విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -4
శాస్త్రిగారి అఖండ పరిశోధనా చాతుర్యం –లింగం గారి రాజశేఖర చరిత్రము పై ఖండనం
బ్రహ్మయ్య శాస్త్రిగారి పరిశోధనా చాతుర్యం అఖండమైనది .శాస్త్రిగారి మొదటి విమర్శ వీరేశలింగం గారి ‘’రాజ శేఖర చరిత్రము ‘’పై రాశారు .ఎంత లోతుగా చర్చించి రాశారో తెలుసుకొంటే అమితాశ్చర్యమేస్తుంది .అందులో రెండు ఉదాహరణలు మాత్రమే చూద్దాం .లింగం గారు రాజ శేఖరుని ఇంటిని చాలా విపులంగా వర్ణించారు .అలా వర్ణించినట్లు ఇల్లు కట్టటం అసాధ్యం అని శాస్త్రిగారు యుక్తి యుక్తం గా నిరూపించారు .రాజశేఖరం మంచి ముహూర్తం లో బయల్దేరినా దొంగల బారిన పడ్డారని కందుకూరి రాశారు .శాస్త్రిగారు రాజశేఖరుడు ప్రయాణానికి బయల్దేరిన ముహూర్తాన్ని జ్యోతిశ్శాస్త్ర బలం తో పరిశీలించారు .ఆ ముహూర్తం ‘’చోర పంచకం ‘’లో పడిందని శాస్త్రిగారు తేల్చి చెప్పారు .కనుక దొంగల బాధ ఈ ముహూర్తానికి తప్పదు అన్నారు .జ్యోతిశ్శాస్త్రం ఎంత శాస్త్ర సమ్మతమో వీరేశలింగం గారే రుజువు చేసి చెప్పారని దానికి ఈ ఉదాహరణమే చాలునని అన్నారు .ఈ విమర్శను ‘’వివేక చంద్రికా విమర్శనం ‘’పేర 1896లో ప్రచురించారు ‘’.రాజ శేఖర చరిత్రము మిక్కిలి రసహీనమైన కావ్యాభాసము .దీనిని వచనకావ్య రచనకు ఉదాహరణ గ్రంధంగా పేర్కొనటం కావ్య కళకు హాని .కనుక కావ్య కళాద్రుష్టిలో చూసి సారస్వతాభి వృద్ధికోసం దీనిపై ఖండనం రాయాల్సి వచ్చింది ‘’అని శాస్త్రిగారి అభిప్రాయం .అంతేకాదు ఈ పుస్తకం లో సంఘం పరమ మూర్ఖమైనదిగా ,వంచన మాత్రమె ప్రాధాన గుణం కలదిగా పంతులుగారు ఇతరుల మెప్పుకోసం రాశారని ఎండ గట్టారు .స్వదేశస్తుడే స్వసంఘాన్ని ఇంత నీచమైనదానిగా వర్ణించటం దారుణం అన్నారు .మనజాతిని హీనమైన దానిగా చూడటానికి ఎప్పుడూ ప్రయత్నించే క్రైస్తవ మిషనరీలు దీనిని ఇంగ్లీషులోకిఇంగ్లాండు లో అనువాదం చేయించుకొన్నారు దీనిపై పాశ్చాశ్చ పండితులు .’’written by a native gentleman of refinement and education ,the book is fine ,and invaluable as an important study of native character as seen by native eyes ‘’He tilts the astounding guillibility and the un fathomable deceit of native character ‘’అని రాశారు .దీన్ని చదివిన ప్రతి పాశ్చాశ్చ పండితుడు ఇండియా వచ్చి ఎంతహీనం గా మనల్ని చూస్తారో అని బాధపడ్డారు శాస్త్రిగారు .దేశాభిమానులైన శాస్త్రిగారు అందుకే ఖండనం రాయవలసివచ్చింది .ఉత్తమ ఆశయం లేకుండా శాస్త్రిగారు ఏ గ్రంధం పైనా ఖండనం రాయనే లేదు .శాస్త్రిగారు ఏది రాసినా యుక్తి యుక్తంగా ,సమగ్రంగా సరసంగానే ఉంటుంది .దీన్ని బట్టి ఉత్తమ కావ్యం ఎలా ఉండాలో శాస్త్రి గారు నిరూపించారు .పంతులుగారి కలం ప్రతి వారిమీద విమర్శ తో విరుచుకు పడుతున్నకాలం లోనే శాస్త్రి గారు ఖండనం రాశారు .అంతటి ధీశాలి శాస్త్రిగారు .శాస్త్రిగారి ఖండనానికి వీరేశ లింగం గారుకాని ఆయన శిష్యులు కాని ప్రతి విమర్శ రాయకపోవటం ఆశ్చర్యమే. అంటే శాస్త్రి గారి వాదం ఎంత సమర్ధనీయమో అర్ధమవుతోంది .
