గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
152- 100 అధ్యాయాల రామాయణం రాసిన మెంధ కవి .
భర్త్రు మెంద గా ప్రసిద్ధుడైన ఈ కవిని కొందరు కాళిదాసు కంటే ఘనుడు అని తమకావ్యాలలో పేర్కొన్నారు .మెంద అనే పదానికి అర్ధం ఏనుగును నడిపే మావటి వాడు అని .జల్హనుడు తన సూక్తి ముక్తావళి లో రాజ శేఖరుడు ఈ విషయం పై రాసిన శ్లోకాన్ని ఉదాహరించాడు .మిగిలిన చరిత్రకారులు కూడా ఈకవిని మెంద అనే పేరుతోనే పిలిచారు .’అతని ’హస్తి పాల ‘’మొదలైన వాటిలో అడవి ఏనుగులను ఏ విధం గా మాటు పెట్టి గోతులలో పడేట్లు చేస్తారో వివరింప బడి ఉంది .దీన్ని బట్టి మెంద కు కు ఈ విద్య తో సంబంధం ఉన్నట్లు తోస్తుంది .
కల్హణుడు మెంద ను కాశ్మీర్ రాజు మాతృ గుప్తుని ఆస్థానం లో ఉన్నట్లు రాశాడు .మాతృ గుప్తునికాలం క్రీ శ.430 గా భావిస్తే ఈకవి ఆ కాలం లో జీవించాడని చెప్పచ్చు . మృచ్చ కటికం ‘’లి౦ఫ తీయ తమొంగూని ‘’అనే ప్రసిద్ధ శ్లోకం లో ను ,అవిమారకుని బాల చరితం లోను ,కావ్యాదర్శం లోను ,సారంగ ధర పద్ధతిలోను విక్రమాదిత్యుడు ,మెంధతో కలిసి కావ్యం అల్లినట్లు ఉంది .దీనితో మళ్ళీ కాలానికి గొళ్ళెం పెట్టాల్సోస్తోంది .ఏతా వాతా తేలిందేమిటంటే మెందకవి విక్రమాదిత్యుని కాలం వాడే నని .మంఖ కవి ‘’శ్రీ కంఠ చరిత్ర ‘’లో మెందను సుబందు ,భారవి, బాణులతో తో ముడిపెట్టాడు.రాజ శేఖరుడు మాత్రం ఆయన్ను వాల్మీకి అవతారం ఆ తర్వాత భవ భూతి అవతారమని చివరికి తాను కూడా మెంద అవతారాన్నే అని మెచ్చుకొని చెప్పుకొన్నాడు .దీన్ని బట్టి మెంద కవి 100 అధ్యాయాల ‘’రామ చరిత్ర ‘’రాశాడని తేల్చారు .దీని వ్రాత ప్రతి నకలు ఇప్పటికీ బెనారస్ విశ్వ విద్యాలయం లో భద్రం గా ఉందని క్రిష్ణమాచారియార్ రాశారు . .
153-సరస్వతీ పుత్ర-భట్టార హరిశ్చంద్ర
హర్ష చరిత లో బాణ కవి భట్టార హరిశ్చంద్ర కవి ని మెచ్చుకొన్నాడు .హరిశ్చంద్రకవి ‘’మాలతి ‘’అనే ప్రేమ కావ్యం రాశాడు .కనుక ఇతను ఐదవ శతాబ్ది కవి అని అనుకోవచ్చు .’’సదుక్తి కర్ణామృతం’’ లో ఈకవి మహాద్భుత కవిగా పేర్కొన బడ్డాడు .మహా కవుల సరసన చేర్చారు .చాటు పద్యాలలో ఈ కవి శ్లోకాలు విశేషం గా కనిపిస్తాయి .ఈ భట్టార హరిశ్చంద్ర కవి దిగంబర జైన మతానికి చెందినవాడు .తండ్రి ఆర్ద్ర దేవుడు .తల్లి రాధ .సోదరుడు లక్ష్మణ .వీరిది కాయస్తకులం లోని సనోముఖ కుటుంబం .ఈ కవి పాండిత్య ప్రకర్షకు ‘’సరస్వతీ పుత్ర’’ బిరుదం అందుకొన్నాడు .ఈకవిని రాజశేఖరుడు ‘’కర్పూర మంజరి ‘’లో పేర్కొన్నాడు .ఇతను ‘’ధర్మ సార మహాభ్యుదయం ‘’అనే 21 ఖండాల కావ్యాన్ని పదిహేనవ తీర్ధ౦కరుడైన ధర్మ నాధుని జీవిత చరిత్రగా రాశాడు .ఇందులో ధర్మపాలుని జననం నుండి నిర్వాణం దాకా వర్ణించాడు .నాయకుడైన ధర్మనాధుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రత్న పుర రాజు మహాసేనుడు భార్య సువ్రతి ల కుమారుడు .హరిశ్చంద్ర కవి కవిత్వం మాధుర్యానికి నిలయం .స్వచ్చమైన తేట యైనకవిత్వం రాశాడు .
భట్టార హరిశ్చంద్ర కవి ‘’జీవనాధార చంపు ‘’ను కూడా 13 లంభాలలో జైన రాజు జీవనాదారుని జీవిత చరిత్ర గా రాశాడు.ఈ జీవనాధరుడు సత్య౦ధర రాజు కుమారుడు .ఇందులో కవి ఉపయోగించిన భాష ఆకర్షణీయం గా ,అత్యుత్తమంగా ఉందని విమర్శకులు కీర్తించారు .టి ఎస్ .కుప్పుసామి గారు ఈకవి ‘’జీవనాధార చరిత్రం ‘’అనే నాటకం కూడా రాశాడని తెలియ జేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-6-15 –ఉయ్యూరు

