భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -2
కంచి వరద రాజ దర్శనం
కంచి లో వెలసిన శ్రీ వరద రాజ స్వామి దివ్య మంగళ విగ్రహం అపురూపమై విరాజిల్లుతోంది అని అప్పయ్య దీక్షితులు ‘’వరద రాజ స్తవం ‘’లో వర్ణించారు .ఆ విశేషాలే మనం తెలుసుకో బోతున్నాం .వరద రాజ స్వామిని స్తుతించటానికి సరస్వతీ దేవికీ శక్యం కాక ,తన అసమర్ధతను కాపాడుకోవటానికి పరోక్షంగా కవి వాక్కుల ద్వారా చేయిస్తోందన్నాడు దీక్షితులు –‘’
‘’మన్యే నిజ స్కలన దోష మవర్జనీయం –అన్యస్యా మూర్ధ్ని విని వేశ్య బహిర్బభూషుః
ఆవిశ్య దేవ రసనాని మహా కవీనాం –దేవీగిరామపి తవస్తవ మాత నోతి’’.
‘’ మహా కవులు నిన్ను స్తోత్రం చేస్తే చేశారుగాక .తెలివి తక్కువ వాడి నైన నేను నీ ఒక్కొక్క అంగాన్నీ వర్ణించటం లో ఎక్కువ సమయం తీసుకొని నా మనసు నీ యందు లగ్నం చేసి ధన్యుడనౌతా’’ నంటాడు అప్పయ్య దీక్షితులు వరద రాజ స్వామితో .తమిళనాడు లోని తు౦డీర మండలం లో అన్ని వైపులా క్షీర సాగరం ఉంది .దాని వైభవం బ్రహ్మ లోక వైభావాన్నే తక్కువ చేస్తుంది .నిరంతర వేద పఠన ,పాఠనాలతోతో ప్రతిధ్వనిస్తుంది .ఈ కాంచీ పురాన్ని చూసిన విద్వాంసుడు కూడా త్రిలోకాలను చూడటానికి ఇష్ట పడడట.
క్షీర సాగర మద్యం లో భగవానుని దివ్య ధామం ఉంటుందని కూర్మ పురాణం చెబుతోంది .శాక ద్వీపం చుట్టూ క్షీర సాగరం ,దానిలో శ్వేత ద్వీపం ,దానిమధ్య శ్రీమన్నారాయణ నివాసం ఉంటుందనీ చెప్పింది .’’ఆదిత్యో వా ఏష ఏ తన్మండలం ‘’అనే మంత్రం లో స్వామి వేదం త్రయ స్వరూపుడు అన్నది .తొమ్మిది యోజనాల విస్తీర్ణం లో ఆదిత్య మండలం ఉందనీ ,ఆ సవిత్రు మండల మధ్య వర్తి యై నారాయణుడు ఉంటాడని వాయు పురాణ కధనం .’’ధ్యేయ స్సదా స్సవిత్రు మండల మధ్య వర్తీ నారాయణః ‘’అని పురాణం చెప్పింది .ఇది బ్రహ్మ సదనం కంటే పరమ మైనది అంది కూర్మ పురాణం .కంచిలో క్షీర నది గురించి బ్రహ్మాండ పురాణం లో ఒక కద ఉంది .కామ దేనువుకు దూడ లేక పోవటం తో వసిష్ట మహర్షి దర్భలతో ( కూర్చి )దూడను తయారు చేశాడు.దీనితో కామధేనువుకు పాలు చేపుకు వచ్చాయి .ఆపాలు వరదలై పారింది .అదే క్షీర నది .తెలుగులో ‘’పాలేరు ‘’అంటారు .ఇది కంచికి దగ్గరలో ఉంది .వేగావతీ నదినే క్షీరనది అంటారని వామన పురాణం లో ఉంది .హరి వంశం లో మరో కధనం ఉంది .విష్ణువు వరాహ రూపం దాల్చి,నాలుగు వైపులా నాలుగు శైలాలు ఉంచాడు .ఒక్కొక్క శైలం నుంచి ఒక్కో నది ప్రవహించింది .అని ,అవే వసుధార ,పయోధార ,ద్రుత ధారా ,,మధుధారలు అని ప్రసిద్ధి పొందాయి .దక్షిణ దిశలో ఉంది పయోధార అనీ పాలవంటి నీళ్ళు ఉండటం వలన ఆ పేరొచ్చిందని చెప్ప బడింది .ఈ నదుల నీరు తాగితే వాసు దేవ పరాయణులు అవుతారు అనీ చెప్పబడింది .
