|
వరంగల్, జున్ 10: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మానవతావాది సద్గురు శివానందమూర్తి(87) శివైక్యం పొందారు. ఎండవేడిమిని తట్టుకోలేక నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లాలో ములుగురోడ్డులోని గురుధామంలో తుదిశ్వాస విడిచారు. డిసెంబర్ 21, 1928న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శివానందమూర్తి జన్మించారు.
సంస్కృతీ, సంప్రదాయాలపై శివానందమూర్తి పలు పుస్తకాలను రచించారు. హిందూవివాహ వ్యవస్థ, మహర్షుల చరిత్ర, గౌతమబుద్ధ ఆయన ప్రముఖ రచనలు. శివానంద కల్చరల్ ట్రస్ట్, ఆంధ్రా మ్యూజిక్ అకాడమీ స్థాపించి కళాకారులకు ఎనలేని సేవలను అందించారు.
ఆయన సేవలను గుర్తించిన ఆంధ్రా యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. విశాఖ జిల్లా భీమిలిలో ఆనందవనం పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నారు. శివానందమూర్తి రచించిన కఠయోగా అనే పుస్తకం కంచిపీఠం పరమాచార్య, శృంగేరి శంకరాచార్యల మన్ననలను పొందింది. సన్యాసులు సహా అందరూ ప్రజా సంక్షేమానికి సంరక్షకులుగా తమవంతు కర్తవ్యం నిర్వర్తించాలని శివానందమూర్తి తన ప్రసంగాల్లో తరచూ చెబుతుండేవారు.
శివానంద అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయన కుమారుడికి ఫోన్ చేసి సద్గురు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శివానంద మూర్తికి దేశవిదేశాల్లో లక్షలాది మంది అభిమానులు, శిష్యులు ఉన్నారు. శివానందమూర్తి మృతిపట్ల పలువురు పీఠాధిపతులు విచారం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం గురుధామంలో శివానందమూర్తి అంత్యక్రియలు జరుగనున్నాయి. శివానందమూర్తి మృతి పట్ల ఆయన అభిమానులు, శిష్యులు విచారం వ్యక్తం చేశారు.
|

