పరబ్రహ్మశాస్త్రికి ఐసిహెచ్‌ఆర్ ఫెలోషిప్

హైదరాబాద్, అక్టోబర్ 1: తెలుగువారు గర్వించదగిన ప్రఖ్యాత చారిత్రక, పురావస్తు పరిశోధకుడు కాకతీయుల చరిత్రపై అధ్యాయనం చేసి అనేక గ్రంథాలు రాసిన డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రికి భారత చారిత్రక పరిశోధనా మండలి (ఐసిహెచ్‌ఆర్) జాతీయ ఫెలోషిప్‌ను ప్రకటించింది. డాక్టర్ పరబ్రహ్మశాస్త్రితో పాటు బెనారస్ హిందూ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఠాకూర్ ప్రసాద్ వర్మకు కూడా ఫెలోషిప్ దక్కింది. 1921లో గుంటూరు జిల్లా పెదకొండూరులో పరబ్రహ్మశాస్ర్తీ జన్మించారు. గురుకుల పద్ధతిలో సంస్కృతం చదువుకున్నారు. జాతీయ ఫెలోషిప్ కింద ఆయనకు నెలకు 55వేల రూపాయిలు చొప్పున రెండేళ్లపాటు గ్రాంట్‌ను అందిస్తారు. దీనికి అదనంగా ఏటా మరో 60 వేల రూపాయిలను ప్రస్తుత పరిశోధనలకు వెచ్చించేందుకు ఇస్తారు. యావజ్జీవితం శాసన పరిశోధనలకు అంకితమైన వాసుదేవ పరబ్రహ్మశాస్ర్తీ ఆంధ్రచరిత్రకు ఆకరాలు అందించారు. శాసనాధారాలతో కాకతీయ వంశానుక్రమణిక, శాతవాహనుల గురించి లోతైన నికార్సయిన అధ్యయనం చేసిన ఏకైక పరిశోధకుడు పరబ్రహ్మశాస్ర్తీ. నాణాల పరిశీలనతో శాతవాహన శకాల నిర్ణయం చేసి పరిశోధకుల మెప్పు పొందారు. కాకతీయ వైభవానికి సంబంధించి కొన్ని అంశాలను గుర్తించి అజ్ఞాతంగా ఉన్న శాసనాలను వెలికి తీసి ప్రామాణిక గ్రంథాలను రచించారు. తెలంగాణకు గర్వకారణంగా ఉన్న చరిత్రను విశ్వవిఖ్యాతం చేసిన పండితుల్లో అగ్రగణ్యుడు. గ్రామాలకు వెళ్లి అసలు చరిత్ర ప్రజల జీవన విధానంలోనే ఉందని గుర్తించి, అదే తపనతో ఆ సమాచారాన్ని ఒడిసిపట్టుకుని ఏ హంగులూ లేని కాలంలో అద్భుతమైన యజ్ఞం చేశారు. సంస్కృతం మీద ఉన్న పట్టుతో ఎన్నో బ్రహ్మీ లిపి శాసనాలను అవలీలగా పరిష్కరించడమేగాక, లిపి పరిణామాన్ని కూడా వివరించి పండితులను మెప్పించారు. 12 గ్రంథాలు రాసిన పరబ్రహ్మశాస్ర్తీ శాసనాల్లో ఉన్న అన్నమాచార్య కీర్తనల పుస్తకానికి సహ సంపాదకత్వం వహించారు. 94 ఏళ్ల ప్రాయంలో సైతం పరిశోధనల్లోనే మునిగి తేలే వారి జీవితం భావి పరిశోధకులకు ఆదర్శప్రాయం.
1938లో పరబ్రహ్మశాస్ర్తీ మద్రాస్ రెసిడెన్సి నుండి ఎస్సెస్సెల్సీ ఉత్తీర్ణులయ్యారు. కాశీలో సంస్కృతంలో ఉన్నత విద్యను అభ్యసించిన పరబ్రహ్మశాస్ర్తీ కర్నాటక ధార్వాడ్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో డాక్టరేట్ పొందారు. 1959 నుండి పురావస్తుశాఖలో దీర్ఘకాలం పనిచేసి పదవీవిరమణ చేశారు. తెలుగువిశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్శిటీల్లోనూ కొంత కాలం పనిచేశారు. 500 బిసిలో ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక ఆర్ధిక పరిస్థితులపై పరిశోధనలు చేశారు. అనేక ప్రసిద్ధ జర్నల్స్‌లో పరబ్రహ్మశాస్ర్తీ వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