ఆ తర్వాత కొన్నేళ్ళకు శ్రీ రాయసం వెంకట శివుడు గారు వీరేశలింగం గారికి ‘’మీ రాజశేఖర చరిత్రము లో రాజశేఖరుని గృహ వర్ణన తప్పుగా ఉందని ఒకాయన రాశాడు దానికి మీ సమాధానం ఏమిటి ?’’అని ఉత్తరం రాశారని దానికి కందుకూరి వారు తమ ఇంటినే రాజశేఖరుని ఇల్లుగా వర్ణించా మని నవ్వుతూ సమాధానం చెప్పారని వెంకట శివుడు ప్రకటించారట .కాని ఇదీ తప్పేనంటున్నారు .వీరేశ లింగం గారింటికి రాజ శేఖరం గారింటికి చాలా భేదం ఉందని రాజశేఖరం గారి ఇంటిపై మేడ లేదని ,వీరేశలింగం గారింటిపై మేడ ఉందని తేల్చారు .కనుక శాస్త్రి గారు రాసిందే యదార్ధం అని తేల్చారు పండితులు .
వెంకట శివుడుగారు శాస్త్రి గారి విమర్శకు ప్రతి విమర్శ ఏదో రకంగా రాసినా అందులో శాస్త్రి గారి పేరు పేర్కొనలేదు ప్రతి విమర్శకు పేరుకూడా పెట్టలేదు .తాను శాస్త్రిగారి పేరు ఎత్తితే ఆయన ఖ్యాతి పెరుగు తుంది కనుక దానిజోలికి పోలేదని శివుడు గారు దాటేశారు .శాస్త్రి గారికి పేరు రాకుండా చేయటానికి సంస్కరణ వాదులం అని చెప్పుకొనే వారు విశ్వ ప్రయత్నం చేసినా శాస్త్రిగారి ప్రతిభా సూర్య ప్రతాపాన్ని వారి అరచేతి తో ఆపలేకపోయారు. ఇది శాస్త్రి గారి గొప్ప నైతిక విజయం .
శ్రీ కొమర్రాజు లక్ష్మణ రావు గారు చిత్రాడ సభలో సారస్వత పరి శోధన గూర్చి ముచ్చటిస్తూ శాస్త్రిగారు సారస్వత విషయం లో విశేషం గా కృషి చేస్తున్నారని ప్రస్తుతించారు .శ్రీ దుగ్గిరాల సూర్య ప్రకాశ రావు పంతులుగారు ‘’న్యు ఇండియా ‘’అనే పేపరులో శాస్త్రి గారి సాహిత్య సేవను గూర్చి రాసి మెచ్చుకొన్నారు. కొవ్వూరులో శాస్త్రి గారికి ఘన సన్మానం జరిగింది .శ్రీ చిలుకూరి వీర భద్ర రావు గారు పాల్గొని తమకు శాస్త్రిగారికి కొన్ని అభిప్రాయ భేదాలున్నా ,శాస్త్రిగారి దేశ సేవ నిరుపమానమై నాదని ,అందుకే ఈ సన్మాన సభలో ఆనందంగా పాల్గోన్నానని చెప్పారు .శాస్త్రి గారికి చేసే సన్మానం ఆంద్ర దేశానికి చేస్తున్న సన్మానం అన్నారు చిలుకూరి వారు .సంస్కార వాదులు కూడా నెమ్మది నెమ్మదిగా శాస్త్రిగారినే సమర్ధిస్తూ వచ్చారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-15 –ఉయ్యూరు
అయ్యా, నమస్కారం. నేను ‘నాయన’ పుస్తకం చదివు ఉన్నాను. వారి మీద మీ వ్యాసం కూడా చదివాను. ‘భారత చరిత్ర పరీక్ష’ అనే పుస్తకం మీరు చదివారని తెలిపారు. సంతోషం. ఆ పుస్తకాన్ని ఎవరు ప్రచురించారు? అది ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? నాకు చదవాలని ఉంది. వివరాలు తెలుప ప్రార్ధన. ధన్యవాదములు. —– వెంకోరా.
ధన్యవాదాలు ఆపుస్తకం రాసింది కావ్యకంఠ గణపతి శాస్త్రిగారే ఆ గ్రంధం తిరువన్నామలై రామణాశ్రమమం పుస్తక విక్రయ కేంద్రం లో దొరక వచ్చు -ప్రయత్నించండి -దుర్గాప్రసాద్
ధన్యవాదములు. —– వెంకోరా.