ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -165
63-ఆధునిక సమకాలీన నృత్యానికి ప్రాణం పోసిన –ఇసడోరా డంకన్-2
ఇరవై ఏళ్ళకు ఇసడోరా అందాల రాశిగా ఉన్నా ,ఆనాటి ప్రసిద్ధ ఇంగ్లాండ్ ఫోటోగ్రాఫర్ ఆర్నాల్డ్ గెంతీ దృష్టిలో ఆమె అంత అందగత్తె గా అనిపించలేదట .బుగ్గలు లావుగా ముక్కు కోటేరు తీసినట్లు ,చిన్న రెండు గడ్డాలతో కనిపించేది .మూతి చాలా అందంగా లలితంగా ఉండేది .కళ్ళు సవాలు చేస్తున్నట్లుగా మొత్తం మీద శరీరం చాలా హుషారైన సాఫల్య వంతమైనదిగా ఉండేది .వేలాది అమెరికా బాలికల కంటే చాలా భిన్నంగా ఉండేది .తాను నాట్య నక్షత్రం లో జన్మించినట్లు భావించేది .
లండన్ లో డంకన్ లు బ్రిటిష్ మ్యూజియం లో ఎక్కువ కాలం గడిపేవారు .విన్కేల్మాన్ రాసిన ‘’జర్నీ టు ఎథెన్స్ ‘’ఆంగ్లానువాదం వాళ్ళను బాగా ఆకర్షించి హెలెనిక్ సంస్కృతి పై ఆసక్తి పెరిగింది .అక్కడి గార్డెన్ పార్టీలలో ,డ్రాయింగ్ రూమ్ లలో తన ప్రతిభ చూపేది .సోదరి ఎలిజబెత్ దియోక్రిటిస్ కవితలు చదివేది .రేమాండ్ డాన్స్ గురించి ఉపన్యాసాలిచ్చేవాడు .డాన్స్ -సైకాలజీమీద భవిష్యత్ మానవులపైనా చూపే ప్రభావం పై మాట్లాడే వాడు .అందరూ బ్రహ్మాండంగా అభినందించారు కాని రొక్కం రాలేది కాదు .పెన్నీ కి దొరికే బన్ నీళ్ళు కలిసిన సూపు తిని తాగి ఎలాగో గడిపేవాళ్ళు .ఇసడోరా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ,ఎల్లెన్ టెర్రీవంటి ప్రముఖులనెందరినో కలిసింది .చివరికి ఫ్రాంక్ బెన్సన్ నడిపే షేక్స్పియర్ కంపెనీలో చేరింది .పూర్వం వేసిన మిడ్ సమ్మర్ తప్ప వేరే అవకాశం రానేలేదు .లండన్ లాభం లేదని పారిస్ కు మారారు .
