డా.శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర గారి ‘’పాఠం’’
తమిళనాడు లో మద్రాస్ నగర జీవితానికి అలవాటుపడి హిందీ లో ఏం ఏ పి హెచ్ డి చేసి, పాలిటెక్నిక్ డిప్లోమో పొంది ,చెన్నై లో కేంద్ర ప్రభుత్వోద్యోగిగా ఉంటూ శతకాలు కవితా సంపుటులు హిందీ వ్యాస సంపుటి ప్రచురించి ,’’జనని’’ పత్రికా సంపాదకత్వం వహించి కార్య దర్శియై ‘’నాగ భైరవ పురస్కారం’’ వంటి అపూర్వ పురస్కారాలు గ్రహించి ‘’షార్ట్ అండ్ స్మార్ట్ ‘’కవితా సంపుటి ‘’పాఠం’’వెలువరించిన డా . శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర నా అడ్రస్ ఇంటర్నెట్ లో చూసి ,రమ్య భారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ గారు కూడా చెప్పగా ఆపుస్తకాన్ని అత్యంత ఆదరం తో నాకు పంపటం నిన్ననే దాన్ని ఆసాంతం చదవటం రాత్రి వారి తో ఫోన్ లో సంభాషించటం జరిగింది .చిక్కని చక్కని కవిత్వం తో అలరించారు .ఉప్పలధడియం అనగానే మహానటులు చిత్తూరు వి. అంటే ఉప్పల దడియం నాగయ్య గారు జ్ఞప్తికి వచ్చారు .వారికీ వీరికీ బంధుత్వం ఉందొ లేదో తెలీడు కాని నాగయ్యగారిదీ చిత్తూరు జిల్లాయే వీరి జననమూ ఆ జిల్లాలోనే . .
‘’పాఠం ‘’కవితలు నిజం గా అందరికీ పాఠాలునేర్పేవిగా నే ఉన్నాయి .ఇందులో మద్రాస్ నగరాన్ని ఎన్నో కోణాలలో ఆవిష్కరించారు డాక్టర్ గారు .పఠాభి అలానే రాశాడని జ్ఞాపకం .మళ్ళీ ఎవరైనా చెన్నై నగరాన్ని ఇలా రాశారో లేదో నాకు తెలియదు .కుందుర్తి నగరం లో వాన కూడా మదిలో మెదిలింది .ముందుగా కవి నగర వర్ణన గురించి తెలుసుకొందాం .’’నిర్నిద్ర నగర౦ ‘’కవితలో ‘’ఒంటరి నగరానికి –ఒంటి కంటి నిద్రే –ఆమాటకొస్తే మెలకువ కూడా ఒట్టి పర్రే’’అని నగర నిజాన్ని తెలిపారు .’’పాలపాకేట్టు ఒలికినట్లు తెల్లారి పోయిందట ‘’ గొప్ప ప్రయోగం .’’నగరం పై ప్రేమ గీతం ‘’వినిపిస్తూ ‘’ఒక స్వప్నం లోకి –ఒకానొక స్మ్రుతి లోకి –ఏక కాలం లో మేల్కొలిపే ఇంద్రజాలం ‘’గా నగరం కనిపించింది .నగరం లో వెలుగుకన్నా’’ చీకటి పొరలు ఎక్కువే ‘’ అయినా ‘’అదొక చైతన్య దీప్తి –ముందుకు నడిపించే మహా చోదక శక్తి ‘’అని పించింది .కవికి చెన్నై నగరం ‘’ఆ జన్మ సాహచర్యం ‘’అందుకే తనది అనుకొంటారు . నగరం అణువణువునా ఆయనలో అల్లుకొనే ఉంది .అన్నిపొరలు ఎలా ఎర్పడ్డాయోననే ఆశ్చర్యం ఉన్నా ‘’అనుభవం వేరు కదా !’’అన్నారు .చెన్నైలోని ప్రముఖ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థలతో కవికి అనుబంధం ఎక్కువ .’’అంశం ఏదైతేనేం వక్త ఎవరైతేనేం –అందరి హృదయాల్లో ప్రవహిస్తుంది –ఆర్ద్రంగా మన తెలుగు గంగ ,’’అని అదొక అమృత తరంగ అని ఫినిషింగ్ టచ్ ఇస్తారు .బహుశా తెలుగు సభలపై ఇంత భావుకతో అనుభూతితో రాసిన కవిత లేదేమో ?బయట చీకట్లు అల్లు కొంటుంటే ‘’లోపల సాహితీ వెన్నెల కురుస్తుంది ‘’’అని సాయంత్రాలు కళా కాంతు లీనుతూ రాత్రిగా పరావర్తనం చెందడం అద్భుతమని పిస్తు౦ది కవిగారికే కాదు మనకూ .
