ఆదివారం అద్భుతం – జీవన యోగం – అంతర్జాతీయ యోగం

అంతర్జాతీయ యోగం (19-Jun-2015)

యోగం అంటే శరీరానికి, మనసుకు ఉన్న సంబంధాన్ని చెప్పే శాస్త్రమనీ
ఇదివరలో తెలుసుకున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపు
కుంటున్న సందర్భంగా యోగ చరిత్ర గురించి తెలుసుకుందాం.

భగవద్గీతతో సహా సమానంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన పుస్తకం పతంజలి యోగసూత్రలు. ఇది ఏ దేవుడి సంప్రదాయాన్ని అనుసరించి వచ్చింది కాదు. అందువల్ల అన్ని సంస్కృతుల వారూ దీన్ని గ్రహించారు. ప్రస్తుతం మనదేశంలో కన్నా ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో దీనిపై శాసీ్త్రయమైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవలే కొలంబియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఎడ్విన్‌ బ్రైయాంట్‌ పతంజలి యోగసూత్రాలపై ఉన్న వ్యాఖ్యలన్నిటినీ పరిశీలించి ప్రామాణికమైన వ్యాఖ్యను రాశారు. వందలాది మానసిక శాస్త్రవేత్తలు యోగాపై అధ్యయనం చేశారు.
మంత్రయోగం..
వేదాల మొదటి భాగాల్లో యోగ ప్రస్తావన కనిపించదు. ఉపనిషత్తుల్లో యోగం ప్రస్తావన వివరంగా ఉంది. సింధునది నాగరికత నాటి ముద్రల్లో ధ్యానం, యోగ ముద్రలు కనిపిస్తాయి. వైదిక సంప్రదాయం, సింధు నది నాగరికత రెండూ ఒకటా..? వేర్వేరా..? అనే విషయంపై భేదాభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల మొదట్లో ఇది వైదిక సంస్కృతిలో లేదు అని కొందరి అభిప్రాయం. అయితే వైదిక సంస్కృతితో పాటు సమాంతరంగా వచ్చిన సంప్రదాయం ఇదని మరికొందరి అభిప్రాయం. వేదాల మొదటి భాగాల్లో యజ్ఞాలు మొదలైనవి చెప్పారు. ఇవన్నీ మానవ స్వభావమైన కోరికలకు సంబంధించినవి. దీని నుంచి క్రమక్రమంగా ఎదిగి తత్వచింతన చేయడానికై మనసుకు నిలకడ, శిక్షణ అవసరం. అందుకే మనసును అదుపులో పెట్టే సాధనంగా యోగా పద్ధతులను ఉపనిషత్తుల్లో అంగీకరించారు. భారతంలో, ముఖ్యంగా మోక్షధర్మ పర్వంలో భీష్ముడు యోగా పద్ధతులను చాలా వివరంగా చెబుతాడు. పురాణ కాలానికి పతంజలిని పూర్తిగా హిందూ సంప్రదాయంలోని వ్యక్తిగా చూడగలం. ఆయన ఆదిశేషుడి అవతారమని మన సంప్రదాయం. ఆదిశేషుడు గానీ, శివుడి కంఠంలో ఉన్న నాగరాజు గానీ, అనేక దేవతలకు గొడుగు పడుతున్న సర్పాలు గానీ, ఆయా దేవతల యోగశక్తులను సూచిస్తాయని పండితుల అభిప్రాయం. సర్పాలకు వాయుభక్షకులు, గాలిని పీల్చి బతికే జీవులు అని కూడా పేరు. ప్రాణాయామంలో.. ముఖ్యమైంది ప్రాణవాయువే. ప్రాణాయామం యోగంలో ఒక ముఖ్యమైన మెట్టు. తర్వాతి కాలంలో అనేక పూజా విధానాల్లో భాగంగా కొంత యోగా పద్ధతులను ప్రవేశపెట్టినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు సూర్య నమస్కారాలు. వీటిలో ఉన్న ఆసనాలను కొన్ని మంత్రాలు మననం చేస్తూ చేయాలి. అలాగే సంధ్యావందనంలోని అనేక ముద్రలు యోగ నుంచి గ్రహించినవే.
