మనీ‘షి’
- 14/06/2015
- -అడుసుమల్లి మల్లికార్జున
|

కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన రచన
***
ఓం
భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యమ్
భర్గో దేవశ్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్!’
ధ్యానం ముగించుకుని గాయత్రి మంత్రం స్మరిస్తూ – తలుపు తీశాను. ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ రాముడు.
‘ఒరే రాముడూ!’ ఆనందంతో బిగ్గరగా కేక వేశాను.
‘అంత బిగ్గరగా అరవకు. ఎక్కడో సీతమ్మ దగ్గరున్న రాముడు కంగారుపడి పరుగెత్తుకొచ్చేను’ అంటూ నవ్వుతూ లోపలికి వచ్చాడు రాముడు అని నేను పిలిచే రామచంద్రయ్య. చిన్ననాటి నుంచి వదలకుండా ఇంకా మిగిలి వున్న ఏకైక నేస్తం.
‘పద్మ ఎప్పుడు వస్తుందిరా?’
‘నిన్ననే కదరా వెళ్లింది. వాళ్ల తమ్ముడు కూతురు సంబంధం విషయమై వెళ్లింది. రెండు మూడు రోజులు పడుతుంది’ అన్నాను.
‘ఈ మూడ్రోజులు బతుకు పో’ అందా?’
‘మరి? ఆడాళ్లు అప్పుడప్పుడు అలా వెళ్లకపోతే మగాళ్లు చచ్చిపోరట్రా’
మా ఆఫీసులో ఈ మధ్య ఓ జోకు –
సుబ్బారావని అటెండరు. ఈ మధ్య ‘హార్ట్ స్ట్రోక్’ వచ్చింది. ఏమయ్యా! నీకు షుగర్ లేదు. బి.పి. లేదు. ఎందుకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందయ్యా అని డాక్టర్ అడిగారట. ‘్భర్య వుందిగా’ అన్నాడట మెత్తగా. డాక్టర్ తేరిపార చూసి ‘నిజమేనయ్యా! ఆ విషయం మర్చిపోయా’ అన్నాడట అంతకంటె మెల్లిగా.
ఇద్దరం భలే నవ్వుకున్నాం. వాడుంటేనే ‘్భలే’ అనే పదానికి అర్థం.
‘నేను స్నానం, ధ్యానం ముగించుకుని వస్తాను. అంతవరకు వీటి జోలికెళ్లకు’ అంటూ నాలుగు పొట్లాలు టేబుల్ మీద పెట్టాడు.
‘ఏమిటివి?’
‘వస్తూ వస్తూ
కనుక్కున్నాను. శీనయ్య హోటల్‌లో ఇడ్లీ, పెసరట్టు ఉప్మా బావుంటాయని తెలిసింది. అవే ఇవి’ అంటూ టవల్ అందుకున్నాడు.
నేను నోరు తెరుచుకుని చూస్తూండిపోయాను.
నేను బాపట్ల వచ్చి నాలుగైదు నెలలు. ఆ శీనయ్య హోటలు సంగతి నాకింతవరకు తెలీదు. వీడు అడుగుపెట్టింది ఈ రోజే. ఇప్పుడే కాదు వాడు ఎప్పుడూ అంతే. ఏదైనా టూర్ వెళ్లినపుడు – మేమంతా పట్టించుకోని విషయాలు, అతి చిన్న విషయాలు వాడికి తెలిసిపోయేవి. ఏదైనా ఊరు వెళ్లి వస్తే ఆ ఊరు ఆహార వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పేస్తాడు. ఈనాటికి వాడికి ఆ ‘ఉత్సుకత’ తగ్గలేదు. అడిగితే ఏమనుకుంటారో అనే ‘్భతి’ నాకూ తగ్గలేదు.
రాముడు వాళ్ల నాన్నగారు మిలట్రీ ఆఫీసర్. కాళ్లకు చెప్పుల్లేకుండా మేము హైస్కూలు వెళ్తున్నపుడు – వీడు టై, టక్, బూట్లతో ప్రత్యక్షమయ్యేడు. అందరూ ‘సిటీ బాయ్’ అన్నారు. వాడి చదువు కూడా అట్లాంటి చోటే సాగింది. వాడి దగ్గరకు వెళ్లాలంటే అందరికీ బెరుకు. తను మాత్రం అందరితో ఫ్రీగా వుండేవాడు. నాతో మరింత దగ్గరగా వచ్చేవాడు. అలా ఆనాటి నుంచి మంచి స్నేహం.
