సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు

సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు

సంగీత కచేరి

శ్రీమతి వి శాంతిశ్రీ గారు

దాదాపు 25 సంవత్సరాలుగా రేడియో, దూర దర్శన్ లలో  సంగీత కచేరీలు చేస్తూ, సుస్వర మధుర గాత్రం తో జనరంజకంగా సంగీతం వినిపిస్తున్న శ్రీమతి వట్టెం శాంతి శ్రీ గారు శ్రీ వంగర మోహన శర్మ ,శ్రీమతి భానుమతి దంపతులకు జన్మించారు . సంగీతం లో డిప్లొమా, తెలుగు లో ఏం .ఏ .డిగ్రీ . పొందారు ..శ్రీ వట్టెం రామ కృష్ణ గారిని వివాహం చేసుకొన్నారు . పశ్చిమ గోదావరిజిల్లా పెద వేగి జవహర్ నవోదయ విద్యాలయం లో సంగీత ఉపాధ్యాయినిగా పని చేస్తూ ,ప్రస్తుతం సెలవులో ఉన్నారు .జీ తెలుగు ‘’సరిగమలు ‘’,సూపర్ సీనియర్స్’’ పోటీలలో పాల్గొన్నారు .తాము గానం చేసిన అన్నమాచార్య కీర్తనలను ,శంకరాచార్య స్తోత్రాలను రికార్డులు ,సి .డి .గా చేశారు .   సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో శ్రీమతి శాంతిశ్రీ గారిని గాత్ర సంగీత కచేరీ నిర్వాహించవలసినదిగా సగౌరవం గా ఆహ్వానిస్తున్నాం .వీరికి వాద్య సహకారాన్ని  వయోలిన్ పై శ్రీ చావలి శ్రీనివాస్ ,తబలా పై శ్రీ వెంగయ్యగార్లు అంద జేస్తారు ..

.

ఈ సంగీత కచేరీని తమ తల్లిగారైన స్వర్గీయ శ్రీమతి మైనేని సౌభాగ్యమ్మగారి స్మారకార్ధం  ,ఆమెకు సంగీతం పై ఉన్న అభిరుచికి తార్కారణంగా, వారి కుమారులు ,సరసభారతికి అత్యంత ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )  ప్రాయోజకులు గా సమర్పిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు

వాద్య సహకారానికి , సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీ మతి జోశ్యుల శ్యామలా దేవిగారు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నందుకు  కృతజ్ఞతలు .

 

స్వర్గీయ గబ్బిట భవానమ్మ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక శ్రీ దుర్ముఖి ఉగాది పురస్కార ప్రదానం

దుర్ముఖి ఉగాది అతిధుల పరిచయం

1–డా .శ్రీమతి పుట్ట పర్తి నాగ పద్మిని గారు

తాను  ‘’ అయ్య ‘’అని ఆప్యాయంగా పిలుచుకొనే తండ్రి సరస్వతీపుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీమతి కనకమ్మ గారల కుమార్తె శ్రీమతి నాగ పద్మిని గారు .   కడప ఆర్ట్స్ కాలేజిలో బి యెస్.సి. చదివి ,తిరుపతి లో తెలుగు హిందీ లలో ఏం ఏ లలో డిగ్రీ పొంది,. ఈ రెండు భాషలలో  ,పి హెచ్ డి .చేసి ,పద్మిని గారు ,డా నాగ పద్మిని అయ్యారు . .జర్నలిజం ,అనువాద కళ,టి.వి ప్రొడక్షన్ లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందిన విదుషీమణి  .తెలుగు హిందీ ఇంగ్లీష్ లలో అపార పాండిత్యం సాధించి అనేక వేదికలపై ఉపన్యాసాలతో వ్యాఖ్యానాలతో రాణిస్తున్నారు  .సాహిత్య అకాడెమి ,నేషనల్ బుక్ ట్రస్ట్ ,తిరుమలతిరుపతి దేవస్థానాలకు అనువాద రచనలలో తోడ్పడుతున్నారు .నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం ‘’రాజ్ కమల్ చౌదరి కధలు ‘’,పబ్లికేషన్ డివిజన్ వారికి ‘’నోబుల్ మహిళా గ్రహీతలు ‘’అనువాదం చేశారు .తెలుగు లో వీరి స్వీయ రచనలు ‘’సాహితీ మంజూష ‘’,’’సంగీత సాహిత్య  స్రవంతి’’,’’వ్యాస వాటిక ‘’,’’తెలుగింటి సిరుల పంట ‘’వ్యాస సంకనాలు.  ,.’’హద్దులు ‘’అనే కవితా సంకలనం రాసి ప్రచురించారు .తండ్రిగారి జీవితం –రచనలపై ‘’భాషాపర శేష భోగి పుట్టపర్తి నారాయణాచార్య ‘’ మహా గ్రంధాన్ని రచించి మార్చి  15 వ తేదీన ఆవిష్కరించారు .

హిందీలోనూ గొప్ప రచనలు చేశారు .తెలుగు ,హిందీ రామ కావ్యాలను తులనాత్మకంగా పరిశోధించి ‘’  సీత ‘’అనే ‘’పరిశోధనాత్మక గ్రంధం హిందీలో రచించారు .హిందీలో వీరి పరిశోధన గ్రంధం ‘’సీతాయాశ్చరితం మహాత్ ‘’ కు, పి .హెచ్. డి.పొందారు .’’తెలుగు ఔర్ హిందీ గీతి కావ్య్-తులనాత్మక్  అధ్యయ్’’హిందీలో ఏం .ఫిల్ సిద్ధాంత గ్రంధం గా రాశారు ‘’తెలుగు సాహిత్యసు ,’’భగవత్ ప్రేమ కా పరిమళ్-తిరుప్పావై ‘’,’’అన్నమాచార్య గీత్ కా మాధురి ‘’వీరి ఇతర హిందీ రచనలు .

