గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

 

1-సంస్కృతాంధ్ర ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి

తెలుగు ,సంస్కృతాలలో ఏం ఏ .పి.హెచ్ .డి.చేసిన శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విద్యలకు పుట్టినిల్లు విజయనగరం జిల్లా దేవాడ లో లో 22-9-1942 జన్మించారు .తండ్రి గారు వేదుల కృష్ణ మూర్తి గారు తల్లిగారు మారువాడ వారి ఆడబడుచు వెంకట రమణ ,రామలక్ష్మి గార్ల కుమార్తె శ్రీమతి రామలక్ష్మి .

విద్యా వైదుష్యం

శాస్త్రిగారు విశాఖ పట్నం సి .బి .ఏం హైస్కూల్ లో సెకండరీ విద్య నేర్చి ,మిసెస్ ఏ.వి.యెన్ కాలేజి లో డిగ్రీ చదివారు ఆంద్ర విశ్వ విద్యాలయం లో చేరి తెలుగు ,సంస్కృతాలలో ఏం .ఏ. లో ఉత్తీర్ణత సాధించి ,పిమ్మట ఆ రెండుభాషలపై గల అభిమానం తో పి హచ్ .డి. లను కూడా పొందారు .విద్వత్ పట్ట భద్రులైన తండ్రి కృష్ణ మూర్తి శాస్త్రి గారు సంస్కృతాంధ్ర సాహిత్య తత్వాన్ని వాత్సల్యం తో ఉపదేశించారు .దానిని శాస్త్రి గారు సద్వినియోగం చేసుకొన్నారు .ఆంద్ర విశ్వ విద్యాలయం లో సంస్కృతాంధ్ర సాహిత్య వైభవాన్ని ఆత్మీయతతో బోధించారు ఆచార్య గంటి జోగి సోమయాజి గారు .శాస్త్రి గారి గురు పరంపరలో ‘’కళా ప్రపూర్ణ ‘’దువ్వూరి వెంకట రమణ శాస్త్రి ,ప్రాచార్య,’’ యశస్వి’’ ,ఎస్వీ జోగారావు ,వంటి ఉద్దండులున్నారు .విద్వత్ శిరోమణి ‘’,వాచస్పతి ‘’అప్పల  సోమేశ్వర శర్మ పుత్ర వాత్సల్యం తో ఎన్నో శాస్త్రవిజ్ఞానపు మెళకువలు కరతలామలకం చేశారు .సద్గురు శివానంద మూర్తి మహర్షి సత్తముల  ఉత్సాహ ప్రోత్సాహాలు అమృత వర్షమై శాస్త్రిగారిని తనియింప జేస్తున్నాయి .’’త్వమేవాహం ‘’భావాన్ని బోధించారు శ్రీ గట్టు నారాయణ గురూజీ సోదరులు . ఇంతమంది మహనీయుల ఆశీస్సులతో తమ విద్యా శాస్త్ర ప్రామాణ్యాన్ని మెరుగు పరచుకొన్న ధన్య జీవులు శాస్త్రి గారు .

ఉద్యోగ సోపానం

తెలుగు గీర్వాణ భాషల లోతులను తరచి చూసిన శాస్త్రిగారు  1965-75 వరకు విశాఖ పట్నం లో తాను విద్య నేర్చిన మిసెస్ ఏ వి యెన్. కాలేజిలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు .1975-2002వరకు ఆంధ్రా యూని వర్సిటి లో లెక్చరర్ గా చేరి ,వరుసగా పదోన్నతి పొంది రీడర్ గా ,ప్రొఫెసర్ గా ఎదిగి ,తెలుగు శాఖ ముఖ్య ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు 1976 లో అమెరికాలోని విస్కాన్సిస్ స్టేట్ యూనివర్సిటి లో ఉద్యోగించారు .చదువుకున్న గురువులవద్ద వారితో బాటు పనిచేస్తూ విద్యార్ధులకు బోధించే  అదృష్టం శాస్త్రిగారికి దక్కింది .

సాహిత్యార్ధాంగి

శాస్త్రి గారి జీవిత భాగస్వామిని నిత్య జిజ్ఞాసువు అయిన శ్రీమతి ప్రభావతి గారు .ఏం.ఏ .పట్ట భద్రురాలు .సంస్క్రుతాన్ద్రాధ్యయనం చేసిన విదుషీమణి .జీవితం లోనే కాక శాస్త్రిగారి సాహిత్యం లోనూ ఆమె సాబాలు (సగం పాలు )పంచుకొన్నారు .

