్నమాట. అత్యంత వేగంగా దూసుకుపోయే రైలు వేగం నియంత్రణ కూడా విద్యుత్‌శక్తి వినియోగం ఆధారంగా ఉంటుంది. ఈ రైళ్లతో లాభాలేంటి… ప్రస్తుతం జపాన్, చైనాలు మాత్రమే పూర్తిస్థాయిలో మాగ్లెవ్ రైళ్లను నడుపుతున్నాయి. జర్మనీ, అమెరికా,బ్రిటన్, దక్షిణ కొరియా,ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు ప్రయత్నాలు, ప్రయోగాల దశలో ఉన్నాయి. వీటిలో ఒకటీ అరా దేశాలు నామమాత్రపు సర్వీసులు నడుపుతున్నాయి. వాణిజ్యపరంగా ప్రజలకు సేవలందిస్తూ రెగ్యులర్ సర్వీసులు నడుపుతున్న దేశాలు మాత్రం రెండే. అవి జపాన్, చైనా. ఈ తరహా రైళ్ల వినియోగంలో చైనా ముందున్నా వేగం, ఆధునికత విషయంలో జపాన్ అగ్రస్థానం వైపు కదులుతోంది. ఉక్కుతో చేసిన పట్టాలపై పెద్దశబ్దం చేస్తూ, ఇరుకుగా ఉండే సంప్రదాయ రైళ్లకన్నా మాగ్లెవ్ రైళ్లతో ప్రయోజనాలు ఎక్కువ. ముఖ్యంగా వీటి నిర్వహణ వ్యయం సాధారణ రైళ్ల నిర్వహణ వ్యయంకన్నా చాలా తక్కువ. పట్టాలుండవు కనుక బోగీల వాడకంలో విడిభాగాల మార్పిడి అవసరం ఉండదు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల అవసరం ఉండదు. మామూలు రైళ్లకు వినియోగించే విద్యుత్‌లో చాలా తక్కువ విద్యుత్‌తో మాగ్లెవ్ రైళ్లను నడపవచ్చు. ట్రాక్‌ల నిర్వహణ కూడా సులభమే. వాతావరణ ప్రతికూలత ప్రభావం మామూలు రైళ్లు, ట్రాక్‌లపైకన్నా తక్కువే. వాయు ధ్వని కాలుష్యం ఉండదు. ఈ రైళ్లు పట్టాలపై నడవవు.వాటికి పది మిల్లీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తులో గాలిలో తేలుతూ ఉంటాయి కనుక శబ్దం ఉత్పన్నం కాదు. కేవలం గాలిలో దూసుకుపోవడంవల్ల కలిగే రాపిడి వల్ల వచ్చే శబ్దం మాత్రమే విన్పిస్తుంది. పరికరాల అమరిక కోసం బోగీలో ఎక్కువ స్థలం అవసరం ఉండదు. అందువల్ల సంప్రదాయ రైళ్లలోకన్నా ఈ బోగీలు విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. ముఖ్యంగా వీటికి ప్రత్యేకంగా ఇంజన్లు ఉండవు. అంతా గైడ్ వేలో ప్రయాణం సాగిపోతుంది. అందువల్ల మొదటి, చివరి బోగీలు ఒకేలా మంచి డిజైన్‌తో ఉంటాయి. తక్కువ బోగీలు, సురక్షిత గైడ్ వేవల్ల బోగీలు విడిపోవడం వంటి ప్రమాదాలు జరగనే జరగవు. ఈ తరహా రైలు వ్యవస్థకు భారమల్లా గైడ్ వే ఏర్పాటు. ఇది సంప్రదాయ రైల్‌ట్రాక్ నిర్మాణవ్యయం కన్నా వందల రెట్లు అధికం. ఇది పేదదేశాలకు మోయలేని భారం. అందువల్ల అగ్ర, సంపన్న రాజ్యాలు మాత్రమే వీటి జోలికి వెళుతున్నాయి. చైనా నడుపుతున్న షాంఘై మాగ్లెవ్ రైలు మార్గం వేయడానికి కిలోమీటరుకు 1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల మొత్తం వ్యయమైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ రెండు విధానాల్లో సేవలు మాగ్లెవ్ రైళ్లు రెండు విధానాల్లో సేవలందిస్తున్నాయి. 