ముసలి మనసుల మానసికోల్లాసం –F.M.రేడియో

ముసలి మనసుల మానసికోల్లాసం –F.M.రేడియో

ఏ చానల్ చూసినా ఏదో ఒక  రాద్ధాంతం , సిద్ధాంతంపై అనవసర చర్చలు .లేకపోతే ఒకే హీరో గారి మూస సినిమాల దాడి .ఏ సీరియలోను రియల్ గా ఉండేది ఏమీలేదు .అన్నీ కుతంత్రాలు ,ఆరళ్ళు ,భీభత్సాలు ,పగలూ ప్రతీకారాలు మాయలు మంత్రాలు .ఇవన్నీ చూస్తూ బంగారం లాంటి సమయాన్ని ఖర్చు చేసి మనం పొందే మానసిక ఆనందం కాని ,త్రుప్తికాని లేదు .ఇక భక్తీ చానళ్ళ విషయానికొస్తే ఒకాయన భారతం దగ్గర్నుంచి’’ పల్లీలు బటానీలు’’దాకా నాన్ స్టాప్ గా వాయిస్తాడు .మరో ఆయన ఏది మొదలు పెట్టినా శాఖా  చంక్రమణం చేసి కద అంగుళం కదలకుండా ఎపిసోడ్ లకు ఎపి సోడులు నవిలి మింగేస్తాడు .మరో ఆయన ఆయన ఏం చెబుతాడో ఆయనకే అర్ధం కాని అగమ్య గోచరం .సూటిగా సరళంగా చెప్పే వ్యక్తీ దుర్భిణీ వేసినా దొరకటం లేదు .ఏదైనా నేర్చుకొనే విజ్ఞానం ఉందా అంటే అదీ గగన కుసుమమే .అందుకే అలసిన ముసలి మనసులకు ఆరోగ్యా తెరపి ఎఫ్ ఏం రేడియో అంటాను నేను .నేను అదే అనుసరిస్తూ. టెన్షన్ లేకుండా హాయిగా ఉన్నాను .ఆ వివరాలే మీకు చెబుతున్నాను .

రెయిన్ బౌ  కృష్ణ వేణి

విజయ వాడ నుండి ప్రసారమయ్యే ఆకాశవాణి వారి ‘’రెయిన్ బౌ ‘కృష్ణ వేణి ’ఎఫ్ ఏం .చాలా హాయిగా ఉంటుంది .ఉదయం అయిదింటికి చక్కగా భక్తీ సినిమాల పాటలు వస్తాయి .ఏదైనా పని చేసుకొంటూ వినచ్చు .లేక పోతే నా బోటి బద్ధకిస్టూ  వింటూ అరమూత కనులలో నిద్రా మెలకువ స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తూ ఆ పాటల మాధుర్యాన్ని అనుభవించవచ్చు .ఉదయం ఆరు గంటలకు సంప్రదాయ భక్తీ సంగీత ప్రసారం జరుగుతుంది .ఏడు గంటలవరకు ఇది ప్రసారమౌతుంది .ఈరెండు గంటలు మనం అలౌకిక ఆనందం లో మునిగి పోతాం .ప్రతి గంటకు రెండు నిమిషాల ముఖ్య వార్తాప్రసారం ఉంటుంది .ఉదయం ఏడు తర్వాత నేనెప్పుడూ దీన్ని వినలేదు .కుర్రకారుకు కావాల్సిన మిర్చి మసాలా అంతా రాత్రి తొమ్మిది దాకా ఉంటుంది .కావాలనుకొనే వాళ్ళు వినచ్చు. నాకు అంత సీను లేదు .నేను వినను .రాత్రి పదిగంటలకు నిజం గా అమృత సమయం .’’ఆపాత మధురాలు’’ పేరిట ఎన్నో పాత సినిమా పాటలు వినిపిస్తారు పదకొండు గంటల దాకా .ఆ గంటా మళ్ళీ ఏదో లోకం లో విహరిస్తున్నట్లే ఉంటుంది శ్రావ్యతకు ప్రాముఖ్యమిస్తారు .ఘంట సాల మేస్టారి పాటలు వింటూంటే పానకం తాగినట్లు భానుమతి పాటలు  వింటూ ఉంటే స్వర్గ సీమలో విహరిస్తున్నట్లు మనసున మల్లెల మాల లూగుతున్నట్లు ఉంటుంది .ఏం ఎస్ రామారావు ,ఏ ఏం రాజా లీల గీతాలు ఉల్లాసం ఉత్తేజం కల్గిగిస్తాయి . ఎవరికి వారు విని అనుభవించాల్సిందే . రాత్రి పదకొండుగంటలకు దక్షిణాది భాషా సినీ సంగీతం వస్తుంది .ఆసక్తి ఉన్నవారు విని ఆనందించవచ్చు .నాకు మాత్రం ఉదయం అయిదు నుండి ఏడు వరకు ,రాత్రి తొమ్మిదిన్నర నుండి పదకొండు వరకు అదే కాల క్షేపం .మంచం మీద పడుకొని దొర్లుతూ విని ఆనందిస్తా .బుధవారం రాత్రి తొమ్మిదిన్నరకు ఆకాశ వాణి నాటకం ,ఆ తర్వాతవచ్చే సంగీత కచేరి వింటా .ఆదివారం మధ్యాహ్నం మూడుగంటలకు వచ్చే గంట నాటకం రాత్రి వచ్చే సంగీతం  వినటం ఎన్నో ఏళ్ళుగా వస్తున్న అలవాటు .

