ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -61

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -61

27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్ -2

సంచార ఉద్యోగ జీవితం

బుర్రనిండా సంపాదనా పరమైన ఆలోచనలే ఎడిసన్ కు. పదహారవ ఏటనే బాగా పరిణతి చెందాడు .స్వతంత్రం గా ఆలోచించటం లో దిట్ట అనిపించాడు .టెలిగ్రాఫ్ ఆపరేటర్ గా విజయాన్ని సాధించి కెనడాలో మొదటిసారిగా ఉద్యోగం లో చేరాడు .కస్టపడి పని చేసేవాడు .తీరిక లేకుండా వ్యాపకం లో ఉండేవాడు .తరువాత అయిదేళ్ళు సంచార జీవితమే .ఏదో ఒక ప్రదేశానికే పరిమితమై పని చేయటం నచ్చక చాలా ఉద్యోగాలు కోల్పోయాడు .ఎక్కడ ఏపనిలో ఉన్నా సైంటిఫిక్ పరిశోధనలు మాత్రం మానలేదు .అతని ఉద్యోగేతర వ్యాపకాల వలన అర్ధ రాత్రి దాకా మేల్కొని పని చేసేవాడు .మనుషులు నిద్రతోనే ఎక్కువ కాలం గడుపుతున్నారని కామెంట్ చేసేవాడు .

నైట్ షిఫ్ట్ ఉద్యోగం

వయసు ఇరవై ఒకటి వచ్చింది .తిరిగింది ఇక చాలులే అనుకొన్నాడు .జీవితాన్ని మలుపు తిప్పుకోవాలని నిర్ణయించుకొన్నాడు .బోస్టన్ చేరి అక్కడే ఎక్కువ కాలం ఉన్నాడు .వేస్త్రెన్ యూనియన్ టెలిగ్రాఫ్ ఆఫీస్ లో నైట్ షిఫ్ట్ డ్యూటీలో చేరాడు .పగలంతా ఒక అద్దె గదిలో లాబ్ ఏర్పాటు చేసుకొని పరిశోధనలు చేశాడు .కాసేపు ఖాళీ దొరికితే కునుకు తీసేవాడు .ఆ రోజుల్లో రోజుకు నాలుగు గంటలే ఎడిసన్ నిద్ర పోయేవాడు .టెలిగ్రాఫ్ పరికరాలను ఎన్నిటినో తయారు చేశాడు .కాని ఇది ఎవరికీ పట్టేది కాదు .

వోట్ రికార్డింగ్ మెషిన్

ఇది కాదనుకొని వోట్ లను రికార్డ్ చేసే యంత్రాన్ని స్వయం గా కనిపెట్టాడు .1868లో మొదటిసారిగా దీనికి పేటెంట్ హక్కు పొందాడు .అమెరికన్ కాంగ్రెస్ దీన్ని కొంటుందేదేమో అనే ఆశతో వాషింగ్టన్ వెళ్లి కమిటీ ముందు  దాన్ని ప్రదర్శించి చూపించాడు .దాని అవసరం తమకు లేదని వాళ్ళు తేల్చి చెప్పారు .అధికారులకు పని కొచ్చే వి చేసేదానికంటే ప్రజలకు బాగా ఉపయోగపడేవి తయారు చేయాలని నిశ్చయించుకొన్నాడు.న్యూయార్క్ వెళ్ళాడు .

న్యూయార్క్ లో ఫోర్ మన్ జీవితం

న్యూయార్క్ లో ఎడిసన్ కాలు పెట్టేసరికి జేబులో పెన్నీ కూడా లేదు .అతని టెలిగ్రాఫ్ మిత్రులు ఒక డాలరు అప్పు ఇచ్చారు .దానితో గోల్డ్ ఇండికేటర్ కంపెనీ లో బాటరీ రూమ్ లో ఉన్నాడు .ఈ కంపెనీ గోల్డ్ మార్కెటింగ్ చేసేది .ఎప్పటికప్పుడు గోల్డ్ రేట్ నుస్టాక్ బ్రోకర్లకు కోట్ చేసే  కీబోర్డ్ ను వైర్ సిస్టం తో పని చేయించేవారు .ఒక సారి టాం గోల్డ్ ఇండికేటర్ ఆఫీసు లో ఉన్నాడు .అనుకోకుండా ఆ మెషిన్ పని చేయటం ఆగిపోయింది .ఎక్కడ లోపం ఉందొ ఎవరూ కనిపెట్ట లేక పోయారు .ఎడిసన్ ఆ కంపెనీ ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్లి మెషీన్ లో లోపం ఎక్కడ ఉందో తాను   కనిపెట్ట గలనని చెప్పాడు .’’అయితే ఏడు వెంటనే ‘’అన్నాడు కట్ అండ్ డ్రైగా .కంపెనీ ఇంజినీర్ల బుర్రలకు ,కళ్ళకు కనిపించని లోపం టాం కు కనిపించింది. అందులో రెండు గేర్ వీల్స్ ను కలిపే ఒక స్ప్రింగ్ విరిగి పడిపోయిందని తెలుసుకొన్నాడు.దాన్ని మార్చి మెషీన్ పని చేసేట్లు చేసి టికర్ లు  మళ్ళీ పని చేసేట్లు చేశాడు .అంతే ఎడిసన్ ను ఆ కంపెనీ ఫోర్ మన్ గా వెంటనే నియమించాడు  ప్రెసిడెంట్  .నెలకు మూడు వందల డాలర్లు జీతం .

