మన్‌మోహన్ బాటలో మోదీ

మన్‌మోహన్ బాటలో మోదీ

  • 11/07/2015
TAGS:

అదే దృశ్యం పదే పదే ఆవిష్కృతమవుతోంది…అదే ఇతివృత్తం అదే కథనం, అవే పాత్రలు, అదే కథ! భారతీయుల పాలిట ఇదంతా ఘోరమైన వ్యధ. ఇతివృత్తం పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత, భారత వ్యతిరేక జిహాదీ హత్యాకాండ. ఇతివృత్తం దశాబ్దులుగా మారడంలేదు…పాత్రధారులు మాత్రం ‘అప్పుడప్పుడు’ మారిపోతున్నారు. రష్యాలోని ‘ఊఫా’లో సరికొత్తగా శుక్రవారం విరుచుకొని పడిన వికృత దృశ్యంలో పాత్రధారులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి జిహాదీ హంతకుడు నవాజ్ షరీఫ్. నవాజ్ షరీఫ్‌ను అతగాడి నాయకత్వంలోని తథాకథిత-సోకాల్డ్- పౌర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది పాకిస్తాన్ సైనిక దళాలలోని పెత్తందార్లు. ఈ పెత్తందార్లు పాకిస్తాన్‌లోని జిహాదీ ఉగ్రవాదులకు, మతోన్మాదులకు తాబేదార్లు. అందువల్ల నరేంద్ర మోదీ నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేయడం పాకిస్తాన్‌లోని జిహాదీ మతోన్మాదులతో కరచాలనం చేయడంతో సమానం. ఈ జిహాదీ మతోన్మాదులు నిరంతరం మనపై చీకటి దాడులు చేస్తుండడం ‘ఊఫా’లో శుక్రవారం సంభవించిన ‘మోదీ, షరీఫ్‌ల కరచాలన’ పరిణామానికి నేపథ్యం. ఈ కరచాలనంతో గతంలో అప్పటి ప్రధాని, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాధినేత మన్‌మోహన్ సింగ్ ఆరంభించిన కథలో మరో ఆవృత్తి మొదలైంది. 2009లో రష్యాలోని ఏకాథరిన్‌బర్గ్‌లో మన్‌మోహన్ సింగ్ పాకిస్తాన్ అధినేత అసఫ్ అలీ జర్దారీతో కరచాలనం చేశాడు. అప్పటి ప్రధాని యూసఫ్ రజా జిలానీని ఈజిప్టులోని షరమ్ అల్ షేక్‌లో కౌగలించుకున్నాడు. 2008 నవంబర్‌లో ముంబయిపై దాడి చేసిన పాకిస్తానీలు సృష్టించిన భయానక బీభత్సకాండ రక్తపు మరకల తడి ఆరకముందే మన్‌మోహన్ సింగ్ జర్దారీని, జిలానీని కలుసుకున్నాడు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఆ ‘తడి’ని మరోసారి తలపునకు తెప్పించాడు. నవాజ్ షరీఫ్‌ను కలుసుకొనడం ద్వారా. 2009 నాటి పాకిస్తానీ ప్రభుత్వ ప్రవృత్తికీ, స్వభావానికీ ఇప్పటి పాకిస్తానీ ప్రభుత్వ ప్రవృత్తికీ స్వభావానికీ మధ్య ఎలాంటి అంతరం లేదు. మన ప్రభుత్వ విధానంలో కూడ ఎలాంటి మార్పు రాలేదని నరేంద్ర మోదీ నవాజ్ షరీఫ్‌ను కలుసుకొనడం వల్ల మరోసారి ధ్రువపడింది.
పాకిస్తానీ జిహాదీలు మనదేశంలోని నిరాయుధులను వందల సంఖ్యలో హత్య చేశారు. హత్యాకాండ జరిగిన వెంటనే ‘తీవ్ర స్వరం’తో నిరసన తెలపడం మన ప్రభుత్వ విధానంలోని మొదటి దశ. దోషులను పట్టి బంధించి మన దేశానికి పంపించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరడం రెండవ దశ. అంతవరకు పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడబోమని, పాకిస్తాన్ నాయకులను కలుసుకోబోమని కరచాలనం చేయబోమని, చర్చల ప్రసక్తి లేనేలేదని ప్రకటించడం మూడవ దశ. ‘‘నేరస్థులను మాకు అప్పగించకపోయినా ఫర్వాలేదు. మీ దేశంలోని విచారించి తీరాలి..’’ అని బెట్టు చేస్తూ మెట్టుదిగడం నాలుగవ విపరిణామం. ఈ మొత్తం వ్యవహారాన్ని మరచిపోవడం మన ప్రభుత్వ విధానంలోని ఐదవ దశ… తరువాత మన ప్రధాని, మంత్రులు, అధికారులు, దౌత్యవేత్తలు, యధావిధిగా పాకిస్తాన్ హంతక ప్రభుత్వ ప్రతినిధులను కలుసుకోవడం, కలసి విందులారగించడం, స్నేహ గీతాలను ఉమ్మడిగా ఆలపించడం సంప్రదాయమైంది. నరేంద్ర మోదీ ‘ఊఫా’లో ఈ సంప్రదాయాన్ని నిలబెట్టారు. ఈ సంప్రదాయం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మన్‌మోహన్ సింగ్ పాలన నుండి సంక్రమించిన విధాన వారసత్వం. ప్రభుత్వాల నిర్వాహకులు మారినప్పటికీ జాతి హితానికి సంబంధించిన విధానాలు మారరాదన్నది ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తి! ఈ స్పూర్తిని నరేంద్ర మో ప్రభుత్వం మరోసారి నిలబెట్టింది. క్షతికారునితో క్షతగాత్రుడు