గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
179- చారిత్రిక ప్రాధాన్య రచన చేసిన -ఉదయ ప్రభ సూరి
వస్తుపాల ,తేజపాలకు గురువు ఆచార్యుడు ఉదయ ప్రభ సూరి .కవి సిద్ధాంతకర్త ,ఖగోళ శాస్త్రజ్ఞుడు .అతని ‘’ఆరంభ సిద్ధి ‘’ఖగోళ విషయం పై రాసిందే .’’ఉపదేశ మాలా కార్మిక ‘’ఉపదేశామాలకు రాసిన వ్యాఖ్యానం. ధర్మాభ్యుదయం లేక ‘’సంఘాదిపతి చరిత్ర ‘’అనే మహాకావ్యం వస్తుపాల రాజు పశ్చిమ దేశ జైన మందిర సందర్శనం పై రాసింది ,నరేంద్ర ప్రభ కూడా దీనిలో భాగ స్వామి .అతని ‘’సుకృత కృతి కల్లోలిని ‘’వస్తుపాల ,తేజపాలుల శత్రున్జయ యాత్ర పై రాసినది .దీనికి చాలా చారిత్రిక ప్రాధాన్యం ఉందికూడా .వస్తుపాల వంశ చరిత్రతో బాటు చాపోత్కల ,చాళుక్య రాజుల గురించి వివరాలూ ఉన్నాయి .
180- చాళుక్య వాంశ చరిత్ర రాసిన -జయ సింహ సూరి
బోచ్ లో ముని సువ్రత కు ఆచార్యుడైన జయ సింహ సూరి వీరసూరి శిష్యుడు .శ్వేతాంబర జైనుడు .ఒకప్పుడు వస్తుపాలుని సోదరుడు తేజపాల ఈ జైన మందిరాన్ని సందర్శించ టానికి వచ్చినపుడు ఇరవై అయిదు బంగారు నాణాలు అంబదలో ఉన్న సకుమిక విహార కు దానం చేయమని శ్లోకం లో అడిగాడు .వెంటనే రాజు ఇచ్చేశాడు .వస్తుపాల ప్రశస్తి లో ఈ సోదరుల దాత్రుత్వాన్ని శ్లాఘించాడు .దానానికి క్రుతజ్ఞాతగా ‘’హమ్మీర మద మర్దనం ‘’నాటకాన్ని వస్తుపాల కొడుకు జయంతి సింహు ని కోరికపై రాశాడు .కాంబే లో భీమేశ ఉత్సవం నాడు దీన్ని ప్రదర్శించారు .ఇందులో వస్తుపాల, స్నేహితుడు వీర ధవళ కలిసి గుజరాత్ ను మహమ్మదీయ దండ యాత్రనుంచి రక్షించిన చరిత్ర వర్ణించాడు .ఉపమలతో ఉల్లాసంగా కవిత్వం ఉంటుంది .విరాధ వల్ల కొలువులో వస్తుపాల మంత్రిగా ఉండేవాడు .కనుక ఈ నాటకం 1220-30మధ్య రచించి ఉండాలి .జయసింహుని ’’వస్తుపాల ప్రశస్తి ‘’చాళుక్య వంశ చరిత్ర .మొదటి మూల రాజు నుండి అందరిని చేర్చి రాశాడు .
