ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -164
63-ఆధునిక సమకాలీన నృత్యానికి ప్రాణం పోసిన –ఇసడోరా డంకన్
యూరప్ లోప్రారంభించి నాట్యం లో విప్లవం సాధించి ప్రపంచ వ్యాప్తి కలిగించిన ఏకైక అమెరికా నాట్య కళాకారిణి ఇసడోరా డంకన్ ఆమె చేసింది ‘’ఏక మహిళా విప్లవం ‘’.27-5-1878 న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ ఫ్రాన్సిస్కో లో సముద్ర తీరాన జన్మించింది .తన జీవిత చరిత్ర ‘’మై లైఫ్ ‘’లో ‘’నా శారీరక కదలికలు సముద్ర అలల లయను బట్టే వచ్చాయి .అందానికి సంతానానికి,ఆనందానికి ప్రేమ కు చిహ్నమైన ,సముద్రం లో పుట్టిన గ్రీకు దేవత ఆఫ్రొడైట్ నక్షత్రం లో నేను పుట్టాను . ఈ గ్రీకు దేవతకు సమానం రోమన్ దేవత వీనస్ ’’అని రాసుకొన్నది .తనను తాను ప్రకృతి ప్రసాది౦చిన దానిని గా చిన్నప్పటి నుండి భావి౦చుకొన్నది .
ఇసడోరా తండ్రి స్కాటిష్ వాడు .నాలుగు సార్లు బాగా సంపాదించి అంతా పోగొట్టుకొన్నవాడు .తల్లి ఐరిష్ కేధలిక్ .ఈమెను వదిలి తండ్రి వేరే అమ్మాయి తో ఉన్నాడు .దీనితో తల్లి నాస్తికానికి మారి రాబర్ట్ ఇంగర్ సాల్ శిష్యురాలైనది .పుట్టిన ఇద్దరు మొగపిల్లలను ,ఇద్దరాడ పిల్లల్ని తిరుగు బాటు దారులుగా పెంచింది .సంగీతం టీచర్ అయిన ఆమె జీవితం లో విసిగి వేసారి పియానో పాఠాలు నేర్పేది .చక్కగా పాడుతూ మంచి సాహిత్యాన్ని పిల్లలకు అలవరచింది .ఈ డంకన్ కుటుంబం పొట్ట గడుపు కోవటం కోసం ఎన్నో చోట్లు మారుతూ తిరిగింది .ఈ జీవితమే ఆమె భవిష్యత్తు జీవితం పై ప్రభావం చూపింది .
బోధించటం లో యెంత కోరిక ఉండేదో డాన్స్ చేయటం లోనూ అంతే ఉండేది .ఆరేళ్ళ పిల్లగా ఉన్నప్పుడే చుట్టూ ప్రక్కలున్న నడక కూడా ఇంకా రాని డజను మంది పిల్లల్ని పోగేసి కాళ్ళూ చేతులు ఎలా కదపాలో తుంటి ని ఆధారంగా చేసుకొని శరీరాన్ని ప్రక్కలకు ఎలా త్రిప్పాలో నేర్పించేది డంకన్ .ఇదే తన ‘’డాన్స్ స్కూల్ ‘’అనేది .జీవితకాలం లో ఎప్పుడైనా ఒక గొప్ప డాన్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని కలలు కన్నది .దీనికోసం ఖండాలు దాటి ప్రయాణించింది .ఎనిమిదవ ఏట చిన్నపిల్లలకు డాన్సింగ్ స్టెప్స్ నేర్పి కొన్ని పెన్నీలు మొదటి సారిగా సంపాదించింది .పదవ ఏట డబ్బు సంపాదించటం ఎలాగో తనకు తెలిసిపోయిందని ,ఇంక స్కూల్ కు వెళ్లి చదవాల్సిన పని లేదని తల్లికి చెప్పేసింది .కూతురుకున్న అభిరుచి గుర్తించి తల్లి ఇసడోరా ను స్థానిక బాలెట్ టీచర్ దగ్గర పెట్టింది .కాని కాలి బొటన వ్రేళ్ళపై నిలబడి ప్రాక్టీస్ చేయటం సహజత్వానికి భిన్నం అని ,అసహ్యం అని చెప్పి౦ది .మూడవ లెసన్ అయ్యాక క్లాస్ వదిలేసి బాలెట్ పై ఉన్న ద్వేషాన్ని జీవితాంతం ఒదులుకోలేకపోయింది .బాలెట్ స్కూళ్ళు అంటే వ్యతిరేకత ఏర్పడింది .అవన్నీ అర్ధం పర్ధం లేని శరీర విన్యాసాలు అన్నది .పూర్తి జిమ్నాస్టిక్ నె డాన్స్ అంటున్నారని ఈ బాలెట్ డాన్స్ అసహ్యం అన్నది .