చాలా సున్నితమైన విషయాలు కూడా నాకు చెప్పేవాడు.
పైట చూసి ఆమడ దూరం పరుగెత్తే వయసులో తను మాత్రం మగ పిల్లలతో మాట్లాడినంత మామూలుగా వాళ్లతో మాట్లాడేవాడు. వాళ్లూ హాయిగా మాట్లాడేవాళ్లు.
చిత్రం చూడండి.
చూట్టానికి అలా వుంటారుగాని
ఆడాళ్లు – భలే వాళ్లు.
రాముడంటే చాలామంది అమ్మాయిలు ఇష్టపడేవాళ్లు. జీవితమంతా అలాగే ఆడుతూ పాడుతూ గడిపేశాడు. అందుకే నేను ‘ఒరే రాముడు – కాదు కృష్ణుడు’ అనేవాణ్ని.
ఉదయానే్న ధ్యానం చేస్తాడు. గాయత్రి మంత్రం జపిస్తాడు. సాయంకాలం ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు వెళ్తాడు. రాత్రి ‘బోట్స్ క్లబ్’కెళ్లి సరదాగా గడిపేస్తాడు. ‘దేనికదే’ అంటాడు. అందరూ అలా జీవించలేరు. ఏదో బ్రతుకీడుస్తూ ఉంటారు. ఆ ఆనందాన్ని, అదృష్టాన్ని చూసి విధి కుళ్లుకుంది. హాయిగా విశ్రాంతి తీసుకునే వయసులో భార్య చనిపోయింది.
ఒక కొడుకు, కూతురు – ముచ్చటైన సంసారం. కొడుకు ఏరోస్పేస్ ఇంజనీర్‌గా బ్రిస్టల్‌లో వుంటున్నాడు. వాడికి పెళ్లి చేశాడు. కూతురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. చిన్న యాక్సిడెంట్‌లో భార్య చనిపోయింది. నేనూ, పద్మా వెళ్లి వారం రోజులు అక్కడే వుండి వచ్చాం. ఎన్ని వున్నా ఇల్లాలు లేని లోటు ఎవరు తీర్చగలరు.
రాముడు ప్రాక్టికల్ మనిషి. రాత్రులు చందమామను చూసి కలలు కనవచ్చు. పగలు అది తల్చుకుని పని పాడు చేసుకోకూడదు – అనే మనస్తత్వం. త్వరలోనే కోలుకున్నాడు. ఉద్యోగరీత్యా నేను ఎన్ని ఊళ్లు తిరుగుతున్నా ‘కావలి కబుర్లు’ వాడి ద్వారా ఎప్పటికప్పుడు తెలిసేవి. నిజంగా తెలిసీ తెలియని యవ్వనం ఎంత మధురం. ఎప్పుడు తలుచుకున్నా పెదవులు సుతారంగా విచ్చుకుంటాయి.
ఇంతలో రాముడు వచ్చాడు.
‘్ధ్యనం ఎంత మంచి అలవాటు. మనసు ప్రశాంతంగా ఉంటుందిరా’
‘నిజమే రాముడు. దాని ప్రభావం తప్పక కనిపిస్తుంది’
‘నిన్ను చూసేరా.. ఈ ధ్యానం, గాయత్రి మంత్రం అలవాటైతే.. మంచి అలవాటైనా – వదలటం కష్టం’ అంటూ నవ్వాడు.
‘అవున్రా! నాకే తెలీదు. ఈ ఉప్మా పెసరట్టు సంగతి’
‘నీ తలకాయ్.. నువ్వు బైట తింటే కదా తెలిసేది. బాపట్ల ఎట్లా ఉంది? ఈ ఊరు స్పెషల్ ఏమిటి?’
టిఫిన్ తింటూ కబుర్లలో పడ్డాం.
‘మన కావలి, బాపట్ల ఒకలా ఉంటాయిరా. సముద్ర తీరానికి పది కిలోమీటర్లలోపు. మనకు రాతి నేల. ఇక్కడ ఇసుక నేల. మల్లెపువ్వులు, ఆకు కూరలు కావాలంటే మాత్రం బాపట్లేరా’
‘ఆహా! మల్లెపూలు ఉంటే ఆడాళ్లెందుకురా!’ అన్నాడు కొంటెగా నవ్వుతూ.