ముద్రయోగం
తూర్పు ఆసియా దేశాలన్నింటిలో యోగ సంప్రదాయం ఉంది. ఇది బౌద్ధమతం ద్వారా వ్యాపించిందని పండితుల అభిప్రాయం. ఆ దేశాల్లోని కొన్ని యుద్ధపద్ధతులు కూడా బౌద్ధబిక్షువులు వ్యాపింపజేసినవే అని ఒక వాదన. కొన్నేళ్ల కిందట వచ్చిన హాలీవుడ్‌ సినిమా ‘blood sport’ లో హీరో కొన్ని విన్యాసాలు చేస్తాడు. వాటిలో చేతులకు, వేళ్లకు సంబంధించినవి ఉన్నాయి. వేళ్లకు సంబంధించిన ముద్రలు కొన్ని మన పూజా విధానాల్లో ఉన్నవే. కుంగ్‌ ఫూ చిత్రాల్లో కూడా ఇలాంటి ముద్రలు చూస్తాం. ఇవన్నీ హఠయోగానికి సంబంధించినవే. గాలిని పీల్చుకుని శరీరాన్ని బిగించే పద్ధతులు హఠయోగంలో కనిపిస్తాయి.
పాశ్యాత్య దేశాల్లో యోగా బోధించేటప్పుడు మన సంప్రదాయంలో చెప్పే మంత్రాలను తీసివేసి వారి సంస్కృతికి అనుగుణంగా బోధిస్తారు. దీనిపై ఆందోళన అనవసరం. మన మంత్రాలకు బదులుగా వారి దేవుడి పేరు చెప్పుకోవడం సహజమే. అర్థచంద్రాసనాన్ని ‘half moon posture’ అని, భుజంగాసనాన్ని ‘cobra posture’ అని ఈ విధంగా పేర్లు మార్చి చెప్పినా వారు కూడా మనం సాధించిన ఫలితాలనే సాధిస్తారు. ఇటీవల కేరళలో క్రైస్తవులు ఈ యోగా పద్ధతులను జీసస్‌ నమస్కారాలు అంటూ బోధిస్తున్నారు. దీనికి మనమేం ఆందోళన చెందాల్సిన పని లేదు.
విద్యాయోగం..

యోగాభ్యాసాన్ని స్కూల్‌ సిలబ్‌సలో భాగంగా పెట్టడం తమ సంస్కృతికి విరుద్ధమని ఇతర మతాల వారు భావించవచ్చు. విషయం ఎంత మంచిదైనా, ఎంత గొప్పదైనా.. స్వచ్ఛందంగా అందరికీ ఆమోదకరంగా ఉన్నప్పుడే దాన్ని ప్రవేశపెట్టడం సరైన విధానం. పదో శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన ప్రఖ్యాత అరబ్‌ యాత్రికుడు అల్‌ బెరూనీ పతంజలి యోగ సూత్రాలను అరబిక్‌ భాషలో ‘కితాబ్‌ బతంజల్‌ అల్‌ హిందీ’ పేరిట గురుశిష్యుల సంభాషణ రూపంలో తర్జుమా చేశాడు. దీని అంగ్ల అనువాదం వివరాలను ఇంటర్నెట్‌లో చూడగలం. ‘ఈ పుస్తకం ప్రతి అక్షరం విని అర్థం చేసుకున్న తర్వాత నా ప్రజలకు దీన్ని ఇవ్వకుండా ఉండటానికి నా అంతరాత్మ అంగీకరించలేదు’ అని అల్‌ బెరూనీ రాసుకున్నాడు. ఇలాంటి పుస్తకాలను భారతీయ భాషల్లోకి తేవడం కూడా అవసరమేమో..!