1901 ప్రాంతంలో జర్మనీ శాస్తవ్రేత్త మాగ్లెవ్ రైళ్ల ప్రస్తావన చేశారు. వీటికి సంబంధించి పరిశోధన పత్రాలు విడుదల చేశారు. జర్మనీ రూపొందించి అభివృద్ధి చేసిన మాగ్లెవ్ రైల్ సిస్టమ్ నిర్వహణ అంతా ఇఎంఎస్ విధానంలో ఉంటుంది. అంటే ఎలక్ట్రోమాగ్నటెక్ సస్పెన్షన్‌తో రైలు నడుస్తుందన్నమాట. ఈ విధానాన్ని అన్వయించుకుని చైనా సొంత సాంకేతిక విధానాన్ని అభివృద్ధి చేసుకుంది. అయస్కాంతశక్తితో రైళ్లు నడుస్తాయి. పరిమితంగా విద్యుత్ వినియోగిస్తారు. ఈ రైళ్లకు చక్రాలు అసలు ఉండవు. జపాన్ సొంతంగా తయారు చేసుకున్న విధానం దీనికి భిన్నం. వారు వాడే విధానాన్ని ఇడిఎస్ అని పిలుస్తారు. అంటే ఎలక్ట్రో డైనమిక్ సస్పెన్షన్. దీనివల్ల రైలు పరిమిత వేగాన్ని అందుకునేవరకు చక్రాలపై నడుస్తుంది. కేవలం పది సెకండ్లలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆ వేగం అందుకున్న వెంటనే రైలు చక్రాలపై కాకుండా గాలిలో తేలుతూ పరుగులు తీస్తుంది. ఈ రెండురకాల విధానంలో రైళ్లు ట్రాక్‌పై పది మిల్లీమీటర్ల (ఇఎంఎస్ విధానం) నుంచి పది సెంటీమీటర్ల ఎత్తులో(ఇడిఎస్) గాలిలో దూసుకుపోతూంటాయి. విద్యుత్‌ను వినియోగిస్తున్నప్పుడు అయస్కాంత శక్తి పనిచేస్తుంది. అప్పుడు రైలు నడుస్తుంది. విద్యుత్‌ను వినియోగించనప్పుడు రైలు ఆగిపోతుంది. ఈ రైళ్ల నిర్వహణలో కీలకమైన గైడ్‌వే (ట్రాక్-ఇరుప్రక్కలా గోడల్లాంటి, పట్టాల్లాంటి పలకలు)లోను, రైలు బోగీల అడుగు భాగంలోనూ అత్యంత శక్తివంతమైన మాగ్నెటిక్ కాయిల్స్ వాడతారు. వీటిని మరోవిధంగా ‘సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్’అని అనుకోవచ్చు. ఇవి వేడెక్కకుండా చల్లగా ఉండేలా వీటిని రేర్‌ఎర్త్ ఎలిమెంట్స్‌తో తయారు చేస్తారు. దాదాపు 15 రకాల మూలకాల మిశ్రమంతో వీటిని తయారు చేస్తారు. ప్రమాదాలు అతి తక్కువ మాగ్లెవ్ రైళ్ల నిర్వహణ ఈనాటిది కాదు. 1980 నాటికే ఇవి వినియోగంలోకి వచ్చాయి. 1984లో బర్మింగ్‌హామ్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ రైల్వెస్టేషన్‌వరకు 600 మీటర్ల దూరానికి తొలి మాగ్లెవ్ రైలును నడిపారు. అప్పుడు ఆ రైలు గంటకు 42 కిలోమీటర్ల వేగంతో నడిచేది. 11 ఏళ్లపాటు అది సేవలందించింది. జర్మనీ 1984లో తొలి షటిల్‌ను నడిపింది. అయితే, ప్రమాదాలు, సాంకేతిక ఇబ్బందులు, నిర్వహణ భారం వల్ల కొంతకాలానికి రద్దు చేశారు. మళ్లీ 1980 తరువాత వీటిపై మమకారం ప్రారంభమైంది. 2001 నాటికి జపాన్, చైనా వీటిపై ఆసక్తి చూపి కార్యరంగంలోకి దూకాయి. ఇప్పటివరకు ఐదారు అగ్నిప్రమాదాలు తప్ప పెనుప్రమాదాలేవీ జరగలేదు. చైనా తన తొలి మాగ్లెవ్ రైలును 2001లో ప్రయోగాత్మకంగాను, 2004లో వాణిజ్యపరంగాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. షాంఘై మాగ్లెవ్ పేరుతో దీనిని పుడోంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి లాంగ్‌యాంగ్ రోడ్ మెట్రోస్టేషన్ వరకు, 30 కిలోమీటర్ల దూరం నడుపుతున్నారు. కేవలం 7 నిమిషాల్లో అది గమ్యం చేరుతుంది. గంటకు 431 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలు ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే రైలుగా రికార్డు సాధించింది. ప్రస్తుతం ఈ రైలు రోజుకు 115 ట్రిప్‌లతో సేవలందిస్తోంది. మున్ముందు ఈ రైలుమార్గాన్ని మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్న జపాన్‌లో 603 కిలోమీటర్ల వేగంతో నడిచిన మాగ్లెవ్ రైలు ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగానే వినియోగించారు. జపాన్‌కు చెందిన లినిమో మాగ్లెవ్ రైలు ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే రెండో రైలుగా రికార్డులు నమోదు చేసింది. 