చేతులు కలపడమేనా జాతీయ హితం. క్షతిని కలిగిస్తున్న హత్యలు చేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వ ప్రవృత్తిలో మార్పు వచ్చినట్టయితే గతాన్ని మరచిపోయి ఆ దేశ ప్రభుత్వంతో మన ప్రభుత్వం స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకోవచ్చు. మనదేశ ప్రజలు బాధపడరు. కానీ పాకిస్తాన్ నోటిలో ఇప్పటికీ రక్తపు మరకలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ రక్తం బీభత్సకారులు చంపిన భారతీయులది. అలాంటి నోటితో నవాజ్ షరీఫ్ ఇచ్చినట్టు చెబుతున్న హామీలను నమ్మడం ఆత్మవంచన మాత్రమే. ఊఫాలో నరేంద్ర మోదీ చేతిని నవాజ్ షరీఫ్ రక్తహస్తం ఊగిస్తుండిన సమయంలోనే అమర్‌నాథ్ యాత్రికులపై దాడికి జిహాదీలు సిద్ధమవుతున్నట్టు వార్తలు వెలువడినాయి. పాకిస్తాన్ ప్రభుత్వం విధానంలో ఎక్కడ వచ్చింది మార్పు?
జాకీ ఉర్ రహమాన్ లఖ్వీ అనే వాడిని శిక్షించడానికి ఎలాంటి ఆధారాలు లేవని బుధవారం పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో స్పష్టం చేసిందట. 2008 నవంబర్‌లో ముంబయిపై దాడి చేసిన జిహాదీ హంతకులను ఉసిగొల్పి నడిపించిన వాడు ఈ లఖ్వీ. శుక్రవారం నవాజ్ షరీఫ్ లఖ్వీ విషయమై నరేంద్ర మోదీకి ఏవో హామీలు ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో విశ్వసనీయత ఎంతశాతం? ‘న్యాయస్థానాలు విడుదల చేసిన’ లఖ్వీని విచారించి శిక్షించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇక ముందు పూనుకుంటుందన్నది వంచన క్రీడలోభాగం. నవాజ్ షరీఫ్‌ను నరేంద్ర మోదీ గట్టిగా నిలదీసినందువల్ల ఇకపై పాకిస్తాన్ వైఖరిలో మార్పు రాగలదన్నది మన ప్రభుత్వం వారి ఆశాభావం. కానీ బుధవారం నాటి పాకిస్తాన్ ప్రభుత్వ విధానం శుక్రవారం మారిపోయిందని విశ్వసించడం తార్కికమా? జమాత్ ఉద్ దావా ముఠాలో పేరుమోసిన హంతకుడు హఫీజ్ సరుూద్ అసలు సూత్రధారి. సరుూద్‌నీ నిర్బంధించి విచారించాలని, అతని నాయకత్వంలోని జమాద్ ఉద్ దావాను నిషేధించాలని 2008 డిసెంబర్‌లో ఐక్యరాజ్య సమితి తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానాన్ని అమలు జరిపినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది కూడ. కానీ తీర్మానాన్ని అమలు జరపలేదని జమాత్ ఉద్ దావాను పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించలేదని 2009 జూలై లాహోర్ హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల హఫీజ్ సరుూద్‌ను గృహ నిర్బంధం నుండి విముక్తి చేయాలని లాహోర్ హైకోర్టు ఆదేశించింది. ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఆమోదించిన తీర్మానాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం పాటించవలసిన అవసరం లేదని కూడ లాహోరు హైకోర్టు స్పష్టం చేయడం చరిత్ర. హైకోర్టు నిర్ణయాలను ఆ తరువాత పాకిస్తాన్ సుప్రీంకోర్టు ధ్రువపరిచింది..
హఫీజ్ సరుూద్ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం అభినయించిన న్యాయ ప్రక్రియ లఖ్వీ విషయంలో కూడ పునరావృత్తమైంది. ఇది ఆశ్చర్యకరం కాదు. పాకిస్తాన్ ప్రభుత్వం లఖ్వీని విచారించి శిక్షిస్తుందన్న ఆశాభావంతో మోదీ రష్యాలో షరీఫ్‌తో కరచాలనం చేయడమే విస్మయకరం. 2008 డిసెంబర్ నాటి సమితి తీర్మానాన్ని అమలు జరిపినట్టు అభినయించి సమితిని అంతర్జాతీయ సమాజాన్ని వంచించిన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విశ్వసించడం ఎండమావి నుండి నీరు తోడడానికి ప్రయత్నించడంతో సమానం. గత ఆగస్టు 18న మన ప్రభుత్వం పాకిస్తాన్‌తో తెగదెంపులు చేసుకొంది. కాశ్మీరీ విచ్ఛిన్నకారులతో చర్చలు జరుపడం మాననంతవరకు, సీమాంతర ఉగ్ర క్రీడను ఉపసంహరించుకునే వరకు పాకిస్తాన్‌తో చర్చలు జరపరాదన్నది మన ప్రభుత్వం అప్పుడు చెప్పిన మాట. రెండింటిని పాకిస్తాన్ మానుకోలేదు…

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.