ఇది విన్నారా ,కన్నారా !-4
6-శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి
61-సంగీత కళానిధి సంగీత విద్యానిధి శ్రీ నేదునూరి కృష్ణ మూర్తిగారికి భారత ,అమెరికాలలోని 24సంగీత సభలు 24బిరుడులిచ్చి సత్కరించాయి .అందులో అన్నమాచార్య సంకీర్తన కిరీటి ,సంగీత సామ్రాట్ వంటివి ఉన్నాయి .ఈ సంఖ్య గాయత్రీ మంత్రాక్షరాల సంఖ్యకు సమానం అంటారు ఆచార్య వీరభద్రయ్య .
62-నేదునూరి వారికి సంగీత విద్యలో తెలియని రహస్యం లేదు .సంగీత విషయం లో వారి అభిప్రాయాలను బహు నాగరికంగా తెలియ జేయటం వారి సంస్కారం .
63-60ఏళ్ళు శాస్స్త్రీయ సంగీతన సాధనం లో జీవితాన్ని ధన్యం చేసుకొన్న శ్రీ శాస్త్రి గారు అన్నమయ్య 60 సంకీర్తనలను రెండు సంపుటాలుగా స్వర పరచి ప్రచురించారు .అన్నమయ్య కృతులను పాడి 3 కాసెట్లు వెలువరించారు .64-‘’జిరాక్స్ కాపీ లాగా ఎవరూ పాడలేరు .ఎవరి మనోధర్మం వారిదే .మాడ్యులేషన్ లో తేడా ఉంటుంది .దాని వలన వ్యక్తిగత అందం పెరుగుతుంది .సంగతులు వేరే అయినా పాడటం లో ఏదో మార్పు ఉంటుంది .అందుకే ఎవరి గాత్రం వారికి ప్రత్యేకంగా ఉంటుంది ‘’అంటారు నేదునూరి వారు .
65-‘’సంగీతం ఆత్మజ్ఞానాన్ని కూడా కలిగించాలి దానికి సాహిత్యం ఒక వెహికిల్ .సంగీత పరిపూర్ణతకు సాహిత్యం చాలా అవసరం .’’అన్నారు .
66-కీర్తన పాఠానికి నేదునూరివారు ఎంతో విలువ నిస్తారు .ఈ నాటి కళాకారులు ఆర్ట్ నే ప్రదర్శిస్తున్నారు కాని కీర్తన ,లయ,స్వర,కల్పనమొదలైన శాస్త్ర విషయాలను బలహీనంగా చూపిస్తున్నారని బాధ పడ్డారు .’’ఆర్ట్ ను శాక్రి ఫైస్ చేసేంత క్రిటికల్ పొజిషన్ లోకి పోవద్దు ‘’అని సంగీత కళాకారులకు హితవు చెప్పారు .
67-కర్నాటక సంగీత వృక్షానికి శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి గారు ఒక తురాయి పువ్వు .సంప్రదాయజ్నుడు ,విద్వచ్చిఖామణి,సంగీతమే తప్ప మరొక జీవితాంశం లేనివారు ‘’ .
7-సంగీత భీష్మ శ్రీ పురాణం పురుషోత్తమ శాస్త్రి
68-కర్నాటక సంగీత విద్వాంసులలో భీష్మా చార్యులుగా గుర్తింపుపొందిన శ్రీ పురాణం పురుషోత్తమ శాస్త్రి గారు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం చేత నెలకు వెయ్యి రూపాయల గౌరవ పారితోషికం అందుకున్నారు .
69-ఆడిషన్ పరీక్ష లేకుండానే ఆకాశ వాణి లో ప్రసారాలు సాధించారు .సంగీత సరస్వతి ,గాన ధీర ,సంగీత చక్రవర్తి ,గాన రసార్నవ బిరుదులూ పొందారు .
70-తాన్సేన్ విశేష రాగం తో జ్యోతిని వెలిగించాడని ,దీక్షితులవారు అమృత వర్షిని రాగం పాడి వాన కురిపించారని మనకు తెలుసు .ఆ రాగం కీర్తనలోనే ‘’వర్షయ వర్షయ సలిలం ‘’అన్న మాటలున్నాయి. పురుషోత్తమ శాస్త్రిగారు ఇతర రాగాలతో కూడా వర్షం కురిపించవచ్చని రుజువు చేశారు .’’ఖర హర ప్రియ ‘’రాగాన్ని మండు వేసవికాలం లో 9రోజులు దీక్షగా పాడి వాన కురిపించిన ఘటికులు శాస్స్త్రిగారు .వర్షాలకు పంతువరాళి శంకరాభరణ రాగాలూ పనికి వస్తాయని ,తెలియ జేశారు .సుమారు 30ఏళ్ళ క్రితం సన్నాయి పై చారు కేసి రాగాన్ని వాయించి పంట దిగుబడిని 60శాతం పెంచారు మనవాళ్ళు .మోహన రాగ ప్రస్తారం చేస్తే వంద దిగ్రీలలోపు జ్వరాలు తగ్గిపోతాయని శ్రీ బాల మురళి అన్నారు .నవీనకాలం లో గానం తో వర్షా వృద్ధి ని సాధించిన ఘనత పురుషోత్తమ శాస్త్రి గారిదే.
71-అక్బర్ పాదుషా ముందు గోపాల నాయక్ అనే సంగీతా విద్వాంసుడు యమునా నది నీటిలో గొంతు వరకు మునిగి దీపక్ రాగం ఆలపించాడని దాని వలన నీళ్ళలోనే అగ్ని పుట్టి ఆ సంగీత విద్వాంసుడు కాలిపోయి పిడికెడు బూడిద గా మారాడని ఒక ఐతిహ్యం ప్రచారం లో ఉంది .
72-‘’I am sure that turbulent lunatics could ,to a very large extent ,be made amenable and to some extent quieted by Neelambari or ydukula Kambhoji ‘’అని ‘’ఫాసేట్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ‘’పుస్తకం లో శ్రీ శ్రీనివాసన్ రాశారు .
73-పిరికి తనాన్ని పోగొడుతూ ,తమ సమస్యలను తామే పరిష్కరించుకొనే శక్తి నీ ధైర్యాన్ని ‘’శుభ పంతు వరాళి రాగం ‘’ఇస్తుందని శాస్త్రిగారి నిశ్చితాభిప్రాయం .అకాల మృత్యువు ,బొమికల లోపాలు చర్మ వ్యాధులను శంకరాభరణం నయం చేస్తుందని భరోసా ఇచ్చారు .
74-శాస్త్రి గారిని భారత ప్రభుత్వం ‘’కల్చరల్ స్కాలర్ ‘’గా సంగీతం లో నియమించింది .నాద యోగి పరంపరలోని వారాయన .
75-వరంగల్లు నగరం లో శ్రీ పురాణం పురుషోత్తమ శాస్స్త్రిగారికి 1980లో స్వర్ణ గండ పెండేరం తొడిగి ఆ సంగీత సరస్వతిని సన్మానించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-6-16-ఉయ్యూరు