రచనా పాటవం

శాస్త్రి గారే చెప్పుకొన్నట్లు సాహిత్య జీవితం లో సాహిత్య ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రసంగాలు సహస్రాదికంగా చేశారు వీటిని గ్రంధ రూపం లోకి తెచ్చి లోకానికి విలువైన గ్రంధాలను అందించారు .కనీసం ౩౦౦ గ్రంధాలకు పరిష్కరణ పూర్వకం గా ముందుమాటలు సమీక్షలు రాశారు .వివిధ అంశాలపై ఆకాశవాణిలో అనేక ప్రసంగాలను చేసి శ్రోతలను మెప్పించారు .శాస్త్రిగారి శిష్యపరంపర అగణితం .

శాస్త్రిగారు తమ సంస్కృత విద్వత్తును సార్ధకం చేసుకొన్నారు .పఠన ,పాఠనలేకాక గ్రంధ రచనా చేశారు సంస్కృతం లో 1.వరూధినీ ప్రవరం 2. కల్యాణం అనే ఏకాంకికలు 3.తత్వ మసి అనే మూడు రచనలు చేశారు  ప్రవర వరూదినుల విషయం పెద్దన గారి మనుచరిత్ర మాతృకగా కలది .ఇదే వీరి తోలి రచనకూడా .కల్యాణం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర కల్యాణం .దీనిని గురుదేవులు దువ్వూరి వారికి అంకితమిచ్చి గురూణం తీర్చుకొన్నారు .కాని దువ్వూరు వారి జీవితాకాలం లో పుస్తకం రాలేదు వారి మరణానంతరమే వెలువడింది .శ్రీ మద్రామాయణేపురుషార్ధ వివేకః అనేగ్రందాన్ని రాశారు –ఇది ఇప్పటికి అముద్రితం .

తెలుగులో చాలా గ్రంధాలు రాశారు శాస్త్రిగారు .అందులో అష్ట దిగ్గజాలు ,భాగవత సుధా ,,పంచ తంత్ర చంపువు ,ఆధ్యాత్మిక వ్యాసమంజరి ,భారతం లో శాంతి పర్వం ,భారత భారతి ,సుబ్రహ్మణ్య భారతి ,జానపద గేయ సాహిత్య ప్రభ ,శంకర భగవత్పాదుల శివానందలహరికి  ,సౌందర్య లహరి లకు వ్యాఖ్య ,ఆధ్యాత్మ రామాయణం లో అపూర్వ కల్పనలు రాసి సంస్కృత ఆధ్యాత్మ రామాయణాన్ని తెలుగు లోకి అనువాదమూ చేశారు .అలాగేసంస్కృత  అద్భుత  రామాయణాన్నీ తెలుగు చేశారు .బాల రామాయణం ,రామాయణ ప్రసంగ లహరి రాశారు .ఉత్తర రామాయణం వాల్మీకి మహర్షి రచన కాదని శాస్త్రిగారు తేల్చి చెప్పారు .’’ఉత్తర కాండ ‘’పేరుతొ సంక్షిప్త సరళ  వచన రచన చేశారు .,రామాయణ౦ లో ఇంతటి విశేష కృషి చేసిన శాస్త్రిగారు భాగవతం వైపుకు దృష్టిని మరల్చి’’ భాగవత రసాయనాన్ని’’ కడుపార గ్రోలమని అందించారు .తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బ్రహ్మ వైవర్త పురాణానువాదం చేసి  లోకోపకారం చేశారు  ఆది శంకరాచార్యులవారు  రాసిన అయిదు ప్రకరణాలు ,అపరోక్షానుభూతి 2.ఆత్మా బోధ  ను తెలుగు చేశారు .శతక సాహిత్యం లోనూ ప్రవేశించి ‘’శంభూ శతకం ‘’రాశారు .