అయితే ఈ రెయిన్ బౌ లో ఒకరిద్దరు జాకీ కుర్రాళ్ళు ‘’ఫ్రెండ్స్, ‘ఫ్రెండ్స్ ’అంటూ నిమిషానికి పది సార్లు అంటూ రాత్రి పూట  ఆ హాయైన అందమైన సమయాన్ని వృధా చేస్తున్నారు .అది లేక పొతే మరీ రక్తి కట్టిస్తుంది .మధురమైన పాటలకు వారేమీ ఇంట్ర డక్షన్ చెప్పక్కర్లేదు .వాళ్ళు చెప్పినా దాని మాధుర్యాన్ని పాడు చేయటమే చేస్తున్నారు .దీన్ని అధికారులు గుర్తిస్తే ఎంతో మేలు చేసిన వారవుతారు .అలాగే ఒక రోజు వేసిన పాటలను మర్నాడే రిపీట్ చేస్తే వైవిధ్యం ఉండక బోరు కూడా కొడుతుంది .కనుక గాప్ ఇవ్వాలి .అప్పుడే చిక్కగా చక్కగా కార్యక్రమం నడుస్తుంది .మరో విషయం వారి ‘’ యాడ్’’ గా-‘’రేడియో కృష్ణవేణి –విజయవాడ విజయవాడ’’ అని చెప్పేది ఆకర్షణీయం గా లేదు .లాగుడుగా ఉంది .మార్చే  వీలుంటే మార్చాలి . ఇలా రైన్ బౌ కృష్ణ వేణి అలసిన ముసలి మనసులకు అందమైన దివ్యమైన అనుభవాన్నిస్తోంది .దీన్ని నిర్వహిస్తున్న ఆకాశ వాణి విజయ వాడ కేంద్రానికి అభి నందన శతం .ఈ మధ్య 103 మీటర్ల మీద ఆకాశ వాణి వారిదే  మరో ఎఫ్ ఏం వస్తోందని తెలిసింది .నేను ఇంకా వినలేదు . ఆహ్వానిద్దాం .

