|
రుతుపవనాలు విస్తరించడంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ వర్షాలతో వాతావరణం చల్లబడింది. విచిత్రంగా గత కొద్ది రోజులుగా సెగలు పుట్టించిన రాజకీయ వాతావరణం కూడా రెండు రోజులుగా కొంత చల్లబడింది. నువ్వెంత అంటే నువ్వెంత అని కాలు దువ్వుకున్న ఇరువురు ముఖ్యమంత్రులు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినట్టు కనిపిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత చానల్‌కు ఏపీ పోలీసులు ఇచ్చిన నోటీసు వ్యవహారంతో విషయం మళ్లీ మొదటికి వచ్చిందనే అభిప్రాయం కలిగినప్పటికీ… అందులో నిజం లేదనే చెప్పవచ్చు. గడచిన మూడు వారాలుగా తెలుగు రాష్ర్టాలను సలుపుతూ వచ్చిన టేపులు, ట్యాపింగ్ వ్యవహారం హఠాత్తుగా ప్రాధాన్యం కోల్పోవడానికి కారణం ఏమిటి? అసలు ఏమి జరిగింది? అన్న కుతూహలం ప్రజల్లో నెలకొంది. ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారనీ, ఇక ఆయన పదవీ త్యాగం చేయక తప్పదనీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భలే దెబ్బకొట్టారనీ చంద్రబాబు వ్యతిరేకులు సంబరపడిపోయారు. రాజకీయ పార్టీల అధీనంలో ఉన్న మీడియాల్లో చేసిన హడావుడి అయితే అంతా ఇంతా కాదు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఒక్కటే మిగిలిందని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు తెర మీదకు తెచ్చారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూలిపోక తప్పదని ఏపీ మంత్రులు జబ్బలు చరచుకున్నారు. ఇద్దరు చంద్రుల మద్దతుదారులు సోషల్ మీడియాలో హైరానా పడిపోయారు. సొంత సమస్యల గురించి ఆలోచించకుండా తమ సృజనాత్మకతను ప్రయోగించి ఫేస్‌బుక్ తదితర మాధ్యమాలలో పోస్టింగులు పెడుతూ అలౌకిక ఆనందం పొందారు. మొత్తంమీద మద్దతుదారుల ఉన్మత్త ప్రేలాపనలు కొనసాగుతూ ఉండగానే ఇరువురు ముఖ్యమంత్రులు తెల్ల జెండా ఎగురవేయబోతున్నారన్న సమాచారం అందుతోంది. అంతవరకు అది చేస్తారు, ఇది చేస్తారు అంటూ రెచ్చిపోయిన కేసీఆర్ మీడియా కూడా గురువారం నుంచి కొంత వెనక్కు తగ్గింది. ఆయన సొంత పత్రికలో మొదటి పేజీలో ఓటుకు నోటు అంశంపై ఒక్క వార్త కూడా కనిపించలేదు. అంతలోనే ఇంత మార్పు ఎలా సాధ్యం అన్న అనుమానాలు సహజంగానే పొడచూపుతాయి. దీంతో చంద్రబాబు సేఫ్ కదా అని ఆయన మద్దతుదారులు అనునయించుకోవడం మొదలుపెట్టారు. ఓటుకు నోటుతో మొదలై ఎన్నో మలుపులు, సుడులు తిరిగి టెలిఫోన్ ట్యాపింగ్ దగ్గరకు చేరి… రెండు రాష్ర్టాల ప్రజల మధ్య అంతరం సృష్టించిన ఈ వ్యవహారంలో ప్రస్తుతం నెలకొన్న స్తబ్ధత తాత్కాలికమా? శాశ్వతమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే, రాజకీయ నాయకుల ఎత్తుగడలు తెలియని వారికి మాత్రమే ఇలాంటి పరిణామాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నేను క్రితం వారం పేర్కొన్నట్టుగానే రాజకీయ నాయకులు ఒక హద్దు దాటి ముందుకు వెళ్లరు. వెళితే ఏమవుతుందో వారికి తెలుసుగానీ, వారిని గుడ్డిగా సమర్థించేవారికి తెలియదు. మొత్తం ఈ వ్యవహారంలో ఇద్దరు ముఖ్యమంత్రులదీ పైచేయికాగా, వారి తరఫున వకాల్తా పుచ్చుకున్నవాళ్లు, ఏదో జరుగుతుందని భ్రమించినవాళ్లు మాత్రం చిత్తు అయ్యారు.
