యోగా’కి రాజయోగం
- 21/06/2015
- -బి.వెంకటప్రసాద్

వేల ఏళ్ల చరిత్ర ఉన్న మన యోగా వైపు నేడు ప్రపంచమంతా ఆసక్తిగా చూడటం మొదలుపెట్టింది. గతంలో యోగాను విశ్వసించేవారు, సాధన చేసే వారు, ఆచరించేవారు ఎంతో మంది ఉన్నా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21వ తేదీని యోగా దినోత్సవంగా గుర్తించడంతో ప్రపంచ వ్యాప్తంగా యోగా సంబరాలు మొదలయ్యాయి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా చెప్పుకునే యోగాను ఇపుడు ప్రపంచం యావత్తూ అక్కున చేర్చుకుంటోంది. యోగా ఐదువేల ఏళ్లుగా భారత్‌లో ప్రాచుర్యంలో ఉంది. గెలుపు స్థిరం కాదు, ఓటమితో అంతా అయిపోదు. కానీ- ప్రతి మలుపులో గెలుపును చూడాలి. ఎందుకంటే విజేతల జీవితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి. నిలకడ లేని పరిణామాల మీద హృదయాన్ని నిలబెట్టి విజయానికి అదే దారి అనుకుంటూ కలల్లో విహరించడం, ఆ దారిలో ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోవడం సమంజసం కాదు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి. అలా మనసుకు అలవాటు చేసుకోవాలి. మనసును నియంత్రించి, అది మనం చెప్పినట్టు వినాలంటే దానికి ఏకైక మార్గం యోగాభ్యాసం. అన్ని విషయాల్లో ముందు జాగ్రత్తలు పాటించే మనం ఆరోగ్యం విషయంలో మాత్రం తీవ్రమైన అలసత్వాన్ని పాటిస్తుంటాం. రోగాలు రాకుండా జాగ్రత్త పడటం మానేసి, తీరా రోగాలు వచ్చిన తర్వాత వేలకు వేలు పోసి చికిత్సలు చేయించుకుంటాం. అసలు రోగమే రాకుండా నిరోధించే దివ్య ఔషధం అరచేతిలోనే ఉన్నా మనం పట్టించుకోం. ఇంతకీ ఆ దివ్య ఔషధమే- యోగా. భారతీయ సనాతన ధర్మం నుండి ఆవిర్భవించి నేటికీ కొనసాగుతున్న ఆరోగ్య సూత్రమే యోగా. సనాతన ధర్మానికి ఆనవాలుగా నిలుస్తూ, సత్కర్మలు భోధించి సన్మార్గంలో నడిపించే వేదభూమిగా భారతదేశానికి మంచి పేరుంది. ఉపనిషత్తుల్లోని ఎన్నో అద్భుత మార్గాలతో జీవన విధానాన్ని అందించిన నేల మనది. ఈ జీవన విధానానే్న నేడు ప్రపంచం మార్గదర్శకంగా తీసుకుంటోంది. ఆ మార్గదర్శకమే యోగా రూపం. ప్రకృతిపరమైన సౌందర్యం, కోమలమైన శరీరం కావాలనుకునే అమ్మాయిలు చాలా మంది ఉంటారు. ఇలాంటి వారికి కూడా యోగా యోగదాయకమైంది. యోగా కారణంగా శరీరంలో కాంతి పెరుగుతుంది. ముఖవర్ఛస్సుతో కళ పెరుగుతుంది. శరీరంలో అవసరంలేని కొవ్వు కరిగిపోతుంది. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగంగా భావిస్తున్నా, వేల ఏళ్ల సంవత్సరాల నుండి యోగా పలురూపాల్లో ఆచరణలో ఉంది. అన్ని మతాల వారు, కులాల వారూ యోగాను సాధన చేస్తున్నారు. దాన్ని తెలుసుకుని సరైన రీతిలో సాధన చేస్తే ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. యోగా సాధనకు, ఆంతరంగిక శిక్షణకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిని ఎంతోమంది యోగులు సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా నిర్వచించారు. వేల ఏళ్ల చరిత్ర… క్రీస్తుపూర్వం వంద శకం నుండి 500 శకం మధ్య కాలంలో పతంజలి యోగా శాస్త్రాన్ని రచించారని