.    .చెల్లెలు శ్రీమతి  పుట్టపర్తి అనూరాధ గారితో తో కలిసి’’ పుట్టపర్తి సాహితీ సుధ’’బ్లాగ్ ను అద్వితీయంగా నడుపుతూ అన్ని తరాలవారికీ సరస్వతీ పుత్రుని సాహిత్య సరస్వతిని పరిచయం చేస్తున్నారు .ఆమె రచించిన ఎన్నో భక్తీ, లలిత, భావ ,బాల గీతాలు ఆకాశ వాణి దూర దర్శన్ లలో ప్రసారితాలై, యెనలేని కీర్తి నార్జించి పెట్టాయి . నాగ పద్మిని గారు గానం చేస్తుంటే నాగ స్వరం విన్న అనుభూతి కలుగుతుంది .ఆ స్వర మాధురి అద్వితీయమని పిస్తుంది .హైదరాబాద్ దూర దర్శన్ లో ప్రోగ్రాం ఎక్సి క్యూటివ్ గా ప్రస్తుతం వ్యవహరిస్తూ ,సాహిత్య సంస్కృతులను తెలుగు లోగిళ్ళలో నింపుతున్నారు .

పద్మినిగారిని సత్కరించి సన్మానించి ఎన్నో సాహితీ సంస్థలు ధన్యమయాయి .ఆరాధనా సాంస్కృతిక సంస్థ ,అన్నమయ్య పదకోకిల శ్రీమతి  శోభా రాజ్ వీరిని సత్కరించారు .అమెరికాలోని న్యూ జెర్సీ నిర్వహణలో జరిగిన దీపావళి వేడుకలలో వీరు ఆత్మీయ అతిధిగా సత్కరింప బడి  ,తెలుగింటి ఆడ పడుచు గౌరవాన్ని పొందారు .తమిళనాడు లోని హిందీ అకాడెమి వీరికి ‘’సులభ్’’పురస్కారాన్ని గవర్నర్ శ్రీ రోశయ్యగారి చే ప్రదానం చేయించింది .నారాయణా చార్యుల వారి శత జయంతి ఉత్సవాలలో ఘన సత్కారాలు అందుకొన్నారు .దూరదర్శన్ సప్త గిరి లో 53వారాలపాటు కర్నాటక సంగీతం లో  ‘’స్వరసమరం ‘’నిర్వహించి సంగీతజ్ఞుల విశేష ప్రశంసలు పొందారు .ఎందరెందరో నూతన గాయినీగాయకులకుప్రోత్సాహం , విశేష ప్రాచుర్యం కలిగించారు .చిన్న పిల్లలకోసం 14 వారాల పాటు ‘’చిరు స్వర సమరం ‘’నిర్వహించి శాస్త్రీయ సంగీతానికి యెనలేని కీర్తిని ఆర్జించి పెట్టి అందరికీ మార్గ దర్శిగా నిలిచారు శ్రీమతి పద్మినిగారు .

సరస్వతీ పుత్రునికి, అసామాన్య సంగీత సాహిత్య సరస్వతి గా జన్మించి ‘’ఆ అయ్య’’కు  తగ్గ ,ఆ తండ్రిని మించిన తనయ గా రాణిస్తున్న డా .శ్రీమతి పుట్ట పర్తి నాగ పద్మిని గారిని సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల ఉగాది పురస్కారాన్ని అందుకోవలసినదిగా సహృదయ ఆహ్వానం పలుకుతున్నాం .

2-డా శ్రీ  రావి మోహన రావు శ్రీమతి కృష్ణ కుమారి గార్లు

15-12-1954 లో జన్మించిన శ్రీ రావి మోహన రావు గారు ,24-12-1957లో జన్మించిన శ్రీమతి కృష్ణ కుమారి గారిని 24-5-1974 న వివాహం చేసుకొన్నారు  .చీరాల కాలేజీలో జియాలజీ లెక్చరర్ గా చేరిన మోహన రావుగారు  తర్వాత సంస్కృతం లో అభిరుచి కలిగి గీర్వాణ౦  లోనూ ఏం ఏ .సాధించారు .మహాకవి కాళిదాసు రచించిన ఋతు సంహారం ,మేఘ దూతం కవ్యాలపైనా ,కుమార సంభవ కావ్యం లో 7 సర్గలపైనా ‘’మృణాలినీ ‘’వ్యాఖ్యానం రాశారు .శ్రీ అరుళానంద స్వామిసంపాదకులుగా  ప్రచురి౦ప బడుతున్న  ‘’ఆత్మ జ్యోతి  ‘’ఆధ్యాత్మిక మాస పత్రిక కు గౌరవ సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు .స్వంత ఖర్చుతో ఇప్పటి వరకు సుమారు 120 సంస్కృతాంధ్ర గ్రంధాలను వెలువరించిన సాహిత్యోప జీవి శ్రీ రావు గారు .వారికి అన్ని విధాలా సహకరిస్తున్న విదుషీమణి వారి శ్రీమతి శ్రీమతి కృష్ణ కుమారి గారు .

సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాన్నితమ సాహిత్య కృషికి చిరు అభినందన కానుకగా  అందుకోవలసినదిగా ఈ సాహితీ జంట ను వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము .

3-డా.శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు

‘’చిత్త శార్దూలమ్ము చిత్తు చిత్తు గ ,గాగ నెత్తిపై కెక్కిన నీరజాక్షి –శేముషీ సింహమ్ము ‘’శ్రీ ‘’పెంచి ,దానిచే మహిషాదులను నామపు మహిత భావ –శ్వాస హంసము నెక్కి ,చతుర సంచారంబు నేర్పించి కాచు నిర్నిద్ర మాత ‘’అయిన లలితా పరా భట్టారిక శ్రీ రాజ రాజేశ్వరి పై శతకం రాసి ,తమ గురుదేవులు  బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ,వారి తండ్రిగారు వెంకటప్పయ్య శాస్త్రిగారు రచించిన ‘’శ్రీరామ కదామృతం’’అనే బృహత్ గ్రంధం పై’’ సమగ్ర సమీక్ష పరిశోధన నిబంధనం ‘’రచించి ,ఆంద్ర విశ్వ విద్యాలయం చేత పి హెచ్ డి పొందిన వారు శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు .పొన్నూరు లోని శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా ఉద్యోగించి, పదవీ విరమణ  చేసిన సాహితీ మూర్తి .వీరి జననం కృష్ణా జిల్లా ఉప్పులూరు కావటం విశేషం .శ్రీ తూములూరు వెంకట రామ శాస్త్రి ,శ్రీమతి లక్ష్మీ నరసమ్మ దంపతులకు 15-2-1953 లో జన్మించిన శాస్త్రిగారు శ్రీమతి నాగ పద్మావతి గారిని వివాహమాడారు .

రామాయణం –సమాజ దర్పణం ను రెండుభాగాలుగా రచించి ,శ్రీ రామ ,వాల్మీకి , వానుమ ద్వాణి లను వినిపించిన ఆధ్యాత్మిక తేజో విరాజితులు .పావనీ శతకం ,శ్రీ త్రికూటేశ్వర త్రిశతి ,శ్రీ కపోతేశ్వర శతకం ,శ్రీ పొన్నూరు వీరాంజనేయ శతకం ,భావ దేవశతకం వంటి భక్తీ శతకాలను ‘’పిలిస్తేపలికే పద్య ధార’’తో వీనుల విందుగా, గుండెల నిండుగా రాసిన సాహితీ చైతన్య మూర్తి .తమ బావ గారు –అంటే అక్కగారి భర్త గారు శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి అపార సంస్క్రుతాంధ్ర వైదుష్యానికి ,సంస్కృత శతావదానానికీ  అనుక్షణం అబ్బురపడి ఆ మధుర స్మృతులను పంచుకొనే సహృదయ మూర్తి శ్రీ శాస్త్రిగారు

.’’స్తవ నీయుండు ,నరోత్తముండు ,సుగుణోద్దాముండు,ధన్యుండు రాఘవ నారారాణశాస్త్రి తాడెపలి విఖ్యాతుండు ,కారుణ్య మూర్తి ,వివేక స్థిర వర్తనుడు మద్దీక్షా గురుండు ,ఆత్మ తత్వ విదుండా’’రుషి వర్యు ‘’గొల్తు ‘’ అని ఘనం గా కీర్తించే గురుభక్తి శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారిది .ఇంతవరకు పద్యాలలో యోగ విద్య ను రాయని లోటును  తీరుస్తూ ‘’ యోగ వైభవం  ‘’రాసి రికార్డ్ సృష్టించారు .  సాహిత్య సాంస్కృతిక ప్రసంగాలతో ప్రజలకు స్పూర్తి కలిగిస్తున్నారు .

సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భావానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాన్ని అందుకోవటానికి వేదిక నలంకరించ వలసినదిగా  డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారిని   ఆప్యాయం గా ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం .

4-  శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు

తూర్పు గోదావరిజిల్లా అవిడి గ్రామం లో 5-8-1950న శ్రీ గరిమెళ్ళ సూర్యనారాయణ ఘనాపాఠీ, శ్రీమతి సూర్య కాంతమ్మ దంపతులకు జన్మించి ,సంస్కృతాంధ్రాలలో ఏం .ఏ .డిగ్రీ పొంది ,శ్రీమతి రాజేశ్వరిని వివాహమాడి అమలాపురం లోను, విజయవాడ కే బి యెన్ కళాశాలలోను తెలుగు లెక్చరర్ గా పని చేసి పదవీ విరమణ చేసి ,కృష్ణా జిల్లా అధికార భాషా సంఘ సభ్యులుగా ఉన్న శ్రీ సోమయాజులు శర్మగారు పుష్పగిరి పీఠ ఆస్థాన పండిత గౌరవంతో విరాజిల్లుతున్నారు .సహజ పాండిత్య ,తర్క వేదాంత పారంగత బిరుదులు  వీరి విద్వత్తుకు  నిలు వెత్తు సాక్ష్యం .అవధానాలు చేయటం ,అముద్రిత తాళపత్ర గ్రంధాలను  సేకరించి శుద్ధ ప్రతులను తయారు చేయటం ,సాహిత్య ఆధ్యాత్మిక ప్రసంగాలు వీరి వ్యా వ్రుత్తి .