ఎత్తుకు పైఎత్తు
ఇంతకీ ఇద్దరు చంద్రుల మధ్య కాల్పుల విరమణ ఆలోచన రావడానికి కారణం ఏమై ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అదే సమయంలో ఈ వ్యవహారంతో లాభపడింది ఎవరు? భంగపడింది ఎవరు? కూడా తెలుసుకుందాం. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి చిక్కుకున్ననాటి నుంచి రెండు రోజుల క్రితం వరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మరక్షణలోనే ఉన్నారు. కేసీఆర్ వ్యాఖ్యల వల్ల తెలుగు ప్రజల మధ్య మరింత అంతరం ఏర్పడి అది ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా ఉపయోగపడినా, ఈ వ్యవహారం మాత్రం జాతీయ స్థాయిలో ఆయన ప్రతిష్ఠను మసకబారేట్టు చేసింది. దీంతో రాజకీయ వ్యూహరచనలో కేసీఆర్‌కు ఏమాత్రం తీసిపోని చంద్రబాబు తన బుర్రకు పదును పెట్టడంతో పాటు, తన పలుకుబడిని అంతా ఉపయోగించి టెలిఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలు సేకరించారు. అంతే, అందుబాటులో ఉన్న మంత్రులను, ఇతర పార్టీ ముఖ్యులను పిలిపించుకుని జరిగినదంతా వివరించి టేపుల వ్యవహారం వల్ల తాను రాజీనామా చేసే పరిస్థితి ఉండదనీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రయోగించడానికి తనకు బ్రహ్మాస్త్రం లభించిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే టెలిఫోన్ ట్యాపింగ్ చేసిందీ లేనిదీ 24 గంటలలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ మంత్రులు అల్టిమేటం జారీ చేశారు. దీనికి కౌంటర్‌గా ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి ఇంటికి రాత్రి పొద్దుపోయాక ఏసీబీ అధికారులను కేసీఆర్ పంపారు. పనిలో పనిగా మరో తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇంటికి కూడా పంపి నోటీసులు జారీ చేయించే ప్రయత్నం చేశారు. ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు చంద్రబాబుకు లభించలేదని నమ్మడం వల్లనే కేసీఆర్ ఈ చర్యకు పూనుకుని ఉండవచ్చు. అయితే, గురువారం సాయంత్రానికి తెలంగాణ ముఖ్యమంత్రికి తత్త్వం బోధపడింది. ఈ దశలో మనం ఒక అడుగు ముందుకు వేస్తే చంద్రబాబు రెండు అడుగులు ముందుకు వేస్తారు. అందరం మునిగిపోతామని అధికారులు కూడా ఆయనను హెచ్చరించారని చెబుతున్నారు. దీంతో అదే రోజు ఆయన గవర్నర్ నరసింహన్‌ను కూడా కలిశారు. అప్పటికే ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు చంద్రబాబుకు లభించాయని తెలుసుకున్న గవర్నర్ కూడా ఓటుకు నోటు వ్యవహారంలో ఇక తగ్గండి అని కేసీఆర్‌కు గట్టిగా సూచించారని వార్తలు వచ్చాయి. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కొట్టుకుంటూ ఉంటే పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహారం ఇంతటితో ఆగకపోతే కొంపలు మునుగుతాయని గుర్తించి గవర్నర్‌ను హెచ్చరించింది. అంతే, వాతావరణం చల్లబడటం మొదలైంది. టేపుల వ్యవహారంలో ఒకరు, ట్యాపింగ్ వ్యవహారంలో మరొకరు ఇరుక్కుపోయినట్టు గుర్తించిన ఇరువురు ముఖ్యమంత్రులు కాల్పుల విరమణకు మానసికంగా సిద్ధమయ్యారు. ఫలితంగానే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ గురు, శుక్ర, శనివారాల్లో ఎటువంటి హడావుడి చేయలేదు. ఏపీ మంత్రులు కూడా తాము ఇచ్చిన