(రచయిత ప్రసంగాలను www.advaitaacademy.org అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చు)

డాక్టర్‌ కె. అరవిందరావు,
రిటైర్డు డీజీపీ
రెండు స్థాయిల్లో దేవుడు (12-Jun-2015)

ప్రపంచంలోని అనేక మతాలకూ, భారతీయ మతాలకూ ఒక ముఖ్య భేదం ఉంది. దీన్ని వివరిస్తూ మ్యాక్స్‌ ముల్లర్‌ ఇలా అన్నాడు. what distinguises the vedanta philosophy from all other philosophies is that it is at the same time a religion and a philosophy. ఇతర మతాల్లో ముఖ్యంగా ఒకే మతగ్రంథం ఉంటుంది. దాని ఆధారంగా మిగతా గ్రంథాలు వస్తాయి. ముఖ్యమైన మతగ్రంథం ఒకానొక వ్యక్తి, ఒకానొక చారిత్రకసమయంలో దేవుడి సాక్షాత్కారాన్ని పొంది దేవుడి ఆజ్ఞగా తన ప్రజలకు చెప్పిన విషయాలకు సంబంధించినది. ఇవి విశ్వాసానికి సంబంధించిన విషయాలు. శాస్త్రీయంగా సమర్థించలేనివి. ఒక మతం వారు మా విశ్వాసం సరైనది అంటే మరొక మతం మా విశ్వాసం సరైనది అనవచ్చు. భారతీయ (హిందూ, బౌద్ధ, జైన) మతాల్లో తత్త్వశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు, మత సంబంధమైన పుస్తకాలు సమన్వయం చేయబడి ఉంటాయి. ఉపనిషత్తులు, గీత, బ్రహ్మసూత్రాలు తత్త్వశాస్త్రంలోనూ భాగమే, మతగ్రంథాల్లోనూ భాగమే. అందుకే హింద మతగ్రంథాలు రెండు స్థాయిల్లో విషయాన్ని బోధిస్తాయని మునుపటి ఒక వ్యాసంలో ప్రస్తావించాను. తత్త్వశాస్త్రాన్ని అర్థం చేసుకునే శక్తి ఉన్న వాడికి ఆ స్థాయిలోనూ, ఆ శక్తి లేనివాడికి పురాణాలు మొదలైన స్థాయిలోనే విషయాన్ని చెబుతాయి.

పరమాత్మ అంటే విశ్వమంతా వ్యాపించిన శుద్ధచైతన్యం అనీ, సృష్టి అనేది ఆ చైతన్యం నుండి వచ్చిందే అనీ, ఆ చైతన్యంలోని క్రియాశక్తి వల్ల ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, చెట్లు చేమలు, చిట్ట చివరిగా ప్రాణులు వచ్చాయనీ, పంచభూతాల మరో రూపంగానే ఇంద్రియాలు, మనస్సు ఏర్పడ్డాయి అని విశ్లేషించి చెప్పడం శాసీ్త్రయమైన విచారం. ఇది తత్త్వశాస్త్రం అనే కోవకు వస్తుంది. ఉపనిషత్తులు, వాటిపై వచ్చిన వ్యాఖ్యానాలు పై విషయాల్ని అనేక కోణాల్లో వివరించి చెబుతాయి. వీటిని తెలుసుకోవడానికి కొంత శ్రద్ధ, కొంత విషయజ్ఞానం ఉండాలి. పురాణాలలో త్రిమూర్తులు, సృష్టి, స్వర్గం, నరకం మొదలైన విషయాలు, విశ్వాసానికి చెందినవి, ఎవరూ నిరూపించలేనివి ఉంటాయి. వీటిని కూడా మన సంప్రదాయం అంగీకరించింది.