సోమయాజులుగారు బహు గ్రంధ కర్త .సంస్కృతం లో ‘’ద్వాదశీ వ్రతమహాత్మ్యం ‘’,మహాభారత  కంటకోద్దారః మహాకావ్యాలు ,శ్రీశైల లింగాష్టకం ,కలావిలాసః ,ఆనంద మందారః వంటి 11 లఘు కృతులను రచించారు .తెలుగులో పద్యకావ్యాలుగా వాల్మీకి వృత్తాంతం, శ్రీ వేంకటేశ్వర శతకం ,శివ కర్ణామృతం మొదలైన దీర్ఘ కావ్యాలు ,సరస్వతీ దండకం ,విశ్వనాధ మహాకవి వంటి లఘుకావ్యాలూ ,రచించారు .అనేక గ్రంధాలకు బృహత్ పీఠికలు సంత రించారు .ఆంద్ర మాఘ కావ్యానికి ‘’భూమిక ‘’,శంకర విజయానికి ‘’ఆముఖం ‘’వాసుదేవ మననం కు ‘’ఉద్యోతం ‘’పేర్లతో వీరి  పీఠికలు విరాజిల్లాయి .సొమయాజులుగారి వ్యాస వాహిని అడ్డూ ఆపు లేకుండా ప్రవహించింది .కల్పవృక్షం  –నాట్య సంగీత శాస్త్రాలు ,సమగ్రాంధ్ర సాహిత్య సమాలోచనం ,మకర సంక్రాంతి వంటి సుమారు 40 వ్యాసాలను పరిపక్వ అధ్యయనం చేసి రాశారు .తరల సంగ్రహం ,తత్వ బోధ ,పరివ్రాజ చంద్రిక వంటి అనువాదాలూ చేశారు .జగన్నాధ పండితుని గంగా, యమునా, విష్ణు లహరి లకు’’అమృత ధారా వ్యాఖ్య ‘’,అశ్వ దాటీ కావ్యానికి ‘’నవ వీధీ వ్యాఖ్య ‘’రాసి వ్యాఖ్యానం లోనూ సరి జోడు అనిపించారు .సూతసంహిత ,భద్రాద్రి రామ శతకం ,భోగినీదందకం తైత్తిరీయోపనిషత్ మొదలైన 10 గ్రందాల ను పరిష్కరించి , ముద్రణకు తోడ్పడిన విద్వత్ కవి శేఖరులు .శర్మ గారు .వీరి రచనలపై పరిశోధనలూ జరిగాయి .

ఇంతటి విద్వన్మణి,,లౌకిక ఆధ్యాత్మిక గ్రంధ రచనా సమర్ధులు ,శ్రీ పుష్పగిరి ఆస్థాన పండితులు తర్క వేదాంత పారంగతులు  బ్రహ్మశ్రీ గరిమెళ్ళ అచ్యుత శేషగిరి  సోమయాజులు శర్మ గారిని ,సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాన్ని అందుకోవలసినదిగా  ,అత్యంత వినయం తో వేదిక పైకి సాదర ఆహ్వానం పలుకుతున్నాం .

5-డా. అసిలేటి నాగ రాజు  గారు

విజయవాడకు చెందిన డా అసిలేటి నాగ రాజు గారు యువ రచయిత ,పరిశోధకులు ,వికలాంగ రచయితలకు గొప్ప ఆసరా . .అనేక  కళాశాల ,విశ్వ విద్యాలయ ,జాతీయ సాహిత్య సదస్సులలో పాల్గొని 15 కు పైగా వివిధ అంశాలపై పరిశోధన పత్రాలను సమర్పించిన విద్యా వంతులు .నాలుగు అంతర్జాతీయ సదస్సులలో ప్రాతి నిధ్యం వహించి పత్ర సమర్పణ చేసిన  సమర్ధులు .

సుప్రసిద్ధ కధకులు శ్రీ గంధం వేంకా స్వామి శర్మ గారురచించిన ‘’అమృత హస్తాలు ‘’కదా సంపుటిపై శ్రీ నాగ రాజు పరిశోధన చేసి ,ఎం.  ఫిల్ సిద్ధాంత వ్యాసం’’అమృత హస్తాలు –కదాను శీలనం ‘’రచించి ప్రచురించి  2007-8 విద్యా సంవత్సరానికి ‘’ఉత్తమ పరిశోధన లఘు సిద్ధాంత వ్యాసం ‘’గా ఎంపికై  డా .ఉండేల మాల కొండా రెడ్డి  ‘’స్వర్ణ పతకం ‘’అందుకొన్నారు . గురజాడ ,చలం ,బాపిరాజు ,శ్రీపాద ,విశ్వనాధ కధలపై హైదరాబాద్ విశ్వ విద్యాలయం లో  పరిశోధన చేసి ‘’తెలుగు కదా –సంస్కరణోద్యమ  ప్రభావ చిత్రణ ‘’రచించి 2013లో పి హెచ్ .డి.పొందారు . .

డా.నాగ రాజు   గారి ముద్రిత రచనలు  –‘’తెలుగు భారతి –సాహితీ ప్రస్థానం’’ లో ‘’తెలుగుకద –దళిత ఉద్యమ ప్రభావం ‘’రాశారు .అంతర్జాతీయ పరిశోధనా జర్నల్ ‘’యోగ్యత ‘’లో ‘’ప్రపంచీకరణ నేపధ్యం లో చలం కదా సాహిత్య విశిష్టత ‘’వ్యాసం రాశారు .’’ప్రజాసాహితి ‘’మాస పత్రికకు ‘’గురజాడ దిద్దు బాటు లో మానవ సంబంధాలు ‘’వ్యాసం రాశారు .’’కర్షక మధనం ‘’ నువ్వు అక్కడే –నేను ఇక్కడే కదలు ,,’’అవిటి కధలు –వికలాంగుల బతుకు చిత్రణ ‘’అనే కదా సంకలనం లో ‘’ఎదురీత ‘’కదా రాశారు .

వికలాంగ రచయితలకు వెన్ను దన్నుగా నిలిచి ,25మంది వికలా౦గు లచేత చిన్న కధలను రాయించి సంకలన సారధ్యం వహించి ‘’మేము సైతం ‘’పేరుతొ 2015జనవరి లో ముద్రించి విడుదల చేశారు .కాలాన్ని గెలుస్తూ ,ప్రత్యేక ప్రతిభా వంతులపై ప్రచురిస్తున్న కవితా సంకలానికి శ్రీ నాగ రాజు గారి కవిత ’’వైకల్యాలకు లేవు ఆవ రోదాలు ‘’ఎంపిక అయి గొప్ప గుర్తింపు తెచ్చింది .