181- కదా రత్న సాగరం రాసిన -నరచంద్ర సూరి
1288 వాడైన నరచంద్ర సూరి అనేక ‘’ప్రశస్తులు ‘’రాశాడు .వస్తుపాలపై రాసిన ప్రశస్తి గిర్నార్ శాసనం లో లభిస్తుంది .హరత పురి యాగచ్చ కు చెందిన మలదారి దేవప్రభ సూరి శిష్యుడు .అనర్ఘ రాఘవం పై వ్యాఖ్యానం రాశాడు .వస్తుపాలుని కోరిక మేరకు ‘’కదా రత్న సాగరం ‘’రాశాడు .శిష్యుడు నరేంద్రప్రభ ‘’అలంకార మహోదధి ‘’రచించాడు .దేవ ప్రభ రాసిన ‘’పా౦ డవ చరిత్ర ‘’,ఉదయ ప్రభ రచన ‘’ధర్మాభ్యుదయం ‘’లను సవరించి మెరుగులు దిద్దాడు
182-సరస్వతీ పుత్రుడు -బాల చంద్ర సూరి
చంద్రా గచ్చ కు చెందిన హరి భద్ర సూరి శిష్యుడే బాల చంద్ర సూరి .ధోల్కా రాజు విరాధ వాలుని మంత్రి వస్తుపాలుడిని తెగ ప్రశంసించాడు .రాజు మరణం తర్వాత వస్తుపాలుని అభ్యర్ధనకేరకు ‘’వసంత విలాసం ‘’అనే పద్నాలుగు కాండాల కావ్యాన్ని వస్తుపాల మంత్రిత్వ గరిమను గురించి రాశాడు .వస్తుపాలుడు మరణించాడు .పద్దెనిమిది కాండలలో మొదటికాండం లో తన చిన్ననాటి జీవితం రాసుకొన్నాడు .గాయక్వాడు రాజాల అదీనం లో ఉన్న కాడి జిల్లాలో మోదేరక నగరం లో ధర్మ వేదుడు అనే ప్రసిద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడని ,బాధలలో ఆపదలలో ఉన్నవారికి సహాయ సహకారాలు చేసేవాడని దీనితో జైనమతం పట్ల ఆకర్షితుడయాడని రాశాడు .అతని ఇంటికి వచ్చిన అతిధులకు చేతి నిండా ధనం ఇచ్చి పంపేవాడు .భార్య పేరు విద్యుత్ .కొడుకు ముంజల .ఈ పిల్లాడికి చిన్నప్పటి నుంచే ప్రపంచం మాయ అని తెలుసుకొన్నాడు .హరి భద్ర సూరి గురుత్వం తో విషయ పరిజ్ఞానం పెరిగి జైనం లోకి మారటానికి తలిదండ్రుల అనుమతి కోరాడు .అనుమతిపొంది జైనమందిరం లో గురువు శిక్షణలో అన్నీ నేర్చాడు .బాల చంద్ర అనే ఆశ్రమనామం పెట్టాడు గురువు .చనిపోయిన తర్వాత శిష్యుడినే అధికారి అయెట్లు చేశాడు .పద్మాదిత్యుడి పాదపద్మాల పై చాళుక్య చక్ర వర్తి కిరీట మణి కాంతులు పడేవని అంతటి మహిమాన్వితుడైన పద్మాదిత్యుడి శిష్యుడనని చెప్పుకొన్నాడు .
వాడిదేవసూరి లోని గచ్చ కు చెందినఉదయసూరి సరస్వతీ మంత్రాన్ని ఉపదేశించాడని ,దాన్ని సాధన చేసేవాడినని ఒక సారి యోగ నిద్రలో సరస్వతీ దేవి ప్రత్యక్షమై తన భక్తికీ ఆరాధనకు మెచ్చి కాళిదాసులాగా తన కుమారుడిగా భావిస్తానని చెప్పింది ‘’అని రాసుకొన్నాడు .బాలచంద్ర రాసిన కవిత్వానికి వస్తుపాలుడు ఏంతో సంతోషించి వెయ్యి ‘’ద్రమ్మల’’(drammaas)తో బాల చంద్ర సూరిని ఆచార్యునిగా చేసినట్లు ‘’ప్రబంధ చింతామణి ‘’తెలియ జేస్తోంది .
183 కీర్తి కౌముది ,కావ్యాదర్శ కర్త -సోమేశ్వర దేవుడు
సోమశర్మ లేకసోమేశ్వర దేవుడు ఆశుకవి .కుమార,లక్ష్మి ల కుమారుడు .అతని పైన ఎనిమిదవ తరం వాడైన సోలుడు అన్హిల్ విద్లో చాళుక్య సామ్రాజ్యాన్ని మొదట స్థాపించిన మూల రాజు ఆస్థాన పురోహితుడు .సోలుని తర్వాత ఆకుటుంబం వారందరూ ఆస్థాన పురోహితులే అయ్యారు .సోమేశ్వరుడు వస్తుపాల రాజు స్నేహితుడు .విరాధ పాల ,విశాల దేవ రాజుల దర్బారులో సోమేశ్వరుని ప్రశస్తి ని రాజశేఖరుడు’’ ప్రబంధ కోశం ‘’లో తెలియ జేశాడు .హరిహర ,సుభటులు సోమేశ్వరుని స్నేహితులు .వీరిద్దరుసోమకవి కవిత్వాన్ని మెచ్చారు .సోమేశ్వరుడు తన ‘’కీర్తి కౌముది ‘’లోను ,’’సురతోత్సవం ‘’లోను తన పోషకరాజులను కీర్తించాడు .ఇందులోని రెండవ కావ్యం లో పదిహేను కాండాలలో సురత రాజును ,అతని చైత్ర వంశాన్ని ,వర్ణించాడు ఇందులోని హిమాలయ వర్ణన అసదృశం..’’ఉల్లాఘ రాఘవం ‘’లో శ్రీరామచరిత్రను నాటకీకరించాడు .పార్ధ పరాక్రమ కావ్యానికి యువ రాజు ప్రహ్లాదనుడు కవి అని సురతోత్సవం లో చెప్పాడు .రామ శతకం కూడా రాశాడు సోమ .కావ్యాదర్శ రాశాడు .కావ్య ప్రకాశ కు వ్యాఖ్య కూడా రాశాడు సోమేశ్వరుడు .
