గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
156-రామ చరిత్ర రాసిన అభినంద
సదానదుని కుమారుడైన అభినందుడు .ఉదయ సుందరి అనే కావ్యం లో సోద్దాలుడుఅనే కవి అభినంద కవిని ,రా జ శేఖరుడిని అభినందించాడు .దీనివలన అభినందన తర్వాతి వాడే రాజ శేఖరుడు అని తెలుస్తోంది .పదకొండవ శతాబ్ది పూర్వార్ధం లో సోద్దాలుడు జీవి౦చిఉన్నాడని యువ రాజు హర వర్ష అతనికి ఆశ్రయ మిచ్చాడని ,మహా గౌరవం గా చూసుకోన్నాడని తెలిసింది .కవి గొప్పతనాన్ని గుర్తించి హరవర్ష అర్ధ సింహాసనాన్ని అందించాడనీ కధనం .సోద్దాలక ,అభిన్దలు రాజా హర వర్ష ను విక్రమాదిత్య ,హాల ,శ్రీ హర్ష ల తో పోల్చారు .అభినందన రాసిన’’ రామ చరిత’’ లో హర వర్ష ను యువ రాజ దేవునిగా ,విక్రమాదిత్యుని కుమారుడిగా ,పాల వంశ బీజమైన ధర్మ పాలుని సంతతి వానిగా చెప్పాడు .
బెంగాల్ చరిత్రలో పాల వాంశ రాజు ధర్మ పాలుడు ప్రసిద్ధుడు .అతిని ఇద్దరు కొడుకులు త్రిభువన పాల ,దేవ పాల లు .మాన్ఘీర్ చరిత్రలో త్రిభువన పాలుడు యువ రాజు గా పేర్కొన బడింది .కాని తండ్రి తర్వాత దేవపాలుడే రాజ్యానికి వచ్చాడు .తొమ్మిదవ శతాబ్దపు రెండవ భాగం లో దేవపాలుడు ఖ్యాతి పొందిన రాజు అయ్యాడు ..రాజా దేవపాలుడే యువరాజు హర వర్ష అని రామ సామి శిరోమణి పరిశోధన లో తేలింది .ఇతడే యువ రాజ దేవుడు ..పాల వంశపు వాడికి హర వర్ష అనేకొత్త పేరు ఎలా వచ్చింది అనే సందేహం ఉంది .దీనికి సమాధానమూ చెప్పారు .ధర్మ పాలుడు రాష్ట్ర కూట రాచ కన్య కామ దేవి ను పెళ్లి చేసుకొన్నాడు . రాష్ట్ర కూట రాజులకు పేరు చివర హర్ష అని టాగ్ తగిలించుకోవటం ఒక ఫాషన్ .అందుకే అత్తవారింట్లో ఉన్నప్పుడు దేవపాలుడి పేరు హర వర్ష గా వాళ్ళు పిలుచుకోవటం ప్రారంభించి ఉంటారు అదేచివరికి స్తిరపడి పోయింది .కాని ఇతని పెద్దన్న త్రిభువన పాలుడు తండ్రి ధర్మపాలుని రాజ దర్బారులో యువరాజుగా చలామణి అయ్యాడు . దీన్ని బట్టి అభినందన కవి తొమ్మిదవ శతాబ్ది పూర్వార్ధం వాడు అని తేల్చారు .
అభినందన రాసిన ‘’రామ చరిత’’ ను భోజుడు ,మమ్మటుడు మహిమ భట్టు పొగిడారు దీనితో అతని ప్రశస్తి ద్విగుణీక్రుతమైంది .ఇది రామాయణ కద యే.బరోడా ప్రతిలో కావ్యం చివరినాలుగు కాండలలో అభినందన ,భీమ కవుల హస్తం ఉందని అనిపిస్తుందట .ఈ భీమకవి ఎవరో అజ్ఞాత కవి .అభినంద కవి అసంపూర్తిగా వదిలినకావ్యాన్ని నాలుగు కాండాలను అదనం గా చేర్చాడు అనుకోవాలి .మొత్తం 36 కాండలలో చాలాభాగం అభినంద కవి రాసినవే .కదా భాగం తోబాటు తనకు ఆశ్రయ మిచ్చిన రాజుల ప్రశంస చేశాడు .దీనితో బాటు తన రచనా చమత్క్రు తినీ చెప్పుకొన్నాడు తీర్ధం ,స్వార్ధం గా .విషయ వివరణలో స్పష్టత చిక్కని కవిత్వం ,కవితా వినోదం తో అభినంద కవి రాసిన రామ చరిత కావ్యం అలరారు తుంది .
157కాదంబరి కదా సారం రాసిన –మరో అభినంద కవి
ఇప్పటిదాకా తెలుసుకొన్న రామ చరిత రాసిన అభినంద కవి కాక ,మరో అభినందుడున్నాడు .ఇతనిని ‘’గౌడాభినందనుడు ‘’అంటారు.వీరి వంశం గౌడ దేశం లో ఉండేది .వీరిలో శక్తి అనే వాడు కాశ్మీర దేశం కు చేరేదాకా ఆ పేరుతోనే పిలువ బడ్డారు . శక్తి ఇక్కడికొచ్చి ,దర్వాభి సార లో ఒకమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .శక్తి మనవడు శక్తి స్వామికాశ్మీర్ రాజు లలితాదిత్యముక్త పాద అనే కర్కోటక వంశ రాజు ఆస్థాన మంత్రి .ఇతని పరిపాలన కాలం 726.శక్తి స్వామికి అభినంద అయిదవ తరం వాడు .జల్హనుడు తన సూక్తి ముక్తావళి లో అభినంద ను రాజ శేఖరుని సమకాలికునిగా చెప్పాడు .అభినవ గుప్తుడు కూడా తన లోచన లో ఇతని గురించి చెప్పాడు .కనుక ఈ అభినంద కవి తొమ్మిదవ శతాబ్ది వాడు అని నిర్ణయించారు .కాని అభినంద కవి తండ్రి జయంతుడు న్యాయ మంజరిలో దామోర గుప్తుని కుంతిని మాతను శృంగారం తో వర్ణించటం తప్పు పట్టాడు .శంకర వర్మ ఆ నాటి కాశ్మీర్ రాజు అన్నాడు .శంకర వర్మ 884నుండి రాజ్యం చేసినట్లు ఉంది .ఇది అభినందన కాలాన్ని కొంచెంతర్వాతి కాలానికి తెచ్చింది .అంటే పదవ శతాబ్దపు మొదటి వాడు అయ్యాడు .ఇతను ఎనిమిది కాండలలో రాసిన కాదంబరి కదా సారం బాణకవి వచనం లో రాసిన కాదంబరి కధే .ఈ కావ్యాన్ని తర్వాతి కవులు చాలా చాటువులలో పొగిడారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 27-6-15-ఉయ్యూరు

