సత్యం బహుముఖీనం
‘’మానవుడు కనిపించేదానికి ఆవల ద్రుష్టి సారించాడు .తనను తాను విస్తృత పరచుకొన్నాడు .దీనినంతా అభివృద్ధి అని ,పరిణామం అని అంటున్నాం .అతని గమ్యం వైపు ప్రయాణానికి,భగవంతుని చేరడానికి వీటితో కోలుస్తున్నాం .ఇదంతా మతం గొప్పతనానికి అంటగడుతున్నాం .దీనితో అతనిజీవితాన్ని భయానకం చేస్తున్నాం .మతం అతనికి ప్రశాంతిని ,ప్రేమను అందించింది .అదేమతం అతనిలో భయాన్ని ,ద్వేషాన్నీ కూడా రగిలించింది .మతం అతనిలో సోదర భావాన్ని పెంపొందించింది .అదే సమయం లో మనిషి మనిషి మధ్య విద్వేష మూ పుట్టించింది .మతమే దాన గుణం తో విద్యా వైద్య సంస్థలను మనుషులతోబాటు జంతువులకుకూడా నెలకొల్పెట్లు చేసింది .ఇదే మతం వాటిమధ్య వైరాన్ని రక్తపాతాన్ని సృష్టించింది .ప్రతి ఆలోచనలో అంతర్గత ప్రవాహం ఒకటి ఉంటుంది అని గ్రహించాలి .ఇదేమనుషులలో విభిన్న పక్షాలకు దారి చూపిస్తుంది .వేదా0తులమధ్య ,భిన్నమతాల మధ్య తులనాత్మక పరిశీలన చేసి అందరిలో సామరస్యాన్ని సాధించే విద్యార్ధుల మధ్య చిచ్చు పెడుతుంది .ఇలా మతం వలన భిన్నమైన తెగల మనుష్యులంగా మారిపోతున్నాం .ఈ సామరస్య సాధన కొన్ని దేశాలలో సాధించగలిగితే ఎన్నో దేశాలలో అది విఫలమైంది .
ప్రపంచం లో ఉన్న గొప్పమతాలన్నీ అతి ప్రాచీనమైనవే .అవి ఇటీవలికాలం లో వచ్చినవికావు అని గమనించాలి .దాదాపు ఈ పురాతన మతాలన్నీ గంగా –యూఫ్రటీస్ నదుల మధ్య మాత్రమె పుట్టాయి .ఇందులో ఏ ఒక్క గోప్పమతమూ యూరప్ లోకాని అమెరికాలో కాని పుట్టలేదని తెలుసుకోవటం ముఖ్యం .ఒక్కటికూడా అక్కడ పుట్టలేదు .అదీ విచిత్రం .ప్రతిమత ఆవిర్భావానికి ఆసియా ఖండమె జన్మస్తలమై,,ప్రపంచ వ్యాప్తమైంది .ఆసియావాసులు మంచి మత బోధక వ్యాపారులని లని పించుకున్నారు .పాశ్చాత్య దేశీయులుసాంఘిక సంస్థలు ,సైన్యం ,ప్రభుత్వాలు మొదలైన వాటి నిర్వహణలో ఆరితేరినవారయ్యారు . మత బోధనా విషయానికి వస్తేమాత్రం ఆసియన్ల కు సాటి రారు .కారణం వీరికి మొదటినుంచి మతం వ్యాపార గుణమైంది .అదివారి రక్త గతం వ్యక్తిగతం. దీనికోసం వాళ్ళు ప్రచార సాధనాలను పెద్దగా ఉపయోగించలేదు .’’
‘’ ప్రస్తుత మానవ సమాజం లో అనేక మతాలు ,పెరుగుతూ విస్తరిస్తూపోతున్నాయి అనేది యదార్ధ విషయం . ఇప్పుడు దీనికి ఒక అర్ధం ,పరమార్ధం ఏర్పడ్డాయి .సృష్టికర్త అయిన భగవంతుడు ఏదో ఒకమతమే ఉండాలని మిగిలినవి కాలగర్భం లో కలిసి పోవాలని అనుకొంటే ఇన్ని మతాలూ ఇన్ని రకాలుగా విస్తరించేవి కావు అన్న సత్యం గ్రహించాలి అందరూ .ఇందులో ఒక మతమే యదార్ధమైనదని మిగిలినవి కావని అనుకోని ఉంటె అదే ప్రపంచమంతా ఈపాటికి ఆక్రమించి ఉండేది .కాని అలా జరగలేదు కదా .ఒక్కమతానికే వ్రేళ్ళు బలమై ప్రపంచమంతా పాకలేదు .కొన్నిమతాలు కొంతకాలం ముందున్నాయి తర్వాత వెనక బడి ఉండచ్చు .ప్రపంచ వ్యాప్తంగా గణాంకాలు సేకరిస్తే కొన్నిమతాలు బాగా పుంజుకొని ముందుకు వెళ్లి కాలప్రభావం వలన ప్రాభవం కోల్పోయి వెనుకడుగు వేసినట్లు గమనించగలం .దీనితో అనేక తెగలు ఏర్పడ్డాయి ‘’.