పై రెంటిలో ఏది నిజం? ఆకాశంలో చేతిలో కర్రపట్టుకుని ఒకానొక దేవుడు ఉన్నాడు అనేది ఏ శాస్త్రజ్ఞుడు ఒప్పుకోడు. అందువల్ల శాస్త్రీయంగా ఆలోచించేవాడికి మొదట చెప్పింది నిజం. కానీ మన చుట్టూ సమాజంలో అనేక సంప్రదాయాలు, విశ్వాసాలు ఉన్నాయి. వాటన్నింటినీ కాదని తోసివేయాలంటే బలాత్కారంతో, రక్తపాతంతో ఆ పని చేయాల్సి ఉంటుంది. ఇతర దేశాల్లో అలా జరిగింది కానీ మనదేశంలో అలా జరగలేదు. ఒక బాలుడు బొమ్మ ట్రైన్‌ను నడుపుతూ తాను నిజంగా ట్రైన్‌ నడుపుతున్నానని భావిస్తాడు. తండ్రి దాన్ని నవ్వుతూ అంగీకరిస్తాడు. పెద్దవాడయ్యాక ఎట్లూ ఆ బొమ్మతో ఆడుకోడని అతనికి తెలుసు. అలాగే ఆలోచనాశక్తి పెరగనంత వరకూ ఏదో ఒక స్థాయిలో మనిషి క్రమశిక్షణతో ఉండడం మంచిది కనుక ఆ సంప్రదాయాల్ని కూడా సరే నిజమే అన్నారు. పై స్థాయిలో చెప్పినదాన్ని పారమార్థిక సత్యం అన్నారు. కేవలం విశ్వాసంపై ఆధారపడి వ్యవహారాల్లో ఉన్నదాన్ని వ్యావహారిక సత్యం అన్నారు.
అలాగే రెండింటినీ ఒప్పుకోవడం వల్ల ఒకానొక కాలంలో లాభంపడి ఉండవచ్చు కాని మతాల మధ్య ప్రస్తుత పోటీ వాతావరణంలో కొత్త సమస్యలొస్తున్నాయి. ఒకప్పుడు శాస్త్రీయ చర్చలు చేస్తూ పండితులు ఒకవైపు, రామాయణం, భాగవతం కథలు వింటూ నిరక్ష్యరాస్యులు మరొకవైపు ఒకే విషయాన్ని రెండు స్థాయిల్లో తెలుసుకుంటూ వచ్చారు. ఒకవైపు సత్యం ఏమిటి అంటూ నిష్పక్షపాతంగా, శాసీ్త్రయంగా కొనసాగించే ఆలోచన. మరొకవైపు సమాజంలో ఇదివరకే ఉన్న సంప్రదాయాల్ని(విష్ణువు, శివుడు మొదలైనవి) అంగీకరించడం మొదటి స్థాయిలో విశ్లేషణ శాస్త్రీయమైనది కావున ఎలాంటి వివాదం ఉండదు. రెండవ స్థాయిలోని విషయాలు విశ్వాసానికి సంబంధించినవి. ఒకవైపు వైష్ణవ సంప్రదాయం, మరోవైపు శైవం, ఇంకొకచోట శక్తిపూజ మొదలైనవి. వీటి మధ్య పరస్పర వాదాలు తలెత్తకుండా శ్రీ శంకరాచార్యులు వీటన్నింటినీ ఉపనిషత్తులు అనే గొడుగు కిందకు తెచ్చారని ఇది వరలో గమనించాం. ఇలాంటి సంప్రదాయాలు అనేకం కావున అనేక దేవుళ్ళను అంగీకరించారు. ఏ సంప్రదాయం ప్రకారం పూజించినా ఒకే పరమాత్మను పూజిస్తున్నారని ఈయన సమన్వయం చేశారు. వేదాంత స్థాయిలో చెప్పిన బ్రహ్మ అనేది ఒక వ్యక్తి కాదు. దానికి ప్రపంచ సృష్టి, దుష్టశిక్షణ, శిష్టరక్షణలాంటి డ్యూటీలు లేవు. సంప్రదాయం, లేదా మతంలో చెప్పిన దేవుడికి ఇలాంటి డ్యూటీలున్నాయి. డ్యూటీని ఉపాధి అంటారని మనకు తెలుసు. ఈ ఉపాధి అన్న దేవుణ్ణి సోపాధిక బ్రహ్మ అన్నారు. ఇది కింది స్థాయికి చెందింది. ఉపాధిలేని సత్యము, చైతన్యం అనే దాన్ని నిరుపాధికం