‘’వేసవిలో నగరం’’ రోడ్లన్నీ తారుని స్రవిస్తాయి .ఆకాశ హర్మ్యాలు కడలిగాలిని కట్టడి చేయగా ఊపిరాడక ఇబ్బంది .నీడ అక్కడ ఎండమావే అనటం మంచిప్రయోగం మాత్రమేకాదు కాంక్రీట్ అరణ్యాల విస్తరణ ఫలితం కూడా .’’మిట్ట మధ్యాహ్నం వేళ’’సలసల కాగే నూనె నెత్తిన కుమ్మరిస్తున్నట్లు ఎండ కాస్తోంది .కాలికింద నేల బుసబుసా వేడి ఆవిర్లు చిమ్ముతోంది .గదిలో పంఖా సెగలు కక్కుతోంది –ఇంటా బయటా అగ్ని గుండమే ‘’ఈ బాధ భరించలేక ఎవరిని నిందించాలో తెలీక నిస్సహాయం గా స్వేద ధారగా కరిగి పోవటమే జీవితం ‘’..ఎండ ఇ౦త మడిస్తుంటే మరి వర్షాకాలం ?’’వానకు నగరం అతలాకుతలమై ‘’బంగాళాఖాతం పాయలై పారుతున్నట్లు ‘’వీధులన్నీ నీళ్ళ మయం .దీనికి తోడు’’ విస్పోటన సంరంభం ‘’తో వీచేగాలి కి నగరం నిలువెల్లా గజగజ .మట్టినీ చెట్టునీ మింగేసిందిట మహా నగరం .యెంత ఎండ అయినా భరిస్తారు కాని జనం నాలుగు వానచినుకులకే అల్లాడి పోవటం విడ్డూరం .మానవ ప్రక్రుతి అది .అంతే .
మద్రాస్ మెరీనా బీచ్ సాయంత్రాన్ని రాత్రిగా మారుస్తుందట. స్థలకాల స్పృహే లేని మహా సౌందర్యం లో లీనం చేస్తుందట .మహానగర సోకు పైపైన కనిపించే డాబు .కాలువలు పూడ్చి కట్టిన హర్మ్యాలు .మనో వేగంగా వాహనాలు .జడివానకు రోడ్లూ ఇళ్ళూ ఏకం .హోరుగాలికి చెట్లు దుంగలే అవుతాయి భరోసా లేని జీవితం ఇది .నగరంపై ‘’ఎప్పుడూ ఎగురుతుంది పదో అంకె ప్రమాద సూచిక –కనిపించీ కనిపించ కుండా ‘’ఇవన్నీ వెంకటేశ్వర గారి స్వీయ అనుభూతులే అవి కవితామృతం మారి మనకు ,సాహిత్యానికి అమరత్వం కల్పిస్తున్నాయి .ఏ కవితలో చూసినా పదాలు వాటంతటికి అవి వచ్చి చేరి కూర్చుని సార్ధక మయినట్లు ,భావానికి తగిన శబ్దం తన విలువను నిరూపించుకోన్నట్లు కనిపిస్తుంది .రస సిద్దుడైన కవి మనకు ప్రత్యక్ష మౌతాడు.