‘’ఒకమతం తనకే సత్య దర్శనం అయిందని ,దేవుడు తనమతం వారికే సత్యాన్నితమ పవిత్ర గ్రంధం లో అందించాడని .నిజంగా అనుకోని ఉంటె ఇన్ని తెగలు వచ్చేవికావు కదా .అలా ఒకే గ్రంధం లో తన భావనలు నిక్షిప్తం చేసి దేవుడు ,ఆ గ్రందాల విషయం లో పోట్లాటలు పెడతాడా?ఒక వేళ సత్యం ఉన్న ఒక మత గ్రంధం దేవుడే ఇచ్చి ఉంటే,దాన్ని అర్ధం చేసుకోవటం అందరికీ సాధ్యమవుతుందా ?బైబిల్ నే ఉదాహరణ గా తీసుకొందాం .క్రైస్తవులలో ఎన్ని తెగలు ఏర్పడ్డాలేర్పడి నాయో ఎవరైనా చెప్పగలరా ? అది భగవంతుడిచ్చిన సత్య దర్శనమేగా ?మరెందుదుకు ఇన్నిచీలికలు ?అదే పవిత్ర గ్రంధం మీద ఒక్కో తెగ తనకు తోచిన వ్యాఖ్యానం చేసింది .తానే బైబిల్ ను పూర్తిగా అర్ధం చేసుకోన్నానని నొక్కి చెబుతుంది .మిగిలినవారివన్నీ అసత్యాలని బుకాయిస్తుంది .ఇలాగే అన్నిమతాల విషయం లో కూడా జరిగింది అని అర్ధం చేసుకోవాలి ‘’.
‘’ మహామ్మదీయుల్లో, బౌద్దులలో ఇలానే తెగలేర్పడ్డాయి .హిందువులలో లెక్కలేనన్ని ఉన్నాయని తెలిసిన విషయమే .దీన్ని బట్టి తేలింది ఏమిటి ? ప్రపంచ మానవాళి నంతా ఒకే ఆధ్యాత్మిక విధానం లోకి ఒకే ఆలోచన కిందకు తెచ్చిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయని .అందరికీ ఒకే రకమైన నమ్మకాన్ని ,విశ్వాసాన్ని కల్గి౦చ లేమని. .ఇది పూర్తి యదార్ధం .దీనికి మనం భగవంతుని కృతజ్ఞతలు చెప్పుకోవాలి .నేను ఏ తెగకు వ్యతిరేకం కాదు .ఇన్ని రకాల తెగలేర్పడినందుకు నాకు మహాదానందంగానే ఉంది .అవి ఇంకా తామర తంపరగా పెరగాలని, విస్తరించాలని నేను కోరుకొంటున్నాను .ఇలా నేను అనుకోవటానికి కారణం ఏమిటి అంటే –ఇక్కడున్న మీరు, నేను, మనమందరం ఒకే రకంగా ఆలోచిస్తే ,ఇంక మనకు కొత్తగా ఆలోచి౦చా ల్సినదేదీ ఉండదు .వస్తువుల మధ్య చలనం జరగాలంటే రెండు లేక ఎక్కువ శక్తులు పరస్పరం ఘర్షణ చెందాల్సిందే .ఆలోచనలలో అభిప్రాయభేదం ,మానవ ఆలోచనల ను మేల్కొల్పుతుంది .ఇక్కడ చేరిన మనమందరం ఒకే విధంగా ఆలోచిస్తే మనం మ్యూజియం లో ఉండే ‘’ఈజిప్షియన్ మమ్మీలు ‘’అయిపోయి ఒకరినొకరు శూన్య దృక్కులతో చూసుకొంటూ అచేతనంగా ఉండిపోతాం .అంతకంటే ఏమీ ఉండదు .ప్రవాహం ఉన్ననీటిలోనే సుడిగుండాలు , అగాధాలు ఉంటాయి .ప్రవహించని మరణ సదృశ నిలవ నీటిలో ఇవేవీ ఉండవు .మతాలు మరణిస్తే తెగలకు ఆస్కారం ఉండదు .అప్పుడు లభించేది స్మశాన నిశ్చల ప్రశాంతి మాత్రమే .మానవాళి ఆలోచనలు సాగినంత కాలం ఈ తెగలు ఉంటూనే ఉంటాయి, ఉండాలి కూడా .భిన్నత్వం ప్రాణి చిహ్నం .అది ఉండాల్సిందే .ప్రపంచం లో ఎంతమంది మనుషులున్నారో అన్ని తెగలు ఏర్పడాలనే నేను ప్రార్ధిస్తాను .అందువలన ప్రతి వ్యక్తీ తన స్వంత ఆలోచన ,స్వయం విధానం రూపొందించుకొని,మత భావాలను సుసంపన్నం చేయాలని నా కోరిక ‘’.అన్నాడు స్వామి వివేకానంద ‘’Many facets of the Truth ‘’లో .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-15- ఉయ్యూరు