గడువు దాటిపోయినా ట్యాపింగ్ వ్యవహారం తేల్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేదు. ఇదంతా చూసి నిన్నటి వరకు కొట్టుకున్నవాళ్ల మధ్య ఇంత సామరస్యం, అవగాహన ఎలా సాధ్యమని ఎవరికైనా సందేహం వస్తే అది వారి అమాయకత్వమే అవుతుంది. రాజ్యం పదిలంగా ఉంటుందన్న నమ్మకం ఉన్నంత వరకు మాత్రమే రాజులుగానీ, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగానీ ఎంత దూరమైనా వెళతారు. ఎన్ని ప్రకటనలైనా చేస్తారు. ఈ క్రమంలో సైనికులు లేదా అభిమానులు కొట్టుకు చచ్చినా పట్టించుకోరు. తమ సీటుకు ఎసరు వస్తుందనుకున్నప్పుడే జాగ్రత్త పడతారు. అప్పుడు ప్రాంత ప్రయోజనాలు, ఆత్మగౌరవం వంటివి ఏమి గుర్తుకురావు. ఇంతకీ చంద్రబాబు సేకరించిన ఆధారాలు ఏమిటి? ఈ ఎపిసోడ్‌లో ఎవరు లబ్ధి పొందారు? ఎవరు బకరాలు అయ్యారో ఇప్పుడు చర్చించుకుందాం.
ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి రావడానికి పది రోజుల ముందునుంచే తెలంగాణ ప్రభుత్వం తన వ్యూహానికి పదును పెట్టడం ప్రారంభించింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్‌రెడ్డి ఎంతకైనా తెగిస్తారనీ, అందుకోసం తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారని గ్రహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో తాము విజయం సాధిస్తామనీ, ఫలితంగా ఏపీ ప్రభుత్వం అప్రతిష్ఠ పాలవుతుందనీ, ఆ పరిస్థితిని ఉపయోగించుకోవలసిందిగా ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కూడా సూచించినట్టు తెలిసింది. ఈ అంశంపై వివరంగా మాట్లాడుకోవడానికి మంత్రి హరీశ్ రావు, జగన్మోహన్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ గత నెల 21వ తేదీన సమావేశమైనట్టుగా తెలుగుదేశం పార్టీ వారికి ఆధారాలు లభించాయి. ఆ రోజు నుంచి తెలంగాణ అధికార పక్ష నేతలు వ్యవహారాన్ని గుట్టుగా మొదలు పెట్టారు. అత్యుత్సాహవంతులైన కొంతమంది తెలంగాణ పోలీసు అధికారులు ఈ వ్యూహం అమలులో సహకరించడానికి ముందుకొచ్చారు. ఆ వెంటనే ఫలానా ఫలానా వారి ఫోన్ నంబర్లు ట్యాపింగ్ చేయాలని సర్వీసు ప్రొవైడర్లకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు పంపారు. ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, సెబాస్టియన్ నంబర్లతోపాటు కొంతమంది ఉగ్రవాదులు, నక్సలైట్‌ల నంబర్లు చేర్చారు. అధికారికంగా రిక్విజేషన్ రావడంతో సెల్‌ఫోన్ సర్వీసు ప్రొవైడర్లు గత నెల 23వ తేదీ నుంచి ట్యాపింగ్ మొదలు పెట్టారు. అధికారికంగా నిర్వహించిన ఈ ట్యాపింగ్‌తోపాటు ప్రయివేటు సంస్థల ద్వారా కూడా మరికొంత మంది ఫోన్‌లు ట్యాప్ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను ఏపీ సీఎం చంద్రబాబు సేకరించి పెట్టుకున్నారు. తమ పార్టీ ప్రజా ప్రతినిధుల ఫోన్ నంబర్లు ట్యాప్ చేయడానికి పోలీసు అధికారులు అధికారికంగా రాసిన లేఖ ప్రతిని కూడా సంపాదించారు. ఈ లేఖపై తెలంగాణ ఎస్‌ఐబీ చీఫ్ సజ్జనార్, ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, హోం సెక్రటరీ బి.