అవాక్కు చేసిన యంత్రం ధర

ఈ జీతం తో వర్క్ షాప్, దానికి కావాల్సిన పరికరాలకు ఖర్చు చేశాడు . అతని ఉద్దేశ్యం ఈమొత్తం టికరింగ్  సిస్టం ను సమూలంగా మార్చాలని ఉండేది .ఉద్యోగానికి గుడ్ బై చెప్పి స్వంతం గా ఈ యంత్ర నిర్మాణం పై ద్రుష్టి పెట్టాడు . వాల్ స్ట్రీట్ పత్రిక కొద్దిమార్పులతో ఇదే యంత్రాన్ని వాడింది .టాం తాను  తయారు చేసిన యంత్రాన్ని పాత యజమానికి అమ్మాలని వెళ్ళాడు .ధర ఏంతో చెప్పమని అడిగితే మనవాడు నత్తురు నత్తురు మన్నాడు  .అయిదు వేలా లేక మూడు వేలు చెప్పాలా అని సందేహిస్తూ ఉంటే కంపెనీ యజమాని ‘’నలభై వేల డాలర్లు ఇస్తాను నీకు సంత్రుప్తేనా ?’’అన్నాడు   .అవాక్కైన ఎడిసన్ నోట మాట పెగల్లేదు .అప్పటికి ఈకుర్ర సైంటిస్ట్ వయసు ఇరవై  రెండు మాత్రమే.

పరిశోధనా పరమేశ్వరుడు –     122 పేటెంట్ హక్కులు

ఈ డబ్బుతో ఒక ప్లాంట్ ను నిర్మించి స్టాక్ టికరింగ్  యంత్రాల ఉత్పత్తి ప్రారంభించాడు .ఈ యంత్రం పై క్రేజ్ పెరిగి విపరీతంగా ఆర్డర్లు  వచ్చాయి .అన్ని యంత్రాలు తయారు చేయటానికి తగిన స్టాఫ్ ను పెట్టుకొని పగలు రాత్రి షిఫ్ట్ లు పని చేయించి అందజేశాడు .అతను ఎంతకస్టపడినాడో ,ఎన్ని గంటలు నిద్రపోయాడో తెలియదుకాని అతని సృజనలు తామర తంపరగా రాసాగాయి .1876కు ఎడిసన్ ఏకంగా 122 పరికరాలకు పేటెంట్ హక్కులు పొంది అందర్నీ ఆశ్చర్య పరచాడు .ఇతని జీవిత  చరిత్ర రాసిన గార్డెన్ గార్బెడియన్స్ చెప్పినదాని   ప్రకారం ఒకే సమయం లో ఎడిసన్ 45 వేర్వేరు సృజనల మీద ద్రుష్టి పెట్టి పనిచేశాడు .ఇది సామాన్య మానవులకు అందుబాటు లో ఉండేవిషయం కాదు. దటీజ్ ఎడిసన్ .పరిశోధనా పరమేశ్వరుడు అనిపించాడు .టేలిగ్రఫీ  పని విధానం లో కూడా అనేక పరిశోధనలు చేశాడు .

లక్ష డాలర్లు –   టెలిఫోన్ యుద్ధం

ఇరవై నాలుగవ ఏట ఎడిసన్ మేరీ స్టిల్ వెల్ అనే లాబ్ అసిస్టంట్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఎన్నో ఇన్వెన్షన్లు చేసిరికార్డ్ సృష్టించిన  ఎడిసన్  ముగ్గురు పిల్లల్ని కన్నాడు .ఒకమ్మాయి ఇద్దరబ్బాయిలు .పిల్లలు పుట్టాక కుటుంబాన్ని న్యు జెర్సీ లోని మెన్లో పార్క్ కు మార్చాడు .ఇంటిదగ్గరే వర్క్ షాప్ పెట్టాడు .టెలిగ్రాఫిక్ కోడ్ ద్వారా పంపే విధానానికి స్వస్తిపలికి మనిషి చేసే శబ్దం నే పంపే ఏర్పాటు చేశాడు.అలేక్సాండర్ గ్రాహం బెల్. .పేటెంట్ కూడా పొందాడు .బెల్ టెలిఫోన్ అని పిలువ బడే ఈ పరికరం దీరీ లో బాగానే ఉంది ప్రాక్టికల్ గా ఫెయిల్ అయింది .దీన్ని పరి పుష్టిచేయాలి అని పించిన ఎడిసన్ కార్బన్ ట్రాన్స్ మీటర్ ను తయారు చేసి వాడాడు .స్పష్టమైన శబ్దం వచ్చింది .దీనికి గాను వేస్త్రెన్ యూనియన్ ఎడిసన్ కు లక్ష డాలర్లు ఇచ్చారు .ఇంతడబ్బు వస్తే మళ్ళీ దాన్ని ప్రయోగాలకోసం ,లాబ్ కోసం ఖర్చు చేస్తానేమో ననే సందేహం తో ఆ కంపెనీని ఏడాదికి ఆరు వేల డాలర్లను పదిహేడేళ్ళు ఇవ్వమని కోరాడు .లోపేటెంట్ విషయం లో బెల్  వాళ్లకు   వేస్త్రెన్ వాళ్లకు గొడవలు వచ్చాయి   .అంతులేనికధలా సాగింది యవ్వారం .చివరికి వేస్త్రెన్ వాళ్ళు ఎడిసన్ ఇన్వెన్షన్ ను బెల్ వాళ్ళకే  తమ వ్యాపారం తో సహా ఇచ్చేసి ఇరవై శాతం రాయల్టి ని బెల్ సిస్టం కు అందజేశారు .

Thomas Edison2.jpgThomas Alva Edison Signature.svg

సశేషం

గోదావరి మహా పుష్కరాల అభినందనలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-15 –ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.