మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -6 (చివరి భాగం )
30- మా పల్లె’’కన్నయ్య’’అన్నయ్య-శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి –విజయవాడ -. 9440174797
మా అన్నయ్య నాకే కాదు నా స్నేహితులకి కూడా అన్నయ్యే!
ప్రతి ఇంట్లో ఉండాలి.. మా అన్నయ్యలాంటి మాంఛి అన్నయ్య!
నాన్నకి చేదోడు వాదోడుగా…! ఇంటి పెత్తనం నాన్న తరువాత అన్నయ్యదే
కాదు కాదు…ఇంటి పెద్దే… అన్నయ్య…!
..
ఉదయం పాలపాకెట్టు మొదలు… చెల్లికి, తమ్ముడికి బడి వరకు తోడుండాలన్నా
అన్నింటికీ అన్నయ్యే!…అన్నయ్య లేకుండా ఏ పనీ జరగదు!
మా అన్నయ్యని చూస్తే అనిపిస్తుంది అమ్మ నాన్న అదృష్టవంతులని!
నాన్న కష్టం, అమ్మ బడలిక అన్నయ్యని చూడగానే పారిపోతాయి
ఎవరు పిలిచినా… ఎవరికి ఏ సహాయం కావాలన్నా…
చిటికెలో చేసి పెట్టే మా అన్నయ్య మాకే కాదు మా పల్లెకే అన్నయ్య!
పెద్ద చదువు చదివినా ఊరు విడిచి వెళ్ళక, తన విజ్ఞానాన్ని పల్లెకే పంచుతూ
ఒంటరిగా ఉన్న వృద్ధులకి చేయూతనిచ్చే మా అన్నయ్య మా పల్లెకే వెలుగు!
మా అన్నయ్యవంటి అన్నయ్య ఇంటికొకడుంటే… వృద్ధాశ్రమాలెందుకు దండగ!
31 మా పెద్దన్నయ్య –శ్రీ డా.రాచకొండ నరసింహ శర్మ ఏం డి .-విశాఖ పట్నం –
1- ఈ వసుధ వేయి నెలలుండు జీవులరుదు- అరుదు తగినంత ఆరోగ్య మమరి యుంట
కరమరుదు వారిలో కొంత ఘనత గనుట- అన్నియును గల్గిన వాడు మా అగ్రజుండు .
2-‘’బాబ్జి ‘’యను ముద్దుపేర బరుగునితడు -రాచ కొండ వంశాన్వయ రమ్య గుణుడు
తండ్రి నారాయనుండతి ధార్మికుండు -లక్ష్మి బోలు సీతా రామ లక్ష్మి తల్లి .
3-మహాదేవ శాస్త్రి నాముడు- గృహముల ,మేడల ,నభేద్య గురు సేతువులన్
రహదారులు రైళ్లకునున్ సహనముతో కట్టె సుజన సంతతి పొగడన్ .
4-పొగగబండుల ఇంజనియరు -తగు మార్గము రైళ్ళు నడుప తా నిర్మించేన్
తగు నేర్పరి చిత్తరువుల -అగణిత సద్గుణ ధనుడు అకళం కుడున్
5-అవకాశ మెంత యుండిన –అవినీతికి లొంగ లేదు అగ్రజు డెపుడున్
అవసరము కతడు మారుట-రవి చంద్రులు నభము వీడి రాలిన యట్లే.
6-కప్పగంతుల వంశీయ కమ్ర హృదయ –సూర్య కాంతమ్మ సదమల చరిత్ర
ధర్మ పరురాలు మాయన్న ధర్మ పత్ని-భర్త్రు సహకారి ఈశ్వర భక్తురాలు .
7-సోదరులందు పెద్దతను ,సూనృత వాక్యము తప్ప డెప్పుడున్
సోదర ప్రేమ లోతులవి శోధన కందక యుండు ,జన్మ
జన్మోదిత పుణ్య సత్ఫల మొకో !యన మాకితడగ్రజుం డయెన్.
32-మార్గ దర్శి అన్నయ్య –శ్రీ మైనేని గోపాల కృష్ణ –అమెరికా -001-256-882-5586
జీవిత సత్యాలు బోధించటం లో గురువు
బంధుత్వాలను తెలియ బరచటం లో ఆత్మీయుడు
సహచరులతో కలిసి మెలిసి తిరిగే నేర్పును నేర్పే హితుడు
తప్పు చేస్తే ఒప్పు కోనేట్లు చేయగల సంస్కారం ,
అందరితో చనువుగా సంచరించే సహృదయత నేర్పే సౌజన్యుడు
తండ్రి రూపం లో వెన్నంటి ,సరైన మార్గ నిర్దేశం చేసి
జీవితానికి వెలుగు నిచ్చే జ్ఞాన జ్యోతి
అన్నయ్య ఉండటం అదృష్టం లేక పోవటం దురదృష్టం
శ్రమ ,క్షమ,వంతు ,వాటా ,శ్రద్ధ ,కాఠిన్యం,విభిన్నతల లోని
సూక్ష్మ మర్మాలు అనుభవం తో తెలియ జేసే మార్గ దర్శి అన్నయ్య.
అన్నయ్య ఆత్మీయ కవితా స్రవంతి సంపూర్ణం .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-4-16-ఉయ్యూరు