అన్నారు. అందువల్లే మొదటి స్థాయిలో మాట్లాడేవారు ఎప్పటికప్పుడు కింది తరగతి వారిని హెచ్చరిస్తూ మీరు సత్యం అనుకుంటున్నది పాక్షిక సత్యం మాత్రమే, ఆ స్థాయి నుంచి మీరు పైకి ఎదగాలి అంటూ చెబుతూ వచ్చారు. ఇలాంటి హెచ్చరికలు ఉపనిషత్తుల్లో చాలా చోట్ల కనిపిస్తాయి. ఉదాహరణకు కేనోపనిషత్తులో ‘‘నేదం యదిదముపాసతే’’-‘‘ప్రజలు ఇది దేవుడు అని పూజిస్తున్నది సంపూర్ణసత్యం కాదు’’ అంటూ నాలుగు మంత్రాలున్నాయి. ఇదం అంటే ఇది అని నిర్ధారించి చెప్పిన విషయం. కొందరు మతపెద్దలు కూడి ఇది దేవుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, సర్వజ్ఞుడు, ఇతన్నే పూజించాలి అని చెబితే అది ‘ఇదం’ అనే దాని పరిధిలోకి వస్తుంది. సృష్టి మొదలైన డ్యూటీలు ఉన్న దేవుణ్ణి ఏ మతం చెప్పినా అది ‘ఇదం’ అనే స్థాయికే వస్తుంది. దీనివల్ల ప్రయోజనాలుండవచ్చు. ఇది పూజాపునస్కారాలకు పనికివస్తుంది. మనిషిని సన్మార్గంలో పెట్టడానికి దానం, ధర్మం, అహింస మొదలైన గుణాల్ని ఇవ్వడానికి పనికివస్తుంది. అయితే ఇది వ్యవహార దశలో సత్యమే కానీ పరమార్థ దశలో కాదు. అందువల్లే వేదాంతం మాటిమాటికీ మనిషిని హెచ్చరిస్తూ నీవు మతం స్థాయిలో దేన్ని ఆరాధించినా తప్పులేదు కానీ అదే పరమసత్యం కాదు అని చెప్పింది. అసలైన శుద్ధ చైతన్యాన్ని ఇది అంటూ నిర్దేశించలేం. ఒక టార్చిలైటు వెలుగులో చీకటి గదిలోని వస్తువుల్ని చూడవచ్చు కానీ సూర్యుడువైపు టార్చిలైటు వేసి ఎవరూ చూపరు. చైతన్యం కారణంగా మనం వస్తువుల్ని చూడగలుగుతున్నామే కానీ ఆ చైతన్యాన్నే మనం చూడలేం. Consciousness cannot be objectified అని ఇవాళ శాస్త్రజ్ఞులు ఈ విషయాన్నే చెబుతున్నారు. కావున నీవు పూజిస్తున్నది పరమసత్యంకాదు అని ఉపనిషత్తులు చెబితే ఒక నమ్మకాన్ని వదిలి మరొక నమ్మకాన్ని అంగీకరించమనీ, ఒక మతాన్ని వదిలి మరొకదాన్ని తీసుకోమని కాదు. ఏ నమ్మకమైనా ఒకే స్థాయిలోనిదే, ఉపాధి ఉన్న దేవుడే. ఇది దాటి అసలైన సత్యాన్ని, తెలుసుకోమని వాటి ఉద్దేశం.
దీన్ని వక్రీకరించి కొందరు మీ ఉపనిషత్తుల్లోనే మీరు పూజిస్తున్నది దేవుడు కాదని చెప్పారు కదా, మా మతంలోకి రండి అనడం, ఆధునిక సాధనాలైన వాట్సప్ లాంటి ద్వారా ప్రచారం చేయడం అజ్ఞానంతో కూడిన పని. దీనివల్ల అమాయకుల్ని మతమార్పిడి చేయవచ్చు. కానీ సత్యానికి మరింత దూరంగా వెళ్లడమే అవుతుంది. మరికొందరు మీ ఉపనిషత్తుల్లో మా దేవుడి గురించే చెప్పారు అనడం మరొక మానసిక బలహీనత. సంస్కృత పండితులు నోరు మెదపకున్నంత కాలం ఇలాంటి వాదనలు ఇంకా అనేకం వస్తాయి.