2005లో ఇది ప్రజల కోసం అందుబాటులోకి వచ్చింది. ఇది అందుబాటులోకి వచ్చిన తొలి మూడునెలల్లోనే కోటిమంది దీనిలో ప్రయాణించారంటే అది ఎలాంటి సేవలందిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇక దక్షిణ కొరియా సైతం ఈ రంగంలో ప్రతిభ చూపింది. తన తొలి మాగ్లెవ్ రైలును గత ఏడాది ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రసిద్ధ ఇంచియాన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నుండి యాంగ్యు వరకు దీనిని నడుపుతున్నారు. చైనా, జపాన్, కొరియా దేశాలు మరికొన్ని ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకువెళుతున్నాయి. ముఖ్యంగా జపాన్ తన టోక్యొ-ఒసాకా మాగ్లెవ్ రైలు వ్యవస్థను పూర్తిచేయాలని చూస్తోంది. 2027 నాటికి తొలిదశను అంటే నగొయా వరకు 286 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 40 నిమిషాల్లో చేరేలా ప్రయత్నిస్తోంది. 2047 నాటికి ఒసాకాకు, అంటే 410 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఒకగంట ఏడు నిమిషాల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కారులో టోక్యోనుంచి ఒసాకోకు చేరడానికి 5 గంటల సమయం పడుతోంది. మాగ్లెవ్ వ్యవస్థ పూర్తయితే కేవలం గంట 7 నిమిషాల్లో గమ్యాన్ని చేరవచ్చు. ఈ వ్యవస్థ ప్రకారం న్యూయార్క్-శాన్‌ఫ్రాన్సిస్కోల మధ్య ఉన్న 4,200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఏడు గంటల్లో అధిగమించవచ్చు. అయితే ఈ ప్రయత్నంలో అమెరికా ఇంకా చాలాదూరం ప్రయాణించవలసి ఉంది. ఈ దేశంలో ఇప్పటికి అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న రైలు ఆమ్‌ట్రెక్ అసెలా ఎక్స్‌ప్రెస్. ఇది గంటకు 241 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తోంది. ఇక ఇంగ్లండ్‌లో ప్రతిపాదనలో ఉన్న హెచ్‌ఎస్2 హైస్పీడ్ రైలు వేగం గంటకు 400 కిలోమీటర్లుగా ఉంది. వివిధ దేశాల్లో హైస్పీడ్ రైళ్లు, మాగ్లెవ్ రైళ్ల వేగం ఇలా ఉంది. షాంఘై మాగ్లెవ్ 431 కెఎంపిహెచ్, లినిమో-380, హార్మని సిఆర్‌హెచ్ 380ఎ-380, ఎజియు-ఇటలో-360, సిమన్స్ వెలరో(స్పెయిన్)-350, టల్గో-350 (స్పెయిన్) తొలి ఆరు స్థానాల్లో ఉన్నాయి. వీటి వేగం ఇదీ… భూమీద వేగంగా నడిచే ప్రయాణ సాధనాలను పరిశీలిస్తే ప్రస్తుతానికి మొన్న జపాన్‌లో రికార్డు సృష్టించిన మాగ్లెవ్ రైలుదే అగ్రస్థానం. దీని వేగం గంటకు 603 కిలోమీటర్లు. మరికొన్ని మగ్లెవ్ రైళ్లు 403 నుంచి హీనపక్షం గంటకు 350 కి.మీ.