వెంకటేశం సంతకాలు చేసినట్టు చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ లేఖతోపాటు ఇతర ఆధారాలను చంద్రబాబు అండ్ కో బయటపెడితే సర్వీసు ప్రొవైడర్లకు రాసిన లేఖపై సంతకాలు చేసిన అధికారుల ఉద్యోగాలు పోవడమే కాకుండా, జైలుకు కూడా వెళ్లవలసి వస్తుంది. అప్పుడు వ్యవహారం అక్కడితో ఆగదు. ఇది తెలంగాణ సీఎం కేసీఆర్ మెడకు కూడా చుట్టుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము ఆ పని చేశామని పోలీసు అధికారులు విచారణలో చెబితే కేసీఆర్ చిక్కుల్లో పడతారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఉదంతం కేసీఆర్‌కు గుర్తుకు రాకుండా ఉంటుందా? నెపాన్ని అధికారుల మీదకు నెట్టి తప్పించుకోవడానికి కేసీఆర్ ప్రయత్నించే పక్షంలో పోలీసు శాఖలో తీవ్ర అలజడి ఏర్పడుతుంది. ఇకపై, ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులెవ్వరూ అమలు చేయబోరు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి విచారణను ఎదుర్కోవలసి వస్తుంది.
![]() ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్‌లను నేరుగా ట్యాపింగ్ చేయకపోయినా, తమ ట్యాపింగ్‌లో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేతోపాటు సెబాస్టియన్ ఫోన్ నుంచి చంద్రబాబుకు వెళ్లిన కాల్స్ సంభాషణలను రికార్డు చేశారు. ఈ క్రమంలోనే ఒక ఎంపీకి, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌కు మధ్య జరిగిన సంభాషణను కూడా పోలీసు అధికారులు రికార్డు చేశారు. ఈ నేపథ్యంలోనే తమ వద్ద టెలిఫోన్ సంభాషణల టేపులు ఉన్నాయని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. జరిగింది ఇది! ఓటుకు నోటు వ్యవహారంలో న్యాయస్థానంలో రేవంత్ రెడ్డికి శిక్ష పడుతుందో లేదో తెలియదుగానీ చంద్రబాబు మాత్రం తప్పించుకుంటారు. ఎందుకంటే ఆయన స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినప్పుడు డబ్బు గురించిగానీ, తమ అభ్యర్థికి ఓటు వేయమనిగానీ కోరలేదు. పైగా సంభాషణ చివరిలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమని సూచించారు. ఈ కారణంగా చంద్రబాబును దోషిగా నిరూపితం చేయలేరని న్యాయవాది కూడా అయిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వంటివాళ్లు కూడా బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులలో ఏసీబీని మరింత ఎగదోస్తే, చంద్రబాబుకు జరిగే నష్టం కన్నా కేసీఆర్‌కు జరిగే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చంద్రబాబుకు జరగాల్సిన నష్టం ఇదివరకే జరిగింది. కేసీఆర్‌కు మాత్రం కొత్త కష్టాలు ప్రారంభమవుతాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోవడం మొదలైంది. కేసీఆర్ మీడియా స్వరాన్ని తగ్గించుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఓటుకు నోటు కేసు కథ కంచికి చేరినా ఆశ్చర్యపోవలసింది లేదు. అదే విధంగా ట్యాపింగ్‌కు సంబంధించి చంద్రబాబు వద్ద ఉన్న ఆధారాలు కూడా వెలుగు చూడకపోవచ్చు. అయితే, ఇద్దరు ముఖ్యమంత్రుల జుట్టు మాత్రం కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఇద్దరు ముఖ్యమంత్రుల హితులు రంగంలోకి దిగారు. ‘చేసింది చాలు. ఇక సరిపెట్టండి’ అని హితవు చెబుతున్నారు. అయినా ముందుకు వెళితే ఏం జరుగుతుందో తెలియనంత అమాయకులుకారు మన చంద్రులు. అందుకే వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.