శ్రీ అసిలేటి నాగ కోటులు, శ్రీమతి పాపాదేవి దంపతులకు 1981 అక్టోబర్ 4 న జన్మించిన శ్రీ నాగరాజు డిగ్రీవరకు విజయవాడలో చదివి ,హైదరాబాద్ యూనివర్సిటీలో తెలుగు ఏం ఏ చేసి , ,రాజమండ్రి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో  ఎం.ఫిల్. పూర్ర్తి చేసి ,హైదరాబాద్ యూని వర్సిటీలో పి.హెచ్ డి.చేశారు .2015 డిసెంబర్ 5న శ్రీమతి’’ దీవెన ‘’ను వివాహమాడి ఒక ఇంటి వాడయ్యారు .

‘’యు. జి. సి .పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కు ఎంపికై, ప్రస్తుతం  ‘’స్వాతంత్ర్యానంతర తెలుగు కద-విభిన్న ఉద్యమాల ప్రభావం ‘’పై హైదరాబాద్ విశ్వ విద్యాలయ తెలుగు శాఖలో పరి శోధన చేస్తున్నవారు ,,వైకల్యం శరీరానికే కాని మనసుకు కాదని సమర్ధ వంతంగా రుజువు చేస్తున్న  డా నాగ రాజు అలిసేటి గారిని –సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాన్ని అందుకో వలసినదిగా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము

6-శ్రీమతి మద్దాలి (వై )సుశీల గారు

కృష్ణా జిల్లా పెదమద్దాలి లో శ్రీ మద్దాలి పూర్ణయ్య శర్మ,శ్రీమతి లక్ష్మీ కాంతమ్మ దంపతులకు శ్రీ మతి మద్దాలి సుశీల గారు జన్మించి ,5వతరగతి నుండే’’నాట్యా చార్య’’  శ్రీ శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి గారి వద్ద నాట్య విద్య నేర్చి, 6వ ఏట నుండి శ్రీ సుంకర కనకారావుగారి ‘’అరుణోదయ నాట్య మండలి ‘’లో చేరి, సినీనటి సావిత్రి తోకలిసి అనేక నాట్య ప్రదర్శనలిచ్చి ,బహుబహుమతులను ,పురస్కారాలు అందుకొన్నారు .శ్రీ కోట సుబ్రహ్మణ్య శాస్త్రి ,శ్రీ సి.ఆర్. ఆచార్య గారల శిక్షణతో నాట్యం లో శిష్యులను తయారు చేసి ‘’నాట్యాచారిణి’’గా ప్రసిద్ధి చెందారు .

శ్రీ మతి సుశీలగారి రంగ స్థల అనుభవమూ అపారమైనదే  .ఆ నాటి సుప్రసిద్ధ రంగస్థల నటులు శ్రీ జగ్గయ్య ,మిక్కిలినేని ,జి ఎస్ ఆర్ మూర్తి ,కే వెంకటేశ్వర రావు ,కర్నాటి లక్ష్మీ నరసయ్య మొదలైన వారితో కలిసి ఎన్నో నాటక ప్రదర్శనలిచ్చి ,ఆంద్ర నాటక కళా పరిషత్ ,ఆంద్ర సంస్కృతిక మహా సభలలో నూ పాల్గొని ‘’ఉత్తమనటి ‘’పురస్కారం పొందారు .రస సమాఖ్య ,ప్రజా నాట్య మండలి ,అరుణోదయ నాట్య మండలి వంటి ప్రముఖ సంస్థలలో నటించి  మంచి  గుర్తింపు  సాధించారు .

వీరి రేడియో అనుభవం విజయవాడ రేడియో కేంద్ర స్థాపన నుండి ఈ నాటి వరకు కొన సాగింది ;ప్రసిద్ధ శ్రవ్య  కళాకారిణి గా గుర్తింపు పొందారు .సాంఘిక ,పౌరాణిక ,జానపద నాటకాలు వీరికి కొట్టిన పిండి .శ్రీ బందా ,అద్దంకి శ్రీరామ మూర్తి ,కందుకూరి చిరంజీవి ,మల్లాది సూరిబాబు, శ్రీరంగం గోపాల రత్నం వంటి ఉద్దండులతో నటించిన మేటి కళా కారిణి శ్రీమతి సుశీల గారు .వీరు నటించిన ‘’సీతా పతి సంసారం ‘’సీరియల్ నాటకం సూపర్ హిట్  అని అందరికి తెలుసు .

ఇప్పుడు వీరికి పేరు ప్రఖ్యాతులు చేకూర్చిన హరికదా రంగాన్ని గురించి తెలుసుకొందాం. శ్రీ అక్కిపెద్ది శ్రీరామ శర్మ ,శ్రీ కూచి భొట్ల కోటేశ్వరరావు వంటి ప్రసిద్ధ హరికదా భాగవతార్ల సుశిక్షణతో ఈ రంగ ప్రవేశం చేసి,సుమారు 36 సంవత్స రాలుగా రాణిస్తూ ,నవరస కదా విధానం తో మెప్పిస్తూ ,’’మధుర కదా నిధి ‘’,’’నాట్య రత్న ‘’,’’అభినయ శిరోమణి ‘’,’’హరికధా సరస్వతి ‘’వంటి అనేక సార్ధక బిరుదు లను తమ హరికధా ప్రావీణ్యత కు  అందుకొన్నారు .