చరిత్రకారులు భావిస్తున్నారు. ఉపనిషత్తులు, భగవద్గీతలో యోగా ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగా సూత్రాలుగా క్రోడీకరించాడు. సూత్రం అంటే దారం. దారంలో మణులను చేర్చినట్టు యోగాశాస్త్రాన్ని పతంజలి ఒక చోట కూర్చాడు. హఠయోగ ప్రదీపిక, శివసంహిత అందులో ప్రధాన భాగాలు, వీటిలో కర్మయోగ, జ్ఞాన యోగ, రాజయోగ, భక్తియోగ అంతర్భాగాలు. వ్యాసుడు రచించిన భగవద్గీతలో కూడా యోగాసనాలపై 18 భాగాలుగా వివరణ ఉంది. అసలు యోగా అంటే ఏమిటి? యోగం అంటే సాధన, యోగం అంటే అదృష్టం, భగవద్గీతలో అధ్యాయాలకు యోగాలు అని పేరు. భారతీయ తత్వశాస్త్రంలోని ఆరు దర్శనాల్లో యోగా దర్శనం కూడా ఒకటి. యోగాదర్శనానికి ప్రామాణికం పతంజలి యోగాశాస్త్రం. యుజ్ అంటే కలయిక అని అర్థం. ఇది సంస్కృతం నుండి వచ్చింది. యోగ లేదా యోగం అనే పదం యుజ్ నుండే ఉత్పన్నమైంది. యోగం అంటే ఇంద్రియాలను వశపరచుకుని, చిత్తాన్ని ఈశ్వరునిపై లగ్నం చేసుకుని మానసిక శక్తులన్నింటినీ ఏకం చేసి సామాన్య స్థితికి చేరడం లేదా పరమార్థతత్వం అర్థం చేసుకుని ఏకాగ్రతను సాధించడమే యోగా. యోగా అంటే చిత్తవృద్ధి విరోధం. స్థిరంగా ఉండి సుఖాన్ని అనుభవించడమే యోగా. యోగాభ్యాసంతో వైరాగ్యం పోతుంది, చిత్తవృత్తులు నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా మనసును మన ఆధీనంలోకి తెచ్చుకునే యోగా సాధననే పతంజలి అష్టాంగ యోగా అన్నారు. దీనినే రాజయోగం అని అలవాటుగా చెప్పుకుంటున్నాం. పతంజలి యోగా సూత్రాలు నాలుగు అధ్యాయాలు. సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అని అంటారు. మానసిక శుద్ధికి కావల్సిన యోగాలు అవి. శారీరక దారుఢ్యానికీ, ఆరోగ్య సంరక్షణకు, రోగ నిరోధానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగయోగ కూడా వివరిస్తుంది. సమాధి పద అంటే ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించడం, సాధన పద అంటే రాజయోగాన్ని సాధన చేయడం ఎలాగో తెలుసుకోవడం, విభూతి యోగ అంటే యోగ సాధనలో నైపుణ్యాన్ని సాధించడం, మోక్ష సాధన ఎలా పొందాలో తెలుసుకోవడమే కైవల్యపద. వీటన్నింటికీ ఉదాత్తమమైన మరో మార్గం అష్టాంగపద యోగం. దీనిని సాధన చేయాలంటే అనేక కఠినమైన నియమనిబంధనలను పాటించాల్సి ఉంటుంది. యమ, నియమ, ఆసన, ప్రాణయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు ఈ యోగంలో భాగంగా ఉంటాయి. అసత్యం పలకరాదు, హింసకు పాల్పడరాదు, బ్రహ్మచర్యం పాటించాలి, మద్యం తాకరాదు వంటి పలు కఠినమైన నిబంధనలు ఉంటాయి. శుభ్రత పాటించడం, సంతోషంగా, ఆనందంగా ఉండటం కూడా ఈ యోగా చేయాలంటే అనివార్యం. మనిషికి జ్ఞానం, విజ్ఞానం, అర్థం తెలియజెప్పే మహత్తర సూత్రం యోగం. ప్రతి మానవుడి శరీరంలో షట్చక్రాలు అనే నాడీ మండలాలు 6 ప్రధానంగా ఉంటాయి. మానవుడిలో ఉండే ప్రాణశక్తి కారణంగా అతడు సజీవంగా ఉండగలుగుతాడు. ఆ ప్రాణశక్తిని కొన్ని పద్ధతుల ద్వారా ప్రేరేపించడం వల్ల శరీరంలో సహజంగా శక్తి వెలువడుతుంది. వెలువడే ఆ శక్తి పేరే కుండలినీ శక్తి. ఆ శక్తిని ప్రేరేపించడం వల్ల మానవుడికి