ల వేగంతో దూసుకువెళుతున్నాయి. ఫార్ములా-1 రేస్ కారు వేగం గంటకు 320 కిలోమీటర్లు కాగా జపాన్‌లోని ప్రతిష్టాత్మక షిన్‌కసు బుల్లెట్ రైలు వేగం 321 కెఎంపిహెచ్. యూరోస్టార్ హైస్పీడ్ రైలు వేగం గంటకు 300 మాత్రమే. కాలగతిలో ఆధునిక మానవుడు ఎలా అభివృద్ధి చెందాడో గమనిస్తే మున్ముందు మరిన్ని మేలైన ఆవిష్కరణలు సాక్షాత్కరిస్తాయనే విశ్వసించాలి. మానవాళి ప్రగతికి అవసరమైన సేవలు మరింత చౌకగా, భద్రంగా, చేరువగా రావాలంటే ఇలాంటి ప్రయోగాలు జరగాలి. ఒక్కో విజయం కొత్త ఆశలకు ఊపిరిలూదుతుంది. ఈ వేగం, విజయం జపాన్ సాధించినా, భారత్ సాధించినా ఒక్కటే. అది ముమ్మాటికీ మానవుడి విజయం. కాదంటారా..? ………………………………….. భారత్‌లో ఎప్పుడు..? భారత్‌లో హైస్పీడ్ రైళ్ల వేగం 160 (దిల్లీ-్భపాల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్) కిమీలకు మించదు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ భారత్‌లో బుల్లెట్ రైళ్లకోసం పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. భారీ వ్యయం, ఎక్కువ సమయం తీసుకునే ఈ ప్రాజెక్టు కార్యరూపంలోకి రావడానికి చాలాకాలం పట్టవచ్చు. భారత్‌లో మాగ్లెవ్ రైళ్లు పరుగుపెట్టాలంటే ఒకటి రెండు దశాబ్దాల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ, మనవాళ్లూ వీటిపై మనసుపడినమాట నిజం. కొన్ని ప్రతిపాదనలు, కొన్ని మార్గాల్లో వీటని నడపాలన్న ఆలోచనలు ఎప్పుడో చర్చకు వచ్చాయి. లాలూప్రసాద్ యాదవ్ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు ఒక అమెరికన్ కంపెనీ మాగ్లెవ్ రైళ్లపై ఓ నివేదిక సమర్పించింది. పూణె-ముంబయి మధ్య నిర్మించ తలపెట్టిన మాగ్లెవ్ రైలువ్యవస్థకు 30 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. లాభనష్టాలపై బేరీజు వేసిన లాలూ పేదలకు అందుబాటులో ఉండే ‘గరీభ్ రథ్’పై మొగ్గుచూపి మాగ్లెవ్‌ను పక్కనపడేశారు. నిజానికి ఈ మాగ్లెవ్ రైలును పూణెలోని పింపిల్ సౌదనగర్ నుంచి ముంబైలోని పడ్వేల్ వరకు నడపాలని ప్రతిపాదించారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 112 కి.మీ. దూరం ఉంది. నిజానికి అత్యంత రద్దీగా ఉండే ముంబయి-పూణె మార్గంలో రోజూ 14 వేల వాహనాలు తిరుగుతాయి. ఈ మార్గంలో మాగ్లెవ్ రైలు నడిపితే రెండు గంటల ప్రయాణ సమయంలో గంటన్నర సమయం ఆదా అవుతుంది. అంటే కేవలం 30 నిమిషాల్లో గమ్యం చేరవచ్చు. ఈ ప్రతిపాదనను మహారాష్టక్రు చెందిన ఓ మంత్రి చేసినా అది కాగితాలకే పరిమితమైంది. ముంబయి-్ఢల్లీ మధ్య కూడా ఇలాంటి రైలు నడపాలన్న ప్రతిపాదనలు వచ్చినపుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ ప్రయోగం సఫలమైతే మరిన్ని ప్రాంతాల్లో అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీ రైల్వెమంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగింది. కానీ అమలు కాలేదు. ఇక చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య ఇలాంటి రైలును నడపాలన్న ప్రతిపాదన 2012లో కర్నాటక మంత్రి ఒకరు చేశారు. దీనిపై సౌత్ కొరియాకు