17వ ఏట తల్లి ఇసడోరా ను చికాగో తీసుకొని వెళ్ళింది .అక్కడ ఎవరైనా కూతురు అభిరుచికి తగిన డాన్స్ నేర్పుతారేమోననే ఆశతో .అప్పటికి ‘’స్ప్రింగ్ సాంగ్స్ ‘’మొదలైన శ్రావ్యమైన సంగీతం ఆదరణలో ఉంది .ఈమెకు నేర్పటానికి యే మేనేజరూ అంగీకరించలేదు .వెంట తెచ్చుకొన్న డబ్బు అంతాఒక వారం లో అయిపోయి తల్లీ కూతురు టమేటాలు తిని బతికారు .చివరికి ‘’మేసోనిక్ టెంపుల్ రూఫ్ గార్డెన్ ‘’మేనేజర్ ఇసడోరా స్ప్రింగ్ సాంగ్ పాడటానికి ఒప్పుకొన్నాడు .కాని పాటలో ‘’ఫ్రిల్స్ అండ్ కిక్స్ ‘’ఉండాలన్నాడు. అదేఆమే మొదటి ప్రదర్శన .ఒక వారం బాగానే గడిచింది .కాని దాన్ని వద్దని వదిలేసింది .చికాగో లో అప్పటికే పెళ్ళయిన పోలిష్ పెయింటర్ ను ప్రేమించింది .అతనంటే పిచ్చ ప్రేమ కలిగింది .కాని తల్లి ఒప్పు కోక పోవటం తో పెళ్లి జరగలేదు .తన బాల్య జీవితమంతా తండ్రి చేసిన నికృష్ట పు పని నీడ పడి వెంటాడిందని బాధ పడింది .తల్లితో తండ్రి విడాకుల విషయం తన మనసుపై తీవ్రమైన ముద్ర వేసి౦ది అన్నది .కనుక తాను పెళ్ళికి వ్యతిరేకంగా ,స్త్రీ జన విముక్తికి పోరాడాలని ,ప్రతి స్త్రీ ఒకరో ఇద్దరో పిల్లలను కనటానికి హక్కు ఉండాలని కోరింది .
చికాగో వదిలాక ఆగస్తిన్ డాలీ అనే నాటక ప్రదర్శకుడు పిలిచిన ఇంటర్వ్యు కు వెళ్లి ఉపన్యాసంగా ‘’నేను డాన్స్ ను కనిపెట్టాను .రెండు వేల సంవత్సరాలుగా మరుగున పడిన ఆర్ట్ ను కనుక్కున్నాను . దానితో మన నాట్యాన్ని విప్లవాత్మకంగా మార్చేయవచ్చు .నేను ఎక్కడ నేర్చుకొన్నాను అని ప్రశ్నిస్తే ఫసిఫిక్ సముద్ర తీరం వద్దా ,సియార్రా నేవడాలోని పైన్ వృక్షారణ్యం దగ్గరా నేర్చానని చెప్తాను .నేను మహా కవి వాల్ట్ విట్మన్ ‘’ఆధ్యాత్మిక పుత్రిక ‘’ను .అమెరికా పిల్లల కోసం అమెరికాను యదార్ధం గా అభి వ్యక్తీకరించే డాన్స్ ను సృష్టిస్తాను ‘’అన్నది గుక్క తిప్పుకోకుండా .ఇసడోరా వాక్ ప్రవాహం ఆమె లోని సృజన ,తపన ,నమ్మకం చూసి ఇలాంటి అమ్మాయి కోసమే తానూ వెతుకుతున్నట్లుగా భావించి తీసుకొన్నాడు .కొన్ని వారాలతర్వాత ఇసడోరా బ్రాడ్వే లోని 29వ వీధిలో రిహార్సేల్ ప్రారంభించింది .మూకాభినయం విజయవంతం కాలేదు .అప్పుడు డాలీ ‘’ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీం ‘’లో ఒకసీన్ ప్రాక్టీస్ చేయించాడు .అందులో దేవదూతలు పెట్టుకొనే రెక్కలు ,వాటితో డాన్స్ నచ్చలేదు .ఇంగ్లీష్ మ్యూజికల్ కామెడి ‘’గ్రీషా’’లోకోరస్ పడటమూ ఇబ్బంది అనిపించింది .
కూతురు సంపాదించిన కొద్ది డబ్బుతోనే ఇసడోరా తల్లి కార్నెజీ హాల్ లో ఒక రూమ్ ఉన్న స్టూడియో ను అద్దెకు తీసుకొని కుటుంబాన్ని ఇక్కడకు వచ్చేయమన్నది .కొద్దిమందికి పియానో నేర్పింది .కొడుకు ఆగస్తిన్ నటుడు కావాలనుకొని టూరింగ్ టాకీస్ లో చేరాడు .రేమాండ్ ఒకపత్రికలో పార్ట్ టైం జాబ్ లో చేరాడు ,ఎలిజబెత్ ఇసడోరాకు సాయం గా ఉంది .అందరూ కొద్దో గొప్పో సంపాదిస్తున్నా ఇంటి అద్దె కు చాలక వక్తృత్వం సంగీతం కోసం గంటకు ఇంత అని అద్దేకిస్తూ రాబడి పెంచుకొన్నారు .వీరందరితో స్టూడియో కిక్కిరిసిపోతే డంకన్ కుటుంబం సేదదేరటానికి సెంట్రల్ పార్క్ కు వెళ్ళేవారు .ఇసడోరా కచేరీలను పెంచింది .డాన్సులూ చేస్తోంది .ఎతేల్ బెర్ట్ నేవీననే ఆతను ఆమెకు చిన్న చిన్న కచేరీ హాళ్ళలో కచేరీలకు కుదిర్చాడు .అయినా ఖర్చు ఎక్కువా రాబడి తక్కువ గా ఉంది .సంచార తెగల గుడారం లాంటి ఈ కొ౦ప నుంచి విండ్సర్ హోటల్ లోని రెండు విశాలమైన గదుల్లోకి మారారు .కాని ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది .అప్పుడు ఇసడోరా ‘’మమ్మల్ని ఆదుకొనేది ఒక్కటే హోటల్ తగలబడటమే ‘’అన్నది నవ్వుతూ .ఈపరిస్థితి లో అదృష్టం ఆమె తలుపు తట్టింది .మర్నాడే విండ్సర్ భవనం పూర్తిగా కాలి నేల మతట్టమైంది .జంతువులను చేరవేసే ఒక బోటు ఎక్కి డంకన్ కుటుంబం వారు ఇంగ్లాండ్ వెళ్ళారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-6-16-ఉయ్యూరు