మాఘమహాకవి సంస్కృతం లో రచించిన ‘’శిశుపాల వధ ‘’కావ్యం లోని అమూల్యమైన విశేషాలను రసజ్ఞులకు పరిచయం చేయాలన్న సత్ సంకల్పం తో ‘’మాఘ కావ్యామృతం ‘’రచించారు .వివిధ పత్రికలలో ప్రచురితమైనవి, ,జాతీయ సదస్సులలో సమర్పింపబడిన పత్రాల వ్యాసాలను ‘’భారద్వాజ వ్యాసావళి ‘’గా ప్రచురించారు .వీరి పుస్తకాలను కొన్నిటిని కరీం నగర్ జిల్లా మందని లోని ‘’శ్రీ సీతారామ సేవా సదన్ ‘’వారు సభక్తికంగా ప్రచురించి  అందించారు .

అందుకొన్న బిరుదులూ సత్కారాలు

వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ‘’ ఆచార్య సార్వ భౌమ ,విజ్ఞాన వివేక భూషణ ,వాణీ విభూషణ ,ఆధ్యాత్మిక రత్న ,వాజ్మయ కళా ప్రపూర్ణ ,సాహితీ కళా సమ్రాట్ ,ఆంద్ర రత్న’’ బిరుదులు  అందుకొన్నారు .ఇవన్నీ అన్వర్ధాలే నని మనకు తెలిసిన విషయమే .

నడిచే సరస్వతి అనిపించే శాస్త్రిగారికి విశాఖ పట్నం శ్రీ శంకర మఠం సంస్థానం ‘’సువర్ణ సింహ లలాటం ‘’తో సత్కరించి సన్మానించింది .శ్రీ గణపతి సచ్చిదానంద  స్వామి వారి స్వహస్తాలనుండి ‘’సువర్ణ కంకణ సన్మానం ‘’అందుకొన్నారు .సద్గురు శ్రీ కందుకూరు శివానందుల సంస్థ నుండి ‘’శ్రీ శివానంద ఎమినేంట్ సిటిజెన్ పురస్కారం ‘’అందుకున్న పుంభావ సరస్వతులు శాస్త్రిగారు .వివిధ సాహిత్య ఆధ్యాత్మిక సంస్థలు విశిస్టవ్యక్తులు శాస్త్రి గారికి చేసిన సత్కారాలు లెక్కకు మించి ఉన్నాయి .

73 వసంతాల శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు  సాహిత్య ,ఆధ్యాత్మిక విషయాలలో నిత్య యవ్వనులై వాజ్మయ  శారదా పీఠ పాదార్చన చేస్తున్న ధన్య జీవులు  .

మనవి –సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )గారి బావ గారు డా శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం డి .గారు(విశాఖ పట్నం) ‘’ఆచార్య సార్వ భౌమ’’ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి సరసభారతి ప్రచురించిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’ గ్రంధాన్ని పంపగా వారు అందుకొని నాకు వారు రచించిన అమూల్య గ్రంధాలను ఏడింటిని  పంపారు .వారికి నేను వెంటనే ఫోన్ చేసి క్రుతజ్ఞాత తెలియ జేశాను .నేను చేసిన కృషిని వారు అభినందించారు

శాస్త్రి గారు సంస్కృతం లో గ్రంధ రచన చేశారని ఈ పుస్తకాలు వచ్చేదాకా నాకు తెలియక పోవటం నా అజ్ఞానానికి ప్రతీక .తెలిసిఉంటే’’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’లో వారిని గురించి రాసి ఉండేవాడిని  . పుస్తకాలు అందగానే ఫ్లాష్ గా  ‘’గీర్వాణకవుల కవితా గీర్వాణం -2 ‘’రాస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి , అందులో సుబ్రహ్మణ్య శాస్త్రి గారినే తొలికవిగా రాయాలని అనుకోని వారి గ్రందాలనుండే విషయ సేకరణ చేసి ఈ మొదటి ఎపిసోడ్ రాశాను .

శ్రీ గోపాలకృష్ణ గారు వారం క్రితం నాకు పంపిన కృష్ణమాచార్ ఆంగ్లం లో రాసిన సంస్కృత  కవుల చరిత్ర లో ఇంకా ఎవరైనా కవులు మిగిలిపోతే వారిపై కూడా రాస్తూ ,మరెవరైనా గీర్వాణ రచన చేసిన వారుంటే వారిపైనా  రాసి  ఈ రెండవ  భాగం లో చేర్చాలని  సంకల్పం .

శాస్త్రిగారి ఫోటో జత చేశాను చూడండి

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -14-5-15- ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.