వరద రాజ దివ్య దర్శనం పుణ్యాత్ములకే సిద్ధిస్తు౦దన్నాడు అప్పయ్య దీక్షితులు .అన్నమయ ,ప్రాణమయ ,మనోమయ విజ్ఞాన మయ కోశాలు దాటి ఆనందమయ కోశం లో ప్రవేశించినట్లుగా కంచిలోని నాలుగు ప్రాకారాలు దాటి ఆనందం అనే తీగ కు కాసిన పండులాగా వరద రాజ దర్శనం చేస్తారు పుణ్యాత్ములు .తైత్తిరీయ ఉపనిషత్ లో ఆనందవల్లిలో మామూలు మానుషానందం కంటే అనంతమైన బ్రహ్మానందాన్ని భక్తుడు పొందుతాడు .మనుష్య ,గాంధర్వ ,దేవ గాంధర్వ ,పితృ ,ఆజాన దేవ ,కర్మ దేవ ,దేవ ,ఇంద్ర ,బృహస్పతి ,ప్రజా పతుల ఆనందం ఒకదానికంటే మరొకటి గొప్పది .దీనికంటే బ్రహ్మానందం అధిక తరమైనది .’’సో శ్నుతే సర్వాన్ కామాన్ ,ఆనందం బ్రాహ్మణో విద్వాన్ న భిభేతి కుతశ్చన’’అంటే కోర్కెలన్నీ తీర్చుకోన్నవాడు అవుతాడని ,నిర్భయంగా ఉంటాడని ఉపనిషత్తులు ఘోషించాయి .
కంచిలో హస్త గిరిపై నెలకొన్న పుణ్య కోటి అనే విమానానికి అంటే విగ్రహం ఉండే ప్రదేశానికి 24మెట్లున్నాయి ఇవి 24తత్వాలకు ప్రతీకలు .ఇవి దాటిన పురుషుడికి పరమ పురుష దర్శనం లభిస్తుంది .భక్తుడు భవసాగరాన్ని దాటి పోతాడు .ఇందులో సాంఖ్య దర్శన ప్రతిపాదన ఉంది .మూల ప్రక్రుతి ,మహాత్ తత్త్వం ,అహంకారం ,పంచ భూత తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు పంచ మహా భూతాలూ అంటే ఆకాశం నీరు ,వాయువు ,అగ్ని,భూమి,11ఇంద్రియాలు ,అనే ఈ 24తత్వాలపైన పురుషుడు అంటే25వ తత్వ మైన పురుషునిగా ఉండటమే సాంఖ్యతత్త్వం .అలాగే ఇక్కడ 24మెట్లున్నాయి .అవి దాటిన వాడు 25వ పురుషుడు అయిన అంటే 26వ వాడైనశ్రీ వరద రాజ స్వామిని ఆరాధించాలి .సాంఖ్యం 24,దానితో పురుషుడు తో ఆగిపోతుంది .24తత్వాలు ప్రకృతికి చెందినవి .వీరి పురుషుడు సాక్షి .పురుషుని సాంగత్యం వలన ప్రక్రుతి జగత్తును నడిపిస్తుందని అంటుంది సాంఖ్యం.ప్రక్రుతి లక్షణాలకు దూరంగా ఉండి,అంటీ ముట్టకుండా ఉండటమే సాక్షి గా ఉండటమే ముక్తి అని సాంఖ్య సిద్ధాంతం వేదాన్తులుమాత్రం పురుషుడిని జీవునిగా భావించి పరమ పురుషుడిని చేరటమే మోక్షం అంటారు .ప్రక్రుతి ,పురుషుల సమాగం ఈశ్వ రేచ్చ లేనిదే జరగదు అంటారు వేదాంతులు .ఈశ్వరుడిని అంగీకరించాలనే వీరి సిద్ధాంతం .ఆ ఈశ్వరుడే వరద రాజ స్వామి .సాంఖ్యం అంటే జ్ఞానం అని అర్ధం .కేవల సాంఖ్య తత్వ మీశ్వరుడిని అంగీకరించదు.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-4-16-ఉయ్యూరు