22వ ఏట పారిస్ లో ఇసడోరా ఒక కొత్త అవతారం దాల్చింది .లావ్రే దెయ్యాలను ,గ్రీక్ కుండీలను ,లోహ ఉపశమనాలను పరీక్షించి వాటిని సంగీతానికి జోడించి ,పాదాల రిధం కు సరిపోయేట్లు చేసింది . స్టుడియో గోడలపై రేమాండ్ గ్రీక్ స్తంభాలు పెయింట్ చేశాడు .డంకన్ కుటుంబం బూట్ల బదులు చెప్పులు వాడటం మొదలు పెట్టింది .తనకున్న లేస్ డ్రెస్ ను ,స్లిప్పర్ లనూ వదిలేసి డాన్స్ చేసింది .ఈ నాటి నగ్నంగా ఉన్నట్లు ఆనాడు దాదాపు అలానే డాన్స్ చేసింది .ఇదంతా గ్రీక్ పెయింటింగ్స్ ,శిల్పాల ప్రభావమే .సంగీతకారుడు రోడిన్ బ్రాంజ్ చప్పుడు ,జపనీస్ సాడాయాక్కో విషాద నృత్యాలను చేసింది .తానిప్పుడు డాన్స్ మూలం ఏమిటో తెలుసుకొంటున్నా నని చెబుతూ’’which might be the divine expression of the human spirit through the medium of the body’s movement ‘’అని వివరించింది .డాన్సింగ్ స్కూల్స్ లో శరీరకదలికలను వెన్నెముక ఆధారం కు వెనుక మధ్యలో ఉంటాయని బోధిస్తారని ,ఈ అక్షరేఖ నుంచి కాళ్ళు చేతులు మొండెం కడులుతాయని చెప్పి ఒక తోలుబోమ్మలాగా తయారు చేస్తారు అన్నది ఇసడోరా .ఇసడోరా కనిపెట్టిన దాని ప్రకారం సెంట్రల్ స్ప్రింగ్ మోటార్ పవర్ బిలం (క్రేటర్ ఆఫ్ మోటార్ పవర్ ) సోలార్ ప్లేక్సేస్ లో ఉంది .అంటే ఉదర నాడీ కూపం లో ఉంది .ఈ విషయాన్ని వివరిస్తూ అర్ధ శతాబ్దం తర్వాత జాన్ మార్టిన్ రాస్తూ ‘’అదే ఆమె చెప్పిన బేసిక్ డాన్స్ .అదొక వ్రుత్తి ,వ్యాపారంకాని ,మొదలు పెట్టె కళ కాని కాదని ,అదొక జీవ కార్యం (బయలాజికల్ ఫంక్షన్ )అన్నాడు .ఆమె ఏదో కొత్తగా ఏమీ కని పెట్టలేదు కాని ఈ కదలికల ప్రేరణ మూలాన్ని(రూట్స్ ఆఫ్ ది ఇ౦ప ల్స్ ) శోధించే ప్రయత్నం చేసింది .ఇదే ప్రతి అనుభవానికి స్పందన అవుతుంది .దీనినే ఆమె యూనివర్సల్ ఏండోమెంట్ అంటే సార్వత్రికదైవ లక్షణం అనుకొన్నది .ఏమాత్రం సాధారణ సైకాలజీలో ప్రవేశం లేని ఈమె యే ఒక్క డాన్సర్ కూ తట్టని అద్భుత భావం తట్టటం గొప్ప విషయం .,యాదృచ్చికమైనశారీరక కదలిక (స్పాంటేనియస్ మూవ్ మెంట్స్ )అనేది ప్రతి మనిషి యొక్క ఇంద్రియ లేక భావోద్వేగ ఉద్దీపన లకు ప్రధమ ప్రతిస్పందన .(spontaneous movement of the body is the first reaction of all men to sensory or emotional stimuli)
ఇసడోరా సిద్ధాంతాలపై చాలా అనుమానాలున్నాయి కాని అంతకు మించిన జవాబు ఎవరి వద్దా లేదు .ఆమె ప్రాధమిక భావోద్వేగాలను ,ప్రేమను ,నిరాశా నిస్పృహలను వేలాది ప్రేక్షకులముందు తన ఆనందం దుఖం తో ప్రదర్శించి చూపింది .ఇంకేముంది మ్యూజిక్ క౦పోజర్లు ,నాటక రచయితలు ,ఆమె చుట్టూ మూగారు .కళాకారులు ఆమె చూపే అసాధారణ శారీరక కదలికలను అనుకరించటానికి, నేర్చుకోవటానికి ఒకరితో ఒకరు పోటీ పడ్డారు .అంతకు మించి ఆమె చేబట్టి ,పునః సృష్టి చేసిన ప్రాచీన ‘’టేర్ప్సి కోరియన్ ఆర్ట్ ‘’ను అభినందించటానికి చాలామంది వచ్చారు .ఈ విషయం పై రోడిన్ రాస్తూ ‘’ఇసడోరా శిల్పాన్ని ,భావోద్వేగాన్ని అతి సునాయాసంగా సాధించింది
.జీవితాన్ని,కళ ను ఇసడోరా మహాద్భుతంగా ఏకీకృతం చేసింది .’’అన్నాడు .