‘పువ్వులు పెట్టుకోటానికి’ అన్నాను నవ్వుతూ.
‘ఓహో! మర్చిపోయాను’
* * *
రాముడు తీరిగ్గా అసలు విషయం బైటపెట్టేడు.
‘చందన సంబంధం విషయం వచ్చాన్రా. బాపట్లలో ప్రసాదరావుగారని. వాళ్లబ్బాయి ఐ.బి.ఎం.లో వున్నాడట. పాప కూడా హైదరాబాదే కాబట్టి – ఒకే ప్రొఫెషన్. అంతా అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అన్ని వివరాలు తెలుసుకుంటే బావుందనిపించింది. నువ్వూ ఇక్కడకే చేరావు. అదీ సంగతి’
‘చాలా ఆనందంగా ఉందిరా’
‘వచ్చిన పని పూర్తయితే కదా’
‘దానికేంరా. కుందనపు బొమ్మ. తప్పకుండా ఈ సంబంధం కుదురుతుంది. పద్మ వుంటే సంబరపడిపోయేది తెలుసా. చందన పెళ్లి తర్వాత నువ్వూ ఇక్కడకు వచ్చేయ్‌రా. ఒక్కడివి ఏం చేస్తావ్? అందరం కలిసే ఉందాం’
ఆ మాటతో రాముడి కళ్లు చెమ్మగిల్లాయి.
కాసేపు మాట్లాడలేదు.
‘నేను మనస్ఫూర్తిగా చెప్తున్నారా. మాకు ఎవరున్నారు? ఎవరి దారి వారిది. నేను పద్మ. మేము నీ గురించి అదే అనుకుంటూ ఉంటాం’
‘ఎప్పుడైనా పొరపాటున రాత్రి తొలి గంటలో మన ‘సెషన్’ చూసిందంటే – తర్వాత మంచి నీళ్లు కూడా పుట్టవు తెలుసా’ అంటూ నవ్వేశాడు.
‘సరే. ఎప్పుడు వెళ్దాం ప్రసాదరావుగారింటికి’ అడిగాను.
‘సాయంత్రం వెళ్దాం’
* * *
చల్లని సాయంకాలం
ఇద్దరం పటేల్‌నగర్‌లోని ప్రసాదరావు ఇంటికి వెళ్లాం. ఇంటి వాతావరణం చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంది. ముందు వైపు పూల మొక్కలు, జామ, ఉసిరి చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
మేము వెళ్లేసరికి ప్రసాదరావు గారు బైట మొక్కల మధ్య పడక కుర్చీలో కూచొని సంజీవదేవ్ ‘తెగని జ్ఞాపకాలు’ చదువుతున్నారు.
నన్ను పరిచయం చేసుకుని, రాముణ్ని పరిచయం చేశాను. కావలి నుంచి వచ్చాడని చెప్పగానే – ఆయనకు అర్థమైంది.
‘రండి రండి… చాలా సంతోషం. కృష్ణమూర్తిగారు చెప్పారు’ అని ఆప్యాయంగా పలకరించారు.
ఈ అపార్ట్‌మెంటు బతుకుల్లో ఏం కోల్పోతున్నామో, ప్రసాదరావు గారిల్లు చూస్తే తెలిసిపోతుంది.
ఆ మాటే అన్నాను.
‘ఈ క్రెడిట్ అంతా మా ఆవిడదే. పని చేసేది ఆవిడ. ఆస్వాదించేది నేను’ అన్నారు.
ఆయన కూడా సరదా మనిషే.
కుర్చీలు తెప్పించి ఆ మొక్కల మధ్య, చెట్ల నీడలో వేయించారు. తను లోనికెళ్లి వాళ్ల బాబు ఫొటోలు తెచ్చారు. చాలా బావున్నాడు. రాముడు కూడా వాళ్ల పాప ఫొటోలు చూపించాడు.
ఈడూ జోడూ ముచ్చటగా ఉంటుంది.
