ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -114
47- భారత జాతి పిత మహాత్మా గాంధి -4(చివరి భాగం )
దేశం విషయం లో తీవ్రంగా స్పందించిన గాంధి తన స్వంత కుటుంబ విషయం లో కూడా చాలా గట్టిగానే వ్యవహరించాడు .స్ట్రిక్ట్ డిసిప్లిన్ అంటూ పిల్లలపై ఆంక్ష పెట్టాడు .ఆయన పాత పద్ధతులు వాళ్లకు నచ్చలేదు .హరిలాల్ పెద్ద తాగు బోతు అయ్యాడు .జల్సా గాడై డబ్బు దుబారా చేశాడు .చివరికి మహమ్మదీయ మతం లోకి మారాడు .తన గొప్పతనాన్ని గాంధీ దాచుకొన్నా ,ఆయన్ను ప్రజలు ‘’మహాత్ముడు ‘’అన్నారు .గుడ్డినమ్మకాలతో ఆయన ప్రజల్ని నమ్మించలేదు .ప్రజలలో చైతన్యం ,జాగృతి కల్పించి మనసుల్ని దోచాడు .’’తన చుట్టూ ఉన్న సామాన్యులను నాయకులుగా అమర వీరులుగా మార్చిన మహా మహర్షి గాంధి అన్నాడు గోపాల కృష్ణ గోఖలే .ఆయన భాషణలు సెర్మన్ ఆన్ ది మౌంట్ లాగా గొప్ప ప్రభావం కలిగించాయి .చెడుకు మంచి గా స్పందించిన మహానుభావుడు .చాలామంది అంతకు పూర్వమే ‘’నిష్క్రియాత్మక ప్రతిఘటన (పాసివ్ రెసిస్టన్స్ )బోధించినవారే ,కానీ గాంధి ఆహి౦సాత్మకంగాశాసన ఉల్లంఘన కార్యక్రమం చేబట్టి ప్రభుత్వాన్ని లొంగ దీసి చరిత్రలో చిరస్మరణీయ విజయాలను సాధించాడు .
తన అనుచరులను ఆయుధం పట్ట వద్దని గాంధీ ఆదేశించినా ,ఆయన చేతుల్లో అనేక ఆయుధాలున్నాయి .అందులో ఒకటి’’ హర్తాల్ ‘’. స్వచ్చందంగా సమ్మెచేసి ,దుకాణాలు బందు చేసి ,పని వాళ్ళు దేవుని ప్రార్ధిస్తూ నిరాహార దీక్ష చేస్తూ ఇంట్లోనే గడపటమే హర్తాల్ అంటే -1919లో బ్రిటిష్ ప్రభుత్వం పరిమిత చట్టం ( రెస్ ట్రి స్టివ్ యాక్ట్ )తెచ్చినప్పుడు గాంధి హర్తాల్ ఆయుధం మొదటి సారి ప్రయోగించాడు.దాని విజయం దాదాపుగా నమోదై ,28ఏళ్ళ తర్వాత బ్రిటిష్ పాలనకు చరమ గీతం పాడించింది .1919-47మధ్యకాలం లో గాంధీ రాజకీయ ఆధ్యాత్మిక కార్య క్రమాలలో మునిగి తేలాడు .సన్నబడి బలహీనంగా కట్టె పుల్లగా నల్లకళ్ళతో పెద్ద గుండ్రని స్టీల్ రిం ఫ్రేం కళ్ళజోడుతో ఉన్నాడు. అరవై వచ్చేసరికిపళ్ళూడి పోయి ’’ బోసి నోటి బాపు ‘’అయ్యాడు .జుట్టులేకుండా బట్ట తలతో ,శరీరం వంకర్లు పోయి చాలా దారుణంగా తయారయ్యాడు .చేతులు మాత్రం యవ్వనం లో ఉన్నట్లు కనిపించాడు .కాని ఆయన ఆత్మ శక్తికి ఏ అడ్డూ ఆపూ లేదు .ఇది వరతికంటే మరింత ప్రేరితం చేస్తూ ప్రాజల్ని ప్రభావితం చేస్తున్నాడు .ఇండియా అంతా తిరిగి ప్రజలభాషలో ప్రజలకు అర్ధమయ్యేట్లు వందలాది సభల్లో వేలాది ప్రజలకు ప్రబోధించాడు .బాగా అలసిపోయి ఉంటె వేదికపై కాళ్ళు ముడిచి మౌనంగా ఉండి పోయేవాడు .ప్రేక్షకులు కూడా ఆయన మనో భావాన్ని అర్ధం చేసుకొని ఆనందించేవాళ్ళు. ఆయన మాట యెంత ప్రభావితం చేసేదో మౌనం కూడా అంతగానే ప్రభావితం చేసింది .ఆయన మౌన ముద్ర మౌన గురువు దక్షిణామూర్తి ప్రబోధంలాగా ఉండేదన్నమాట .
