ఇది విన్నారా ,కన్నారా !-5
8-వాయులీన విద్యా విశారద శ్రీ అన్నవరపు రామ స్వామి
76-వాయు లీన విద్యా విశారదులైన శ్రీ అన్నవరపు రామస్వామి శ్రీ బాల మురళీ కృష్ణ కు అనేక వేల కచేరీలలో వయోలిన్ సహకారం అందించారు .
77-విజయవాడ ఆకాశ వాణి కేంద్రం లో వయోలిన్ విద్వాంసులుగా చేరి అక్కడే పదవీ విరమణ చేశారు .
78-స్వామి గారు ఇంటి దగ్గరే సంగీత విద్యార్ధులకు గాత్రం వీణ వయోలిన్ లను ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉచితం గా నేర్పిన ఉదారులు .
79-శ్రీ పారుపల్లి రామ కృష్ణయ్య పంతులుగారి వద్ద గురుకుల పద్ధతిలో వారి౦ట్లోనే ఉండి 1941నుండి 48వరకు ఉచితంగా సంగీతం అభ్యసించారు .వీరితండ్రి శ్రీ పెద్దయ్య గారుకూడా ప్రముఖ విద్వాంసులే .8 రకాల తాళ వాద్యవాదనలో నిపుణులు .
80-రెండవ క్లాసు వరకే చదివిన స్వామిగారు 1948నుండి 1986వరకు విజయవాడ ఆకాశ వాణి లో ఉద్యోగించారు .
81-నాద సుధార్ణవ ,గాన కళానిధి రామస్వామిగారు తామ గురువులు రామ కృష్ణయ్య గారు విజయవాడలో సంగీత కళా శాల స్థాపనకోసం కొంత భూమి నిచ్చి ,పునాది వేసి చనిపోతే ,స్వామిగారు ఆనాటి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి మోతే వేదకుమారి గారి తో ఈ విషయం ప్రస్తావించగా ఆమె వెంటనే ఆనాటి మంత్రి శ్రీ ఎస్ .పి.పట్టాభిరామా రావు గారితో చెప్పి విజయవాడలో సంగీత కళాశాల మంజూరు చేయించగా నిర్మింపజేసి గురు ఋణం తీర్చుకొన్నారు .పునాది గురువుగారిది భవన నిర్మాణం శిష్యునిది .
82-రామస్వామిగారు విజయవాడ గాంధి నగర్ లో గురువులు గాయక సార్వ భౌమ శ్రీ పారుపల్లి రామ క్రిష్నయ్య గారి కాంశ్య విగ్రహ ప్రతిస్టాపనం చేయించారు.అంతటి గురు భక్తి వారిది .
83-‘’సప్త గిరి సంగీత విద్వన్మణి ‘’స్వామిగారు చడువేమీ లేక పోయినా ఛందో భంగం లేకుండా పాంచాలీ రీతిలో రస గుళికలలాంటి రచనలు చేసిన వాగ్గేయ కారులు .
84-వయోలిన్ సోలో వాయించటం లో రామ స్వామి గారు ఎంత నిష్ణాతులో సహకార వాద్యం లోనూ అంతే చతురులు .వారు సహకార వాద్యం వాయిస్తే ‘’పట్టుపరుపు మీద పడుకొన్నట్లు ఉంటుంద’’న్నారు ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు .
85-ప్రక్క వాయిద్యం వాయిస్తుంటే ‘’కూరలో సరిపడా ఉప్పు ఉన్నట్లుగా ఉండాలి .ముఖ్య కళాకారుడు ,వయోలిన్ కలిసి పాడినట్లు౦డాలి’’అంటారు’’ స్వామీ’’జీ .
86-హంస పురస్కార గ్రహీత ,ఆకాశ వాణి ఆడిషన్ కమిటీ సభ్యులు అయిన స్వామిగారు అనేక దేశాలలో సోలో కచేరీలుచేశారు సహకార వాద్యమూ వాయించారు .అయినా రవ్వంత గర్వం కాని ఈర్ష్యా అసూయలు కాని లేని పూర్ణ పురుషులు .
87-‘’నేను దేనికీ భయపడను –ఒక్కశ్రుతి,లయలకు తప్ప ‘’అంటారునిర్భీకులైన పండిన వాయులీన ఘనులు శ్రీ అన్నవరపు రామ స్వామి .
9-మహా మహోపాధ్యాయ శ్రీ ఆకెళ్ళ మల్లికార్జున శర్మ
88-‘’ప్రతి వారిలో’’ లయ ‘’ఉంటుంది .దాన్ని వెలికి తీసే బాధ్యత అధ్యాపకునిది ‘’అన్నారు మహా మహోపాధ్యాయ ఆకెళ్ళ మల్లికార్జున శర్మ గారు .
89-లయ ప్రాధాన్యతతో ఆకెళ్ళ వారు విద్యార్ధుల కిచ్చే శిక్షణ మహత్తర మైనది .తెలుగు లోను ఇంగ్లీష్ లోను వీరు ‘’తాళ ప్రస్తార రత్నాకరం ‘’రాశారు .Indian genius in Talaprastar ‘ Tala prastara of Nihamka Saranga deva’s Sangita ratnakara ‘’అనే వీరి రెండు ఉత్తమ గ్రంధాలు చరిత్రలో చిరస్థానం పొందాయి .
90-36 రాగాలకు ఒక్కొక్కటి అయిదారు నిమిషాల కు సరిపడా రాగాలాపనలను స్వర లిపి లో రచించి ‘’స్వరరాగ సుధ’’అనే మహోత్కృష్ట గ్రంధం రాశారు .
90-శ్రీ నేదునూరి వారిని ఆకెళ్ళ వారు తమ గురుదేవులుగా భావిస్తారు .
91-సంగీత కళాశాలలలో నేడు బోధిస్తున్న సర్టి ఫికేట్ కోర్సుకు ఆకెళ్ళ వారు సిలబస్ తయారు చేసిచ్చారు .అలాగే డిప్లొమా కోర్సుకు ఆరేళ్ళ శిక్షణ కూ వారిచ్చిన సిలబస్ నే అందరూ అనుసరిస్తున్నారు ఇంతకంటే ఘనత ఇంకేమి ఉంది ? వీటిని సి.డి .లుగా కూడా రూపొందించి మహోపకారం చేశారు ఆకెళ్ళవారు .
92-ఆకెళ్ళ వారి ‘’తాళ ప్రస్తార సాగరం ‘’గ్రంధం 1985లో తెలుగు విశ్వ విద్యాలయం చేత స్సర్వ శ్రేష్ట గ్రంధంగా ఎంపిక కాబడి౦ది .
93-భారత ప్రభుత్వం ఆకెళ్ళ వారికి సీనియర్ ఫెలోషిప్ అందించి నిశ్శంక శా౦ర్గ్య దేవుని ‘’సంగీత రత్నాకర ‘’గ్రంధానికి వ్యాఖ్య రాయించింది .
94-లయ విన్యాసాలపైనా ,వర్ణాలపైనా ఆకెళ్ళ వారు 481’’ఆడియో ట్రాక్స్ ‘’లను సి డిలుగా వెలువరించారంటే వారి విద్వత్తు యే స్థాయిదో అర్ధమవుతుంది .అందుకే వీరికి మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ అవార్డ్ ,టి టి.కె .అవార్డ్ లభించాయి
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-6-16-ఉయ్యూరు ‘
.

