రట్టుకానున్న గుట్టు..
- 09/07/2015
సమాచారం పొందే హక్కును ప్రజలు వివిధ రాజీయ పక్షాల విషయంలో ఉపయోగించకొనలేకపోవడం నడచిపోతున్న వైపరీత్యం. సమాచార హక్కుల చట్టం -ఆర్‌టిఏ- కింద ప్రభుత్వ విభాగాలకు చెందిన సమాచారాన్ని పౌరులు పొందగలుగుతున్నారు. కానీ రాజ్యాంగబద్ధమైన రాజకీయ పార్టీల నిధుల గురించి, వాటిని వారు సేకరించే విధానం గురించి సమాచారం మాత్రం ప్రజలకు అందకపోవడం ప్రజాస్వామ్య వైపరీత్యం. ఈ చట్టం తమకు వర్తించదన్నది రాజకీయ పక్షాలు ప్రధానంగా జాతీయ రాజకీయ పక్షాలు చేస్తుండిన వాదం. ఎందుకు వర్తించదో వివరించవలసిందిగా సర్వోన్నత న్యాయస్థానం రాజకీయ పక్షాలను ప్రశ్నించడంలో పారదర్శకత ప్రాధాన్యం మరోసారి ప్రస్ఫుటిస్తోంది. ఈ పారదర్శకత వల్ల తమ అంతర్గత సంస్థాగత స్వాతంత్య్రానికి భంగం కలుగుతోందన్నది రాజకీయ పక్షాల భయం. కానీ ప్రజాస్వామ్య రాజ్యాంగ నిష్ఠను నిరంతరం అభినయిస్తున్న మన రాజకీయ పక్షాలు తమ నిధుల గుట్టు మాత్రం రట్టు కారాదని పట్టుదలతో ఉండడం పారదర్శక సూత్రాన్ని పరిహసిస్తున్న పరిణామం. సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం జారీ చేసిన ఆదేశంలో వివిధ రాజకీయ పక్షాల నిధి నిక్షేపాల సంగతి మరోసారి చర్చనీయాంశమైంది. 2013లో కేంద్ర సమాచార న్యాయసంఘం-సిబిఐ- వారు రాజకీయ పక్షాలు సార్వజనిక సంస్థలని నిర్ధారించారు. ఈ నిర్ధారణను రాజకీయ పక్షాల వారు బహిరంగంగా ధిక్కరిస్తుండడం మంగళవారం సర్వోన్నత న్యాయాదేశానికి ప్రాతిపదిక. సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకొనేవరకు ప్రభుత్వాలు తమ విధులను విస్మరించడం ఇప్పుడు వ్యవస్థీకృతమైపోయింది. అవినీతిని పరిశోధించడం మొదలు ఆహార భద్రత వరకు అనేకానేక విషయాలలో సర్వోన్నత న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానాలు, జోక్యం చేసుకున్న తరువాత మాత్రమే పాలకులలో కదలిక ఏర్పడడం చరిత్ర. ఇలా ప్రభుత్వాలు తమ విధులను విస్మరించడం గురించి ప్రతి రాజకీయ పార్టీ కూడ ఎప్పుడో అప్పుడు విమర్శించడం కూడ చరిత్ర. కానీ ఈ రాజకీయ పార్టీలు తమకు మాత్రం ఆర్టీఏ చట్టం వర్తించరాదని పట్టుదలతో ఉండడం గురివింద ప్రవృత్తికి చిహ్నం. సంస్థాగతంగా జరిగే వ్యవహారాలను ఆర్‌టిఏ ద్వారా బయటపెట్టడం ఇంటిగుట్టును ఇల్లెక్కి చాడడంతో సమానమన్నది రాజకీయ పార్టీల వితండవాదం. ఈ వితండవాదాన్ని కేంద్ర ప్రభుత్వం కూడ సమర్ధించడం మరో వైపరీత్యం. తాము ఎవరివద్ద ఎంతమొత్తం విరాళంగా సేకరిస్తున్నదీ బయటకు రాకూడదన్నదే ఈ ప్రధాన రాజకీయ పక్షాల ఐక్య స్వరానికి ప్రధాన కారణం.