కవిగారు కొన్ని ప్రదేశాలను చూసి అక్కడిఅనుభూతులనూ కవితలలో అందంగా అమర్చారు .అవీ చాలా సార్ధకమై విలువను పొందాయి .అస్సాం లోని గౌహతికి వెళ్తే హోటల్ గది ‘’నిరుపహతి స్థలం ‘’గా పెద్దనగారికి లాగా అనిపించింది .’’ఎన్ని నక్షత్రాల హోటలైనా ఇల్లు అవదు అని ఎరుక కలిగింది .ఇంటిమీది జ్ఞాపకాలతో రాత్రి దహించిపోయింది . బ్రహ్మ పుత్ర నది మహా మాయలాడి –బతికించిన మనుష్యులనే బలి గొంటుంది .అలాంటి నదిలో పడవ ప్రయాణంచేయాలి ప్రాణాలు అర చేత బట్టుకొని ‘’కామాఖ్యమ్మ ‘’పై భారం వేసి . ఇక్కడే ‘’చూస్తుండగానే ‘’కవితలోపడవలో చీకటి వేళ ఇంటికి వెడుతున్న మిత్రుడు-‘’క్షితిజ రేఖ కేసి బ్రాహ్మ పుత్ర ప్రవహిస్తుంటే చీకట్లో ఉవ్వెత్తున కెరటం ఎగిసి పడి కళ్ళల్లో గుచ్చుకొంది ‘’అని చెప్పారు .అంటే స్నేహితుడు జలసమాధి చెందాడని అంతరార్ధం . ‘’మదనపల్లి ‘’చుక్క రాల్చని నింగి –నెర్రవారిన నేలా ‘’కుమ్మక్కు అయినట్లుగా ఉందట .ఆశ ఆవిరై కళ్ళు శూన్యాన్ని వరిస్తే కాళ్ళు సరిహద్దుల్ని పునర్లిఖిస్తున్నట్లుంది .’’హంపి ‘’లో రాగ ఝారి ప్రవహించింది .ఒకసారి పురావైభావం గుర్తొచ్చి ‘’గాలి వేళ్ళు అలల తీగల్ని మీటు తుంటే –ఏ వసంతోత్సవం లోనో ‘’అక్కడ పద్యం చదివిన గుర్తు .’’తల కోన ‘’అందాలనూ వొడిసి పట్టారుకవి .’’పచ్చని చీరలో –కొత్త పెళ్లి కూతురులా కొండ మెరిసి పోతోంది ‘’ట .జలపాతం వెండి తోరణం లా వేలాడుటూ రాతి తబలాల పై మూర్చనలు పోతోంది ‘’ట .మహా గొప్ప భావ చిత్రం .’’పాండిచ్చేరి ‘’లో జాలరి సాహసి .బుల్లిపోట్ట కోసం సాహసమే శస్త్రం గా ,నమ్మకమే కవచం గా ‘’సముద్ర యుద్ధం చేస్తాడు .అనుకోకుండా కడలి కాల సర్పమై బుస కొడితే క్షణమొక యుగమే అతనికి .ఎలాగోఅలా గట్టెక్కితే ‘’ గట్టవతల తిమింగిలాలు ‘’గుటుక్కున మింగేస్తాయి ‘’అని దళారీ సామ్రాజ్యపు తిమింగిల కోరల్లో నలిగిపోతున్న జాలర్ల బతుకుని చక్కగా ఆవిష్కరించారు .’’మైసూరు ప్రయాణం లో పదనిసలు ‘’లో బట్టలకు బదులు పుస్తకాలే సర్డుకొన్న అక్షర జీవిగా కవి కనిపిస్తాడు .పుస్తకం తెరిస్తే లోకమే కనిపించదు. భార్య ఫోన్ చేసి బట్టలు కొనుక్కోమనే దాకా .’’హార్స్లీ కొండలు ‘’అక్కడే ఉండిపొమ్మంటాయిట.నీళ్ళూ చీకటి రాహు కేతువుల్లా సూర్యుడిని మింగుతుంటే కొండను మోసుకొని వెనుదిరుగుతాడటకవి ..బెంగళూరు నగరం లో స్నేహితులతో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన కవి పెళ్ళయ్యాక ‘’ఒక్క బంధం కోసం ఎన్నో బంధాలు కోల్పోయాను ‘’అని మధన పడతారు .’’కొడైకెనాల్’’ లో తాను ఒంటరిని కాదని చెట్లూ పూలు వాగులూ తన నేస్తాలేనని భావించారు .తిరునల్వేలి పై ‘’ఖాళీ ‘’కవితలో ‘’గదిలో గోడగడియారం ‘’అవే అంకెల చుట్టూ పదే పదే తిరుగుతున్నట్లని పించింది .గది ఖాళీ చేస్తే గణాంక పుస్తకం మినహా మరేమీ మిగలదు ‘’అన్నారు .’’అరకు ‘’లోనిగిరిజన తండాను చూసిన కవిగారి పిల్లలు అక్కడ వారు వాడే చింకి చాప , మట్టికుండా , రుబ్బు రోలు ,పూరిపాక చూసి అవి ఎవరివి అని అడిగితె ‘’మనవేరా కన్నా ! మన పూర్వీకులవి ‘’అని మాయ మాట చెప్పి ఆ గిరిజన దీన స్తితిని మనకళ్ళ ముందుంచారు కవి .
మిగిలిన కవితల గురించి ఈ సారి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-6-15 ఉయ్యూరు