చెందిన ఒక సంస్థ ప్రాజెక్టు రిపోర్డును కూడా ఇచ్చింది. ఆ తరువాత దానిపై ఎవరూ ముందుకు వెళ్లలేదు. ముంబయి-నాగపూర్ మధ్య వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంటుంది. మహారాష్టల్రోని వెనుకబడిన (అహ్మద్‌నగర్, బీడ్, లాతూర్, నాందేడ్)ప్రాంతాల మీదుగా ఓ రైలు వేయాలన్న ప్రతిపాదన కూడా గతంలో తెరపైకి వచ్చింది. ఇవన్నీ రాష్టస్థ్రాయిలో జరిగిన మాటామంతీయే తప్ప సీరియస్ ప్రయత్నాలు కావు. ……………………………………………….. వాక్టో ట్యూబ్ ట్రైన్‌@6,400 కెఎంపిహెచ్ ఔను…అన్నీ అనుకున్నట్లు జరిగితే, పరిశోధనలు నిజమే అయితే- అవి సత్ఫలితాన్ని ఇస్తే శాస్తవ్రేత్తలు కంటున్న కలలు నిజమైతే..ఆ రైలు వేగం గంటకు కనీసం 6400 కిలోమీటర్లు. గరిష్ఠ వేగం..గంటకు 8వేల కిలోమీటర్లు. ఇది ప్రస్తుతానికి నమ్మశక్యం కాదు. కానీ వీటిపై చైనాకు చెందిన సౌత్‌వెస్ట్ జయాటోంక్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేస్తున్నారని అంటున్నారు. ఈ రైళ్లకు వారు ‘వాక్టో ట్యూబ్ ట్రెయిన్స్’ అని పేరుపెట్టారు. గాలిలేని ట్యూబుల్లో ప్రయాణించే రైళ్లు అన్నమాట. గాలి ఒత్తిడివల్ల రైళ్లవేగం మందగిస్తుంది. గాలే లేని విధంగా నిర్మించిన టనె్నల్స్ లేదా ట్యూబుల్లో ప్రయాణించే రైళ్లను సృష్టించాలన్నది ఆలోచన. గాలి ఒత్తిడి లేనప్పుడు ఆ రైళ్లవేగం గంటకు 6 వేల కిలోమీటర్లపైగానే ఉంటుందన్నది వారి అంచనా. ఇది భూ వాతావరణంలో ధ్వనివేగం కన్నా ఐదారురెట్లు ఎక్కువ. వీరిలెక్కలు, అంచనాలు కార్యరూపంలోకి వస్తే బీజింగ్ నుంచి న్యూయార్క్‌కు రెండు గంటల్లో చేరిపోవచ్చు. ఆ వేగం ఓ విమానం ప్రయాణించే వేగంగా ఎక్కువ. నిజానికి 1970లోనే వీటిపై పరిశోధనాపత్రాలు వెలువడ్డాయని అంటారు. కానీ ఇదంతా పుక్కిట పురాణమేనని, ఇది అసాధ్యమని అంటున్నవాళ్లూ ఉన్నారు. చైనా యూనివర్శిటీ శాస్తవ్రేత్తలు ఒక్కటి మాత్రం స్పష్టం చేశారు- ‘తామేమీ పరిశోధనలు చేయడం లేద’ని. కానీ- చేసేవన్నీ ముందు చెబుతారా ఏంటి.? అదీ చైనాలో..! …………………………. జపాన్ మాగ్లెవ్-603 ఈ రైలు వేగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 21న ప్రయోగాత్మకంగా జపాన్ పరిశీలించింది. ఏడు బోగీలున్న ఈ మాగ్లెవ్ రైలు కేవలం 10.8 సెకండ్లలో 1.8 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంది. ఇది గంటకు 603 కిలోమీటర్ల వేగంతో సమానం. దీంతో ప్రపంచం కళ్లు జపాన్‌వైపు, ఆ మాగ్లెవ్ రైలువైపు పడ్డాయి. నిజానికి సరిగ్గా వారం ముందు అదే రైలు వేగాన్ని పరిశీలించినపుడు గంటకు 590 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రికార్డు సృష్టించింది. అంటే తాజాగా తన రికార్డును బద్దలుకొట్టి సరికొత్త రికార్డును నమోదు చేసిందన్నమాట. అది ఆ రైలుకు కొత్తకాదు. ఇదే రైలు తొలిసారి అంటే 2003లో గంటకు 581 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది. జపాన్ మాగ్లెవ్ అంటే ఆషామాషీ కాదు కదా!

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.