ఫాన్స్ లోనే కాక తన జీవితం లోను పరిపూర్ణత సాధించటానికి కన్యత్వం నుండి చెప్పులు వదిలేసినంత తేలికగా విడుదలై౦ది .ఒక రోజురాత్రి ఒపెరాకు తల్లిని ,రేమాండ్ ను రమ్మని పిలిచి రహస్యంగా ఒక చా౦పేన్ బాటిల్ తెచ్చి తలలో రోజా పువ్వులు అలంకరించిడయాస్ అందరి కోసం ఎదురు చూసినట్లు ఉంది .అక్కడికి అప్పుడే వచ్చిన ఒక యువకుడు ఒక్క సారిగా దిగ్భ్రాంతి చెంది బాబోయ్ అని పారిపోయాడు .రోజాలు చామ్పేన్ తనను ము౦చేశాయని ఏడుస్తూ కూర్చుంది .మరోసారి ఇంకోకుర్రాడిని హోటల్ రూమ్ కు తీసుకొని వెళ్ళమని అడిగితె ఆమెస్వచ్చతకు ముగ్ధుడై మోకాళ్ళ మీదకూర్చుని వినమ్రుడయ్యాడు .ఇదీ ఆమె మోహ బంధ జీవితం .ఆమెది ఎప్పుడూ అవతలివారిని ఇబ్బంది పెట్టె విధానమే .మోహపు వలలో వేసి మగాళ్ళను గిలగిల లాడేట్లు చేసేది .లవర్స్ కంటే ఆమె చేత దిగజార్చ బడిన వాళ్ళే ఎక్కువ .అహంకార పూరిత సాహసం,ఆలోచనా రహిత జీవనం బాధ్యతా రాహిత్యం ఆమె కొంప కొల్లేరు చేశాయి . My life called for the pen of Cervantes or Casanova ‘’అని గర్వంగా చెప్పేది .
డంకన్లు మరింత తూర్పుకు బెర్లిన్ వియన్నా బుడాపెస్ట్ వెళ్ళారు .ఇసడోరా తన రంగాన్ని తీవ్ర ,భోగాసక్తి విషయాలతో డిజైన్ చేయించింది .స్టేజి ఏమీ లేని శూన్యం చేసింది .పేల్ బ్లూ ,సాఫ్ట్ గ్రీన్ ,న్యూట్రల్ గ్రే రంగుల పెద్ద పెద్ద కర్టెన్లు ఏర్పాటు చేసింది .అవి పైన నలుపులో కలిసిపోయి అదృశ్య మయ్యేట్లు వెనకా ప్రక్కలా ముడతలుగా అమిరేట్లు చేసింది .రోజ్ కలర్ స్పాట్ లైట్ ఊహను ప్రతిబింబింప జేసింది .ఇసడోరా కురులు వంకరలు తిరిగి మెత్తగా ఉన్నాయి .ప్రేమ పిచ్చి పట్టిన కోపోద్రిక్త వాతావరణం కల్పించింది .డాన్సులు మొదలయ్యాయి .ఆమె ఒక పిల్లలాగా బంతి, పిడికిలి ఎముకలతో చాకీస్ సముద్ర తీరం లో ఆడుతున్నట్లు అభినయించింది .ఆర్ఫియాస్ కు విషాద సహాయికలలో ఒకరిగా ,ఎల్సియన్ ఫీల్డ్ లలో ఆనందోత్సాహాలతో ఉన్న అమ్మాయిగా నటించింది .సమాప్తి అతి త్వరలోనే వచ్చేసింది .ఈ ప్రదర్శన బాగా విజయ వంతమైంది .అదొక రెవెలేషన్ అంటే దివ్యా దేశం అనిపించింది .