రెడ్ ఎఫ్ ఏం

రెడ్ ఎఫ్ ఏం ఎవరిదో నాకు తెలియదుకాని ఇదీ  చాలా బాగుంది .ఉదయం అయిదు నుంచిఏడు గంటలదాకా  ఇందులోనూ మంచి భక్తీ సంగీతం వస్తుంది .అనేక వైవిధ్యభరితమైన భక్తిపాటలు కీర్తనలు ,వినిపిస్తారు .ఈ సమయం లో ఉండే జాకీ ఒకామ్మాయి చాలా విషయాలను సేకరించి మనకు తెలియ జేసి సంతోష పరుస్తుంది . చాగంటి వారి ప్రవచనమూ సాగుతుంది ఎడ్లరామదాసు కీర్తనలు బాలమురళి తత్వాలు హైలైట్ . చాలా బాగా ఉంటాయి .ఎందరో కొత్త గాయినీ గాయకులూ తమ స్వర మాధుర్యంతో దీన్ని సుసంపన్నం చేస్తున్నారు అభినందనలు ..వీలున్నప్పుడు దీన్నీ వింటూ ఉంటాను .ఏడు గంటలనుండి రాత్రి తొమ్మిదిదాకా యువతను ఉర్రూత లూగించే పాటలు మాటలతో వారిని బాగా ఆకర్షిస్తోంది .వీటి జోలికి నేనెప్పుడూ వెళ్ళలేదు .

రెడ్ ఎఫ్ ఏం లో రాత్రి తొమ్మిది నుంచి పద కొండువరకు మధుర మైన పాటలు వినిపిస్తారు .’’రెడ్ క్లాసిక్స్ ‘’పేరిట కృష్ణం రాజ్ చెప్పే విషయాలు ఆసక్తిదాయకం గా ఉంటాయి .సినిమా  రంగం లో పేరుపొందిన నటులు నటీమణులు ,దర్శకులు నిర్మాతలు పాటల, సంభాషణ రచయితలూ ,ఛాయాగ్రాహకులు సంగీత దర్శకులు మొదలైన వారినందరినీ కృష్ణం రాజ్ పరి చయం చేసే తీరు అత్యద్భుతం .మూలాలోకి చొచ్చుకొని వెళ్లి విషయ సేకరణ చేసి అందంగా హాయిగా అందించే ‘’రాజ్ ‘’రెడ్ ఎఫ్ .ఎం. కు నిజంగానే ’’ రాజే ‘’నని పిస్తాడు .మధ్య మధ్యలో వచ్చ్చే క్లాసికల్ సాంగ్స్ వింటూ మనం మైమరచి పోతాం .ఆ మధుర సుందర స్వర్గ సీమ లో నుంచి బయటకు రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది ‘’హాట్స్ ఆఫ్ టు కృష్ణం రాజ్’’ .

మిర్చి –చాలా హాట్ గురూ

ఏ సెంటర్ లో విన్నా ,ఏ బస్ లో ,ఏ కారులో విన్నా రేడియో మిర్చి వినిపిస్తూనే ఉంటుంది .కుర్రకారుకు కిక్కెక్కించే ఎన్నో విషయాలు రేడియో మిర్చి హాట్ హాట్ గా అందిస్తుంది .దాన్ని వినని విని ఆనందించని కుర్ర్రాడు ఉండడు .క్రికెట్ స్కోర్ నుంచి ట్రాఫిక్ దాకా అది స్పృశించని అంశం ఉండడు .అందులో మరీ ఆకర్షణీయమైనది ‘’రాంబాబు కబుర్లు ‘’ ‘’బాబు బాగా బిజీ’’అని టెలిఫోన్ మోగినప్పుడు వినిపించే అమ్మాయి’’ హస్కీ వాయిస్’’ గమ్మత్తుగా ఉంటే రాంబాబు మిత్రుడితో సంభాషిస్తూ చెప్పే సినీ సిత్రాలు మరింత హాట్ కేక్ లే అనిపిస్తాయి .రోజుకు నాలుగైదు సార్లు వస్తుంది .వెరైటీ ఉంటుంది .సినీ,రాజకీయాలపై సంధించే వ్యంగ్యాస్త్రమే  ఇది . కడుపుబ్బా నవ్విస్తూ అవతలివారిని నవ్వుల చేన్నాకోల్ తో బాదేస్తున్నట్లని పిస్తుంది . దీన్నిమాత్రం నేనెప్పుడైనా హైదరాబాద్ లో మా అబ్బాయిల కార్ లో వెడుతున్నప్పుడు వాళ్ళు పెట్టె మిర్చి లో విని ఎంజాయ్ చేస్తాను .మిగిలినవేవీ కావాలని వినను .