సుశీల గారు సినీ రంగప్రవేశమూ చేసి, తమ నటనతో 25పైగా సినిమాలలో  శ్రీ విశ్వనాద్, జంధ్యాల ,దాసరి ఇ. వి .వి .,రాఘవే౦ద్రరావు వంటి అగ్ర దర్శకుల వద్ద నటించి సినీ జనాన్నీ  మెప్పించారు .పెద్ద తెరపై మాత్రమేకాదు బుల్లి తెరపైనా తన నటనా సామర్ధ్యాన్ని నిరూపించారు .’’హిమ బిందు ‘’’’బ్రహ్మా!  నీ రాత తారుమారు ‘’మొదలైన సీరియల్స్ తోనూ, టి .వి .హరి కధలతోనూ మెప్పించారు .

సుశీల గారి నటనా సామర్ధ్యాన్ని గుర్తించి ఆంధ్రా ఆర్ట్స్ అసోసియేషన్ ,భారతీయ పరిరక్షణ కేంద్రం మొదలైన సంస్థలు గౌరవించి సన్మానించి అభినందించాయి .శ్రీ నారాయణ దాస శిష్య ప్రశిష్య బృందం ఘన సత్కారం చేసి ‘’హరికధా సరస్వతి ‘’బిరుదునిచ్చిగౌరవవించారు .

హరికద ,నాట్య, నాటక ,రేడియో,సినీ, టి .వి. కళాకారిణి , బహుముఖ ప్రజ్ఞా శీలి, అభినయ సరస్వతి శ్రీ మద్దాలి (వై ) సుశీలగారిని సరసభారతి నిర్వహిస్తున్న  శ్రీ దుర్మిఖి ఉగాది వేడుకలలో స్వర్గీయ  గబ్బిట భవానమ్మ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాన్ని అందుకోవటానికి వేదికను అలంకరించ వలసినది గా సవినయంగా ఆహ్వానిస్తున్నాం

                          7– శ్రీ ఎ సి పి.శాస్త్రి గారు

హైదరాబాద్ కింగ్ కొఠీ ప్రభుత్వ సంగీత కళాశాలలోకర్నాటక  శాస్త్రీయ సంగీతం అభ్యసించి ‘’సంగీత భూషణా’’న్ని దాల్చి ,సాహిత్యపు  లోతులు తరచి ,రేడియోకు పులకేశి ,నల చరిత్ర మొదలైన నాటికలు రచించి , హైదరాబాద్ రేడియో వారి యువవాణికి సంగీతం కూర్చి ,దూరదర్శన్ ,ఆకాశవాణి లో ప్రసారమైన గేయాలకు స్వరకల్పన చేసి ,’’హం ఏక్ హై’’ హిందీ గేయ నాటికకు,  కూచిపూడి గేయనాటిక ‘’మహా శ్వేత ‘’కు స్వర రచన,అష్ట లక్ష్మీ వైభవానికి స్వర వైభవం చేకూర్చిన  సామర్ధ్యం శ్రీ ఏ సి పి శాస్త్రి గారిది .హైదరాబాద్  ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారమైన శాస్త్రిగారి ‘’సంగీత కళానిధి భట్టు మూర్తి ‘’వ్యాసం వారి సంగీతపు పాటవానికి, అధ్యయన సామర్ధ్యానికి అద్దం పట్టింది .వైదిక సాహిత్యం పై ఎన్నో వ్యాసాలూ రాసి అందులోని అనర్ఘ రత్నాలను వెలికి తీసి చూపిన ప్రతిభ వారిది .పాతిక ఏళ్ళుగా భట్టు మూర్తి అని పిలువ బడే ‘’రామ రాజ భూషణ కవి’’ పాత్రను ‘’న భూతో ‘’గా భువన విజయం లో నటిస్తూ  సంగీత సాహిత్య ప్రియులను మెప్పిస్తూ భట్టు మూర్తి అంటే శాస్త్రిగారే అని పిస్తున్నారు .వీరి నలచరిత్ర నాటకాన్ని ధర్మపురి సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి గారు సంస్కృతం లోకి అనువదించి శాస్త్రిగారి కీర్తి కిరీటం లో మరోకలికి తురాయిని చేర్చారు .శాస్త్రిగారు గొప్ప రంగస్థల నటులు కూడా .

శ్రీ శాస్త్రిగారు 19-1-1944 న శ్రీ అందుకూరి వెంకట సుబ్బయ్య ,శ్రీమతి అచ్చమాంబ దంపతులకు జన్మించి ,శ్రీమతి లక్ష్మీ  కళ్యాణి గారిని కళ్యాణ మాడారు . ,హైదరాబాద్ రిజర్వ్ బ్యాంక్ లో ఉద్యోగం లో చేరి అసిస్టంట్ మేనేజర్ గా పదవీ విరమణ చేశారు . ప్రముఖ భౌతిక అంతరిక్ష శాస్త్ర వేత్త స్టీఫెన్ హాకింగ్ రచన ‘’ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’’చదివి ,ప్రేరణ పొంది హాకింగ్ చెప్పిన వాటినీ , మన వేద.ఉపనిషత్ ,పురాణాలలో చెప్పిన వాటినీ తులనాత్మకంగా పరిశీలించి, పరి శోధించి ఆంగ్లం లో ‘’ది మైండ్ ఆఫ్ గాడ్ ‘’పుస్తకం రాస్తే ,శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ దానిని ‘’దైవ చిత్తం ‘’గా స్వేచ్చాను వాదం చేశారు. ఆ గ్రంధమే ఈ రోజు ఆవిష్కరింప బడింది .శాస్త్రిగారితో మాట్లాడటమే ‘’ఒక ఎడ్యుకేషన్’’.