రాముడు అక్కడి వాతావరణం, ఆ ఇల్లు చూశాక కాస్త ఆలోచనలో పడ్డాడు. కొడుకు ‘బ్రిస్టల్’లో వున్నా, కూతురు ఉద్యోగం చేస్తున్నా ఆర్థికంగా పెద్ద పొజిషన్ కాదు. ఎంత చెట్టుకు అంత గాలి అన్న చందాన ఉంది. వాళ్లు కాస్త ఎక్కువలోనే ఉంటారు. అయినా వెళ్లిరా. దేవుడి దయ ఉంటే, రాసి పెట్టి ఉంటే అంతా సవ్యంగా జరుగుతుందని కృష్ణమూర్తిగారు చెప్పబట్టి వచ్చాడట.
నిజం చెప్పాలంటే అబ్బాయే అందంగా ఉన్నాడు. కుటుంబ పరంగా, ఆర్థికపరంగా చూసినా అన్ని విధాలా కాస్త ఎత్తులోనే ఉన్నారు ప్రసాదరావుగారు. ఇలాంటి విషయాలు వాళ్లు మాట్లాడుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. నేనే మొదలుపెట్టాను.
కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు – అన్నీ విడమరిచి చెప్పాను. నేను మాట్లాడినంతసేపు ప్రసాదరావు గారు చిరునవ్వుతో విన్నారు. చివరగా ఆయన అన్నారు.
‘కృష్ణమూర్తిగారు మాకు ఫ్యామిలీ ఫ్రెండు. రామచంద్రయ్య గారి గురించి పూర్తిగా చెప్పారు. నాకు చాలా సంతోషం కలిగింది. మా బాబు పెళ్లి విషయంలో వాళ్లమ్మ ఇష్టమే వాడిష్టం. నా మీద అంత నమ్మకం మరి’
మేము నవ్వాం.
తనూ నవ్వి-
‘నిజమండీ. నాకు మాత్రం అన్ని విధాలా నచ్చింది. ముఖ్యంగా రామచంద్రయ్యగారు, మీరు. మీ మాటలు, పాప, కుటుంబం – రాసిపెట్టి ఉంటే అంతే మరి’ అన్నారు.
నాకు తృప్తి కలిగింది.
రాముడి ముఖంలో కూడా కాంతి.
ఆడపిల్లకు పుట్టిల్లు కంటె అత్తారిల్లు ప్రాముఖ్యత ఎంతో ఉంది. జీవితాంతం వీడని అనుబంధం కదా.
ప్రసాదరావుగారిని చూసినా, వారి మాటలు విన్నా ఆడపిల్లల తండ్రులకు భయం తీరిపోతుంది.
మమ్మల్ని తీసుకెళ్లి తన మినీ లైబ్రరీ చూపించారు.
కృష్ణశాస్ర్తీ, చలం, బుచ్చిబాబులతోపాటు ఆధునిక రచయితల పుస్తకాలు కూడా ఉన్నాయి. పోతన భాగవత మాధుర్యం గురించి ముచ్చటించారు. సాహిత్యంలో పడి కాలం ఇట్టే గడిచిపోయింది.
‘మరి మేము సెలవు తీసుకుంటాం’ అన్నాం.
‘వుండండి. మా ఆవిడ వస్తుంది. శ్రావణమాసం కదండీ. పూజలూ అవీ ఉంటాయి’ అంటూ ‘శారదా’ అని పిలిచారు.
కాఫీ తీసుకుని వచ్చిందావిడ.
‘నమస్కారమండి’ అంది.
మేము ప్రతి నమస్కారం చేశాం.
ఆవిడను చూసి రాముడు మ్రాన్పడిపోయాడు. ఆవిడ స్థితి కూడా అలాగే ఉంది.
కలా! నిజమా! అన్నట్లు చూస్తూండిపోయారు.
నేను రాముణ్ని పరిచయం చేశాను. ఈలోపు ప్రసాదరావుగారు విషయం పూర్తిగా చెప్పారు.
ఆవిడ శాంతంగా విన్నారు.
పాప ఫొటో తీసుకున్నారు.
ఆదరంగా, ఆప్యాయంగా మాట్లాడారు.
బాబుతో మాట్లాడి తప్పకుండా త్వరలో అభిప్రాయం చెప్తామన్నారు.
నోట మాట రాకుండా గుడ్లప్పగించి అట్లాగే ఉండిపోయాడు రాముడు.
నమస్కారం చేసి బైటకొచ్చాం.
ఇంటికి వచ్చేవరకు రాముడు మాట్లాడలేదు.
మనిషి కలత చెందినట్లు కనిపించాడు. దిగులుగా వున్నాడు.
‘ఆలోచించకు. నేను మాట్లాడతాను. ఈ సంబంధం కుదురుతుంది’ అన్నాను.