ఆర్‌టిఏ చట్టం కేవలం నిధులకు సంబంధించిన వ్యవహారం కాదు. రాజకీయ పార్టీలు సార్వజనిక సంస్థలు కనుక చట్టం వాటికి కూడ వర్తించాలని మాత్రమే కేంద్ర సమాచార న్యాయ సంఘం-సిఐసి- వారు 2013లో నిర్ధారించారు. అయితే గుమ్మడికాయల దొంగలు భుజాలను తడుముకున్న చందంగా అన్ని పార్టీలు కూడ ప్రధానంగా తాము సేకరిస్తున్న విరాళాల గురించి మాత్రమే ఉలిక్కిపడ్డాయి. అందువల్ల చట్టం నుండి రాజకీయ పార్టీలకు మినహాయింపు ఇవ్వాలన్న ఐక్య ప్రతిఘటన 2013లోనే మొదలైంది. ఆరు జాతీయ పక్షాలను చట్టం పరిధిలోకి తీసుకొని రావాలని నిర్ధారించిన వెంటనే అప్పటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని ఐక్య ప్రగతి కూటమి-యూపిఏ- ప్రభుత్వం వారు చట్టాన్ని సవరించడానికి పూనుకున్నారు. ఈ సవరణకు దాదాపు అన్ని పార్టీలు వత్తాసు పలకడం అప్పటి కథ. ఆర్‌టిఏ పరిధి నుంచి రాజకీయ పక్షాలను మినహాయించాలని నిర్దేశిస్తూ ముసాయిదా సవరణ బిల్లు కూడ 2013 ఆగస్టులో రూపొందినట్టు ప్రచారమైంది. ఎందువల్లనో ఆ సవరణను చట్టం చేసే సాహసానికి అప్పుడు రాజకీయ పార్టీలు పూనుకోలేదు. నిధుల గురించి జాతీయ రాజకీయ పక్షాలు సమాచారం వెల్లడించాయి కనుక మళ్లీ చట్టంలో మార్పులు అవసరం లేదని ప్రభుత్వం భావించిందట. అందువల్ల ప్రత్యేకించి రాజకీయ పక్షాలను చట్టం పరిధి నుంచి మినహాయించాలన్న సవరణ చట్టం కాలేదు.
రెండేళ్ల తరువాత గత మార్చిలో సిఐసి వారు మళ్లీ తమ నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు. అయినప్పటికీ ఆరు జాతీయ రాజకీయ పక్షాలు అ నిర్ణయాన్ని ధిక్కరిస్తూనే ఉన్నాయి. ఇలా చట్టాన్ని తమ నిర్ణయాన్ని ధిక్కరించేవారిపై చర్యలు తీసుకొనే అధికారం తమకు లేదని సిఐసి వారు స్వయంగా ప్రకటించడం చట్టంలోని లొసుగులకు నిదర్శనం. న్యాయ ధిక్కారానికి పాల్పడిన ఈ రాజకీయ పక్షాలకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో అభియోగాలు దాఖలు చేయడం ఎవరి బాధ్యత? ప్రభుత్వం పూనుకోవడం లేదు. అందువల్లనే సమాచార హక్కు సామాజిక ఉద్యమకారులు సుభాన చంద్ర అగర్వాల్, జగదీశ్ ఎస్. ఛోకర్ ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, వీరు దాఖలు చేసిన దరఖాస్తులోని ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిందిగా ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు, న్యాయమూర్తులు అరుణ్‌మిత్ర, అమితవరాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం న్యాయ ప్రమే యం అనివార్యమవుతున్న తీరుకు నిదర్శనం. ఎన్నికల కమిషన్ వారు కూడ తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టు కోరింది. భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్, భారత కమ్యూనిస్టు పార్టీలుకూడ సర్వోన్నత న్యాయస్థానంలో నిలబడి సమాధానం చెప్పవలసి ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఈ జాతీయ రాజకీయ పక్షాలు తమ నిధుల వివరాలను ప్రతి ఏటా స్వచ్ఛందంగా వెల్లడించవలసి ఉంది. అయితే నిమంధనలలోని లొసుగుల కారణంగా విరాళాలను చెల్లిస్తున్న వారిలో అందరి పేర్లను ఈ రాజకీయ సంస్థలు బయటపెట్టనవసరం లేదు. అందువల్ల గుప్తదాతల గుట్టు రట్టు కావడం లేదు.
ఈ గుప్తదాతలు దాదాపు అన్ని రాజకీయ పార్టీలతోను స్నేహ సంబంధాలు కలిగి ఉండడం ప్రపంచీకరణ మాయాజాలంలో భాగం. కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు మారినప్పటికీ బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు చొరబడుతూనే ఉండడం సామాన్య జనాలకు అంతుపట్టని వ్యవహారం. రాజకీయంగా బద్ధ విరోధులైన రాజకీయ సంస్థల వారు ప్రపంచీకరణ విషయంలో మాత్రం ఏకాభిప్రాయంలో ఉండడం జాతీయ వైపరీత్యం. చిల్లర వ్యాపారంలో వాల్‌మార్ట్ వంటి విదేశాలకు చెందిన దోపిడీ దారులను అనుమతించడం ఈ ఏకాభిప్రాయానికి ఒక నిదర్శనం మాత్రమే. ఈ వాల్‌మార్ట్ సంస్థవారు దాదాపు అన్ని దేశాలలోను రాజకీయ నిర్వాహకులకు విరాళాలు సమర్పిస్తున్న తీరును అమెరికా కాంగ్రెస్ వారు సైతం తప్పుపట్టారు. వాల్‌మార్ట్ అమెరికాకు చెందిన దోపిడీ సంస్థ. ఇలా సంపన్న దేశాల వాణిజ్య సంస్థలు మనదేశంలోని రాజకీయ పార్టీలను మంచి చేసుకొనడం బహిరంగ రహస్యం. ఎలా మంచి చేసుకుంటున్నాయన్నది ప్రజలకు వెల్లడి కావలసిన రాజకీయ రహస్యం…