184- అమరచంద్రునిజంట కవి- అరిసి౦హుడు
లావణ్య సింహుని కొడుకైన అరి సింహుడు వస్తుపాల మంత్రి ఆశ్రితుడు .తక్కూరకు అధికారి .అమరచంద్రుడు సహ సాహిత్య జీవి .అమరచంద్రునికి సిద్ధ సరస్వతి మత్రాన్ని ఉపదేశించింది అరి సింహుడే .ఈ జంట కవులు ‘’కవి కల్ప లత’’సూత్రాలు కలిసి రాశారు .అరి సింహుడు ‘’కవితార హాసం ‘’రాశాడు .పదకొండు కాండాల’’సుకృత సంకీర్తన ‘’లో అరి వస్తుపాలుని మహోజ్వల చరిత్ర రాశాడు .మొదటి కాండం లో అనహిల్ల పట్టణం నిర్మించిన వన రాజును ,అతని చాపోత్కర వంశ రాజులను వర్ణించాడు .ఇది ఉదయ ప్రభ రాసిన సుకృత కల్లోలిని లాగానే ఉంటుంది .రెండవ కాండలో చాళుక్య రాజ్య మూల పురుషుడు మూల రాజు తో ప్రారంభించి రెండవ భీమ దేవుదు వస్తుపాల, తేజపాలల దాకా రాశాడు .మిగిలిన కాండలలో వస్తుపాలుని యాత్రలు దాన ధర్మాలు వివరించాడు .ప్రతికాండం చివర అమరసింహుడు తాను రాసిన నాలుగు శ్లోకాలను చేర్చాడు .మల్లినాధుడు నిర్మించిన గోడ లోని గూడు ను కూడా వర్ణించాడు .వీటికి ఆధారాలుగా మౌంట్ ఆబూలో శిలాశాసనాలున్నాయి .
185- ప్రబంధ చింతామణి కర్త -మేరుతంగ
మేరుతంగ రాసిన ‘’ప్రబంధ చింతామణి ‘’మహా గొప్పచారిత్రిక కావ్యం .1306లో దీన్ని వాద్వాన్ లో వైశాఖ శుద్ద్ధ పౌర్ణమినాడు పూర్తీ చేశాడు .ఇందులో అయిదు ప్రకాశ లున్నాయి .ప్రతి ప్రకాశకు ప్రబందాలుంటాయి .ప్రతి ప్రబంధం లో ఒక కద ఉంటుంది .అదీ దీని నిర్మాణం .విక్రమశకానికి ఆద్యుడైన విక్రమాదిత్యుని కధతో కావ్యం ఆరంభమవుతుంది .తర్వాత శాతవాహనుని పూర్వజన్మ వృత్తాంతం ఉంది .ఆ తారవాత సుదీర్ఘంగాఅన్హిల్ విద్ చాళుక్య రాజుల చరిత్ర భోజరాజు ముంజ రాజులతో వారి సంబంధం ఉంటాయి .పిమ్మట వాఘేల రాజు లావణ్య ప్రసాదు ,విరాధ వాల రాజు ల గురించి సుదీర్ఘ చరిత్ర రాశాడు కవి .ఇందులో వారిమంత్రులు వస్తుపాల తేజ పాల వ్రుత్తా౦తమూ చేర్చాడు .చివరి కాండ లో లక్ష్మణ సేన ,ఉమాపతి ,భర్తృహరి గురించి ఆసక్తికర విషయాలున్నాయి .మేరుతంగ రాసిన ‘’మహా పురుష చరిత్ర ‘’జైన మునుల చరిత్ర యే.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-7-15-ఉయ్యూరు