‘నాకు ఆశ లేదు. ఈ సంబంధం కుదరదు’ దృఢంగా అన్నాడు రాముడు.
నాకు అర్థం కాలేదు.
నిదానంగా అన్నాడు.
‘ఆ రోజుల్లో కట్నం నచ్చక ఒక మంచి అమ్మాయిని చేసుకోలేక పోయానని నీకు చెప్పాను గుర్తుందా? ఆ అమ్మాయే ఇప్పుడు మనం చూసిన ఆవిడ’
విషయం చిన్నగా అర్థమైంది.
కారణం ఎవరైనా కానీ ఆ రోజుల్లో వాళ్లు చాలా ప్రాధేయపడ్డారు. డబ్బులు పెద్దగా ఇవ్వలేమని తర్వాత వీలైతే అడిగినంత ఇవ్వగలమని రాముడు వాళ్లను బ్రతిమాలారు. అందరూ మంచివాళ్లే. కాని పెళ్లి జరగలేదు. ఆడపిల్ల గలవాళ్లు చాలా బాధ పడ్డారు. రాముడు కూడా ఆటలో బొమ్మలా అలా ఉండిపోయాడు.
విధి విచిత్రమంటే అదే కాబోలు.
ఈ రోజు తన కూతురు భవిష్యత్తును నిర్ణయించే అధికారం, అవకాశం ఆవిడకే వచ్చింది.
రాముడు చెప్పాక – విషయం పూర్తిగా అర్థమైన తర్వాత, నాకు కూడా సంశయం కలిగింది.
‘చూద్దాంరా. ఇంతకంటే మంచి సంబంధం వస్తుందిలే’ ధైర్యం చెప్పాను.
వౌనంగా ఉండిపోయాడు రాముడు.
జీవితాన్ని ఆడుతూ పాడుతూ ‘సిటీ బాయ్’గా – రాముడు కాదు కృష్ణుడుగా, గడిపిన రాముడు ఒక్కసారిగా డీలా పడిపోయాడు. కూతురు విషయమై ఏ తండ్రి అయినా ఆలోచన చేయటం సహజం. కానీ చేతిదాకా వచ్చింది, నోటిదాకా రాకపోయేసరికి – నిజంగా ఆడపిల్ల తండ్రి అయిపోయాడు.
మరుసటి రోజు వాణ్ని ట్రైన్ ఎక్కించి-
‘నువ్వేమీ ఆలోచన పెట్టుకోకు. చందనకు మంచి సంబంధం నేను చూస్తాను’ అని ధైర్యం చెప్పాను.
సరిగ్గా వారం రోజుల తర్వాత-
ప్రసాదరావుగారు మా బ్యాంక్‌కి వచ్చారు. నన్ను చూసి చిరునవ్వుతో నా దగ్గరకు వచ్చి-
‘నమస్కారం’ అన్నారు.
నేను నమస్కారం పెట్టి-
బాయ్ చేత ‘కాఫీ’ తెప్పించాను.
‘బ్యాంకులో పని ఉందా?’ అని అడిగాను.
‘లేదండి. మీ దగ్గరకే వచ్చాను. మీ రామచంద్రయ్యగారి సంబంధం మాకు బాగా నచ్చింది. కట్నం విషయం ఆలోచన వద్దు. మీ ఫ్రెండ్‌కు చెప్పండి. ముందుగా మీకు చెప్పాలని వచ్చాను’ అని చెప్పారు.
సంతోషానికి అర్థమేమిటో తెలిసింది.
ఆ సాయంత్రం-
పళ్లు, స్వీటు తీసుకుని ప్రసాదరావు గారింటికి వెళ్లాను.
ఎదురుగా ఆవిడ.
ఆవిడకు ఇచ్చి, రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాను.
మానవత్వానికి, మంచితనానికి ప్రతీకగా ఆమె అలాగే నిలబడి ఉంది.
నేను వడివడిగా బైటకొచ్చాను – ఈ విషయం రాముడికి చెప్పాలి కదా! ఈలోపు మీకు కనిపించినా వాడి చెవిలో ఈ శుభవార్త వేయండి.
అడుసుమల్లి మల్లికార్జున
15-5-56, వేదాంతంవారి వీధి, బాపట్ల – 522 101
గుంటూరు జిల్లా.. 99895 99175
*