బుడా పెస్ట్ లోనే ఇసడోరా మరో నూతన నృత్యానికి ప్రాణం పోసి ప్రేక్షకులను ఉర్రూత లూగించింది .ఆమె ప్రోజ్ స్టైల్ లాగా ఆమె టేస్ట్ కూడా నాసిరకం .ఒక స్టాక్ కంపెనీ నటుడిని ప్రేమ వలలో పడేసింది .అతని మూడ్ ప్రతి పాత్రకీ మారి పోతుంది .ఆతను రోమియో జూలియట్ లో నటించగానే మళ్ళీ మార్క్ ఆంటోని గా నటించటం ఆమె జీర్ణించుకోలేక పోయింది .ఇసడోరా ముద్దు ఇమ్మంటే ఆంటోనీ లాగా లాంగ్ స్పీచ్ ఇచ్చేవాడు .వ్యక్తీ తన వృత్తికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పేవాడు .మళ్ళీ ప్రేమలో విఫలమై౦ది కాని ఆర్ట్ ను గుర్తించింది .జెర్మనీ చేరి ‘’డాన్స్ ఆఫ్ ది రివల్యూషన్ ‘’చేసింది .మ్యూనిచ్ చేరగానే విద్యార్ధులు అభిమానులు కోచ్ హార్స్ ను తప్పించి వీధుల్లో తామే బండీ లాగి అభిమానాన్ని ప్రదర్శించారు .ఆమె బెర్లిన్ ఒపేరా హౌస్ లో కనపడగానే ప్రేక్షకులు ఆమె ప్రదర్శనను పదేపదే చేయమని కోరారు .
26 వ ఏట ఇసడోరా గ్రీస్ వెళ్ళింది .రేమాండ్ తమ యాత్ర యులిసిస్ దారిలో నడవాలన్నాడు .ఎన్నో ఇబ్బందు లెదురైనాయి .గ్రీకు గడ్డ మీద కాలు పెట్టగానే స్వంత గడ్డపై కాలు పెట్టిన అనుభూతి పొందారు .అక్కడి పార్దినాన్ ను చూసి ఒక దేవాలయం కట్టాలని నిర్ణయించుకొన్నారు .శంకుస్తాపనకు ప్రీస్ట్ ను పిలిచారు .ఒక నల్ల కోడిపుంజు ను బలి ఇచ్చారు .గ్రీసులోనే స్థిరంగా ఉండి పోవాలనుకొన్నారు .సూర్యోదయాన పాటలతో డాన్స్ లతో సముద్ర తీరాన గడిపారు .తర్వాత మేక పాలు మాత్రమే తాగి చాలా సాత్వికంగా గడిపారు .అక్కడి వారికి ఉదయాన డాన్స్ ,పాట నేర్పేవారు .గ్రీకు దేవతలను సందర్శించేటప్పుడు తమ ఆధునిక వస్త్ర ధారణవదిలేసి సామాన్యంగా వెళ్ళేవారు .మధ్యాహ్న సమయాలలో ధ్యానం ,సాయం వేళల పాగాన్ ఉత్సవాలు జరిపి తగిన సంగీతం పాడేవారు.ఇంత చేస్తున్నా అక్కడి వారెవరికీ వీళ్ళగురించి పట్టనే లేదు .మంచినీళ్ళకోసం మైళ్ళ దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది అక్కడ తాము ప్రారంభించిన గుడి నిర్మాణం తడపటానికి నీళ్ళు అందలేదు. దానితో పని ఆపేశారు .కాని మొత్తం ట్రిప్ లో ఇసడోరాకు ఒకే ఒక ఆనందం మిగిలింది – గ్రీకు పిల్లలకు ఏషిలస్ రాసిన ‘’ది సప్ప్లిఎంట్స్’’ను పాడటం నేర్పగలిగింది .తమతో వాళ్ళను వియన్నా కు తీసుకెళ్ళింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-16-ఉయ్యూరు