‘ఇదం’ అని చెప్పబడింది పూర్తిగా వ్యర్థంకాదు. డిగ్రీకి వెళ్ళడానికి హైస్కూలు ఎలా అవసరమో ఇదీ అలా అవసరం. అసలైన దాన్ని తెలుసుకోవడానికి అదొక గొప్ప సాధనం.
మన సంప్రదాయంలో చెప్పిన ఉసాసనలన్నీ ఇలాంటివే. అంతేగాని ‘ఇదం’లో ఉన్న ఒకటి సరైనది, మరొకటి తప్పు అనడం దురుద్దేశంతో కూడిన వాదం.
(రచయిత ప్రసంగాల్ని www.advaitaacademy.org అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చు)

జీవన యోగం

  • 20/06/2015
TAGS:

ఆదివారం-జూన్ ఇరవై ఒకటవ తేదీన జరుగుతున్న ‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’ మానవాళి చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం…సమన్వయసాధన పథంలో మరో ప్రగతి పదం. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న దాదాపు అన్ని దేశాలూ మన ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘యోగ దినోత్సవ నిర్వహణ’ ప్రతిపాదనను ఆమోదించడం మన దేశానికి లభించిన సాంస్కృతిక విజయం. శరీరం, మనస్సు, బుద్ధి కలసి మెలసి ఎకోన్ముఖ స్థితి ఏర్పడడం యోగం. ఈ ఏకోన్ముఖ స్థితి మంచి నడవడి. మంచి నడవడిని మానవాళికి నేర్పిం చే సంస్కారాల సమన్వయతత్త్వం యోగం. యోగ విద్య మనదేశంలో అంకురించింది, పల్లవించింది, వికసించింది, పరిమళించింది. ఈ పరిమళం ప్రపంచ మానవాళికి మాధుర్యాన్ని పంచిపెట్టడం చరిత్ర. ఆ మాధుర్యం మానవులను నిజమైన మానవులుగా దిద్దడానికి దోహదం చేసిన చరిత్ర. జంతు ప్రవృత్తి నుంచి పైశాచికమైన వికృతులనుంచి తప్పించి మానవుడిని సంస్కృతి నిబద్ధుడిని చేసిన మాధ్యమం యోగం. యోగవిద్య మనదేశలో పుట్టినప్పటికీ మొత్తం ప్రపంచానికి ఉపయోగపడడం తరాల చరిత్ర. ఈ సంస్కారబద్ధులైన సమయంలో మానవులు ఇతర మానవులను పీడించలేదు. ఈ సంస్కారానికి దూరమైన సమయంలో మానవులు దురాక్రమణ దారులుగా మారారు. కలయిక-యోగం-ఆయా జాతుల మనస్సులలో వికసించకపోవడమే ఇందుకు కారణం… యోగం వికసించడమంటే శరీరం, మనస్సు, బుద్ధి ఒకే లక్ష్యం వైపు ఏకోన్ముఖంగా కేంద్రీకృతం కావ డం. ఈ ఏకోన్ముఖ లక్ష్యం ఆత్మసాక్షాత్కారం. ఒకే ఆత్మ అద్వితీయమైన ఆత్మ. అనంతకోటి బ్ర హ్మాండాలుగా, అసంఖ్యాక జీవాత్మలుగా ప్రస్ఫుటిస్తుండడం విశ్వవ్యవస్థలోని వ్యవహార వాస్తవం. ఈ జీవన వాస్తవం, యోగం ద్వారా యోగ విన్యాసాల ద్వారా ధ్రువపడడం