పుల్లెల’కు నగరంతో విడదీయని బంధం
- 25/06/2015
హైదరాబాద్, జూన్ 24: ప్రముఖ సాహితీవేత్త, సంస్కృత భాషలో నిష్ణాతుడు పుల్లెల శ్రీరామచంద్రుడికి నగరంతో విడదీయలేని బంధం ఉంది. తూర్పు గోదావరి జిల్లా హిందూపల్లి వాస్తవ్యులైన ఆయన కొంతకాలం స్వస్థలంలో పనిచేసినా, ఆ తర్వాత నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో లెక్చరర్‌గా చేరి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అత్యుత్తమ సేవలందిస్తూ క్రమంగా ప్రొఫెసర్‌గా, ఆ తర్వాత సంస్కృత విభాగానికి అధిపతిగా ఎదిగి మరువలేని సేవలందిస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. జి.పుల్లారెడ్డి ట్రస్టు తరపున భాషా వికాసం, సాహితీ, సంస్కృతి పరిరక్షణల కోసం నగరం వేదికగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. దీంతో పాటు సంస్కృత భాష ప్రచారం, దాన్ని వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేసిన ప్రముఖుల్లో పుల్లెల ఒకరు. బుధవారం సాయంత్రం ఆయన కనుమూశారన్న సమాచారం తెలవటంతో ఐఏఎస్ అధికారి జెఎస్వీ ప్రసాద్‌తో పాటు పలువురు సాహితీప్రముఖులు జూబ్లీహిల్స్ ఐటికాలనీ సమీపంలో ఉన్న ‘నందనవనం’ భవన సముదాయంలోని ఆయన నివాసానికి చేరుకోవటంతో అక్కడ విషాదం అలముకుంది. పలువురు ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకున్నారు. సంస్కృతాంధ్ర భాషలో ఆయన చేసిన రచనలు, భాష వికాసం కోసం చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. మొత్తం 25 రచనలు చేసి, అందులో ఓ రచనకు రాష్టప్రతి పురస్కారాన్ని పొందారు. రచనల్లో ఎక్కువ అనువాదాలు చేశారు. సంస్కృతం, తెలుగు భాషల్లో తనకున్న పట్టును నిరూపించుకున్నారు. అంతేగాక, వాల్మీకి రామాయణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదించిన గొప్ప సాహితీవేత్త పుల్లెల శ్రీరామచంద్రుడు.
పాలగుమ్మి పద్మరాజు ఆదర్శనీయుడు
కాచిగూడ, జూన్ 24: ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు శతజయంత్యుత్సవ సమాపన సభ తెలుగు రథం, శ్రీవేదగిరి కమ్యూనికేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా సిక్కిం మాజీ గవర్నర్ వి.రామరావు విచ్చేశారు. పాలగుమ్మి పద్మరాజు మానవీయ విలువలు కట్టుబడిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన రచనలు నేటి తరానికి తెలియజేయ వలసిన అవసరం ఉందని అన్నారు. కవిగా, చిత్ర రచయితగా, నవల నాటకకర్తగా ఎన్నో పురస్కారాలను అందుకున్నారని తెలిపారు. ‘బంగారుపాప’, ‘అంతర్జాతీయ కథకుడు’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశ్వసాహితి అధ్యక్షుడు డా.పోతుకూచి సాంబశివరావు, లేఖిని మహళ చైతన్య సాహితీ సంస్థ అధ్యక్షురాలు డా.వాసా ప్రభావతి, రచయిత విహారి, పాలగుమ్మి సీత, పాలగుమ్మి రత్న, సంస్థ అధ్యక్షుడు కొంపెల్లి శర్మ, డా.వేదగిరి రాంబాబు పాల్గొన్నారు.