బహుముఖీన పాండిత్యం ,సరస సంభాషణం ,వేదోక్త జీవన విధానం ,వేద రహస్యా విష్కరణ చేస్తున్న నటులు సంగీత, సాహిత్య కారులు, భువన విజయ భట్టు మూర్తి ఫేం, పూర్ణ ప్రజ్ఞులు ,ప్రాజ్ఞులు  శ్రీ అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి అంటే ఏ. సి.పి .శాస్త్రి గారిని సరసభారతి నిర్వహిస్తున్న  శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి   గారల స్మారక ఉగాది పురస్కారాన్ని అందుకోవలసినదిగా  సగౌరవం గా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం .

8- శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు

శ్రీ సోమేపల్లి హనుమంతరావు , శ్రీమతి నాగ రత్నం దంపతులకు జన్మించిన శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు ఎం. కాం .ఉత్తీర్ణులై , రెవిన్యు డిపార్ట్ మెంట్ లోఉద్యోగం లో  చేరి , అంచెలంచెలుగా ఎదిగి , గుంటూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా పని చేస్తున్నారు ., ప్రస్తుతం ‘’డా.కే.ఎల్ రావు సాగర్’’ అని పిలువబడే పులిచింతల ప్రాజెక్ట్  భూసేకరణ స్పెషల్ కలెక్టర్ గా సేవలందిస్తున్నారు .

వీరి  వ్రుత్తి కలెక్టర్ గిరీ అయినా ప్రవ్రుత్తి సాహిత్యమే .మంచి కవి ,కధకులు, విమర్శకులు అయిన శ్రీ సోమేపల్లివారు గుంటూరు జిల్లా రచయితల సంఘాధ్యక్షులుగా 2007నుండి సాహితీ సేవ చేస్తూ ,ఎన్నో వైవిధ్య భరిత కార్యక్రమాలను జిల్లా ,రాష్ట్ర స్థాయిలలో  నిర్వహించి ప్రశంసలు అందుకొన్నారు .నవ్యాంధ్ర ప్రదేశ్ లో ఏర్పడినతర్వాత  రాష్ట్ర రచయితల సంఘ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడి ,సంఘ పటిస్టత ,విస్తరణ కోసం అహరహం శ్రమిస్తున్నారు .గత అర్ధ శతాబ్దం గా ‘’గుంటూరు జిల్లా రచయితల సంఘం ‘’పేరుతొ రాష్ట్ర స్థాయి రచయితల నుండి రచనలను ఆహ్వానించి కదా ప్రక్రియలో ఒకటి, కవితా ప్రక్రియ లో ఒకటి పురస్కారాలను అందజేస్తున్నారు .గత ఎనిమిది సంవత్సరాలుగా తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలకదా రచయితలనుండి చిన్న కధలను ఆహ్వానించి నిష్పాక్షికంగా ఎంపిక చేయించి ఉత్తమ మైన కధలకు  ‘’సోమేపల్లి కదల పురస్కారం ‘’పేరిట  తమ తండ్రిగారు ‘’సోమేపల్లి హనుమంత రావు స్మారక సాహిత్య పురస్కార ప్రదానం చేస్తున్నారు .ఈ పురస్కారం అందుకోవటం గొప్ప అదృష్టంగా కధకులు భావించే స్థాయి కలిపించారు సోమేపల్లివారు .

మాటలో ,నడవడిలో ఎక్కడా డాబు ,దర్పం లేని అత్యంత వినయ సౌజన్య శీలి ,సాహితీ సేవా పరాయణులు ,ఆదర్శ ప్రభుత్వాధికారి శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారిని సరస భారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ మృత్యుంజయ శాస్త్రి గారల  స్మారక ఉగాది ప్రస్కారాన్ని అందుకోవలసినదిగా అత్యంత ఆదరంగా వేదికపైకి  ఆహ్వానిస్తున్నాం .

 

శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రభావతిగారల ప్రోత్సాహక ‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కార ప్రదానం

1-శ్రీ పరశు నందకుమార్ గారు

‘’ నందబాబు మేష్టారు ‘’ గా అందరికీ సుపరిచితులైన శ్రీ పరశు నందకుమార్ శ్రీ పరశు వెంకట నాగ భూషణం ,శ్రీమతి రాజ్య లక్ష్మి దంపతులకు 15-7-1954న ఉయ్యూరులోనే  జన్మించారు .పాఠశాల విద్య మాత్రమే అభ్యసించిన శ్రీ నందకుమార్ 1971వ సంవత్సరం మార్చి 2 న , 17 ఏళ్ళ వయసులోనే ‘’విజయ విద్యా నికేతన్ ‘’పేరిట ఏడవ తరగతి వరకు మాత్రమే బోధించే స్వంత పాఠశాలస్థాపించి ,తానూ బోధిస్తూ ,బోధింప జేస్తూ ,పర్య వేక్షిస్తూ 23సంవత్సరాలు దిగ్విజయం గా నడిపి ,1974లో ‘’అమరవాణి పబ్లిక్  స్కూల్ ‘’గా పేరు మార్చి,10వ తరగతి వరకు విద్యా బోధన చేస్తూ  విజయవంతంగా నిర్వహిస్తున్నారు .అతి తక్కువ ఫీజు తో ,అట్టడుగు వర్గాల వారికి అందు బాటులో ఉండేట్లు,విలువలతో కూడిన విద్యనూ నేర్పుతూ ,ఆదునిక శాస్త్ర సాంకేతిక సహాయం తో ,సర్వ హంగులు ఏర్పరచి ,క్రమ శిక్షణకు మారుపేరుగా, మన సంస్కృతీ సంప్రదాయాలపై విద్యార్ధులకు సరైన అవగాహన కల్పిస్తూ  ఆదర్శంగా విద్యా సంస్థను నిర్వహిస్తూ అందరి ఆదరాభిమానాలను పొందారు .పరిసర ప్రాంతాలలో అమరవాణికి గొప్ప గుర్తింపు తెచ్చి ,.వేలాది విద్యార్ధుల   జీవితాలలో వెలుగులు .తమ విద్యార్దుల బహుముఖీన ప్రజ్ఞా పాటవాల కోసం   సరసభారతి చేత ఈ విద్యాలయం లో అనేక వక్తృత్వ, వ్యాస రచన పోటీలను  .సాహితీ ప్రసంగాలను  నిర్వహింప జేసిన ఘనత వీరిది .