శారీరక ఆరోగ్యం చేకూరడమే గాక, ఆత్మజ్ఞానం కలిగి సమాధి స్థితిలో బ్రహ్మానుభూతిని పొందగలుగుతాడు. ఆధునిక కాలంలో భారతీయ, పాశ్చాత్య పండితులు ఎందరో ఎన్నో రకాలుగా యోగాభ్యాస ప్రక్రియలను, యోగాసనాలను ఒక క్రమపద్ధతిలో అమర్చి సామాన్య ప్రజలకు అందిస్తున్నారు. తీవ్రమైన ఒత్తిడితో జీవితాలు గడుపుతున్న ఆధునిక సమాజం దీని వల్ల ఎంతో ప్రశాంతత పొందుతోందని పరిశోధనల్లో, స్వానుభవాలతో తేటతెల్లమైంది. ఇతర వ్యాయామాలు శారీరక దారుఢ్యాన్ని మాత్రమే మెరుగుపరచడంపై దృష్టి సారిస్తాయి. యోగాభ్యాసం మాత్రం ధ్యానం, ప్రాణాయామం వంటి ప్రక్రియలతో మానసిక ప్రశాంతతకు, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. మానసిక వత్తిడులు తగ్గించడం, హృద్రోగం, రక్తపోటును అదుపు చేయడం, వ్యాధుల తీవ్రతను తగ్గించడానికి తోడ్పడుతుంది. మనం దేవుళ్లను గమనించినపుడు వారు ఏదో ఒక యోగాసనంలోనే మనకు దర్శనం ఇస్తారు. యోగాపై పురాణాలు, ఇతిహాసాల్లో కూడా ప్రస్తావన ఉంది. దేవదేవుడైన ఈశ్వరుడు తపస్సు చేస్తున్నపుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్టు పురాణాల్లో వర్ణించారు. లక్ష్మీదేవి ఎప్పుడూ పద్మాసినియే, మహావిష్ణువు నిద్రను యోగనిద్ర అంటారు. బౌద్ధ సంప్రదాయంలోనూ, జైన సంప్రదాయంలోనూ యోగా ప్రధానపాద్ర పోషిస్తోంది. ఆశ్చర్యకరం ఏమంటే సింధు నాగరికతలో కూడా యోగా చిత్రాలను మనం గమనిస్తాం. ఇతర వ్యాయామాల కంటే భిన్నమైనది, నిబిడీకృతంగా ఆధ్యాత్మిక భావం ఉన్నది యోగాభ్యాసం. ఇదే కారణంతో దేశవిదేశాల్లో యోగాకు విశేష ప్రాచుర్యం లభించింది. తేలికగా ఆచరించదగింది కావడంతో పాశ్చాత్యదేశాల్లో కూడా యోగాకు మక్కువ పెరిగింది. దీంతో భారతీయ సంప్రదాయక యోగా నిపుణులు ఇతర దేశాల్లో కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి యోగా హిందువుల ధ్యానమార్గంగా భావించడం కూడా ఇటీవల వివాదాలకు దారితీస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సూర్యనమస్కారాలకు ఇటు క్రైస్తవుల నుండి అటు ముస్లింల నుండి అభ్యంతరాలు వ్యక్తమవడం గమనార్హం. యోగా దినోత్సవం సందర్భంగా దిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించే కార్యక్రమంలో ఐక్యతను చాటుకునేలా ముస్లింలు పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వివాదం లేకుండా చూడటానికి అధికారికంగా యోగా కార్యక్రమం నుండి సూర్య నమస్కారాలను తొలగించామని, నిజానికి వాటికి మతంతో ఎలాంటి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. మొత్తం కార్యక్రమం సజావుగా జరగాలన్నదే తమ సంకల్పమని పేర్కొంది. శ్లోకాలు తప్పనిసరేమీ కాదని, వాటికి బదులు అల్లా అని ముస్లిం మతస్థులు వల్లించుకోవచ్చని కూడా సూచించింది. యోగా దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించడంపై కూడా కొన్ని మైనార్టీ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముస్లింలు ఆచరించే నమాజ్- యోగా కాకున్నా, అందులోనూ యోగా ఉందని, నిజానికి యోగాను వ్యతిరేకించేవారు మానవాళికే