సమన్వయం. అసంఖ్యాక రూపాల, వైవిధ్యాల స్వభావం ఒక్కటే…వైవిధ్యాలన్నీ అద్వితీయమైన సత్యంలో ఆత్మతో సమన్వయమై ఉండడం యోగం-కలయిక! ఈ జీవన వాస్తవాన్ని ‘ప్రపంచం’ ఆచరించగలిగినప్పుడు వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేదు. మతాల మధ్య, భాషల మధ్య, వర్గాల మధ్య, దేశాల మధ్య, జాతుల మధ్య, జీవజాలం మధ్య, చరాచర విశ్వ స్వరూపాల మధ్య విరోధం లేదు. ఈ సంస్కార మాధ్యమం భారతీయ జీవన యోగం! కలిసి ఉండడమే విలీనమై ఉండడమే యోగ స్వభావం. శరీరం బుద్ధి మనస్సు ఆత్మతో కలసి ఉండాలి. మానవాళి కలసిమెలసి ఉండాలి. ఇదే వసుధైక కుటుంబం…ప్రపంచ మంతా ఒకే కుటుంబం, ఒకే ఇల్లు! అలాగే మన పుడమి విశ్వవ్యవస్థలోని అసంఖ్యాక గ్రహాలతో నక్షత్రాలతో బ్రహ్మాండాలతో కలసి ఉండడం సహజమైన యోగం. మహా మేళనం యోగం. అంతర్జాతీయ యోగ దినోత్సవం ఈ సహజ సమన్వయ తత్వానికి చిహ్నం..
యోగవిద్య, యోగాభ్యాసం, యోగాచరణ, యోగ ప్రబోధం అందువల్ల అనాదిగా ఉన్న సహజ జీవన విన్యాసాలు, సహజత్వానికి తప్పిపోకపోవడం, కృత్రిమత్వానికి గురికాకపోవడం యోగం. అనాది యోగశాస్త్రాన్ని దాదాపు మూడువేల మూడువందల ఏళ్ల క్రితం పతంజలి మహర్షి మరోసారి వివరించాడు. యోగశాస్త్రం ఆరు వేద దర్శన శాస్త్రాలలో ఒకటి. మానవాళికి మార్గదర్శనం చేసేది దర్శనాలు. పతంజలి హఠయోగం అని రాజయోగం అని యోగాభ్యాస పద్ధతులను వర్గీకరించాడు. హఠయోగం ప్రధానంగా శరీరానికి పుష్టిని కలిగించే వ్యాయామం. రాజయోగం శరీరానికి మనస్సునకు బుద్ధికీ కూడ సౌష్టవం కలిగించే ప్రక్రియ మాత్రమే కాదు. నైతికనిష్ఠను పెంపొందించే జీవనరీతి కూడ. అందువల్లనే యోగం కేవలం ఆసనాలకు, ప్రాణాయామానికి ధ్యానానికి పరిమితమైనది కాదు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ యోగంలోని ఎనిమిది విభాగాలు. ఇవన్నీ మానవులు ఇరవైనాలుగు గంటల దినంలో సహజంగా పాటించదగిన జీవన సూత్రాలు. హింస చేయరాదు, దొంగతనం చేయరాదు, అబద్ధాలు చెప్పరాదు, ఉన్నదానిలో సంతృప్తి చెందాలి. అత్యాశతో యాచించరాదు, దోచుకోరాదు, శుభ్రతను పెంపొందించుకోవాలి వంటి నైతిక సూత్రాలు యోగంలో భాగం. ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ్భారత కార్యక్రమం యోగం నిర్దేశించే స్వచ్ఛతలో భాగం. ఈ స్వచ్ఛత మానసిక పరిశుభ్రత, శరీర ఆరోగ్యం మాత్రమే కాదు, పరిసరాల పరిరక్షణ కూడ.