ఇంతకీ… ఎవరు చిత్తు?
ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఆటలో అరటిపండు అయిందెవరో చూద్దాం. ఈ జాబితాలో ముందుగా గవర్నర్ నరసింహన్ పేరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటను నమ్మిన ఆయన టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇంతటితో ఆగకుండా తనను కలిసిన ఏపీ మంత్రుల వద్ద కూడా ట్యాపింగ్ ఎవరు చేశారంటూ దబాయించారు. ట్యాపింగ్ జరిగిందని నిరూపించడానికి అవసరమైన ఆధారాలు చంద్రబాబుకు లభించడంతో, ఇప్పుడు గవర్నర్ కేంద్రం వద్ద తలదించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం అంతిమంగా ఆయన పదవికే ఎసరు తేవచ్చు. వాస్తవానికి, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టగానే ఉమ్మడి గవర్నర్‌గా ఎవరిని నియమించ మంటారంటూ చంద్రబాబును అడిగారు. అప్పట్లో ఆయన ఏ కారణం వల్లనోగానీ నరసింహన్‌నే కొనసాగించవలసిందిగా సూచించారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబుకు, నరసింహన్‌కు మధ్య వ్యవహారం ఉప్పు నిప్పు అన్నట్టుగా నడుస్తోంది. ఏపీ మంత్రులు నేరుగా గవర్నర్‌ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు తన వద్ద ఉన్న ఆధారాలు బయటపెడితే తెలుగు ప్రజల ముందు తాను తలదించుకోవలసి వస్తుంది కనుక ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కేసీఆర్‌ను నిలువరించడం ఒక్కటే మార్గమన్న ఉద్దేశంతో బుధవారం నాడు తనను కలిసిన కేసీఆర్‌కు గవర్నర్ ఉపదేశం చేసినట్టు చెబుతున్నారు. ఇక ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి రెండవ బకరాగా మిగిలారు. ఇద్దరు చంద్రుల మధ్య సాగుతున్న రాజకీయ క్రీడలో చివరకు జగన్ ఆటలో అరటిపండుగా మిగులుతారని నేను గతవారమే పేర్కొన్నాను. ఇప్పుడు అదే జరిగింది. కేసీఆర్ అండ్ కో మాటలు నమ్మి చంద్రబాబు నిజంగానే జైలుకు వెళతారనీ, ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తారనీ, ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుని తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తనతో చేతులు కలిపే అవకాశం ఉందనీ, తాను ముఖ్యమంత్రి కావచ్చుననీ జగన్మోహన్ రెడ్డి కలలు కని ఉండవచ్చు. లేదా కేసీఆర్ అండ్ కో అలా భ్రమింపచేసి ఉండవచ్చు. ఈ కారణంగానే కాబోలు గడచిన మూడు వారాలుగా చంద్రబాబుకు శిక్ష తప్పదంటూ పుంఖానుపుంఖాలుగా తన పత్రికలో వార్తలు అచ్చేశారు. చంద్రబాబు స్థానంలో ఫలానా వారు ముఖ్యమంత్రి అవుతారన్న ఊహాగానాలను ప్రజల్లోకి వదిలారు. ఊహల్లో విహరించిన జగన్‌కు బుధవారంనాటి పరిణామాలతో తత్త్వం బోధపడింది.