శత్రువులని, యోగాకు మతానికి అస్సలు సంబంధమే లేదని మజ్లిస్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు వౌలానా సయ్యద్ కౌకబ్ మఖ్తాబా అంటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మద్దతు తెలిపిన 177 దేశాల్లో 47 దేశాలు ఇస్లామిక్ దేశాలేనని గుర్తుచేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. వివిధ వర్గాల విమర్శలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మతాలకు, వివాదాలకు అతీతంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని భావించింది. ఈ సందర్భంగా నిర్వహించే రెండు కార్యక్రమాలు ప్రపంచ రికార్డును నమోదు చేయబోతున్నాయి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు సంస్థకు కూడా ప్రభుత్వం ఈ విషయమై సమాచారాన్ని పంపించింది. ఆయుష్ సంస్థ ఈ మేరకు రెండు రికార్డులను నమోదుచేయాల్సిందిగా గిన్నీస్ రికార్డ్సు సంస్థను కోరింది. 651 జిల్లాల్లో… అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భం గా ఈ నెల 21న దేశ రాజధానిలో యోగా ప్రదర్శనలు భారీ ఎత్తున జరుగుతాయి. రాజ్‌పథ్‌లో ఆ రోజు ఉదయం జరిగే కార్యక్రమంలో 45 వేల మంది పాల్గొంటారు. మొత్తం 15 ఆసనాలను 35 నిమిషాల పాటు వేస్తారు. ప్రధాని నరేంద్రమోదీ హాజరై యోగా విశిష్టతను వివరిస్తారు. దేశ వ్యాప్తంగా 651 జిల్లాలతో పాటు దిల్లీ నగరంలోనూ పెద్ద సంఖ్యలో యోగా శిబిరాలు నిర్వహిస్తారు. పాఠశాలల్లో యోగా, సూర్య నమస్కారాలు చేయిస్తారు. సూర్యనమస్కారాలు అభ్యంతరమైతే హిందూయేతర మతస్థులు వారి మతాలకు చెందిన బోధనలను చదువుకోవచ్చు. రాజ్‌పథ్‌లో యోగా దినోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ దేశాల రాయబారులు పాల్గొంటారు. టైమ్ స్క్వేర్‌లో.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ మన్‌హట్టన్‌లోని టైమ్‌స్క్వేర్‌లో యోగా కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే ప్రధాన కార్యక్రమం ఇది. సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ అధ్యక్షత వహిస్తారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు శ్యాంకుటిసా కూడా దీనికి హాజరవుతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ప్రత్యేక ఉపన్యాసం ఇస్తారు. టైమ్ స్క్వేర్ నుండి అనేక కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ, యోగాకు అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. 193 దేశాలకు ప్రాతినిధ్యం ఉన్న ఐరాసలో ఆయన చేసిన ప్రతిపాదనను 177 దేశాలు బలపరిచాయి. సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానానికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు రావడం ఇదే తొలిసారి. అలాగే, సమితిలో కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఒక ప్రతిపాదన తీర్మానంగా రూపుదిద్దుకోవడం కూడా ఇదే ప్రథమం. గత అక్టోబర్ 22న తీర్మానం ఆమోదించారు. మొదటి యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓవర్సీస్ వాలంటీర్స్ ఫర్ బెటర్ ఇండియా ఆధ్వర్యంలో అమెరికాలోని వంద నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందుకొచ్చిన కార్పొరేట్లు.. యోగా పట్ల అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని యోగా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అనేక కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. మొబైల్ అప్లికేషన్లు రూపొందిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు బ్లాగ్‌లు, పోర్టళ్లు ప్రారంభించాయి. సమయ పరిమితి మినహాయింపు.. రోజా ఇఫ్తార్ తర్వాత కూడా యోగా చేయాలని భారత్‌లోని ముస్లిం వర్గాలు భావిస్తే అలాగే చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తాము నిర్దేశించిన సమయం కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు, ఇతర సంస్థలకు మాత్రమేనని మిగిలిన వారు తమకు అనుకూలమైన సమయంలో చేసుకోవచ్చని పేర్కొంది. సూర్య నమస్కారాలను వ్యతిరేకించే వారు తమ మతానికి చెందిన ప్రవచనాలను మననం చేసుకోవచ్చని కూడా పేర్కొంది. ముస్లిం మతస్థులు నమాజ్ చేయడం అంటే యోగా చేయడం వంటిదేనని యోగా, ఏ ఒక్క మతానికో పరిమితం అయింది మాత్రం కాదని పేర్కొన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ ప్రత్యేక స్టాంప్‌ను విడుదల చేస్తుంది. 10 రూపాయలు, వంద రూపాయలు విలువ చేసే నాణాలను కూడా ఆర్థిక శాఖ విడుదల చేయనుంది. అన్ని రాష్ట్రాల్లోనూ యోగా కార్యక్రమం ఉదయం 7.00 నుండి 7.35 గంటల వరకూ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆసనం ప్రధానం.. యోగాలో ఆసనం అనేది ఒక కీలక ఘట్టం. ఆసనం అంటే ఒక భంగిమ. మానవ శరీరం అసంఖ్యాకమైన భంగిమలను తీసుకోగలుగుతుంది. అందుకు తగ్గట్టు శరీర నిర్మాణం ఉంటుంది. క్రమపద్ధతిలో హృదయానికి, శరీరానికి ఉపయోగపడే భంగిమలను ఆసనాలుగా గుర్తించారు. జీవితాన్ని ఒక ఉన్నతమైన పార్శ్వానికి తీసుకువెళ్లేది లేదా ఉన్నతమైన అవగాహనను అందించేది యోగా. అందువల్ల ఎలాంటి భంగిమ అయితే మనల్ని ఉన్నత అవకాశాల వైపు తీసుకువెళ్తుందో దానినే మనం యోగాసనం అంటున్నాం. మనకు తెలిసి, అలవాటుగా చేసుకుంటున్న యోగాసనాలు చాలా తక్కువ. తెలియనివి చాలా ఉన్నాయి. శరీర వ్యాయామ విధానాలే యోగాసనాలు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రంగాల్లో మనిషి శుద్ధి కావడానికి ఇవి దోహదపడతాయి. ముక్తికి మార్గం.. దైనందిన జీవితంలో శరీరం సహజంగానే ఒక భంగిమను ఎంచుకుంటుంది. అపుడే మనం ఆనందంగా ఒక విధంగా కూర్చోగలుగుతాం. ప్రశాంతంగా లేనప్పుడో, కోపంగా ఉన్నపుడో మనం మరో విధంగా కూర్చుంటాం. ఎవరైనా ఎలా కూర్చున్నారన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని వారి మనసు లోపల ఏం జరుగుతుందో చెప్పేయవచ్చు. అయతే, యోగాసన శాస్త్రం ఇందుకు భిన్నమైన సూచన చేస్తుంది. చేతనంగా శరీరాన్ని ఒక నిర్దిష్ట భంగిమలోకి తీసుకువెళ్లి చైతన్యాన్ని పెంచేలా చేస్తాం. ఒక నిర్దిష్ట పద్ధతిలో కూర్చోవడం ద్వారా ఆలోచించే విధానాన్ని మనం మార్చుకోవచ్చు. యోగాసనాల్లో చైతన్యాన్ని పెంచే