యోగసూత్రాలకు దూరమైన జాతులు ఇతర జాతులను దోపిడీ చేయడం చరిత్ర. శక్తిని గాయాలను మాన్పడానికి-క్షతత్రాణ కార్యక్రమానికి-వినియోగించకుండా గాయాలను కలిగించడాన్ని ‘క్షతికారులు’ ఉపయోగించడం వల్ల ప్రపంచ సమాజం అల్లకల్లోలమైంది. సంతృప్తి చెందని జాతులు ఇతర దేశాలను దురాక్రమించడం ఇతర దేశాల ప్రజలను అణచివేతకు ఆర్థిక శోషణకు గురి చేయడం శతాబ్దుల చరిత్ర. కలసి జీవించడమన్న యోగం నష్టమై కలహించడమే ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రజల సమష్టి స్వభావంగా మారింది. ఈ కలహించే ప్రవృత్తి మానసిక వికృతి. ఈ వికృతులు అంతర్గత సమాజంలో, అంతర్జాతీయ సమాజంలోను, వైరుధ్యాలను వ్యవస్థీకరించడం కొనసాగుతున్న వైపరీత్యం. మానసిక సంతులనం, మానసిక ప్రశాంతిని కోల్పోయిన వారు రకరకాల ఒత్తడికి గురి అవుతున్నారన్నది దాదాపు అన్ని దేశాలలోను ప్రచారమవుతున్న మనోవైజ్ఞానిక వాస్తవం. అందువల్లనే ప్రశాంతిని వెతుక్కుంటూ వివిధ దేశాలవారు యోగభూమి అయిన మనదేశానికి తరలిరావడం ఆధునిక పరిణామం. అలాగే ఈ దేశంనుండి తమ దేశానకి వచ్చిన వివేకానందస్వామి వారి నుండి మానసిక ప్రశాంతిని, నైతిక జీవనాన్ని నేర్చుకొనడానికి అనేక దేశాల ప్రజలు తపించడం కూడ ఆధునిక పరిణామం. యోగం, నేర్పడానికి నేర్చుకొనడానకి భారతీయ ధర్మాచార్యుల నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా కేంద్రాలు, సంస్థలు, మందిరాలు, విశ్వవిద్యాలయాలు నెలకొంటుండడం కూడ ఆధునిక పరిణామం. ఈ ఆధునిక పరిణామం అతి ప్రాచీన పరిణామ క్రమానికి పునరావృత్తి. ఈ దేశానికి వచ్చి, ఈ దేశం నుండి పృథివీ తలంలోని సర్వమానవులూ జీవన సంస్కారాలను నేర్చుకొని వెళ్లడం అతిప్రాచీన చరిత్ర. ఈ జీవన యోగం మధ్యకాలంలో మరుగున పడింది. వివేకానందుని వంటివారి కృషి ఫలించి చరిత్ర మళ్లీ పునరావృత్తవౌతోంది. నైతిక నిష్ఠను జీవన సంస్కారాలను నేర్చుకొనడానికై ప్రపంచ ప్రజలు మళ్లీ భారతదేశం వైపు చూస్తున్నారు. భారత్ విశ్వ విజేత కావాలని ఆహంకరించడం లేదు. ఇదీ వౌలికమైన యోగం…ఈ యోగం వల్లనే భారతదేశం విశ్వగురువైంది.
యోగం పెరగడం వల్ల రోగం నశిస్తుంది. సృష్టి, ప్రకృతి, సమాజం, మానవుడు, పరస్పరం విభేదించే విరుద్ధ అంశాలు కాదు. పరస్పరం పరిపోషకమైన సహజ స్వభావ రూపాలు. ప్రకృతి తానేనని మానవుడు భావించినప్పుడు యోగం వికసిస్తుంది. ప్రకృతి తనకంటె భిన్నమని భావించిన మానవుడు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. భౌతికమైన, మానసికమైన రోగాలకు ఇదీ కారణం. సమాజం తనకంటె భిన్నమని భావించడం వల్లనే మానవుడు ఆర్థిక రోగాన్ని విస్తరింపచేశాడు. ఈ రోగం దోచుకొనడం. ప్రకృతిని సామాజాన్ని పరిరక్షించడం వల్ల మాత్రమే తనకు సర్వాంగీణ వికాసం కలుగుతుందన్న సృష్టిగత సత్యాన్ని వ్యక్తి వ్యక్తిలో చిగురింపచేసే జీవన మాధ్యమం యోగం… యోగం సృష్టిక్రమం..

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.