కేసీఆర్ మాటలు నమ్మి ఆయనకు భుజం కాయడం వల్ల ఏపీలో తనపై వ్యతిరేకత ఏర్పడుతోందన్న వాస్తవాన్ని ఆలస్యంగా గుర్తించారు. దీంతో పార్టీ ముఖ్యులను సమావేశపరచి ఓటుకు నోటు వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టి, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకుని, కుటుంబ సమేతంగా జెరూసలెం వెళ్లిపోయారు. దీన్ని బట్టి రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవలసింది ఎంతో ఉందని అనిపిస్తోంది కదా! ఇక మూడవ బకరాగా మీడియాను పేర్కొనవచ్చు. కేసీఆర్‌కు భయపడిగానీ, మరే ఇతర కారణాల వల్లగానీ అటు పత్రికలు, ఇటు చానెళ్లు గాలి వార్తలను పోగేసి ప్రచురించి, ప్రసారం చేశాయి. అవినీతి నిరోధక శాఖ సోర్స్ పేరిట ఇదిగో పులి, అదిగో తోక అంటూ కథనాలను ప్రజల్లోకి వదిలాయి. చంద్రబాబును అరెస్ట్ చేయడమే మిగిలి ఉందంటూ ప్రచారం చేశాయి. టెలిఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు లభించి ఉండకపోతే ఏమి జరిగేదో తెలియదుగానీ… ఇప్పుడు మాత్రం ఏమీ జరగకపోవచ్చునని చెప్పవచ్చు. చట్టం తన పని తాను చేసుకుపోవాలి కదా! అని అనుకుంటే అలా నమ్మిన వారిదే అమాయకత్వమే అవుతుంది. ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టడం గతంలో కూడా జరిగింది. ఇకపై కూడా జరుగుతుంది. అయితే, ఈ కేసులో వలె మీడియా ఇంత బాధ్యతారహితంగా గతంలో ఎప్పుడూ వ్యవహరించలేదు. ఇందుకు అనేక కారణాలు ఉండవచ్చు. తాము ప్రచారం చేస్తున్న గాలి వార్తలను ప్రచురించి, ప్రసారం చేయకపోతే ‘ఆంధ్రా మీడియా’ అని కేసీఆర్ సొంత మీడియా ఎక్కడ నిందిస్తుందోనన్న భయం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. ఇక నాలుగవ బకరాగా సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వారిని పేర్కొనవచ్చు. చంద్రబాబుకు వ్యతిరేకంగా, అనుకూలంగా సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారు తమలోని సృజనాత్మకతను సొంతానికి ఉపయోగించుకుంటే వారికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఇప్పుడు ఆట ముగింపు దశకు చేరుకుంది. కేంద్రం నుంచి కూడా ఆ మేరకు ఇరువురు ముఖ్యమంత్రులకు సూచనతో కూడిన హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే, ఒక్కటి మాత్రం నిజం. ఈ మొత్తం వ్యవహారం వల్ల కేసీఆర్, చంద్రబాబు పదవులకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. అయితే… ఒక రాష్ట్ర ప్రభుత్వం టెలిఫోన్‌లను ట్యాప్ చేయడం, అది బయటకు వెల్లడవడం తెలంగాణ క్షేమం దృష్ట్యా కూడా మంచిది కాదు. గుట్టుగా ఉండవలసిన చోట అత్యుత్సాహం ప్రదర్శిస్తే అంతిమంగా ఏమి జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రభుత్వాధినేతల ప్రోత్సాహంతోనే విచ్చలవిడిగా ట్యాపింగ్ చేయడం, ఆ టేపులను బయటపెట్టడం వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు కూడా భయపడే ప్రమాదం ఉంది. ఈ మాట అన్నందుకు సోకాల్డ్ తెలంగాణవాదులు నన్ను విమర్శించవచ్చుగానీ రోజులు గడిచేకొద్దీ వారికి వాస్తవం తెలిసివస్తుంది. నిజానికి, దేశంలో టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్తకాదు. దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ నిత్యం ఆ పని చేస్తూనే ఉంటాయి. గుట్టుగా అది సాగిపోతుంటుంది. ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న వివరాలను తదుపరి వ్యూహాల రచనకో, లేక విరుగుడు చర్యలకో వాడుకుంటాయి. అంతే తప్ప నేరుగా బయటపెట్టవు. కానీ, తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని ‘ట్యాపింగ్ టేపులను’ బయటపెట్టడం కొత్త అనుభవం. మొుత్తంమీద కథ కంచికి చేరుకునే దశకు చేరుకున్నట్లే అని భావించవచ్చు. కనుక ఏదో జరుగుతుందని ఆశించి భంగపడిన వారి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎటొచ్చీ చట్టాల పట్ల నమ్మకం పెట్టుకున్నవాళ్లు మాత్రం ఇదంతా చూసి ‘నీ యవ్వ. అంతా తొండి’ అని ఉడుక్కోవచ్చు! |