ప్రాథమిక ఆసనాలు 84 ఉన్నాయి. అవి 84 శరీర భంగిమలని మాత్రం కాదు. ఇవి ముక్తి సాధించడానికి తగిన వ్యవస్థలు లేదా సరైన మార్గాలు. యోగాసనంలో ప్రావీణ్యం ఉంటే చాలు ఈ సృష్టిలో తెలుసుకోదగినవన్నీ తెలుసుకోవచ్చు. యోగాసనాలు కేవలం వ్యాయామ ప్రక్రియలు మాత్రమే కాదు. ప్రాణశక్తిని ఒక నిర్దిష్ట దశలో నడిపించే సున్నితమైన ప్రక్రియలు. వీటిని ఒక స్థాయి ఎరుకతో చేయాల్సి ఉంటుంది. యోగా సూత్రాల్లో పతంజలి ‘సుఖం స్థిరం ఆసనం’ అని అన్నారు. మీకు ఏ ఆసనమైతే అత్యంత సౌకర్యవంతమైనదో, అత్యంత స్థిరమైనదో అదే మీ ఆసనం. మానవ శరీరం పూర్తి ఉత్తేజంతో, సమతుల్యతతో ఉంటే అప్పుడు ఎవరైనా ఊరికే కూర్చున్నా ధ్యానంలోనే ఉంటారు. ఆసనం అనేది సహజసిద్ధంగా ధ్యానంలో ఉండటానికి మనం వేసే ఒక సన్నాహక అడుగు. అందుకే ఆసనాలు చురుకైన ధ్యానమార్గాలు. యోగా సాధనతో శరీరంలోని జీవక్రియలను నియంత్రిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నేడు మనిషి జీవనకాలం పెరిగినా, బతికినన్ని రోజులూ అనేక రోగాలతో బాధపడుతూ ఎంతోమంది రోజూ నరకం అనుభవిస్తున్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం యోగా సాధనే. రోగం వచ్చిన తర్వాత పరుగులు తీసేకంటే రాకుండానే శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి యోగా తోడ్పడుతుంది. ఎక్కువ మంది ప్రాణాయామం, శవాసనం చేస్తుంటారు. వీటివల్ల చాలా లాభాలు ఉన్నా, ఆచరించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని యోగులు చెబుతున్నారు. యోగా ఇపుడు భారతీయులకో పెద్ద పండగ. సగటు భారతీయుడి ఆరోగ్యమే భారతదేశ ఆరోగ్యం. అదే దేశ సమర్థతకు, సామర్థ్యానికి చుక్కాని అవుతుంది. *** ప్రచారకర్తలు యోగాపై ప్రచారం కోసం ఇప్పటికే సినిమా, క్రీడలు, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీల సేవలను ఉపయోగించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయంచింది. యోగా దినం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖ వ్యక్తులు ఇప్పటికే మీడియాలో ప్రచారం ప్రారంభిం చారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, నటి శిల్పాశెట్టి, ప్రముఖ క్రికెటర్ విరాట్ కొహ్లీ లాంటి వారిని యోగాకు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారు. మోదీ ప్రత్యేకత ఇంటర్నేషనల్ యోగా డే పురస్కరించుకుని ఈ నెల 21న భారీ కార్యక్రమం జరుగుతున్నా, తొలి నుండి ప్రధాని నరేంద్రమోదీకి యోగాసనాలపై మక్కువ ఎక్కువ. గుజరాత్ సిఎంగా ఉన్నపుడు కూడా ఆయన ప్రతిరోజూ తెల్లవారుజామున విధిగా యోగాసనాలు వేసేవారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం తప్పకుండా యోగాసనాలు వేయాలని, తద్వారా వారి పనితీరు మెరుగుపడుతుందని ఆయన అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. మనుషులంతా ఒక్కటే అనే భావన కూడా యోగా కారణంగా కలుగుతుందని మోదీ విశ్వసిస్తారు. యోగా శారీరక, మానసిక వికాసానికి, సమాజ శాంతికి దోహదం చేస్తుందని, ఒత్తిడి నుంచి దూరం చేస్తుందని ఆయన నమ్ముతారు.