45 సంవత్స రాల సుదీర్ఘ అనుభవం తో’’ అమరవాణిలో చదువు ఉజ్వల భవిష్యత్తు కు మెరుపు’’అన్నట్లు మలచిన అమరవాణి విద్యాలయ సంస్థాపక, నిర్వాహకులు .శ్రీ పరశు నందకుమార్ గారిని సరస భారతి నిర్వహిస్తున్న ఉగాది వేడుకలలో  శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్, శ్రీమతి ప్రభావతి దంపతుల ప్రోత్సాహక ‘’స్వయం సిద్ధ ‘ ఉగాది పురస్కారాన్ని అందుకోవలసినదిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం .

 

2   .కుమారి చతుర్వేదుల యశస్విని

స్టేట్ బాంక్ ఉద్యోగి అయిన శ్రీచతుర్వేదుల మధుసూదన మూర్తి ,శ్రీమతి రాజ్య లక్ష్మి దంపతులకు విజయవాడలో జన్మించిన కుమారి చతుర్వేదుల యశస్విని విజయవాడలోనే భాష్యం లో సెకండరీ విద్య పూర్తిచేసి ,అక్కడే శ్రీ చైతన్యలో ఇంటర్ చదివి పాసై ,హైదరాబాద్ లోని జవహర్లాల్ నెహ్రు ఆర్కి టెక్చర్ అండ్ ,ఫైన్ ఆర్ట్స్ యూని వర్సిటీ లో బాచేలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదివి  ఉత్తీర్ణు రాలైనారు . జే .యెన్. ఏ .ఎఫ్.ఏ.యు.కు అనుబంధంగా ఉన్న ఇండస్ట్రియల్ కన్సల్టంట్ సర్వీసెస్ లో ప్రస్తుతం జెన్ .యెన్. టి .యు .కలికిరి ,అనంతపురం మొదలైన చోట్ల లోను అనేక ప్రభుత్వ సంస్థల ప్రాజెక్ట్ లకు డిజైనింగ్ అండ్ ఎక్సి క్యూషన్ ఆర్కి టెక్ట్ గా పని చేస్తున్నారు . ఇతర ఆర్కి టేక్చర్ ,ఇంటీరియల్ మరియు లాండ్ స్కేప్ ప్రాజెక్ట్ లకు ఫ్రీ లాన్సింగ్ చేస్తున్నారు .బెంగుళూర్ లోని కాడేన్స్ ఆర్కి టేక్చర్ ఫరం లో ఒక ఏడాది ఇంటర్న్ షిప్  చేసి తన సమర్ధతను నిరూపించుకొన్నారు . కర్నాటక సంగీతం ,చిత్రలేఖనం ,స్కెచింగ్ ,ప్రాడక్ట్ డిజైనింగ్ యశస్విని  హాబీలు .

.23 ఏళ్ళ ఈ యువ ఆర్కిటెక్ట్ కు ఆస్ట్రేలియా లోని సిడ్నీయూని వర్సిటీ లో ‘’సస్టైనబుల్  ఆర్కిటేక్చర్’’ లో ఈ జులై నుండి  ఏం .ఎస్ .చేయటానికి అడ్మిషన్ లభించిన శుభ సందర్భం లో,కుమారి యశస్విని మరింత యశస్సు నార్జించాలని మనః పూర్వకంగా కోరుకొంటూ , సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకల లో  శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,శ్రీమతి ప్రభావతి దంపతుల ప్రోత్సాహక ‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కారాన్ని స్వీకరించవలసినదిగా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం .

 

3  చి.పామర్తి వీర వెంకట దుర్గా ప్రసాద్

అందులకు విద్యను సులభ తరంగా అందించాలనే అభిలాష ఉన్న వ్యక్తి ఛి పామర్తి వీర వెంకట దుర్గాప్రసాద్ .బి ఏ రెండవ సంవత్సరం చదువుతున్న ప్రసాద్ ,హైదరాబాద్ లో ‘’సాయి జూనియర్ కాలేజి ‘’లో శిక్షణ పొంది ,తను నేర్చిన విద్య ను తోటి అంధ విద్యార్ధులకు వినికిడి ద్వారా  నేర్పించాలని కృషి చేస్తున్నాడు .అంధ విద్యార్ధులకు సి .డి.లద్వారా ఉచిత శిక్షణ నిస్తున్నాడు ..’’ప్రసాద్ సెల్ పాయింట్ షాప్ ‘’ను మంటాడలో నెలకొల్పి ,వచ్చిన ఆదాయం తో కొంత సొమ్మును తాను  స్థాపించిన ‘’ఓం సాయి కంప్యూటర్ ‘’ద్వారా ఖర్చు చేస్తున్నాడు  .ఒకదీపం మరొక దీపాన్ని వెలిగిస్తున్నట్లు దివ్యాంగుడైన తాను ఇతర దివ్యా౦గులకువిద్యా సేవచేస్తున్న ఛి పామర్తి వీరవెంకట దుర్గా ప్రసాద్ ను సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతుల ప్రోత్సాహక ‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కారాన్ని అందుకోవలసినది గా వేదిక పైకి ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం .

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.