గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2
158-యుదిష్టిర విజయం రాసిన వాసుదేవకవి
వాసుదేవకవి ‘’రవి’’ కుమారుడు .మహా భట్ట భట్టాత్రి అనే భారత్ గురువు కు శిష్యుడు .తిరువాన్కూర్ లో విపర సత్తామ లో ఉండేవాడు .మలబారు తీరం కధనం ప్రకారం తన గురువు గారి శిష్యులు చదివే పురాణాలను శాస్త్రాలను వినటం అంటే వాసు దేవుడికి ఇష్టం గా ఉండేది .కాని చదువుకోవాలని ఉన్నా శబ్దాలను సరిగ్గా పలికే వాడు కాదట .’వాసు ‘’అనటానికి బదులు ‘’వాతు ‘’అని పలికే వాడు .ఒక రోజు తిరువలక్కావు దేవాలయం నుండి వాసు దేవ ఇంటికి తిరిగి వస్తూ ఉంటే విపరీతంగా వర్షం కురిసింది .ఒక బోటు ఎక్కి సుళ్ళు తిరుగుతున్నవరద నీటి ప్రవాహం దాటే ప్రయత్నం చేశాడు .కాని అసాధ్యం అని భావించి మళ్ళీ దేవాయానికే చేరుకొన్నాడు .అక్కడే ఆ రాత్రి గడిపాడు .బయట వర్షం తీవ్రం గా కురుస్తూనే ఉంది .ఒంటిమీద తడిసిన పంచె తప్ప ఏమీలేదు .ఆకలి విపరీతంగా ఉంది .తన ఇలవేలుపైన ఆ దేవిని ప్రార్ధించాడు .దయతో చలికాచుకోవటానికి కట్టెల మంట ఏర్పరచింది దేవి. తినటానికి కొన్ని అరటి పళ్ళు కూడా ప్రసాదించింది .ఆ పళ్ళు తినగానే వాసుదేవునికి మహా గొప్ప కవిత్వం ఆశుదారగా వచ్చేసింది .మహా కవి అయిపోయాడు .ఉదయమే వచ్చిన దేవాలయ పని మనిషి అది గమనించి అతనిని అరటి తొక్కలను ఎక్కడ పారేశాడో తెలుసుకొని వెళ్లి తెచ్చుకొని తినేసింది . ఆశ్చర్యం గా ఆమె నోటి వెంబడి అమోఘమైన కవిత్వం జాలు వారింది .కవయిత్రి అయిపొయింది .ఆ తర్వాత రాజా కులశేఖర ,రాజా రాము ల ఆస్థానం లో వాసుదేవకవి తొమ్మిదవ శతాబ్దం లో ఉన్నాడు .
దేవి కృపతో మహాకవిఅయిన వాసుదేవ ‘’యుదిష్టిర చరితం ‘’ అనే ఎనిమిది కాండలలో ఆర్యా వృత్త శ్లోకాలలో కావ్యం రాశాడు .అందులో తన రాజు కులశేఖరుడు అని తెలియ జేశాడు .పాండురాజు వేట తో ప్రారంభించి ధర్మరాజు పట్టాభి షేకం తో కావ్యం ముగించాడు . అక్షింబ శిష్యుడైన చొక్కనాధుడు దీనికి వ్యాఖ్యానం రాశాడు .శ్రీరంగానికి దగ్గరలో ఉన్న శాత నూర్ కు చెందిన సుదర్శన కూడా ఈ కావ్యం పై వ్యాఖ్య రాశాడు .
శౌరికాధోదయ ,త్రిపురదహనం కావ్యాలలో రాజు రామ అని పేర్కొన బడింది .మొదటికావ్యం శ్రీకృష్ణుని జననం నుండి బాణాసుర వధ వరకు ఉన్న శ్రీ కృష్ణ కద. దీనికి హరివంశం మూలం .నీల కంఠుడుదీనికి వ్యాఖ్య రాశాడు .ఇతడు ముక్తిస్తలానికి చెందిన ఈశానుని కుమారుడు ..రెండవ కావ్యం త్రిపురాలను దహించిన శివ గాధ.దీనికి నిత్య ప్రియుడు అని చెప్పుకొన్న కవి వ్యాఖ్యానం రాశాడు .వాసుదేవుడు రాసిన ఈ మూడు కావ్యాలు యమకం లో ఉండిబాగా రాణిం చాయి .ఇటీవలి పరిశోధనలలో కాళిదాసు రాసినట్లు భావిస్తున్న ‘’నలోదయ ‘’కావ్యాన్ని కూడా వాసుదేవ రచించి ఉంటాడని భావిస్తున్నారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-15-ఉయ్యూరు