మిర్చి కూడా ఉదయం అయిదింటి నుంచి ఏడు వరకు’’ దేవరాగం ‘’వస్తుంది దీన్ని భారతి అనే అమ్మాయి మహా గొప్పగా నిర్వ హిస్తుంది ‘’’దేవరాగం విత్ భారతి ‘’అందరూ విని తీరాల్సింది .ప్రతి రోజు తిదినక్షత్రాలు వర్జ్యం దుర్ముహూర్తం తో బాటు ఆ రోజు ప్రత్యేకత ఏమిటో భారతి చెప్పే విషయాలు మనకు అంతకు ముందు ఎప్పుడూ వినని విషయాలే .ఎక్కడి నుంచి సేకరించి ఆ మహా తల్లి అందిస్తుందో మహాశ్చర్యం .పురాణాలు చారిత్రికవిషయాలు పండగలు పబ్బాలు మన రాష్ట్రం లో మాత్రమె కాదు దేశం లో ఏ రాష్ట్రం లోనైనా ఏ ప్రాంతం లోవైనా భారతి తెలియ జెప్పే తీరు ముచ్చటగా ఉంటుంది .మధ్య మధ్యలో  ఇంగ్లీష్  మాటలు దోర్లుతున్నా  అవీ ఇంపుగానే ఉంటాయి భారతి గొంతులో. అదే ఈ కార్య క్రమం ప్రత్యేకత .దిన ప్రాధాన్యాన్ని మహా వివరంగా తెలియ జేస్తుంది భారతి .దైవరాగం విత్ భారతి వింటూ ఉంటే దైవ లోక సందర్శనం చేసినట్లే ఉంటుంది .దీనికి కారణమైన భారతిని ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది .

ఈ రెండు గంటలలో క్లాసికల్ మ్యూజిక్ తప్పక ఉంటుంది .బాలమురళి ని వినచ్చు .పట్టమ్మాళ్ ,సుబ్బులక్ష్మి మొదలైన సంగీతజ్ఞులస్వరాభి షేకం లో నిండా మునిగి పోవచ్చు .భక్తీ జ్ఞాన వైరాగ్యాల పై పాటలు మహా ఇంపుగా ఉంటాయి .ప్రతి  రోజు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఉంటుంది .రేడియో మిర్చి ని ఉదయంఅయిదు నుంచి వినటం నాకిష్టం .   .మిగిలిన వాటిపై నాకు అవగాహన లేదు .

ఈ విధంగా విజయవాడ నుంచి ప్రసారమయే మూడు రకాల ఎఫ్ ఏం రేడియో లు ఉదయం రాత్రి మనసుకు ఆహ్లాదం కల్గిస్తున్నాయి .అందులో ముసలిమనసులకు మరీ ఆనందం అనుభూతి .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-7-15-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రేడియో లో and tagged . Bookmark the permalink.

1 Response to ముసలి మనసుల మానసికోల్లాసం –F.M.రేడియో

  1. gdurgaprasad's avatar gdurgaprasad says:

    కృష్ణ వేణి ఎఫ్.ఎమ్ .ఛానల్ లో ప్రతి నెలా సీనియర్ సిటిజను వాణి – జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ వార్తల సమాహారం, పెద్దల మాటలు, ఆరోగ్యానికి ఆధారాలు, ఆరోగ్యానికి ఆచారాలు, ఈ మాసపు కవిత కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను – – నాల్గవ శనివారం ఉదయం 7-30 లకు, అవకాశం వుంటే వినండి, ఇదే కార్యక్రమం ఆ పిమ్మట వచ్చే మంగళ వారం మధ్యాహ్నం 12-40 లకు ఆకాశ వాణి విజయవాడలో పున్హ్ ప్రసారమవుతుంది – మీ బందా

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.