ఒక వేళ హర్తాల్ పిలుపు తో హింస ప్రజ్వరిల్లితే ,ప్రజలకు శాసనోల్లంఘనలో సరైన శిక్షణ లభించలేదని సమ్మెను ఆపెయ్యాలని వెంటనే ఆదేశించేవాడు .అమృత సర్ లో బ్రిటిష్ నరమేధం చేసినప్పుడు హోమ్ రూల్ లీగ్ అధ్యక్షుడుగా ఉన్న గాంధి ,మరింత తీవ్రంగా సహాయ నిరాకరణ చేశాడు .అరెస్టయి జైలుకెళ్లాడు .జైల్లో నిరాహార దీక్ష చేసి తిరుగుబాటు చేయమని ఆదేశించాడు .ఇలాంటి విధానాలను ఒక దశాబ్ద కాలం నిర్వహించాడు .61ఏళ్ళ బాపు ఇరవై నాలుగు రోజులు నడిచి సముద్ర తీరం దండీ లో ఉప్పు వండాడు ఇదే ఉప్పు సత్యాగ్రహం .ఇది దేశ ద్రోహం గ భావించి అరెస్ట్ చేస్తే ఆసియాలోనే కాదు పడమటి దేశాలన్నీ బ్రిటిష్ దౌర్జన్యాన్ని ఖండించి ఇండియన్ లకు స్వాతంత్ర్యం ఇవ్వాల్సిందేనని ఘాటుగా తెలియ జేశాయి .దీని ఫలితంగా గ్రేట్ బ్రిటన్ చర్చలు జరపటానికి తీవ్రంగా సిద్ధ పడింది .లండన్ కు ఆహ్వానించారు .అక్కడ అయిదవ జార్జి రాజు తోనూ క్వీన్ మేరీ తోనూ కలిసి బకింగ్ హాం పాలస్ లో టీ త్రాగాడు .ఇండియాలో ధరించే అన్గోస్త్రం ,పై పంచతో చర్చలకు వెళ్ళాడు .రాజు గారి తో భేటీకి ఈ డ్రెస్ సరి కాదుకదా అని ఒకరు వ్యాఖ్యానిస్తే ‘’రాజు మా ద్దరికి సరిపడిన దానికంటే ఎక్కువ దుస్తులే ధరించాడు కదా ‘’అన్నాడు బోసినవ్వుల బాపు .ఇండియా వదిలి వెళ్ళేదాకా బ్రిటిష్ వాళ్ళు భీష్మించుకొనే కూర్చున్నారు. అంతకంటే మొండిగా గాంధీ కూడా పట్టు వదలలేదు .మళ్ళీ మళ్ళీప్రజల చేత శాసనోల్లంఘన చేయించాడు జైలుకెళ్ళాడు నిరాహార దీక్ష చేశాడు .హిందూ ముస్లిం లమధ్య సయోధ్య కుదిర్చాడు .అంటరాని తనాన్ని రూపు మాపాడు .పుట్టుక బట్టికులంకాదు ప్రవర్తన బట్టి అన్నాడు .బ్రిటిష్ ప్రభుత్వ నక్క జిత్తులు గాంధి ముందు పారలేదు .గాంధీని నియంత్రించటం అసాధ్యం అని గుర్తించింది తెల్ల జాతి ప్రభుత్వం .లక్ష్యం ఏమిటో 1942లో క్రిప్స్ రాయబారం వలన ఇస్తామన్న రాజ్యాంగ ప్రతిపత్తి (డొమినియన్ స్టేటస్ )చాలదని పూర్తీ అధికారం తో స్వాతంత్ర్యం ఇచ్చి దేశం విడిచి బ్రిటిష్ వారు వెళ్ళిపోవాలని చెప్పాడు .
కాని దేశం లో ఐక్యత సాధించటం కష్టంగా ఉంది .రాత్రింబవళ్ళు హిందూ ముస్లిం ఐక్యత కోసమే శ్రమించాడు .పాకిస్తాన్ లో ముస్లిం లు ఎక్కువ .మిగతా దేశం లో హిందువులది మెజారిటీ .నాయకులతో 73ఏళ్ళ వయసులో కూడా పరిష్కారం కోసం నిరంతర సంభాషణలు జరుపుతూనే ఉన్నాడు ఓపికగా.అసూయ ,బదులు ప్రేమతో ఉండమన్నాడు ప్రతిఘటన వదిలి సహకరించాలని కోరాడు .కాని ఆయన ప్రయత్నం విఫలమైంది .రెండు మతాలమధ్య చిచ్చు రగిలింది .హింస ప్రజ్వ రిల్లింది .కానీరాజీ అనేది గాంధీ ముఖ్య సిద్ధాంతం .మెజారిటీ వైపే మొగ్గాడు .చివరిసారిగా ఎక్కువకాలం నిరాహార దీక్ష చేశాడు .దాదాపు చావు అంచుకు చేరాడు .ఢిల్లీ లో చర్చలు జరిపి ఇండియాపాకిస్తాన్ లు ఏర్పడాలని ముస్లిం లు పట్టు బట్టారు .చర్చులు విఫలమైనాయి .ఒప్పుకోక తప్పలేదు .1947ఆగస్ట్ 15 ఇండియా స్వతంత్రం పొందింది పాకిస్తాన్ విడిపోయింది మళ్ళీ గాంధి విఫలమైనాడు .సయోధ్యకోసం ప్రయత్నించే సమయం ఇక లేదు .25-1-1948న ..ఆదివారం దీక్ష అయిపోగానే ఒక ప్రార్ధనా సమావేశానికి హాజరయ్యాడు .మామూలుకంటే అధికంగా జనం హాజరౌతున్నారు ప్రార్ధనలకు .౩౦-1-1948న ప్రార్ధనా సమావేశానికి వెడుతూ ఉండగా నాధూరాం గాడ్సే అనే హిందూ మహాసభ సభ్యుడు గాంధీకి నమస్క రిస్తున్నట్లుగా వంగి చేతిలోని రివాల్వర్ తో అతి దగ్గరగా మూడు సార్లు కాల్పులు జరిపాడు .’’ హే రాం ‘’అంటూ కుప్ప కూలి ప్రాణం విడిచాడు జాతిపిత మహాత్మా గాంధీజీ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-2-16-ఉయ్యూరు

