గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2
162- కొంకణ రాయబారి -మంఖ కవి
మంఖ కవికి మంఖక ,మంఖూక అనే పేర్లు కూడా ఉన్నాయి .కాశ్మీర్ దేశం లో పుట్టాడు తండ్రి విశ్వా వర్తుడు .సోదరుడు అలంకారుడు కూడా కవే కాక కాశ్మీర్ రాజులు సుసాల ,జయ సింహ రాజుల ఆస్థానం లో మంత్రికూడా .రాజా జయసింహ 1127-1150కాలం లో కాశ్మీర్ ను పాలించాడు .మంఖ కవి కొంకణ దేశానికి రాయబారిగా వెళ్ళాడు మంఖ మరో సోదరుడు శృంగారుడు ‘’బృహత్త౦త్రాధిపతి ‘’పదవిలో ఉన్నాడు .మంఖుని గురువు రుయ్యకుడు .మంఖ కవి’’ శ్రీ కంఠ చరిత్ర ‘’కావ్యాన్ని 1140లో రాశాడు .ఇరవై అయిడుకాండల మహాకావ్యం ఇది .ఇందులో శివుడు త్రిపురాసుర సంహార విషయం రాశాడు .
చివరి కాండ చాలా ఆకర్షణీయంగా ఉంది .అందులో అనేక మంది సమకాలీన ,పూర్వ కవులను పేర్కొన్నాడు .వాళ్ళ పేర్లు చెప్పటమేకాదు ఒక్కొక్కకవి ఏ విషయం లో నిష్ణాతుడో కూడా వివరించటం మంఖకవి ప్రత్యేకత .ఆనందుడు న్యాయ మీమాంసలో ,శంభూరిని కొడుకు ఆనందుడు వైద్యం లో ,అలక దత్తుని శిష్యుడు కళ్యాణుడు సాహిత్య శాస్త్రం లో ,గర్గుడు,గోవిందుడు జల్హనుడు సాహిత్యం లో,జిన్దూకుడు త్రైలోక్యుడు మీమాంస లో ,జనక రాజు వేదాలలో , నందనుడు వేదాంతం లో నిష్ణాతులు అని చెప్పాడు ., మొదటి కాండ లో ఇష్ట దేవతాస్తుతి .అందరు దేవుళ్ళనూ ప్రార్ధించాడు .చాలా భాగం కవితలో రెండు అర్ధాలు వచ్చేట్లు నేర్పుగా కూర్చాడు మంఖ కవి .భాషమీద మాంచి పట్టు ఉంది .అందుకనే నెమో మనవాళ్ళు ఎవరైనా మారాం చేసి పట్టు బడుతుంటే ‘’మంకు పట్టు ‘’పట్టాడు అంటారు .అది ‘’మంఖ కవి పట్టు’’ ఏమో .చదివే వారికి కష్టంగా ఉంటుంది మంఖ కవిత్వం .ప్రవాహ వేగం తక్కువ .జన రాజు దీనికి రాసిన వ్యాఖ్యానం వలన ఆ పాషాణ పాక కవిత్వాన్ని కొంత వరకు అర్ధం చేసుకో వచ్చు .మంఖ కవి ప్రయోగించిన శబ్దాల అర్ధాలను వివరించే నిఘంటువు ‘’మంఖ కోశం ‘’వచ్చింది . ఇది ఇప్పటికీ కాశ్మీర దేశం లో ఉన్నది . రుయ్యకుని అలంకార శాస్త్రం పై మంఖ కవి ‘’అలంకార సర్వస్వం ‘’రాశాడు .రుయ్యకుని కారికలకు వ్యాఖ్యానం రాస్తూనే మంఖ కవి అలంకార సూత్రాలు కూడా రాసినట్లు అని పిస్తుంది .’’మంఖు కసుత్రోద్ధారణ ‘’లో సూత్రాలకు మంఖ కవి శిష్యుడు సముద్ర బంధుడు ఉదాహరణలు రాశాడు .ఇతనే అలంకార సర్వస్వానికి వ్యాఖ్య కూడా రాశాడు .అందులో రాజా రవి వర్మను కీర్తించాడు .మంఖ కవికాలం లో కాశ్మీర రాజాస్థానం లో నిరంతరం సాహిత్య చర్చలు జరిగేవి .ఎంతో విలువైన సమాచారం అందేది .కాశ్మీర రాజులు ఇతర దేశాల రాజులతో మంచి సంబంధాలు నెలకొల్పారు రాయబారులను పంపేవారు .మంఖ కవిని కాశ్మీర దేశపు రాయబారిగా కొంకణ దేశానికి పంపారని ముందే చెప్పుకొన్నాం .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-15-ఉయ్యూరు
